Thursday, October 18, 2007

ఆ నాలుగు గంటలు..

మన దేశం లో ఎక్కడైనా పార్టీలు, గెట్ టుగెదర్లు జరిగేటప్పుడు జనాలు మూడు గ్రూపులుగా విడిపోయి మాట్లాడుకుంటుంటారు.

మొదటి గ్రూపు - సినిమాల గురించో, క్రికెట్ గురించో మాట్లాడుకునేవాళ్ళు

మిగతా రెండు గ్రూపుల వాళ్ళు ఏమి మాట్లడుకుంటారో నాకు తెలియదు...ఎందుకంటే నేను ప్రతీసారీ ఖచ్చితంగా ఆ మొదటి గ్రూపులోనే ఉంటాను...

సెప్టెంబరు నెలలో T20 ప్రపంచకప్పు జరిగినన్ని రోజులు నేను ఎక్కడికెళ్ళినా జనాలంతా ఒకే గ్రూపులో ఉండేవాళ్ళు...మొదటి గ్రూపు!

T20 కప్పు ఫైనల్ జరిగిన ఇన్ని రోజులకు ఈ టపా పోస్టు చెయ్యటానికి ఒక కారణం ఉంది........ఈ టపా రాసింది ఇవ్వాళే.

ప్రస్తుతం ఆస్ట్రేలియా తో జరుగుతున్న సేరీస్ లో మనవాళ్ళు చితగ్గొట్టించుకుంటున్నా పరవాలేదు...ఇక నుంచి మన వాళ్ళు ఆడే ప్రతీ సీరీసూ ఓడిపొయ్యినా పరవాలేదు...ఈ T20 కప్పు చాలు...1983 లో ఇండియా ప్రపంచ కప్పు గెలిచినప్పుడు నేను చూడలేదు...మరోసారి అటువంటి మధుర క్షణాలు ఇక రావేమో అని అనుకున్నా...వచ్చాయి...ఈ గెలుపుకి బంగారు పూత - ఫైనల్ లో పాకిస్తాన్ పై విజయం....

కొంతమంది భారతీయ ప్రేక్షకులు గ్రౌండు మీద జరిగే ఏవో చిన్న చిన్న సంఘటనలను చూసి పాకిస్తాన్ క్రికెటర్లను ద్వేషిస్తుంటారు...నేను వాళ్ళలో ఒకడిని కాను.....

అసలు ప్రత్యేకమైన కారణాలేవీ లేకుండా.. పాకిస్తాన్ క్రికెటర్లను చూడగానే ద్వేషిస్తుంటారే కొంతమంది మూర్ఖులు...వాళ్ళలో ఒకడిని నేను..

-------------------

సెప్టెంబరు 24....టైము 2:30 అయ్యింది. 5:30 కు మ్యాచు మొదలు...మా ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళటానికి కనీసం నలభయ్యైదు నిముషాలు పడుతుంది. కాస్త పని మిగిలుంది..కానీ అది రేపొచ్చి చెయ్యొచ్చు..ఎలాగోలా తెగించి నా బాసు క్యాబిన్ కు వెళ్ళాను..."సార్..నాకు కడుపు నొప్పిగా ఉంది....ఇంటికెళ్తాను సార్..రేపు తెల్లవారుజామునే వచ్చి..."

"మ్యాచు ఐదున్నరకు కదయ్యా...ఇప్పటి నుంచే ఎందుకు డ్రామాలు...చస్తున్నాను నీతోటి...ఇందాక దినకర్ అని నీ ఫ్రెండు ఎవడో ఫోను చేసి "సార్ నాకు కడుపు నొప్పిగా ఉంది..మా వాడిని రెండున్నర కు వదిలెయ్యండి" అని అన్నాడు...కడుపు నొప్పేంటయ్యా స్కూలు పిల్లల్లాగా..వేరే సాకులే తోచలేదా మీకు...ఐదు గంటలకి ఒక్క నిముషం ముందైన నువ్వు నీ సీటు నుంచి కదిలావంటే...నిన్నేమీ చెయ్యను...నీ ఫ్రెండున్నాడే ఆ దినకర్...వాడి బాసుకు ఫోను చేసి మీ వాడి తిత్తి తీయిస్తాను " అని వార్నింగ్ ఇచ్చాడు..

నేను సరిగ్గా 4:58 కు నా సీటు నుంచి బయలుదేరాను....నా బాసు గాడికి కనపడేట్టు....

ఆఫీసు నుంచి బయటపడి ఆటోకోసం చూస్తున్నా....

నేను ఉద్యోగరిత్యా మూడు నెలల క్రితం మద్రాసు నుండి బెంగళూరుకు వచ్చి పడ్డా....ఈ మూడు నెలల్లో నేనొక ఈక్వేషన్ కనుగొన్నాను...

If

మద్రాసు ఆటోవాడు = నీచ్, కమీనా, కుత్త్తా..

Then

బెంగళూరు ఆటోవాడు = ఇద్దరు మద్రాసు ఆటోవాళ్ళు


బెంగళూరు ఆటో వాళ్ళు మనము ఏ ఏరియాకైతే వెళ్ళాలంటామో.. సరిగ్గా అదే ఏరియా కు రాము అంటారు...కారణం చెప్పరు....ఒక వేళ వచ్చినా (ఆటో మనమే నడుపుతాము అని ఒప్పించాక) 'మీటర్ మీద ఎక్స్ట్రా' అంటారు...చీకటి పడినా,వర్షం వస్తున్నా...వచేట్టు సూచనలున్నా, ట్రాఫిక్కు ఎక్కువగా ఉన్నా, మనకు మీసాలు లేక పొయ్యినా మీటర్ మీద ఓ 2000 రూపాయలు అడుగుతారు...

ఒక పావుగంట పొరాడాక ఆటో దొరికింది...నేను ఇల్లు చేరేప్పటికి ఖచ్చితంగా మ్యాచ్ మొదలయ్యుంటుంది....ఆ బాధలో నాకు తెలియకుండా కంట్లో నీళ్ళొచ్చాయి...ఆటో వాడు నేను ఏడవటం చూసి..."బాధపడకండి సార్...ఈ అమ్మాయి కాకపొతే ఇంకో అమ్మాయి " అన్నాడు....వాడికి విషయమేంటో చెబుదామనుకుంటుండగా ఫోను మోగింది....నీల్ విజయ్ గాడు.....

"ఏరా మ్యాచ్ చూస్తున్నావా??" అని అడిగాడు...

"లేదు రా..దారి లో ఉన్నా..ఎమయ్యింది?"

"సెహ్వాగ్ గాడు...."

ఆ తరువాత మాట వినపడలేదు..

"హలో...సెహ్వాగ్ గాడు ఏంట్రా....చెప్పు "

ఫోను కట్ అయ్యింది...

నాకు ఏ క్షణం లో నైనా గుండె పోటు రావచ్చు... అంత ఖంగారు గా ఉంది....సెహ్వాగ్ ఫోర్ కొట్టాడా..అవుట్ అయ్యాడా (ఛీ ఛీ.. అపశకునం)...ఏమీ అర్థం కావట్లేదు.....

మళ్ళీ నీల్ గాడికి ప్రయత్నిస్తుంటే లైను తగలట్లేదు....

ఇంతలో ఆటో వాడు "ఏంటి సార్ సెహ్వాగ్ గాడు అవుటయ్యాడా...వాడు టీం లో ఉంటే మనము ఓడిపోవటం ఖాయం " అన్నాడు..

టెన్షన్ తట్టుకోలేక కార్తీక్ గాడికి ఫోన్ చేసాను...

(సినిమాల్లో ఫోన్ లో మాట్లాడేటప్పుడు జరిగే సంభాషణ ప్రేక్షకులకు తెలియాటానికి అవతలి వ్యక్తి మాట్లాడే ప్రతి మాటా రెపీట్ చేసినట్టు.. మా ఆటో వాడి కోసం నేను కూడా చేసాను)

ట్రింగ్...ట్రింగ్

"ఏంటీ.. హలో నా? ఏంటీ.. ఇంకా మ్యాచ్ మొదలవ్వలేదా? ఏంటీ... సెహ్వాగ్ టీం లో లేడా? ఏంటీ.. 'నీ యబ్బ ' నా? ఏంటీ.. ఫోన్ పెట్టేస్తావా?"

విషయం మొత్తం ఆటో వాడికి అర్థమయిపొయ్యింది...

"సెహ్వాగ్ గాడు టీం లో లేడా సార్...వాడు టీం లో లేకపోతే మనము ఓడిపోవటం ఖాయం " అన్నాడు...

వీడి మీటర్ పడిపోనూ...ఆ కంపు నోట్లోంచి ఒక్క మంచి మాటా రాదే.....

బెంగళూరు ట్రాఫిక్కుకు ఒక ప్రత్యేకత ఉంది...సిగ్నల్ పడో, ఏ స్కూటర్ వాడు కార్ వెనకాల గుద్దో..ఒక రెండు మూడు బళ్ళు ఆగాయనుకోండి....వెంటనే ఏవో అద్రుశ్య శక్తులు ప్రత్యక్షమయ్యి ఆ రోడ్డుకు అడ్డంగా ఒక పెద్ద గోడ కట్టేస్తాయి....అంతే...ఒక ఐదారు గంటల వరకు ట్రాఫిక్కు ఒక్క అంగుళం కూడా కదలదు....

మ్యాచ్ తప్పకుండా మొదలయ్యుంటుంది....

ఎవరికి ఫోన్ చేస్తే ఏ దుర్వార్త చెబుతారోనని ఎవ్వరికీ చెయ్యట్లేదు...కాల్ వస్తే కట్ చెసేస్తున్నా...sms లు చూడట్లేదు......

ఈ ట్రాఫిక్కు లో మా ఆటో గంటకు తొమ్మిది కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ లా దూసుకెళ్తోంది...కరెక్టుగా ఒక బట్టల కొట్టు పక్కన మళ్ళీ ఆగింది...అక్కడ కొట్టు తలుపు చివర్న నుంచొని ఒక పది, పదిహేనుగురు మ్యాచ్ చూస్తున్నారు...ఒక్కసారిగా అందరూ గట్టిగా అరిచారు...నా వల్ల కాలేదు...ఆటో లోంచి తల బయటకు పెట్టి "ఏమయ్యింది గురూ " అని అడిగాను..వాళ్ళలో నా మాట వినపడ్డ వాడెవడో "యూసఫ్ పఠాన్ సిక్సర్ " అన్నాడు........చ్చీ...నా మీద నాకే అస్సహ్యమేసింది...ఎందుకీ చదువులు...ఎందుకీ ఉద్యోగాలు..మన వాళ్ళు సిక్సర్లు కొడుతుంటే నేను ఇక్కడ ఆటో లో FM రేడియో వింటున్నా.....

రెండు నిముషాలు ప్రయత్నించాక రవి గాడికి ఫోన్ తగిలింది.."ఏరా యూసఫ్ పఠాన్ సిక్స్ కొట్టాడంట గా "...అని అడిగాను...."ఆ...కొట్టాడు...అవుట్ కాక ముందు " అన్నాడు............బాధ తో నా గొంతు కూరుకు పొయ్యింది...మాట రావట్లేదు...ఫోన్ కట్ చేసి, పేస్ట్ చేసాను.........

ఇంకొ ఇరవై నిముషాలు ఈ నరకయాతన అనుభవిస్తూ ప్రాణాలు ఆటో లో పెట్టుకుని ప్రయాణించాక రూముకు చేరుకున్నాను...అక్కడ అప్పటికే మా వాళ్ళు బోలెడు మంది కూర్చుని చూస్తున్నారు...ఒక పెద్ద కార్టన్ లో మందు సీసాలు కూడా ఉన్నాయి....గెలిస్తే ఆనందంలో, ఓడిపోతే (ఛీ ఛీ అపశకునం) బాధలో తాగుదామని తెచ్చారంట......దేవుడిని తలచుకుని కుడికాలు లోపల పెట్టాను...ఒక్క వికెటే పడింది....

"తరువాతి బాలు వుంటాడా ఊడతాడా " అని బాలు బాలుకూ గుండెపోటు తెచ్చుకోవటం ఆరోగ్యానికి అంత మంచిది కాదని..నా రూములోకెళ్ళి DVD పెట్టి గూబలు గుభేల్ మనేలా వాల్యూం పెట్టాను....పెట్టింది "ఖతర్నాక్" సినిమా కావటం తో స్కోరు చెప్పటానికి కూడా నా ఫ్రెండ్స్ ఎవ్వరూ నా రూము దరిదాపుల్లోకి రావటానికి సాహసించలేదు..

ఒక గంట సేపు ఆ సినిమా చూసాక...అటువంటి సినిమా తీసిన ఆ డైరెక్టర్ కు కళ్ళూ, ముక్కూ, చెవులు పని చెయ్యకుండా చేతబడి చేసి....రూము బయటకు వచ్చాను....

అప్పుడు తెలిసింది.....మన వాళ్ళు 157 చేసారని..ఆ స్కోరు పాకిస్తాన్ వాళ్ళకు చపాతీల్లోకి నంచుకోవటానికి కూడా సరిపోదు....మ్యాచు చెయ్యి జారిపొయ్యినట్టే.....

మన వాళ్ళు ఓడిపోతే అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోదామని ఆ రోజు పొద్దున్నే నిర్ణయించుకుని ఆఫీసు లో అందరికీ చెప్పేసాను....ఈ స్కోరు చూసాక ....ఫ్రెండ్స్ అందరితో ఆటోగ్రాఫు పుస్తకం లో చెత్తా చెదారం రాయించుకుని హిమాలయా ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోవటం మొదలుపెట్టాను....అసలే వచ్చే నెలలో అక్కడ 'Miss Himalaya' పోటీలు జరగబోతున్నాయి...అందులో ఒక రౌండులో ఆడ సన్యాసినిలు కాషాయం స్విం సూట్లలో తిరుగుతారని ఒక పుకారు ఉంది...ఇప్పటి నుండే ప్రయత్నించకపోతే ఇల్లు దొరకటం కష్టం.....హిమాలయాల్లో ఒక టూ బెడ్రూం అపార్ట్మెంటులో సన్యసిస్తున్న మా ఇంటి ఓనర్ కొడుకుకి ఫోన్ చేసి నాకు ఒక ఇల్లు, కావలసిన కాస్ట్యూంస్ కాస్త చూసిపెట్టమని చెప్పాను.....

ఒక వైపు నా ఏర్పాట్లు జరుగుతూంటే..మరోవైపు పాకిస్తాన్ వాళ్ళ బాటింగ్ మొదలయ్యింది...

మళ్ళీ నా రూములోకి వెళ్ళిపొయ్యాను..."ఖతర్నాక్" సినిమా పెట్టాను....

మధ్యమధ్యలో హాల్లోంచి మా వాళ్ళ అరుపులు వినిపిస్తున్నాయి...పాకిస్తాన్ వాళ్ళ వికెట్లు బాగానే పడుతున్నట్టున్నాయి...ఇక లాభం లేదని నేను కూడా మ్యాచ్ చూద్దామని TV ముందు కూర్చున్నా....

తరువాతి బాట్స్మన్ యూనిస్ ఖాన్...పాడ్లు కట్టుకుంటున్నాడు...పక్కన్నే బెంచి మీద కూర్చున్న అజీత్ అగార్కర్ యూనిస్ ఖాన్ దగ్గరకు వచ్చి ..."ఆవేశంగా కొట్టటానికి పొయ్యి అనవసరంగా అవుట్ కాకు...నువ్వొక 10 ఓవర్లు ఉన్నావనుకో...అప్పుడు నేను బౌలింగ్ వేస్తాను..ఆలోచించుకో " ...కుడి కాలి బొటన వేలుతో నేల మీద గోకుతూ...పెదవి కొరుకుతూ అన్నాడు.......యూనిస్ ఖాన్ కు ఆశ కలిగింది...అగార్కర్ గాడు బౌలింగ్ వేస్తె ఒక్కొక్క బాల్ కు రెండు సిక్సర్లు కొట్టొచ్చు....పైగా..బాట్స్మన్ కాస్త అలసిపొతే...తిరిగి పుంజుకునేంత వరకు..వైడ్లు, నోబాళ్ళు వేస్తూ ఉంటాడు...అమ్మో ..ఈ అవకాశం వదలుకోరాదు " అని అనుకొని.....వెళ్ళి ఒక ఐదు ఓవర్లు అవుట్ కాకుండా...రన్లు కొట్టకుండా జాగ్రత్తగా ఆడాడు....స్టేడియం లో ఉన్న భారతీయ సపోర్టర్లు యూనిస్ ఖాన్ కటౌట్ కు పాలాభిషేకం చెస్తుంటే...ఏదో తేడా ఉందని అర్థమయ్యింది వాడికి....వెంటనే ధోనీ దగ్గరకు వెళ్ళి..."అగార్కర్ కు ఎప్పుడిస్తావురా బౌలింగు " అని అడిగాడు..."ఇంకో పది ఓవర్ల తరువాత " అన్నాడు...యూనిస్ ఖాన్ గాడికి కాలింది...మ్యాచ్ లో మిగిలుందే 8 ఓవర్లు...జరిగిన మోసం అర్థమయిపొయ్యింది..అసలు అగార్కర్ టీం లోనే లేడు ఆ రోజు..ఆ బాధ లో అవుటైపోయి...తెలుగు సినిమాలో సెకండు హీరొయిన్ లాగా అస్తమిస్తున్న సూర్యుడి వైపు నడుచుకుంటూ వెళ్ళిపొయ్యాడు....

*********
అజీత్ అగార్కర్ ప్రస్తావన వచ్చింది కాబట్టీ ఒక చిన్న సర్వే.....

అజీత్ అగార్కర్ మంచి బౌలర్ అని అనుకునే వాళ్ళంతా చేతులు పైకి లేపండి (ఎవడా మూల చెయ్యి లేపింది...రే అజీత్ అగార్కర్ గా...దించరా చెయ్యి)..
*********

ఒక పక్క వికెట్లు పడిపోతున్నాయి...నా హిమాలయా ట్రిప్పు కాన్సల్ అయ్యేలాగే ఉంది....

4 ఒవర్లు ఉన్నాయి...54 రన్లు కొట్టాలి...3 వికెట్లు మిగిలున్నాయి....బెంగళూరులో బాణాసంచా కాలవటం మొదలు పెట్టారు జనాలు...ఇక్కడ మా వాళ్ళు మందు సీసాలు బయటపెడుతున్నారు...క్రితం రోజు న్యూస్స్పేపర్ కింద పరచి దాని మీద వేరుశనగ పప్పులూ, చిప్సూ పోసారు....

మా బాసు గాడికి ఫోన్ చేసి "నాకు కడుపు నొప్పిగా ఉంది...రేపు ఆఫీసుకు రావట్లేదు సార్" అని చెబుదామని బయటకు వెళ్ళాను...నంబర్ పూర్తిగా డయల్ చేసేలోపు రూములొ నుంచి పెద్ద పెద్దగా ఏడుపులు వినిపించాయి....ఖంగారు గా లోపలకు వెళ్ళాను...మా వాళ్ళందరూ కింద కూర్చుని ముందుకూ వెనక్కూ ఊగుతూ "ఈ మిస్బా ఉల్ హక్ గాడు ఎంత పని చేసాడు రో దేవుడో....ఇప్పుడు మాకు దిక్కెవ్వర్రా నాయనో " అని గట్టిగట్టిగా ఏడుస్తున్నారు...ఏమయ్యిందా అని స్కోరు చూసాను.....ఒక ఓవర్ మిగిలుంది... 13 రన్లు కొట్టాలి అంతే.......నేను బయటకు వెళ్ళినప్పుడు మిస్బ ఉల్ హక్ హర్భజన్ సింగ్ ఓవర్లో మూడు సిక్సర్లు కొట్టాడంట.....

నాకు ఏమీ పాలుపోవటం లేదు...ఎలా జరిగింది ఇదంతా??????

చివరి ఓవర్ జోగీందర్ శర్మ కు ఇచ్చారు....

మొదటి బాలు వైడు....రెండవ బాలు సిక్సర్...అయిపొయ్యింది...అంతా అయిపొయ్యింది.........చలో హిమాలయాస్......

వెళ్ళే ముందు ఒక్క సారి దేవుడితో మాట్లాడదామని ఫోన్ చేసి విషయం చెప్పాను....దానికి దేవుడు "భయపడకు...ఆ T20 కప్పు తయారుచెయ్యగానే నేను స్టీలు సామాన్ల వాడి రూపం లో వచ్చి దాని మీద ఇండియా పేరు చెక్కేసాను..లొపలకు వెళ్ళి మ్యాచ్ చూడు" అన్నాడు....

ఇంట్లోకి వెళ్ళాను....

జోగీందర్ శర్మ బాల్ వేసాడు...అంతవరకు అద్భుతంగా ఆడిన మిస్బా గాడికి ఎమయ్యిందో తెలియదు...వికెట్ల పక్కకు జరిగి వెనక్కు కొట్టాడు.......

కామెంటరీ చెబుతున్న రవి శాస్త్రి "in the air" అన్నాడు....అది కనిపిస్తూనే ఉంది...కానీ బౌండరీ లైను అవతల "in the air"ఆ, బౌండరీ లైను ఇవతల"in the air"ఆ?...బాల్ మెల్లగా కిందకు వస్తోంది...మేమంతా మెల్లగా పైకి లేస్తున్నాము........రూము లో నిశ్శబ్దం....దినకర్ చిప్స్ నములుతున్న శబ్దం తప్ప ఇంకేమీ వినిపించట్లేదు..

..................

శ్రీశాంత్ క్యాచ్ పట్టేసాడు!

ఆ తరువాత ఏమి జరిగిందో గుర్తు లేదు.......

మరుసటి రోజు న్యూస్పేపర్లలో, TV ఛానళ్ళలో "ఇరు జట్లకు కేవలం 5 రన్నులే తేడా...కాబట్టీ నిజానికి గెలిచింది క్రికెట్.....రెండు టీములూ విజేతలే " అని చాలా మంది అన్నారు.

నాన్సెన్స్ - ఐదు రన్లు కాదు.....సగం రన్నుతో గెలిచినా సరె....గెలిచిన వాడే హేరో..

ఇప్పటికీ ఆ మ్యాచ్ హైలైట్స్ చూసేప్పుడు ఆ చివరి బాల్ మిస్బా గాడు గాల్లోకి లేపంగానే ఛానల్ మార్చేస్తాను....శ్రీశాంత్ ఎదవ ఎక్కడ క్యాచ్ వదిలేస్తాడోనని భయం.....

Thursday, September 6, 2007

బరువు - బాధ్యత

అదొక వర్షం కురవని రాత్రి....టైం పదకొండో,పన్నెండో, ఒకటో, రెండో అయ్యింది. దూరంగా నక్కల ఊళలు ఏవీ వినపడక పోవటం తో నేను పడుకుని నిద్రపొయ్యాను....

నా జీవితంలో మరచిపోలేని ఈ సంఘటన జరిగి ఇప్పటికి సరిగ్గా కొన్ని సంవత్సరాలా, కొన్ని నెలలయ్యింది.... ఒక రోజు....

నేను ఆఫీసుకు బండిలో బయలుదేరుతుంటే రోడ్డు మీద స్కూలు బాగు తగిలించుకుని ఒక పిల్లవాడు లిఫ్ట్ అడుగుతున్నాడు...గోధుమ రంగు నిక్కరు, తెల్ల చొక్కా వేసుకునున్నాడు. చిన్మయా విద్యాలయా యూనిఫార్మ్...బండి ఆపాను..."ఎక్కడికి?" అడిగాను...."మీకు చిన్మయా స్కూల్ తెలుసా?" అడిగాడు...."ఆ తెలుసు" అన్నాను....."దాని దరిదాపుల్లో కాకుండా ఎక్కడైనా దూరంగా దించెయ్యండి" అన్నాడు..
బెత్తం భయంతో బడి ఎగ్గొట్టి బయట తిరిగిన రోజుల్లో నాకు కూడా ఇలాంటి సహాయం బోలెడు మంది చేసారు..వీడిని కూడా నా మార్గంలొ నడిపిద్దామని బండి ఎక్కించుకున్నాను....పిల్లవాడు కదా అని బండి 40 లో పోనిస్తున్నాను..."బండి భలే తోలుతున్నారు..మీ పేరేంటి లావాటి అంకుల్?" అన్నాడు.

"లావాటి అంకులా???" వాడన్న మాటకి ఎవడో నా గుండెల్లో గాజు పెంకులు గుచ్చినంత బాధేసింది....
నాకు కష్టం కలిగింది వాడు నన్ను 'అంకుల్ ' అన్నందుకు కాదు...ఆ పిలుపు నాకు అలవాటైపొయ్యింది (మన భారత దేశం లో ఇంటర్మీడియెట్ అయిపొతే మనకు వయసైపొయినట్టే....మన ఇంటర్మీడియెట్ రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజు నుంచి పదో క్లాసు గాడిదలు కూడా 'అంకుల్ ' అని పిలుస్తారు)....
వాడు నన్ను 'లావాటి ' అన్నాడే..అక్కడే కాలింది..ఇంతటి మాటన్నందుకు ఆ పిల్ల రాక్షసుడికి కోలుకోలేని శిక్ష వెయ్యాలని నిర్ణయించుకున్నాను....బండిని నేరుగా చిన్మయా విద్యాలయా ప్రిన్సిపల్ రూము ముందు ఆపాను...

వాడన్న మాటలకు బాధ తట్టుకోలేక ఆ రోజు ఆఫీసుకు సెలవు పెట్టి ఇంటికి వెళ్ళాను....మా అన్నయ్యకు ఫోను చేసి "ఏరా...నేను లావుగా ఉన్నానా" అని నిలదీసాను....దానికి మా అన్నయ్య "ఈ మధ్య కాస్త లావయ్యావు కద రా..ఇప్పుడెందుకొచ్చింది ఆ అనుమానం?" అన్నాడు..."మరి ఇన్నాళ్ళూ చెప్పలేదే?" అడిగాను..."నేను చెప్పేదేంట్రా...నీ దగ్గర అద్దం లేదా?" అన్నాడు..."అది కూడా ఎప్పుడూ చెప్పలేదు రా......ఛ...సరే..నేను ఆత్మహత్య చేసుకోవాటానికి వెళ్తున్నాను..తరువాత ఫోన్ చేస్తా" అని పెట్టెయ్యబోయాను...దానికి మా వాడు "ఈ విషయానికి అంత బాధెందుకు రా...వెళ్ళి ఏదైనా మంచి జిం లో చేరు...వ్యాయామం చెయ్యి..మళ్ళీ మామూలుగా తయారౌతావు. ఈ సారైనా క్రమం తప్పకుండా రోజూ చెయ్యి...లేక పోతే జనాలు నిన్ను'బండంకుల్' అనో 'లావాటి అంకుల్ 'అనో అని పిలుస్తారు జాగ్రత్త " అని పెట్టేసాడు..

నేను గతంలో కండలు పెంచటానికి చాలా సార్లు జిం లో చేరాను....హైవేల మీద స్పీడు బ్రేకర్ల లాగా ఇంతింత బొజ్జలేసుకున్న వాళ్ళు చాలామంది వస్తారు అక్కడకు....గోడలకు సిల్వెస్టర్ స్టాలన్, సంజై దత్ లాంటి హీరోల ఫొటొలు చాలా అతికించుంటాయి.....వీళ్ళతో పాటు జిం లో ఒక పెద్ద విలన్ కూడా ఉంటాడు....వాడి పేరు 'ట్రైనర్ '...

బయట గ్రౌండులో పరిగెట్టిస్తే అట్నుంచి అటే ఇంటికి ఎక్కడ పారిపోతామో అని...జిం లో ట్రెడ్ మిల్ మీద పరిగెట్టిస్తాడు. నా వల్ల కాదు..ప్రాణభిక్ష పెట్టమని ఎంత అడుక్కున్నా చలించడు...

నెలనెలా డబ్బు కట్టమంటే మొదటి నెల తరువాత ఎవ్వడూ కట్టడని.. మూడు నెలలకు కలిపి కట్టించుకుంటారు డబ్బులు. క్రితం సారి జిం లో చేరినప్పుడు నేను కూడా మూడు నెలల డబ్బు కట్టాను..కానీ వెళ్ళింది ఒకటిన్నర రోజులు . నేను చేరిన రెండవ రోజే ట్రైనర్ శెలవు పెట్టాడు...వాడి అసిస్టెంటు నాతో మిస్టర్ యూనివర్సు పోటీలకు తయారయ్యే వాళ్ళు చేసే ఎక్సర్సైసులన్నీ చేయించాడు...ఒక్కొక్కటీ మూడు సార్లు.....
"ఒళ్ళు హూనం" అంటారుగా...దానిని 10 తో గుణిస్తే ఎమంటారో అది అయ్యింది నాకు.

ఆ రోజు రాత్రి నిద్ర పొయ్యి లేచాను...పైకి లేద్దామని చూస్తే నా వల్ల కాలేదు...చేతులకు, కాళ్ళకు బియ్యం బస్తాలు కట్టేసినట్టుంది...అటూ, ఇటూ ఒక్క అంగుళం కూడా కదలలేని పరిస్థితి.....అంతే..ఆ తరువాత నేను ఇంకో సారి జిం లో చేరలేదు...

ఏమీ కష్టపడకుండా బరువు తగ్గే పధ్ధతి ఏదైన ఉందా అని నేను పరిశోధన చేస్తున్న సమయంలో దేవత లాగ కనిపించింది నా కొలీగ్ హేమలత...నా చెవిలో 'డైటింగ్, డైటింగ్, డైటింగ్' అని మంత్రోఛ్ఛారణ చేసింది..
అంతే..ఒక వారం రోజుల పాటూ కడుపు ఎండగట్టాను...మూడు తలతిరగడాలు, ముప్పై మూడూ జ్వరాలతో డైటింగ్ దిగ్విజయంగా కొనసాగిస్తున్న సమయంలో...మా ఇంటి దగ్గర మెరపకాయ బజ్జీలవాడు "End of season sale" పెట్టాడు....పది రూపాయలకు బజ్జీలు కొంటే రెండు రూపాయల బోండాలు ఫ్రీ...తేరగా బోండాలువస్తుంటే వదులుకునేంత రాతి హృదయం కాదు నాది. కట్ చేస్తే.. నడుము చుట్టూ ఒక అంగుళం పెరిగింది...

ఆఫీసులో 7 వ అంతస్థు లో ఉంటుంది నా సీటు.....మెట్లెక్కితే మంచి ఎక్సరసైసు అని లిఫ్టు ఎంత ఆహ్వానిస్తున్నా రోజూ మెట్లెక్కే వెళ్ళేవాడిని. కాని ఒక రోజు మెట్లెక్కబోతుంటే....అక్కడ నుంచున్న సెక్యూరిటీ వాడు ఆపి "పొద్దున్నుండి మెట్లు పని చెయ్యట్లేదు సార్...ఇవ్వాళ లిఫ్ట్ లో వెళ్ళండి" అన్నాడు. అంతే...నడుము చుట్టూ ఇంకో ఇంచు..


ఇలా నాకు తెలియకుండా కొంచెం కొంచెంగా బరువు పెరుగుతూ పోతున్న సమయంలో న్యూస్ పేపర్ లో ఒక చిన్న ప్రకటన చూసాను...

"అధిక బరువు మీ సమస్యా? అయితే ఈ నంబర్ కు ఫోను చెయ్యండి: 9999999999- దినకర్"...అని ఉంది. నేను ఆ దినకర్ అనే మనిషి కి ఫోను చెయ్యంగానే 'నేనే మీ ఇంటికి వస్తాను సార్ ' అని అడ్రస్సు తీసుకున్నాడు..

ఆ దేవదూత దినకర్ కోసం ఎదురుచూస్తూ గడియారం చూసాను..టైం 7:00 అయ్యింది. మంచినీళ్ళు తాగుదామని మంచం మీద నుంచి లేవబొయ్యాను...మెడ పట్టేసినట్టయ్యింది....అమ్మా...అస్సలు ఈ మెడ నొప్పంత దారుణంగా మనిషిని పీడించేది ఒకే ఒకటి - మెడ నొప్పి! దీనికి కారణమేంటో నాకు అర్థమయ్యింది...అందుకే ఆ రోజు నుంచి రాత్రి యేడింటికి నేను ఎప్పుడూ మంచినీళ్ళు తాగలేదు.

7:15 కంతా దినకర్ మా ఇంటికి వచ్చాడు..చూడటానికి చాలా సన్నగా ఉన్నాడు..'ఆహా సరైన మనిషి చేతిలో పడ్డట్టున్నాను...నేను కూడ ఇంత సన్నగా అయిపోవచ్చూ అనుకుని.."రండి...ఏమి తీసుకుంటారు?" అని అడిగాను..."ఆల్రెడీ బయట మీ షూ పాలిష్ డబ్బా జేబులో వేసేసుకున్నాను..వేరే ఏమీ వద్దు " అన్నాడు...

నేను నా సమస్య చెబుదామనుకునేలోపు మళ్ళీ తనే మాట్లాడుతూ " సార్...నేను చిన్నప్పటి నుండి చాలా సన్నగా ఉన్నాను...ఎంత ప్రయత్నించినా లావు కావట్లేదు..మీ లాంటి వాళ్ళను కలిస్తే కొవ్వు ఎలా పెంచుకోవాలో చెబుతారని ఆ ప్రకటన ఇచ్చాను...ఇప్పుడు చెప్పండి...మీ అధిక బరువు రహస్యమేంటి?" అన్నాడు....తినటానికి తిండి లేదని ఒకడేడుస్తుంటే మందులోకి సైడ్ డిష్ అడిగాడంట వెనకటికి ఒక దినకర్......

నా కంట్లో నీళ్ళు చూసి వాడికి పరిస్థితి అర్థమయ్యి వెళ్ళిపొయ్యాడు. ఆ వెళ్ళేవాడు ఊరికే పోకుండా.. బరువు తగ్గటానికి నాకు జిం వాళ్ళు ఇచ్చిన పొడి,గూట్లో పెట్టున్నది, తస్కరించుకుని మరీ వెళ్ళాడు.
తరువాత తెలిసింది నాకు....దానిని కంది పొడి లాంటిదే అనుకుని, నెయ్యి వేసుకుని అన్నంలోకి కలుపుకుని తిన్నాడంట...ఎలక లా ఉండేవాడు బొద్దింక లాగా తయారయ్యాడు......

ఇలాంటి తరుణంలో నేను, నా అధిక బరువు కలిసి ఒక సారి TV చూస్తుండగా టెలీ షాపింగ్ నెట్వర్క్ వాళ్ళ అడ్వర్టైస్మెంటు ఒకటి వచ్చింది..'Fit, Fitter, Fittest' అనే పరికరం గురించిన ప్రకటన అది..

ఆ అడ్వర్టైస్మెంటులో అమ్మాయిలు, అబ్బాయిలు ఆనందంగా నవ్వుతూ ఎక్సర్సైసులు చేస్తున్నారు...వాళ్ళందరిలోకీ ఎక్కువగా నవ్వుతున్నవాడు "మా ఈ 'Fit, Fitter, Fittest' తో వ్యాయామం చెయ్యండి...రోజుకు 10 నిముషాలు చాలు...మీ శరీరం లో ఉండే కొవ్వు అంతా కరిగి పోతుంది...కాళ్ళూ చేతులు బలంగా తయారౌతాయి...కండలు తిరుగుతాయి....పళ్ళు మిలమిలా మెరుస్తాయి..జుట్టు నిగనిగలాడుతుంది..చొక్కా తళతళ మెరిసిపోతుంది " అన్నాడు..ఇంతటి గొప్ప పరికరాన్ని పెట్టుకుని నేను అనవసరంగా కష్టపడుతున్నా...పైగా దీనితో బోలెడన్ని లాభాలు (పళ్ళు, జుట్టూ, చొక్కా)....వెంటనే ఆ పరికరం ఆర్డర్ చేసేసాను..1000 రూపాయలయ్యింది. దానిని ఇంటికి తెచ్చిన వాడు కూడా నవ్వుతూ ఇచ్చాడు...ఎంత మంచి మనుషులు వీళ్ళంతా.....

ఆలస్యం చెయ్యకుండా 'Fit, Fitter, Fittest' కవర్ తీసేసి, దాని మీద కూర్చుని, TV లో చూపించినట్టుగా నవ్వుతూ ఎక్సర్సైసు చెయ్యటానికి ప్రయత్నించా...అది ఎటూ కదలటం లేదు...ఒక అర గంట పాటు దానిని అన్ని వైపుల నుంచి కదల్చటానికి ప్రయత్నించా...దానికున్న పిడికి తగులుకుని నా షర్టు చిరిగాక వదిలేసా...అప్పుడర్థమయ్యింది..ఆ అడ్వర్టైస్మెంటు వాళ్ళూ, ఆ డెలివరీకి వచ్చిన వాడు ఎందుకు నవ్వుతూ కనిపించారో....అంత డబ్బు పోసి దీనిని కొనే నాలాంటి వాళ్ళు ఉన్నారు అని తెలిస్తే ఇక నవ్వక ఏంచేస్తారు?

చెయ్యగలిగింది ఏమీ లేక ఆ పరికరం పేరు కొంచంగా మార్చి ('i' లు ఉన్న చోటంతా 'a' లు చేర్చాను) లావు కావటానికి తపించిపోతున్న దినకర్ కు 5000 రూపాయలకు అమ్మేసాను...

పోనీ ఏవైన పుస్తకాల్లో లావు తగ్గటానికి మార్గాలుంటాయేమోనని నాలుగైదు పుస్తకాలు కొని చదివా...మంచి 10, 15 కిటుకులిచ్చి, చివరకు "మీరు ఇవన్నీ క్రమశిక్షణ, పట్టుదల తో చేస్తే తప్పకుండా చక్కటి,నాజూకైన శరీరం మీ సొంతమవుతుంది " అని రాస్తారు....అసలు ఆ క్రమశిక్షణ, పట్టుదలే ఏడ్చుంటే ఇలాంటి పుస్తాకాలు ఎందుకు కొంటాను?? అవి లేని వాళ్ళకోసం ఏవన్నా చిట్కాలుంటాయనే కదా ఈ తనకలాట...

కాస్త పెద్దవాళ్ళకెవరికైన నా బాధలు చెప్పుకుంటే "ఇప్పుడు ఉద్యోగాలలో పొద్దున్నుంచి కుర్చీలో కూర్చొనే ఉండాలి...అందుకే అలా లావుగా ఔతున్నారు " అంటారు...
నాకర్థం కాదు,..ఇదివరకు ఉద్యోగాలు చేసే వాళ్ళంతా ఆఫీసులో గంటకొకసారి కబడ్డీ ఆడేవాళ్ళా ఏంటీ??

అయినా ఈ విషయంలో దేవుడు నాకు అన్యాయం చేసాడనే చెప్పుకోవాలి..నాకు తెలిసిన కొంతమంది ఎంత తిన్నా, వ్యాయామం చెయ్యకపొయ్యినా లావు పెరగరు...మరి నేను ...గట్టిగా గాలి పీల్చినా రెండు కిలోలు బరువు పెరుగుతాను..

ఇవ్వాళ తెల్లవారుజామున గేటు చప్పుడైతే ఎవరబ్బా అని కిటికీలోంచి చూసా...సుచరిత గారు...మా ఎదురింట్లోనే ఉంటుంది...చిన్నప్పటి నుంచి నన్ను 'తమ్ముడూ...తమ్ముడూ ' అని ఎంతో ప్రేమతో పలకరించేది ఎప్పుడూ....
తలుపు తీసి "రండి ఆంటీ" అన్నాను. దానికి ఆవిడ "లావాటి అన్నయ్య గారూ....కొంచం పంచదార వుంటే ఇస్తారా...మీ బావగారికి జిం కు ఆలస్యమౌతొంది " అంది..

ఈ సూటిపోటి మాటల బరువు నేను మొయ్యలేను..ఇంకో మూడు నెలల్లో నేను బరువు తగ్గుతాను.....ఒక వేళ తగ్గకపోతే....దానికి నైతిక బాధ్యత వహించి మన రాష్ట్రపతి రాజీనామా చెయ్యాలి!

Wednesday, August 22, 2007

ఇదీ సంగతి!

గత రెండు నెలలుగా నా చుట్టూ ఉన్న ప్రపంచం లో ఏమి జరుగుతోందో నాకు తెలియదు..పర్సనల్ లైఫ్ లోను, ప్రొఫెషనల్ లైఫ్ లోనూ చాలా పనులవల్ల ఈ రెండు నెలల్లో ఒక్క న్యూస్ పేపర్ చదవలేదు, ఒక్క న్యూస్ చానల్ చూడలేదు...ఇలా ఏ వార్తా సరిగ్గా తెలియకుండా, జనరల్ అవేర్నెస్ సెంటీమీటర్ కూడా లేకుండా పోతే నేను కూడా కొంత మంది తెలుగు న్యూస్ రీడర్ల లాగా అయిపోతానేమో అని భయమేసి వెంటనే మేలుకున్నాను....

పాత న్యూస్ పేపర్ల కోసం రమేష్ రూముకు బయలుదేరాను...

పొద్దున్నే వాకిట్లో పడి ఉన్న న్యూస్ పేపర్ ఇంట్లోకి తీసుకెళ్ళి జాగ్రత్తగా గూట్లోపెడతాడు మా రమెష్. చదివితే పేపర్ నలిగిపోతుందని దాన్ని తాకడు. మళ్ళీ పేపర్లు అమ్మేటప్పుడు బయటకు తీయటమే...కాబట్టి అక్కడకు వెళ్తే మనకు కావలసిన పేపర్ ఫ్రెష్షుగ దొరుకుతుంది..

మొన్న శని ఆదివారాలు కూర్చొని రెండు నెలల న్యూస్ పేపర్లు చదివేసాను..ఏమైనా సహాయం చేస్తాడేమోనని రమేష్ ను కూడా ముఖ్యమైన వార్తలేమైనా తెలిస్తే చెప్పమన్నాను. " వారం రోజుల క్రితం మన దేశ ప్రధానమంత్రి కుల్భూషన్ ఖర్భాండా......" అని ఇంకా ఏదో అనబోతుండగా రమేష్ నోటికి ప్లాస్టర్ వేసి ఒక కుర్చీ కి కట్టేసాను...

ఏవో కారణాల వల్ల ఈ మధ్యకాలం లో న్యూస్ మిస్ అయ్యి నాలాగా " చాలా బిజీ " అని కహానీలు దొబ్బుతున్న వాళ్ళ కోసం నేనొక న్యూస్ లెటర్ తయారు చేసాను..ఇది చదివిన వారు చెప్పుకోదగ్గ వార్తలేవీ మిస్ కానట్టే....


పాలిటిక్స్ -

అసెంబ్లీ సమావేశాల్లో చివరి బెంచీల్లో కూర్చుంటున్న మంత్రులుందరికీ తీరని అన్యాయం జరుగుతోందని మంత్రి అఖండమూర్తి గారు అన్నారు. ఆయన మాట్లాడుతూ " ఎయిర్ కండిషనర్లు ముందు వరసలో కూర్చున్న వాళ్ళకు మాత్రమే గాలి వచేట్టు ఫిక్స్ చేసారు...ఇది వెనక బెంచీ వాళ్ళ మీద జరిగిన కుట్ర " అని... దానికి నిరసనగా కట్ డ్రాయర్ల తో స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళారు....
ఇంతలో ముందు బెంచి లో కూర్చున్న మంత్రి ప్రచండమూర్తి గారు లేచి " అధ్యక్షా...ఈ కట్ డ్రాయర్ ల నిరసన ఐడియా మాది...దీనిని దొంగలించిన వీళ్ళని క్షమించరాదు...రెయ్ అఖండి గా...నీ @#$*$@& " అన్నారు..
దీనికి సమాధానంగా అఖండమూర్తి గారు ప్రచండమూర్తి గారిని ఉద్దేశించి " పొరా నీ $@&**, *&***, @#$*&!!! " అన్నారు....
ఇలా ఒకరి వంశవృక్షాన్ని మరొకరు వేళ్ళతో సహా పెకిలించాక స్పీకర్ పక్కన ఎప్పుడూ కర్ర పట్టుకుని సైలెంటుగా ఉండే వ్యక్తిని కిందకు లాగి చితకబాదారు...

ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు అఖండమూర్తి గారు ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి -

" నేను వాళ్ళ నాన్నను " బర్రె " అని తిట్టాను...కావాలంటే ఆయనను కూడ మా నాన్నను " గేదె " అనో, " దున్నపోతు " అనో తిట్టమనండి..అంతే కానీ " మొన్నీమధ్యలో వచిన ' సత్యభామ ' సినిమాలోని 'నీ నవ్వులే చూసా ' అనే పాట పాడింది మీ నాన్నేగా "...అని అవమానించటం మేము సహించేది లేదు...అస్సలిది ప్రజాస్వామ్యమేనా?? ఆ పాట పాడి జనాల జీవితాలతో ఆడుకున్నందుకు చక్రి అనే సంగీత దర్శకుడికి ఆల్రెడీ హైకోర్టు వాళ్ళు 130 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించినట్టు యావత్ ప్రజానికానికీ తెలుసు...అలాంటప్పుడు ఈ అపవాదు సబబేనా??? అందుకే మేము ఇంకో మూడు రోజులు రాష్ట్రబంద్ నిర్వహించదలచుకున్నాము " అని అన్నారు...
అంతవరకు ఫోన్ లో మాట్లాడుతున్న ఆయన సెక్రెటరీ " సార్..మనమనుకున్న డేట్లలో ' ప్రజా సేవా.. మజాకా ' పార్టీ వాళ్ళు కూడా బంద్ నిర్వహిస్తున్నారు " అన్నాడు...
" దేనికి బంద్? " అడిగారు అఖండమూర్తి గారు..."
కర్నూల్ జిల్లా ఆదోని పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర కాన్వెంట్ లో 3వ తరగతి B సెక్షన్ సోషల్ స్టడీస్ పేపర్ అవుట్ అయ్యిందని రాష్ట్రబంద్ నిర్వహిస్తున్నారు "..అని సెక్రెటరీ చెప్పగానే " ఆల్రైట్.. మా బంద్ వచ్చే వారానికి వాయిదా వేస్తున్నాము " అని ప్రకటించారు...వెంటనె ఆ పార్టీ కార్యకర్తలంతా " బంద్ జిందాబాద్...బంద్ వర్ధిల్లాలి " అని ఎంతో సాఫిస్టికేటెడ్ స్లోగన్లు అరిచారు..

ఆ తరువాత వారం రోజులు రోడ్డు మీద కనిపించిన బళ్ళ అద్దాలు పగలగొట్టి, ప్రైవేట్ వాహనాలలో ప్రయాణించటానికి ప్రయత్నించిన జనాల తలలు పగలగొట్టి...ఎంతో శాంతియుతంగా నిర్వహించారు బందును....
రైళ్ళు, బస్సులు ఆపటం తో పాటూ జనాలు కాలకృత్యాలు కూడా తీర్చుకోనీయకుండా జాగ్రత్త పడ్డారు బంద్ నిర్వాహకులు....
" ప్రజలంతా మాకు ఎంతగానో సహకరించి ఈ బందును జయప్రదం చేసారు...అలాగే మాకు ఈ బందు టైములో ఎంతో తోడ్పడ్డ ' ప్రజా సేవా..మజాకా ' పార్టీ వాళ్ళకు వచ్చేసారి ఫ్రీ గా బంద్ నిర్వహించి పెడతామని మాటిస్తున్నాము " అన్నారు....


బిజినెస్ -

'Sensex' అంటే అదేదో బూతు పదమని స్టాక్ మార్కెట్ కు చాలా ఏళ్ళుగా దూరంగా ఉన్న మారెళ్ళ దినకర్ అసలు విషయం తెలిసాక తన దగ్గరున్న లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేద్దామని నిర్ణయించుకున్నాడు..
ఒక మంచి రోజు చూసుకుని పొద్దున్నే CNBC, NDTV Profit చానెళ్ళు చూసాడు ఏమైనా సలహా ఇస్తారని..ఆ చానళ్ళలో మాట్లాడే ఇంగ్లీషు తిరుపతి యాస లో లేకపోవటం తో వాళ్ళు చెప్పేది ఏమీ అర్థం కాక TV ఆపేసాడు..
ఇక తన సొంత తెలివి తేటలనే నమ్మాలని అనుకుని ఒక తెల్ల కాగితం మీద వంద కంపెనీల పేర్లు రాసాడు..రెండు కళ్ళు మూసుకుని " జై వీరాంజనేయా " అని ఒక కంపెనీ మీద వేలు పెట్టాడు..దైవ నిర్ణయం కాదనలేక తను వేలు పెట్టిన " కిరాణా జనరల్ స్టోర్స్ " షేర్లు కొన్నాడు...లక్ష రూపాయలకు రెండున్నర లక్ష షేర్లు వచ్చాయి....
మరుసటి రోజు పేపర్లో " దివాళా తీయబోతున్న కిరాణా జనరల్ స్టోర్స్- షేర్లు కొని సొంత బ్లేడుతో గుండు గీసుకున్న బిజినెస్ టైకూన్ దినకర్ " అని మొదటి పేజీలొ వార్త వచ్చింది...
అసలే తన మొబైల్ ఫోన్ పనిమనిషి కొట్టేసిందని కొద్ది రోజులుగా చాలా బాధలో ఉన్నాడు దినకర్..దీనికి తోడు రాత్రి నుంచి తన కీబోర్డ్ మీద 'Enter' కీ కనిపించట్లేదు...ఇలాంటి సమయంలో ఈ వార్త చదవగానే తలకాయ లో Richter స్కేలు మీద 7.8 పాయింట్ల బుర్రకంపం వచ్చింది...
కాకపొతే ఆయనకు తల లోపల డామేజ్ కావటానికి సరుకేమీ లేదని డాక్టర్లు, సైంటిస్ట్లు, మెకానిక్లు ధ్రువీకరించటం తో ఊపిరిపీల్చుకుంది యావత్ వాణిజ్య ప్రపంచం...


సినిమా -

రెండు వారాల క్రితం మన దేశం లోని పైరసీ సిడి ల వ్యాపారస్తులు అంతా కలిసి సమావేశమయ్యారు..మీటింగ్ హాల్ లోకి ప్రవేశించే ప్రతి ఒక్కరూ eye patch లు వేసుకుని వచ్చారు...
వాళ్ళ సంఘ అధ్యక్షుడు మాట్లాడుతూ " ప్రేక్షకులు దొంగ సిడిలలో కొత్తదనం కోరుకుంటున్నారు.. థియేటర్ లో ఏదో మూలకు కూర్చుని హాండీకాం తో తీస్తుంటే క్లారిటీ ఉండట్లేదు..జనాల తలకాయలు, ఫాన్ లు కనిపిస్తున్నాయి...ఈలలు, మొబైల్ రింగ్ టోన్లు వినిపిస్తున్నాయి...ఇలాగే కొనసాగితే మన ఇండస్ట్రీ నిలదొక్కుకోవటం కష్టం..అందుకే మనమంతా కలిసి ఒక కొత్త దిశగా ముందుకు వెళ్ళాలి..ఈ మధ్య ఏ న్యూస్ చానల్ వాళ్ళు చూసినా చొక్కాల్లోనూ,పర్సుల్లోనూ హిడన్ కేమెరాలు పెట్టుకుని ఎంతో మంది చీకటి బ్రతుకులు బయటపెడుతున్నారు...మనకు ఆ హిడన్ కేమెరాలే శ్రీరామరక్ష..మన మనుషులకు ఈ కేమెరాలు ఫిక్స్ చేసి ప్రతి సినిమా షూటింగుకు పంపుదాము...అక్కడ జరిగే షూటింగంతా మన వాళ్ళు కేమెరా లో బంధించి తీసుకువస్తారు..ఇక్కడ మనము దానిని ఎడిట్ చేసి, ఇద్దరు ముగ్గురు అరవోళ్ళతో డబ్బింగు చెప్పించి..అసలు సినిమా విడుదల కాకముందే మన సిడి మార్కెట్ లోకి వదులుతాము...మనము దొంగగా తీయబోయే మొదటి సినిమా పేరు ' దొంగనాకొడుకు '...టైటిల్ విని ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు..ఇందులో హీరో తండ్రి పేరు ' దొంగనా '...హీరో మీద టైటిల్ రావాలని అలా పెట్టారు...కమాన్...మీమీ కెమెరాలు పట్టుకుని షూటింగులకు బయలుదేరండి " అన్నాడు...
ఈ రిపోర్ట్ రాత్రి ప్రసారమయ్యే 'దొంగ ఫిల్మ్ న్యూస్ ' లో టెలికాస్ట్ చేసారు...


స్పోర్ట్స్ -

ఆగస్ట్ 13వ తారీఖున మన క్రికెట్ టీం ఇంగ్లండ్ తో మూడవ మాచ్ డ్రా చేసి సీరీస్ 1-0 తో గెలిచింది...
ప్రెజెంటేషన్ సెరిమొని లో మన వాళ్ళు అందరూ కలిసి రచించిన "గెలవాల్సిన మాచ్ డ్రా చెయ్యటం/ఓడి పోవటం ఎలా" అనే పుస్తకాన్ని రెలీజ్ చేసారు...

ఆగస్ట్ 14వ తేది బొడ్డపాటి వంశీధర్ 7 సార్లు తుమ్మాడు..కారుమంచి విజయ్ 9 సార్లు తుమ్మాడు.....విన్నర్ - కారుమంచి విజయ్...నాకు తెలిసి ఈ మధ్య కాలం లో నలుగురికి చెప్పుకుని గర్వించదగ్గ విజయం సాధించిన ఏకైక భారతీయ క్రీడాకారుడు కారుమంచి విజయ్....


జనరల్ -


కొన్నాళ్ళ క్రితం మన భూమిని పోలిన గ్రహం ఇంకోటి ఉందని సైంటిస్టులు ప్రకటించారు...వెంటనే మన వాళ్ళు అంతరిక్షం లో తిరుగుతున్న సునితా విలియంస్ కు ఫోన్ చేసి ఆ గ్రహం మీద ఒక కర్చీఫ్ వేయించారు...హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ తో ఆ గ్రహానికి రిబ్బన్ కట్ చేయించి దానికి 'Bhoom - 2' అని నామకరణం చేసారు....
దీన్ని చూసి తట్టుకోలేని జార్జ్ బుష్ " 'Bhoom-2' మీద కెమికల్ వెపన్స్ ఉన్నాయని" దాని మీద యుధ్ధం ప్రకటించాడు....


అరెరే....పాత పేపర్లు కొనేవాడు వచ్చేసాడు...రమేష్ తన కట్లు తెంచుకుని ఉన్న న్యూస్ పేపర్లన్నీ ఇస్త్రీ చేసి బయటకు తీసుకువెళ్ళాడు....
ఓ ఐదు నిముషాల తరువాత రుసరుసలాడుతూ ఇంట్లోకి వచ్చి.." చూడరా..ఒక సారి వాడిన పేపర్లని వాడు 20 రూపాయలు తక్కువిచ్చాడు..అందుకే వాటిని తాకొద్దు రా అన్నది....సరే గానీ పైకి వస్తూంటే ఓనర్ గాడు నన్ను ఏ పేపర్ తెప్పించేది అనడిగాడు...అదేది రా...T తో స్టార్ట్ ఔతుంది...."

ఈ వార్తలు ఇంతటితో సమాప్తం...

Wednesday, June 6, 2007

నేను - బినీతా - చంద్రబాబు రెడ్డి

మొన్న ఒక రోజు ఆఫీసులో బిజీగా పని చేసుకుంటున్నట్టు డ్రామా ఆడుతుండగా ఒక ఫోను వచ్చింది...బెంగళూరు లాండ్లైన్ నంబరు..

నేను - హలో

అవతలి వ్యక్తి - హలో...నేను రా

నేను - ఇవతల కూడా 'నేనే' మాట్లాడేది...ఎవరు మీరు..

అవతలి వ్యక్తి - నేను రా...నీ ఎంకమ్మా..

నేను - చెప్పండి ఎంకమ్మ గారూ

అవతలి వ్యక్తి - ఎదవా...నేను దినకర్ రా

నేను - ఓ...నువ్వా....ఐతే రాంగ్ నంబర్

దినకర్ - చెప్పేది విను...ఇవ్వాళ మా ఆఫీసులో బినీతా చేరింది రా...మా టీం లోనే. ఇన్నాళ్ళు నా హీరోఇజాన్ని ఎవరిమీదా ప్రదర్శించాలా అని ఎదురుచూస్తున్నా..ఇక చూడు...వీలుంటే ఈ వారం బెంగళూరికి రా. నేనూ, బినీతా ఏ రెస్టారెంటులో నో..సినిమా హాలు లోనో కనిపిస్తాము. ఇందాకే చందు గాడికి కూడా ఫొను చేసి చెప్పాను...

ఫొను కట్ అయ్యింది.....

'బినీతా ' అంటే నా ఇంజనీరింగ్ లో క్లాసుమేటు. 'చందు ' అంటే కోట్ల చంద్రబాబు రెడ్డి - నా ఇంజనీరింగ్ ఫ్రెండు....ఒక్కసారిగా నా జీవితం లోని కొన్ని చేదు సంఘటనలు గుర్తుకొచ్చాయి...


*******************************


అవి నేను కొత్తగా ఇంజనీరింగ్ లో చేరిన రోజులు. మాకు పనికిమాలిన 'ప్రాక్టికల్స్' బోలెడు ఉండేవి. లాబు క్లాసుల్లో స్టూడెంట్స్ ను గ్రూపులుగా విభజించేవాళ్ళు. ఒక గ్రూపు కు నలుగురు. మా మొదటి సెమిస్టర్ లో నోటీసు బోర్డు లో ఏ గ్రూపు లో ఎవరెవ్వరు ఉంటారో లిస్టు పెట్టారు...నేను మూడో గ్రూపు. నా గ్రూపు లో నెనొక్కడే అబ్బాయిని..మిగతా ముగ్గురూ అమ్మాయిలు - భార్గవి, బిందు, బినీతా.
ఆ రొజు 'స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ ' క్లాసు అవ్వంగానే ముగ్గురమ్మాయిలూ నన్ను వెతుక్కుంటూ వచ్చి "మనమంతా ఒకే లాబ్ బ్యాచ్" అని చెప్పారు. ఓ రెణ్ణిముషాల పరస్పర పరిచయ కార్యక్రమం కూడా జరిగింది.

ఈ విషయం తెలియంగానే మా కాలేజీ లో తెలుగు వాళ్ళంతా కలిసి 'మయూరా'లో పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసారు..ఏడెనిమిదేళ్ళుగా అదే కాలేజి లో ఇంజనీరింగ్ డిగ్రీ కోసం పోరాడుతున్న మా పూర్వీకులందరూ వచ్చారు...నాకు 'తెలుగు తేజం' అనే బిరుదిచ్చి ఒక పెద్ద పూలదండ వేసారు.

చివరగా మా సూపర్ సేనియర్ జోషి మాట్లాడుతూ " 'తెలుగు అబ్బాయిలతో అమ్మాయిలు మాట్లాడరు ' అన్న అపవాదుకు ఈ రోజుతో తెర పడబోతోంది. ఇన్నాళ్ళుగా మేమెవ్వరూ సాధించలేనిది మన వాడు సాధించాడు " అన్నాడు...ముందు వరసలో కూర్చున్న గోపాల క్రిష్ణ ఆనంద భాష్పాలతో "నీలాంటి వాడు బాచుకు ఒక్కడున్నా చాలు రా...మేమంతా గర్వంగా తలెత్తుకుని తిరుగుతాము " అన్నాడు.

సరే..'ఫంక్షన్ ' అనే సాకు అయిపొయ్యింది కాబట్టీ అసలు కార్యక్రమం మొదలయ్యింది - మందు పార్టీ..ఎవడికి తోచింది వాడు తాగాడు..అక్కడుండే వాళ్ళలో సగానికి పైగా పడిపొయ్యారు....

"ఈ రోజు మీరు తాగినదానికి బిల్లు గౌతం గాడు కడతాడు" అని చంద్ర బాబు రెడ్డి గాడు గట్టిగా అనౌన్సు చేసాడు. ఆ మాట వినపడటం తో కింద పడిపొయ్యిన వాళ్ళంతా లేచి మొహాలు కడుక్కుని ఫ్రెష్ అయ్యి మళ్ళీ తాగటం మొదలు పెట్టారు. 'ఒక ప్రాణి ఇంత ద్రవ పదార్థం తాగగలదా " అని తిమింగలాలు కూడా అనుమానించే లాగా తాగాడు ప్రతి ఒక్కడు..మూడు నాలుగు గంటలు అలా తాగాక వాళ్ళందరిని ఒక ఇసక లారీలోకి ఎక్కించి హాస్టల్ కు పార్సెల్ చేసాము...

సీనియర్ల ప్రసంగాలు బాగా ఇన్స్పైర్ చేసాయో ఏమో,ఆ రోజు రాత్రి పడుకున్నప్పుడు ఏవేవో ఆలోచనలు...మరుసటి రోజు నేను లాబ్ కు వెళ్ళగానే నా బాచీ అమ్మాయిలు "వావ్....వాట్ ఎ మాన్" అని అరిచి నన్ను వాటేసుకున్నట్టు...నన్నొక కుర్చీ లో కూర్చో పెట్టి ద్రాక్షపళ్ళు తినిపిస్తూ జ్యూసులు తాగించినట్టు...ఇవన్నీ చూసిన మా ప్రొఫెసర్లు నన్ను మెచ్చుకుని అప్పటి నుంచి ఫైనల్ ఇయర్ దాకా జరిగే అన్ని పరీక్షలలో పాస్ చేసేసినట్టు.......చక్కటి ఊహలు.

నా ముగ్గురు లాబ్ పార్ట్నర్లలో బినీతా కూడ ఉందని ఇందాకే చెప్పాను గా..ఆ అమ్మాయి మా కాలేజికి మాధురీ దీక్షిత్ లాంటిది. పుస్తకాల రంగూ రుచి వాసన తెలియని బీహారబ్బాయిల నుంచి సోడా బుడ్డి బెంగాలీల దాక కళ్ళూ, కళ్ళద్దాలూ ఆర్పకుండా చూసే వారు ఆ అమ్మాయి అటుగా వెళ్తుంటే....అలాంటిది, వారానికి మూడు సార్లు అనిల్ కపూర్ లా ఆ అమ్మాయి పక్కన్నే నుంచొనే చాన్సు కొట్టేసా....

మా హాస్టల్ లో మామూలుగా పొద్దున తొమ్మిదింటిలోపు ఎవ్వడూ స్నానాలు చెయ్యడు..క్లాసు ఏ ఎనిమిది కో ఎనిమిదిన్నరకో ఉంటే ఆ రోజొంతా స్నానం ఉండదు..అలాంటిది నేను పొద్దున్నే ఏడింటికే నిద్ర లేచి, స్నానం చేసి, హాస్టల్ ముందు ముగ్గేసి..లాబ్ కు బయలుదేరాను...

నేను వెళ్ళేటప్పటికే మా లేడీస్ ముగ్గురూ వచ్చేసారు.."హాయ్.." అన్నాను..వాళ్ళు కూడా హాయ్ లు చెప్పి షేక్ హాండ్ ఇచ్చారు...షేక్ హాండ్!....ఈ విషయం మా వాళ్ళకు తెలిస్తే నాకు 'భారత రత్న ' ఇచ్చి సత్కరిస్తారు....ఇంతలో బినీతా "మ్మ్...నువ్వేసుకున్న డియోడరెంట్ భలే వాసనొస్తోంది...ఏ డియోడరెంట్ వాడతావెంటి?" అని అడిగింది...లాబ్ లో మూలకు ఉన్న టేబుల్ పక్కన నుంచున్న దినకర్ "నాది..నాది...ఆ డియోడరెంట్ నాది...ఇప్పుడే రూము కెళ్ళి పట్టుకొస్తాను " అని పరిగెట్టాడు...

మా ప్రొఫెసర్ రాంగానే అందరము వెళ్ళి మా టేబుళ్ళ ముందు నుంచున్నాము...మాకొక ఎక్స్పెరిమెంటు ఇచ్చి, వెళ్ళి దానికి కావలసిన ఎక్విప్మెంట్ తెచ్చుకొమన్నాడు.... ముగ్గురమ్మాయిలూ నా వైపు చూసి " గౌతం...pleeeeeaaasssssseeeeee...ఆ ఎక్విప్మెంట్ తీసుకు రావా? " అని అడిగారు. వెంటనే నేను మోకాళ్ళ దాకా పాంటు మడతెట్టుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళి, కావలసిన వన్నీ పట్టుకొచ్చాను....అప్పుడు మడతెట్టిన పాంటు నాలుగేళ్ళదాకా కిందకు దించలా...ఎప్పుడు ఏ వయర్లు కావాలన్నా...ఏ మీటర్లు తేవాలన్నా బినీతా నా వైపు చూసి "pleeeeeaaasssseeeeee... " అంటుంది...మొదట ఓ నాలుగైదు సార్లు ఎదో మనల్ని హీరో గా భావించి తెమ్మంటున్నారనుకున్నా. కానీ ప్రతీ సారీ ఇలా జరుగుతుండటం తో మెల్లగా నా కళ్ళు తెరుచుకున్నాయి....

అంత చాకిరీ చేసినా కూడా ఎక్స్పెరిమెంటు చేసెప్పుడు నన్ను ఎక్విప్మెంట్ ముట్ట నిచ్చే వాళ్ళు కాదు...ఒక్క సర్క్యూటుకు కూడా కనెక్షన్లు ఎలా పెట్టాలో తెలిసేది కాదు నాకు..ముగ్గురూ తమలో తాము రహస్యంగా ఎక్స్పెరిమెంటు చేసేసుకుని, వీలుంటే నా మీద రెండు మూడు జోకులేసుకుని (నాకు వినబడేలా), టైం అయిపొంగానే మళ్ళీ నన్ను చూసి "ఇవన్నీ తిరిగి లోపల పెట్టెయ్యవా pleeeeeaaasssseeeeee..." అనేవాళ్ళు.....

ఈ విషయాలేవీ హాస్టల్ లో జనాలకు ఎవ్వరికీ తెలియదు. అమ్మాయిలతో మాట్లాడటానికి కిటుకులు నేర్పమని నా దగ్గరకు రోజుకొకడు వచ్చేవాడు...నిజం బయటకు చెప్పెస్తే జరిగే పర్యవసానాలు బాగా తెలుసు కాబట్టి ఏవొ అరవ,మలయాళ సినిమాల్లొ హీరోలు హీరోయిన్ల వెంటబడేప్పుడు వాడె టెక్నిక్కులను తర్జుమా చేసి సలహాలుగా మా వాళ్ళకు పడేసే వాణ్ణి.

ఇలాంటి తరుణం లో ఒకసారి నా పుట్టిన రోజొచ్చింది....లాబ్ లో నాపాటికి నేను వైర్లు, కుర్చీలూ మోసుకుని తిరుగుతుండగా..చంద్ర బాబు రెడ్డి గాడు మా లాబ్ కు వచ్చి , తలుపు దగ్గర నుంచి గట్టిగా " హాపీ బర్త్ డే రా గౌతం" అని అరిచి వెళ్ళిపొయ్యాడు..అప్పటివరకు చప్రాసి పనికి తప్ప నా తో ఎప్పుడూ మాట్లాడని అమ్మాయిలు ముగ్గురూ నా దగ్గరకు వచ్చి ఒకటికి రెండు సార్లు విష్ చేసి " ఇవ్వాళ సాయంకాలం ట్రీట్ ఇవ్వాల్సిందే " అన్నారు..నేను ఒప్పుకోలేదు...బినీతా నా దగ్గరకు వచ్ఛి పక్కన్నే పడి ఉన్న వైర్ ముక్క తీసుకుని నన్ను చిన్నగా గోకి "pleeeeeaaasssseeeeee..." అనింది..........తరువాతి సీన్ లో అందరమూ ఐస్క్రీం పార్లర్ లో ఉన్నాము...

ఆ వచ్చేటప్పుడు తన రూమ్మేట్స్ ను కూడా వెంటేసుకొచ్చింది బినీతా.....ఐస్క్రీం లు తినింది, STD బూత్ లో ఇంటికి ఫోన్ చేసుకుంది....పక్క కొట్లో సబ్బులు, గూడ్నైట్ మాట్లు, చీపురు కట్టలు..ఇలా వాళ్ళ ఇంటికి కావలసిన సామన్లన్నీ కొనింది బినీతా డార్లింగ్.............అన్నింటికీ బిల్లు తనే కూడా కట్టింది (ఈ ఆఖరి వాక్యం నిజమని నమ్మిన వాళ్ళు....... డాక్టరు దగ్గరకు వెళ్ళవలసిందిగా ప్రార్థన).

చివరగా అక్కడున్న అందరూ కలిసి నాకొక రెనాల్డ్స్ పెన్ను గిఫ్టుగా ఇచ్చారు...

నేను ఐస్క్రీం పార్లర్ లో అమ్మాయిలతో కూర్చుని ఉండటం చూసిన చంద్ర బాబు రెడ్డీ గాడు హ్సస్టల్ కు వెళ్ళి అక్కడ అందరికీ "అమ్మాయిలంతా కలిసి గౌతం గాడికి ట్రీట్ ఇచ్చార్రో " అని దండోర వేసాడు....ఆ రోజు రాత్రికి మాళ్ళీ ఓ పెద్ద సమావేసం ఏర్పాటు చేసి నాకు 'తెలుగు వజ్రం ' అని ప్రమోషన్ ఇచ్చి, మళ్ళీ తాగి తందనాలాడారు.........బిల్లు నేను కట్ట లేదు (ఈ ఆఖరి వాక్యం నిజమని నమ్మిన వాళ్ళు........ఏంటి డాక్టర్ ఊరిలో లేడా??? )

ఇండియా టీం క్రికెట్ మాచులో గెలిచినప్పుడు...మా యూనివర్సిటీ లో రిజల్ట్ బాగా వచ్చినప్పుడు.. అటల్ బిహారీ వాజ్ పాయి బాత్రూము లో కింద పడినప్పుడు....ఇలా మన దేశం లో ఏమి జరిగినా...చంద్ర బాబు రెడ్డి గాడు అందరి ముందు నన్నొచ్చి అభినందించటం...బినీతా నన్ను ట్రీట్ అడగటం....మా వాళ్ళు నాకొక కొత్త బిరుదివ్వటం.....నేను మా ఇంట్లో "special fee" అని చెప్పి డబ్బు తెప్పించుకోవటం.....ఎన్నో సార్లు జరిగాయి.....


*********************


వెంటనే బెంగళూరు బయలుదేరాను...ఎలాగైనా దినకర్ ను కాపాడదామని. బస్టాండు నుంచి నేరుగా దినకర్ ఆఫీసుకు వెళ్ళాను..కాబిన్ లోకి వెళ్ళ బోతుండగా అక్కడ దినకర్, బినీతా కనిపించారు...తలుపు దగ్గర దాక్కుని వాళ్ళ మాటలు విన్నాను.

"బాగున్నావా బినీతా " అన్నాడు దినకర్...

బినీతా "బాగున్నాను దినకర్....ఔనూ...ఏదో మంచి వాసనొస్తోంది.. ఎక్కడి నుంచి?" అని అడింగింది

వెంటనే మా తింగరోడు తన చంక పైకి లేపి "ఇదిగో...నీకిష్టమైన డియోడరెంట్ వేసుకొచ్చాను " అన్నాడు..

ఈ లోపు ఆఫీస్ బాయ్ ఒక పెద్ద బొకే తీసుకొచ్చాడు..

"ఏంటిది?" - అడిగాడు దినకర్...

"ఎవరో చందు అనే అతను మీకు పంపాడు సార్...ఇవ్వాళ మీ పుట్టిన రోజంట కదా...హాపీ బర్త్ డే సార్ " అని ఆ బొకే ఇచ్చి వెళ్ళి పొయ్యాడు..

దినకర్ "అదేంటి...ఇవ్వాళ నా పుట్టిన రోజు కాదే..." అని ఇంకా ఏదో అనబోతుండగా..... బినీతా దినకర్ చెయ్యి పట్టుకుని " హాపీ బర్త్ డే దినకర్...ఇవ్వాళ ఆఫీసు అవ్వంగానే ట్రీట్ ఇవ్వాలి" అంది.....

మళ్ళీ తనే మాట్లాడుతూ "దినకర్...దినకర్...నాకు ఫాస్ట్ గా టైప్ చెయ్యటం రాదు...ఈ రెండు డాక్యుమెంట్స్ టైప్ చేసి పెట్టవా pleeeeeaaasssseeeeee..." అంది.

నేను అక్కడి నుండి బయటకొచ్చేసాను....పరిస్థితి చెయ్యిజారి పొయ్యింది...నేనేమీ చెయ్యలేను....

కానీ లోక కల్యాణం కోసం ఒక చిన్న ప్రకటన మాత్రం ఇవ్వగలను:

అమెరికా లో ఉండే ఆంధ్రుల్లారా....న్యూ జర్సీ లో 'కోట్ల చంద్ర బాబు రెడ్డి ' అనే ఒక దొంగ వెధవ ఉంటాడు...వాడు గానీ మీకు కనిపిస్తే...దగ్గర లో ఉండే పోలీసు స్టేషన్ కు తీసుకెళ్ళి "వీడు, ఒసామా బిన్ లాడెన్ కలిసి బీడీలు కాల్చేవాళ్ళు" అని చెప్పండి..చాలు....

Thursday, May 17, 2007

నా చీకటి రహస్యాలు

నేను ఇన్నాళ్ళుగా దాచుకున్న రెండు చీకటి రహస్యాలు ఈ బ్లాగు ద్వారా బయట పెడుతున్నాను...

మొదటి రహస్యం - నాకు కుక్కలంటే భయం. ఈ భయాన్ని ఇంగ్లీషులో 'Cynophobia' అంటారట.

రెండో రహస్యం - నాకు ఇంజెక్షన్లంటే భయం. ఈ భయానికి కూడా ఏదో ఇంగ్లీషు పదముండే ఉంటుంది..కానీ ఆ పదమేంటో తెలుసుకోవాలంటే కూడా భయం నాకు.
మా ఇంటి బయట ఎప్పుడూ రెండు కుక్కలుంటాయి. కంఫ్యూజ్ కాకూడదని నేను వాటికి పేర్లు పెట్టాను - 'నల్ల కుక్క ', 'నల్ల కుక్క పక్కనుండే కుక్క ' - మూడేళ్ళుగా రోజూ వీటి ముందు నుంచే వెళ్తున్నా కూడా నన్ను చూసినప్పుడల్లా మొరుగుతాయి. నా డ్రైవర్స్
లైసెన్సో, కంపెనీ ID కార్డో చూపిస్తే తప్ప నన్ను కదలనివ్వవు.

ట్రాఫిక్ పోలీసులు వైర్లెస్సు లో మాట్లాడుకున్నట్టు ఈ కుక్కలకు కూడా ఏవో ఫోన్లలో మాట్లాడుకునే సదుపాయం ఉంది. నేను ఏ ఏరియా వైపు బయలుదేరుతుంటే ఆ ఏరియా కుక్కలకు మెస్సేజ్ చేరిపోతుంది. నిద్రపోతున్న కుక్కలు, భోంచేస్తున్న కుక్కలు అన్నీ పనులు మానుకుని నాకోసం ఎదురుచూస్తాయి..నేను కనిపించగానే ఆర్.నారాయణ మూర్తి సినిమాలో సైడ్ డాన్సర్ల లాగా ఆవేశంతో నా మీదకు వస్తాయి...

మనుషుల్లో ఉనట్టు జాతి,ప్రాంత భేధాలు కుక్కల్లో ఉండవు..ఏ ఊరి కుక్కైన, ఏ జాతి కుక్కైన నన్ను చూసి మొరుగుతుంది, నా వెంట పడి నన్ను తరుముతుంది..

నేను పదో క్లాసులొ ఉండేప్పుడు శివప్రసాదరావు గారింటికి లెక్కల ట్యూషన్‌కెళ్ళేవాడిని.
"లెక్కలు, కుక్కలు ఒకటే రా...వాటిని చూసి నువ్వు భయపడి పరిగెడితే అవి నీ వెంటపడతాయి...వెనక్కు తిరిగి 'దీని సంగతేందో చూద్దాం తీ' అనుకుంటే తోక ముడుస్తాయి" ఆంటూండేవాడాయన...
దీనిని అమలు పరుద్దామని నేను ఒకసారి నా వెనకాల పడ్డ కుక్కల మీదకు రాయి విసిరాను. అవి ఆగిపొయ్యాయి....ఆ విజయ గర్వంలో పూనకమొచ్చినోడి లాగా ఓ రెండు నిముషాలు రాళ్ళు విసురుతూనే ఉన్నాను. ఆ కుక్కల మూక నా లాగా తిక్కది కాదు...నా చుట్టూ ఉండే రాళ్ళన్నీ అయిపొయ్యేంతవరకు వెయిట్ చేసాయి...ఆ తరువాత పక్కవీధిలో ఉండే మరో ఆరు కుక్కలకు SMS చేసి పిలిపించి, ఊరు దాటేంత వరకు నా వెంటబడ్డాయి. ఊరు దాటాక 4 X 400 మీటర్స్ రిలే రేసులో లాగా ఆ పక్క ఊరి కుక్కలకు నన్ను అప్పగించి తిరిగి వెళ్ళి పొయ్యాయి...

నాకెప్పుడో ఊహ తెలియని వయసులో ఇంజెక్షన్ వేయించారు మా ఇంట్లో వాళ్ళు. ఆ తరువాత నాకు 18 ఏళ్ళొచ్చేంతవరకు ఎప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్ళినా ఆ సిరంజిలో ఉండే మందు లోటాలో పోసుకుని తాగానే కానీ సూది పొడిపించుకోలేదు....

ఆ తరువతైనా సూది వేయించుకున్నది నాకేదో మైనారిటీ తీరిపొయ్యిందని కాదు.....నన్ను నా పధ్ధెనిమిదో ఏట కుక్క కరిచింది..అందుకు.

నేను మయూరా బేకరీ దగ్గర బటర్ బన్ తింటూ ఉంటే నా వెనకాల ఎవరో అమ్మాయి చిన్న కుక్క పిల్లను ఎత్తుకుని "చో చ్వీట్, చో క్యూట్ " అని దాన్ని ముద్దాడుతోంది..నేను దరిదాపుల్లోనే ఉన్నట్టు ఆ కుక్కపిల్ల పసిగట్టినట్టుంది..ఆ అమ్మాయి చేతుల్లోంచి కిందకు దూకి, గట్టిగా మొరుగుతూ నా కాళ్ళ మీదకు ఎగిరింది. అది గిల్లిందో, కరిచిందో తెలియదు కానీ బొటనవేలు చివరి నుండి రక్తమొచ్చింది.....

నా చుట్టూ నుంచున్న వాళ్ళలో ఒకడు (నాకు వాడెవడో కూడా తెలియదు) "గిల్లినా కొరికినా ఇంజెక్షన్లు తప్పవు" అని మొదలెట్టాడు. మిగతా వాళ్ళు కూడా ఆ డిస్కషన్ లో పాల్గొని యధాశక్తి నన్ను భయపెట్టరు. చివరకు "నువ్వు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోకపోతే బ్రతకటం కష్టం " అని తేల్చేసారు...

కుక్క కరిచిన 24 గంటల లోపు ఇంజెక్షన్ వేయించుకోవాలన్నారు జనాలు. ఆ రోజు రాత్రంతా ఆలోచించి అన్నాళ్ళ నా సూది బ్రహ్మచర్యం వదిలెయ్యాలని నిర్ణయించుకున్నాను...అది కూడా 'బొడ్డు చుట్టూ ఇంజెక్షన్ ' ల కాన్సెప్టు అప్పటికి పొయ్యింది కాబట్టి...లేకుంటే జీవితాంతం అలా మొరుగుతూ ఉండేవాడినేమో కానీ ఇంజెక్షన్లు మాత్రం వేయించుకునే వాడిని కాను.

నెలన్నర వ్యవధిలో 5 ఇంజెక్షన్లు వేయించుకున్నాను - కుడి చేతికి మూడు, ఎడమ చేతికి రెండు....అన్నీ అయ్యిన తరువాత పోలీసు స్టేషన్ కు వెళ్ళి ఆ డాక్టర్ మీద 'attempt to murder' కేసు పెట్టాను. అంత తక్కువ టైము లో అన్ని సార్లు ఇంజెక్షన్లు వేయించుకోవటం తో నాకు అవంటె 'భయం ' పొయ్యింది...'విపరీతమైన భయం ' మొదలయ్యింది.

ఈ కుక్కల భయం తో జీవితాంతం బ్రతకలేనని, నేను నాలుగేళ్ళ క్రితం ఒక Psychiatrist దగ్గరకు వెళ్ళాను. ఆయన "చూడు బాబూ..నీకు కుక్కలంటే భయం పోవాలంటే నువ్వు మొదట చెయ్యవలసింది వాటికి దగ్గరగా ఎక్కువ సమయం గడపటం...వాటితో ఆడుకో. ఒక్క సారి ఇది ప్రయత్నించి చూడు " అన్నాడు. ఆ సలహా ప్రకారమే నేను దాదాపు ఒక సంవత్సరం పాటు 'మోతీలాల్ తో చాల చనువుగా ఉన్నాను...వాడితో ఆడుకున్నాను (మోతీలాల్ అంటే కుక్క కాదు...మా ప్రొఫెస్సర్. వాడిలాంటి నీచుడు ఇంకోడు లేడు..వాడికి లేని కుక్క బుధ్ధి లేదు). ఎన్ని చేసినా నేను కుక్కలకు దగ్గర కాలేక పొయ్యాను. చివరి సెమిస్టరులో ఒక సారి మా హాస్టలు మెస్సులో టిఫిన్ చేద్దామనుకుంటుండగా కిటికీలోంచి ఒక కుక్క కనిపించింది. డాక్టర్ చెప్పింది గుర్తుకొచ్చి నా ప్లేటుతో సహా బయటకొచ్చాను. ఊహించినట్టే నన్ను చూసి అది మొరగటం మొదలుపెట్టింది. నా ప్లేటులొ ఉండే ఇడ్లీ దానికేసాను..అది పారిపొయ్యింది. మా మెస్సులో చేసె రబ్బర్ లాంటి ఇడ్లీలు మేమే అనుకున్నా...కుక్కలు కూడా తినవన్నమాట...చేసేదేమీ లేక ఆ ఇడ్లీలు మూల టేబుల్లొ కూర్చుని టిఫిన్ తింటున్నమోతీలాల్ గాడికిచ్చేసాను..

ఈ భయాన్ని నేను జయించలేను..నా పరిధుల్లో నెనుండటం మంచిది.

అందుకే అప్పటినుంచి నేను ఎవ్వరి ఇంటికి వెళ్ళినా వాళ్ళ గేట్ బయట "కుక్క లేదు..అజాగ్రత్త " అనే బోర్డు ఉంటే తప్ప లోపలకు వెళ్ళను.

మొన్న అడయార్ లో ఒక ఇల్లు ఖాళీగా ఉందంటే చూడటానికి వెళ్ళాను. ఇంటి గేటు మీద "కుక్కలు లేవ" న్నబోర్డు చూసి ఆనందంతో లోపలకు నడిచాను...గేటు తెరవబోతూ ఆ బోర్డు మళ్ళీ చూసాను...కింద చాక్పీసు తో సన్నటి అక్షరాలతో "దినకర్ ఉన్నాడు జాగ్రత్త " అని రాసుంది..ఇదేంటి ఇలా రాసుంది అని పక్కన్నే బొంగరాలు ఆడుకుంటున్న పిల్లల్ని అడిగితే విషయం తెలిసింది. దినకర్ అంటే ఆ ఇంటి ఓనర్..'మొరిగే కుక్క కరవదు ' అనే విషయాన్ని నలుగురికీ తెలపాలని మొరుగుతున్న ఒక వీధి కుక్క నోట్లో చెయ్యి పెట్టాడంట..20 నిముషాలపాటు ఆ చేతిని వదలకుండా పట్టుకుందంట ఆ కుక్క..ఆ ప్రయోగం ఫెయిల్ అయ్యిందన్న బాధలొ "కరిచే మనిషి మొరగడు " అనే కొత్త విషయాన్ని జనాలకు తెలియజెప్పటానికి.. తన ఇంట్లోకి ఎవరొస్తారా అని ఎదురు చూస్తున్నాడంట.

"కుక్క కాటుకు చెప్పు దెబ్బ " అనేది ఒక తప్పుడు సామెత. "కుక్క కాటుకు 5 ఇంజెక్షన్లు" అనేది కరెక్టు....ఈ సవరణ నా సామెతల పుస్తకంలో నేనెప్పుడో చేసుకున్నా..

Thursday, May 3, 2007

" ఇక్కడ మంచు పడుతోంది "...

...అని న్యూ యార్క్ నుంచి రాంకిరణ్ ఫోన్ చేసినప్పుడల్లా నా కడుపు రగులుతుంది. కారణం - ఇక్కడ మద్రాసు లో నిప్పులు కురుస్తున్నాయి.

2004 లో అనగనగా ఒక నేను మద్రాసు లో వచ్చి పడ్డాను. ఈ మూడేళ్ళలో సంవత్సరానికి 10 చొప్పున 30 ఎండాకాలాలు చూసాను. మార్చ్, ఏప్రెల్, మే నెలలలో ఎవరైనా మద్రాసు కు పెళ్ళికో, బంధువుల ఇంటికో వచ్చారంటే సిక్కిం బంపర్ లాటరీ కొట్టినట్టే. దగ్గర్దగ్గిర 180 డిగ్రీ సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది వాతావరణం.

అసలు మాటర్ ఏంటంటే.....'Big Bang' జరిగిన తరువాత మన విశ్వం లో అన్నీ చల్లబడి సర్దుకుంటున్న టైములో 'Small Bang' అనే చిన్న విస్పోటం ఇంకోటి జరిగింది. ఆ నిప్పు రేణువులు పడటం వల్ల మన విశ్వం లో కొన్ని ప్రాంతాలు మాత్రమే వేడిగా అలా ఉండిపొయ్యాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగినవి సూర్యుడు, సహారా ఎడారి, మద్రాసు...

ఇప్పటి వాళ్ళ లాగానే రాతియుగం నాటి మద్రాసు వాస్తవ్యులు కూడా కోతి నాయాళ్ళు. తంగ వేల్, శరవణ వేల్, బొటన వేల్, చిటికెన వేల్ అనే నలుగురు అన్నదమ్ములు దోమలు ఎక్కువగా కుడుతున్నాయని ఓజోన్ పొర ను చించి దోమతెరలు కుట్టుకున్నారంట. దాని ఫలితం ఇప్పటి జనాలు అనుభవిస్తున్నారు.
వీళ్ళకంటే అలవాటైపొయ్యింది....తలరాత తమిళ దేవుడు రాసి మద్రాసు లో ఉద్యోగం వచ్చిన నాలాంటి వాళ్ళ సంగతి ఏంటి??

'మద్రాసు ' ను 'చెన్నై' అని పేరు మారిస్తే పరిస్థితి మారుతుందేమో అని ప్రయత్నించారు. అసలుకే మోసం వచ్చి ఎండ మూడింతలయ్యింది. ఆ వేడికి బుర్ర బాయిలింగ్ పాయింట్ దాటి...మామూలు మనుష్యుల్లాగా అలోచించే శక్తి కోల్పొయ్యి, ఏమి చెయ్యాలో తోచని వాళ్ళు రాజకీయాల్లోకి ప్రవేశించి..ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు అయ్యారు (మీరుగానీ నేను కరుణానిధి, జయలలిత గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా??? ఐతే మీకు వంద మార్కులు...నేను వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను).

మా ఆఫీసు లో ఫార్మల్ వేర్ తప్పనిసరి....మార్చ్, ఏప్రెల్, మే నెలల్లో మేము పడే కష్టాలు గమనించి మానేజ్మెంట్ వాళ్ళు అందరికీ మెయిల్ చేసారు - "మీకు ఏ డ్రస్సు సౌకర్యంగా ఉంటే అదే వేసుకురండి" అని....మరుసటి రోజు అందరూ నిక్కర్లూ, బనియన్లూ వేసుకుని తయారయ్యారు..

కాసిన్ని వానలు పడితే ఐనా భూమి కాస్త చల్లబడుతుంది...కానీ అదంత వీజీ కాదు..

ఉన్న కొండలన్నీ పగలగొట్టి KPJ లక్కీ స్టోన్స్ వాళ్ళు ఉంగరాల్లో పెట్టి అమ్మటం మొదలు పెట్టారు..అశోకుడు మద్రాసు లో కూడా రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటించాడంట. కానీ ఇక్కడ టీ కొట్లనుంచి కార్ షోరూముల దాకా చెట్లు కొట్టేసి, ఫూట్పాత్లు చెరిపేసి కట్టిన ఇల్లీగల్ కట్టడాలు చాలా ఉన్నాయి...ఇప్పుడు మద్రాసు మొత్తానికి 13 చెట్లు మిగిలున్నాయి - అందులోవి ఆరు గులాబీ మొక్కలు...

కొండలూ, చెట్లు ఏమీ లేకపోతే వర్షాలు ఎక్కడినుండి పడతాయి??

అలాగని అస్సలు వర్షాలే ఉండవని కాదు..అప్పుడప్పుడూ కొన్ని అకాల వర్షాలు పడుతుంటాయి - అది కూడా కేవలం మద్రాసులో ఇండియా క్రికెట్ మాచులు ఉన్నప్పుడు మాత్రమే...ఈ మాట చాలా మంది నమ్మక పోవచ్చు....కావాలంటే ఈ సారి మనవాళ్ళ మాచ్ ఏదైనా మద్రాసు లో ఉన్నప్పుడు ఇక్కడకు రండి. ఆ రోజు పొద్దున వాన పడే సూచన ఏమాత్రం లేకున్నా సగం మంది గొడుగులు పట్టుకుని కనిపిస్తారు...మిగతా సగం 'అడవి రాముడు ' సినిమాలో వాన పాట డ్రస్సులేసుకుని తిరుగుతుంటారు. మనవాళ్ళు గనక గెలిచే పొజిషన్ లో ఉంటే ఆరోజు మధ్యాన్నానికల్లా తుఫానొచ్చి మద్రాసు చుట్టుపక్కల రెండు మూడు ఊర్లు మునిగిపోతాయి..

నేను నా స్నేహితులను కలవటానికి సగటున మూడు నెలలకొకసారి బెంగళూరు వెళ్తుంటాను. మద్రాసు నుండి వస్తున్న బస్సు బెంగళూరు ప్రవేశించబోతోంది అనగా ఒక అనౌన్సుమెంటు చేస్తారు - "మద్రాసు నుండి వస్తున్న ప్రజలార...ఇప్పుడు మీరు మీకు తెలియని ఒక కొత్త అనుభూతికి లోనవబోతున్నారు...దీనిని 'చలి ' అంటారు. సీట్ల కింద దూరడమో, డ్రైవర్ పక్కనున్న ఇంజను మీద కూర్చోవడమో చెయ్యండి...లేకపొతే చచ్చి ఊరుకుంటారు " అని...

మద్రాసు లోని లోకల్ బొబ్బిలి బ్రహ్మన్న 'చలి 'ని ఎప్పుడో 'గ్రామ బహిష్కరణ ' చేసాడు.. అందుకే ఇక్కడ 'చలికాలం ' అనే మాటకు అర్థం చాలా మందికి తెలియదు...ఇక్కడ డిసెంబర్, జనవరి నెలల్లో కూడా ఎయిర్ కూలర్ల అమ్మకాలు మాంచి జోరుగా ఉంటాయి...

మూడు నెల్ల క్రితం పేపర్లో వచ్చిన ఒక సంచలన వార్త అందరూ చదివే ఉంటారనుకుంటా - "మద్రాసు లో స్వటర్లు అమ్మటానికి ప్రయత్నించిన దినకర్ అనే వ్యక్తిని పిచ్చాసుపత్రిలో చేర్పించిన పోలీసులు " అని...మొదట్లో ఇదేదో పోలీసులు పన్నిన కుట్ర అనుకున్నారు మిగతా ప్రాంతాల వారు...కానీ అదే దినకర్ పిచ్చాసుపత్రి నుండి రెలీజ్ అయ్యాక మద్రాసు ఎండలో 'sun bath ' చేద్దామని రెండు చిన్న గుడ్డ పేలికలు కట్టుకుని మరీనా బీచులో పడుకున్నాడంట...ఆ ఫొటోలు పేపర్లో రావటం తో కొంచెం తేడా కాండిడేట్ అని నిర్ధారించుకున్నారు..

గంట సేపుగా కంప్యూటర్ ముందు కూర్చున్నానేమో...వళ్ళంతా చెమటలు పట్టేసాయి..ఈ రోజు చెయ్యవలసిన నాలుగో స్నానానికి టైమయ్యింది...

Wednesday, April 11, 2007

పరీక్షల రాక్షసి

మొన్న వీకెండ్ ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో చాలా చోట్ల గ్రౌండ్లలో పిల్లలు క్రికెట్ ఆడుతూ కనిపించారు. అందరికీ పరీక్షలు అయిపోయినట్టున్నాయి.

పరీక్షలు...exams...భాషా బేధం లేకుండా ఒంట్లో దడ పుట్టించేవి.

నేను ఆఖరి సారి పరీక్షలు రాసి దాదాపు మూడేళ్ళు కావొస్తోంది. ఇప్పటికికూడా పరీక్షల టైము గుర్తుకు వస్తే ఎదో తెలియని చిరాకు.

నేను ఇంటర్మీడియట్ వరకు మా వూళ్ళోనే ఉండి చదువుకున్నాను. ఇంట్లో వాళ్ళు ఎప్పటికప్పుడు నేను బాగా ప్రిపేర్ ఔతున్నానా లేదా అని చూసుకోవటం వల్ల అప్పటి పరీక్షలకు సంబంధించిన విషయాలు పెద్దగా జ్ఞాపకం లేవు.

ఒక్క సారి ఇంటి నుంచి బయటకొచ్చి హాస్టల్లో పడ్డప్పటి నుంచి రాసిన ప్రతి పరీక్ష గుర్తుంది....మేలుకున్న ప్రతి రాత్రి గుర్తుంది...వచ్చిన ప్రతి రిజల్టు గుర్తుంది...

పరీక్షల డేటు రాంగానే ఎవడి రూము లో వాడు కూర్చుని ఏఏ సబ్జెక్టు ఎన్ని రోజులలో పూర్తి చెయ్యాలో టైము టేబులు తయారు చేసుకుని గోడకు అతికించుకుంటాడు. ఎవరో ఒకరిద్దరు తప్ప మిగతా అందరూ చదవడం 'రేపటి ' నుంచి మొదలుపెట్టేలా టైము టేబులు తయరుచేసుకుంటారు. టైము టేబులు రెడీ అయిపొయ్యింది కాబట్టీ ఇంక టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. ఆ రోజు రాత్రి ఏదైన సినిమాకు వెళ్ళొచ్చి హ్యాపీగా పడుకుండిపోవటం.

గోడకతికించిన టైము టేబులు ఒక్క రోజు మాత్రమే నీటు గా ఉంటుంది. రోజులు గడిచేకొద్దీ అందులో పెన్నుతో కొట్టివేతలు..మార్పులు..అందుకు బోలెడు కారణాలుంటాయి. పుస్తకం తెరిచినప్పుడు టైము 7:45 అయ్యుంటే "8:00 నుంచి మొదలుపెడదాం" అనిపిస్తుంది. "నా మాట విను..ఇప్పుడే మొదలు పెట్టు" అని మనసు చెప్తుంది - మనకు వినబడదు. శనివారం వచ్చేటప్పటికి టైము టేబులు ప్రకారం చదవలేక పోతే..."సోమవారం నుంచి ఫ్రెష్షు గా మొదలుపెడదాం " అని మళ్ళీ అనిపిస్తుంది. "రేయ్..ఇలా చేస్తూ పోతే మట్టికొట్టుకు పోతావ్... " అని మనసు ఇంకా ఎదో చెప్పేలోపు దాని నోట్లో గుడ్డలు కుక్కి ఓ మూల కూర్చోపెడతాం. పరీక్షలకు రెండు రోజుల ముందు గోడకున్న ఆ టైము టేబులు పీకేసి అక్కడ ఏ ఐశ్వర్య రాయ్ ఫొటొనో అతికించుకుంటాం.

పరీక్షల డేటు ప్రకటించినప్పటినుంచి - పరీక్షలు మొదలయ్యేలోపు...చాలా సార్లు "exams postponed" అనే కమ్మటి మాటలు వినబడతాయి. ఈ పుకార్లు ఎవరు మొదలుపెడతారో తెలియదు..."మా మామకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ సెక్షన్ లో పని చేసేవాడు చెప్పాడు " నుంచి - "ఇందాకే TV లో చెప్పారంట " వరకు అన్ని రకాల మాటలు వినిపిస్తాయి. అయినా "ఎలా తెలిసింది...ఎవరు చెప్పారు " లాంటి ప్రశ్నలు ఎక్కువ మంది అడగరు. అప్పటికి పుస్తకం మూసెయ్యటానికి ఒక సాకు దొరికితే చాలు..మిగతా సంగతులు తరువాత. పరీక్షలు పోస్టుపోను అయ్యాయి అని తెలిసి కూడా పుస్తకం పట్టుకునేంత రాతి గుండె ఎవ్వరికీ ఉండదు...మళ్ళీ సినిమా...గంటకొకసారి కాలేజికి వెళ్ళి నోటీసు బోర్డు లో ఈ పరీక్షలు పొస్టుపోను అయిన విషయం గురించి ఏమైన ఉందేమో అని చూడటం...

ఎన్ని రోజులకూ ఆ శుభ వార్త రాకపోవటం తో ఒక్కొక్కరుగా పుస్తకాలు తీయటం మొదలుపెడతారు.

పరీక్షల టైములో వచ్చే ఆటంకాలలో క్రికెట్ అనేది చాలా పెద్దది. మన అదౄష్టం మీద దురదౄష్టం టాసు గెలిచి సరిగ్గా ఎగ్జాం టైము లో ఇండియా ఆడే టోర్నమెంటు ఏదైన ఉంటే అంతే సంగతులు...ఎంతో పెద్ద మనసు తో మనవాళ్ళు ఈ సారి లాగ ఫస్టు రౌండు లో తిరిగొస్తే తప్ప పరీక్షలలో గట్టెక్కటం కష్టం.

పరీక్షల టైము లో చదివేవాళ్ళు, చదవని వాళ్ళు అనే బేధం లేకుండా ప్రతి ఒక్కడూ 'night out' చెయ్యలనుకుంటాడు. అదేంటో.. రాత్రంతా మేలుకుంటే చాలు మనము పాసైపొయ్యినట్టె అనే భ్రమ లో ఉండేవాళ్ళం. మా హాస్టలు కు కొద్ది దూరం లో ఒక టీ కొట్టు ఉండేది. ఆ కొట్టోడు పరీక్షల టైము లో మాకోసం రాత్రంతా ఉండేవాడు. ఈ టీ కాన్సెప్టు మాలో చాలా మందికి పని చేసేది కాదు. పదకొండింటికి ఒక పెద్ద గ్లాసులో టీ తాగి సుబ్బరంగా పడుకునేవాళ్ళం. రెండింటికి మెలుకువస్తే ఫ్లాస్కు లో మిగిలిన టీ తాగేసి మళ్ళీ పడుకుండిపోవటం...కొన్ని సార్లు ఆ టీ సరిగ్గా పనిచెయ్యక పోవటం వల్ల రాత్రంతా మేలుకున్నా..."కరెంటెప్ప్పుడు పోతుందా" అని ఎదురు చూడటం.

మా కాలేజి వెనకాల ఉండే గుడికి మామూలు రోజుల్లో ఒకరిద్దరు తప్ప ఎవ్వరూ వెళ్ళేవారు కాదు. పరీక్షలు దగ్గరయ్యేకొద్దీ క్రౌడు పెరిగేది. హాల్టికెట్లు, పెన్నులకు తెగ పూజలు జరిగేవి. సబ్జెక్టుకొక కొబ్బరికాయ చొప్పున కొన్ని వేల కొబ్బరికాయలు పగిలేవి ఆ గుడి ముందు. వాటిలో సగం కాయలు మా సీనియర్ హనుమా రెడ్డి కొట్టేవాడు..వాడు ప్రతి సెమిస్టరు వచ్చి ఆ గుళ్ళో కొబ్బరికాయలు కొట్టి, పరీక్షలు రాయకుండా తిరిగి ఇంటికి వెళ్ళిపొయ్యేవాడు.

పరీక్షల టైము లో తప్పనిసరిగా వచ్చే డిస్కషన్ - 'సెలవులు ఎలా గడపాలి ' అని..చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ పాల్గొంటారు ఈ చర్చ లో..ఇంటికెళ్ళి తిరిగి రాంగానే ఎక్కడికైన ట్రిప్పుకెళ్ళాలి...ఆలస్యం చేస్తే రిజల్ట్స్ వచ్చేసే ప్రమాదముంది. అవి కాస్త అటో ఇటో ఐతే మళ్ళీ టైము టేబులు తయారు చెయ్యటం, నైటౌట్లు...అమ్మో టైము ఉందదు...అందుకే ఆ ట్రిప్పుకి పరీక్షల టైము లో ప్లాన్ వెయ్యటమే కరెక్టు!

ఇలా ఏవో ఆటంకాలు వచ్చి రోజులు గడిచిపొతాయి..ఆ దుర్దినం రానే వస్తుంది.

పరీక్ష ముందు రోజు జనం నాలుగు గ్రూపులుగా విడిపోతారు -

1. ముందు నుంచి బాగా ప్రిపేర్ అయ్యి...రివైజ్ చేసుకునే వాళ్ళు
2. ఒక్క రాత్రిలో ఎదోలాగ చదివేసి పాస్ అయిపోదామనుకునే వాళ్ళు
3. ఎనిమిది గంటలు చదివి పరీక్షలో ఊడబొడిచేది ఏమీ లేదని మరుసటి రోజు పరీక్షకు తీలోదకాలిచ్చేసి...తన లాంటి వాళ్ళను ఓ నలుగురిని పొగేసి.."మాయావతి అందంగా ఉంటుందా..విజయకాంత్ అందంగా ఉంటాడా " లాంటి దేశాన్ని పీడించే సమస్యల గురించి చర్చించేవాళ్ళు
4. కాపీ చీటీలు తయారు చేసుకునేవాళ్ళు...వీళ్ళంతా ఒక పెద్ద రూం లో సమావేశమయ్యి చకచకా చీటీలు రాసేస్తుంటారు..నా ఫ్రెండు దినకర్ కాపీ చీటీలు రాయటం లో దిట్ట..పరీక్షలకు వారం ముందు నుంచి "కాపీ చీటీలలో ఏ సైజు ఫాంట్ వాడాలి, చీటీలు సన్నగా ఎలా మడవాలి, వేళ్ళ సందులో పెట్టుకుని ఎలా రాయాలి " లాంటి అంశాల మీద workshop నిర్వహిస్తుండేవాడు.

పైన చెప్పిన నాలుగు రకాలలో ఎక్కువగ కనిపించేది రెండో రకం జనం. ఏదో ఒకటి చేసి పాస్ అయిపోవాలి అనుకునేవాళ్ళు. పుస్తకాలు తాకితే చేతికి సెప్టిక్ ఔతుందేమో అని భయం భయంగా తెరిచి చదవటం మొదలుపెడతారు. సెమిస్టర్ సరుకు...ఒక్క రాత్రిలో బుర్రలోకి తొయ్యాలంటే ఎలా కుదురుతుంది? మన బుర్ర తీసుకోగలిగినంత తీసుకుని మిగిలింది బయటకు తోసేస్తుంది....సరిగ్గా అలా బయటకు తోసేసిందాంట్లొంచే ఒక పది మార్కుల క్వశ్చను, మూడు ఐదు మార్కుల క్వశ్చన్లు వస్తాయి...ఆ క్వశ్చన్లు చూస్తే ఎక్కడో చదివినట్టే అనిపిస్తుంది...ఒక్క ముక్కా గుర్తుకు రాదు. ఇలాంటి టైములోనే మనము ఎప్పుడో నోట్లో గుడ్డ కుక్కిన మనసు కష్టపడి ఆ గుడ్డ తీసేసి "నేను ముందే చెప్పానా...చూడు ఎలాంటి పరిస్థితి తెచ్చుకున్నావో..వచ్చే సెమిస్టర్లో నైనా బాగా చదువు" అంటుంది.

ఇంట్లో వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకం...నెల నెలా మనకు పంపే డబ్బు గుర్తుకు వచ్చి పేపరు ఇద్దామా వద్దా అని కాస్సేపు తటపటాయించి..చివరకు చేసేదేమీ లేక ఇన్విజిలేటరుకు మన ఆన్సర్ పేపరిచ్చి హాలు బయట పడతాం..

ఏంటి ఇంకా ఎవ్వరూ బయటకు రాలేదే అని చూస్తే లోపల మోహన్ గాడు తెగ రాసేస్తూ కనిపిస్తాడు..ఒక పేపర్ మొత్తం నిండాక తను రాసింది తప్పనిపిస్తుందో ఏంటో..మొత్తం కొట్టేస్తాడు..వాడి చుట్టూ కూర్చున్న ఆరు మంది "రేయ్..ఇంత రాసాక కొట్టేస్తావేంట్రా" అని గట్టిగా అరిచి, వాళ్ళ పేపర్లో ఉండేది కూడా కొట్టేస్తారు...ఇన్విజిలేటరుకు అనుమానమొచ్చి మోహన్ గాడి ప్లేసు మార్చగానే ఈ ఆరు గురు పేపర్లు ఇచ్చేసి బయటకొచ్చేస్తారు.....

50 మార్కులకు చదువుకెళ్ళి...40 మార్కులకు పేపర్ రాసొచ్చి...35 మార్కులతో పాస్ అయిపోవాలి అనుకునే అత్యాశావాదులం మేము......

ఎలా గడిచిపొయ్యిందో గడిచిపొయ్యింది ఆ కాలం....పరీక్షలతో లెక్క లేనన్ని సార్లు చేసిన యుధ్ధం...

Wednesday, March 28, 2007

పెళ్ళెప్పుడు???

కొత్తగా ఉద్యోగం లో చేరాక మనకు తెలిసిన వాళ్ళెవరైన కనిపిస్తే.. "ఎలా ఉన్నావు? " అని అడిగినా అడగకపొయినా "పెళ్ళెప్పుడు? " అని మాత్రం తప్పకుండా అడుగుతారు.

సినిమాల్లో పెళ్ళి కాని అమ్మాయిల కష్టాలు చూపిస్తారు కానీ చదువు అవగొట్టి, ఉద్యోగం తెచ్చుకుని, పెళ్ళి కాని అబ్బాయిల బాధలు ఎవ్వరూ పట్టించుకోరు.

నా ఫ్రెండు ఒకడు "ఇంకో సంవత్సరం దాకా నాకు పెళ్ళి ఒద్దు మొర్రో " అని ఎంత గింజుకున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వినలా..
తన మాటలు నచ్చక అందరూ రెండు రోజులు భోజనం మానేస్తారేమో అనుకున్నాడు. కానీ వీడికి తిండి పెట్టడం ఆపేసారు. దాంతో ఒప్పుకోక తప్పలేదు.ఇలాంటి పరిస్థితే దాదాపు అందరిదీ.

పెళ్ళికి ఒప్పుకోగానే మన బాధ్యతంతా అయిపోదు. నిజానికి అప్పటి నుంచే అసలు టార్చర్ మొదలు.

మొదట చెయ్యవలసింది..పెళ్ళిళ్ళ మార్కెట్లోకి వదలటానికి మంచి ఫొటోలు తీయించుకోవటం.

ఫొటోలు: ఏ ఫొటోలు పడితే అవి ఇవ్వకూడదంట..స్టూడియోలో నీలం గుడ్డ ముందు నుంచుని ఒకటి, కుర్చీలో కూర్చుని ఒకటి, ఫొటో మొత్తం మొహం మాత్రమే కనపడేలా ఒకటి తీయించుకోవాలి. "ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండదు " అన్నామంటే.. మనము ఇంటర్మీడియట్లో పరీక్ష హాల్ టికెట్ కోసం తీయించుకున్న ఫొటో ఇస్తామని బెదిరిస్తారు.
పెళ్ళి సంబంధాల కోసం ఫొటోలు తీయటానికి 'స్పెషలిస్ట్ 'లు ఉంటారు. వీళ్ళ దృష్టిలో అక్కడకు ఫొటో లు తీయించుకోవటానికి వచ్చిన వాళ్ళంతా శత్రు దేశ యుధ్ధ ఖైదీలు..స్టూడియో లోకి వెళ్ళగానే ఇంటరాగేషన్ టైము లో వేసినట్టు పెద్ద పెద్ద లైట్లు వేస్తారు. "సరిగ్గా నుంచోండి సార్..కాస్త నవ్వండి..పై పళ్ళు నాలుగు, కింది పళ్ళు ఒకటిన్నర మాత్రమే కనపడాలి...ఎక్కువగా నవ్వకండి...ఆ చొక్కా గుండీ మీద ఇంకు మరకేంటి..తుడిచెయ్యండి "....ఇలా ఓ గంట సేపు రాగింగ్ చేసాక ఏవో ఫొటోలు తీసి పంపుతాడు. ఫొటోలు తీసినంత సేపూ మన మొహంలో ఏ పార్టూ సరిగ్గా లేదంటూ నిముషానికి ఒకసారి ఏడిపించి, అవమానించి..మన దగ్గర 1000 నుంచి 1500 రూపాయలు గుంజేస్తాడు.

బయోడాటా: ఫొటోలు రెడీ అయ్యాక చెయ్యవలసిన పని బయోడాటా తయారు చెయ్యటం. మన గురించి, మన అలవాట్ల గురించి చాలా జాగ్రత్తగా రాయాలి. ఈ బయోడాటా మాటి మాటికీ మారుస్తూ ఉంటే చాలా ఇబ్బందులపాలవ్వాల్సి వస్తుంది.
నా ఫ్రెండొకడు పేపర్ లో 'వధువు కావలెను ' అనే ప్రకటన లో మొదట "కట్నం లేకున్నా పరవాలేదు " అని ఇచ్చాడు. వాడికి తెలిసిన వాళ్ళెవరో "అలా ఇస్తే నీలో ఎదో లోపముందనుకుంటారు " అన్నారట. "కట్నం తప్పనిసరిగా కావాలి " అని మార్చాడు. అయినా లాభం లేక పొయ్యింది. ఇలా కాదని.. "కట్నం తీసుకు రాకపోతే పెట్రోలు పోసి తగలబెట్టేస్తాను..ఖబడ్దార్!" అని మార్చాడు. కొత్త సంబంధాలు ఏమీ రాలేదు కానీ పోలీసుల నుంచి ఫోను మాత్రం వచ్చింది...
అందుకే మొదటి సారే ఆచి తూచి బయొడాట తయారు చేసుకోవాలి. "సిగరెట్టు, మందు అలవాటు లేదు " లాంటి చిన్ని చిన్ని అబధ్ధాలు పరవాలేదు కానీ "నేను అందంగా ఉంటాను..రోజూ ఎక్సరసైసు చేస్తాను...అజీత్ అగార్కర్ బౌలింగ్ బాగా వేస్తాడు"... లాంటి పచ్చి బూతులు రాయకూడదు...అసలుకే మోసం వస్తుంది.

మధ్యవర్తులు: వీళ్ళు చేసే అన్యాయం అంతా ఇంతా కాదు - మనకు నెలనెలా వచ్చే జీతం నుంచి..మన అండర్వేరు సైజు వరకు ఎవ్వరికీ చెప్పని వ్యక్తిగత విషయాలన్నీ దబాయించి అడిగి తెలుసుకుంటారు..వాళ్ళు తెచ్చిన ప్రతీ సంబంధానికి "అమ్మాయి భూమిక లాగ ఉంటుంది..కళ్ళు మూసుకుని చేసుకోవచ్చు " అంటారు. తీరా వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి అమ్రీష్ పురి లాగ ఉంటుంది.

ఇంట్లో వాళ్ళ కంగారు: ఒక్క సారి సంబంధాలు చూడటం మొదలు పెట్టాక ఇంట్లో వాళ్ళు పడేదానికన్నా మనల్ని పెట్టే కంగారు ఎక్కువ.ఇంటికి వచ్చిన ప్రతీ వాడితో "మా వాడికి ఏవైన సంబంధాలు ఉంటే చూడరదూ " అంటారు. ఆ వచ్చినోడు మనల్ని ఎగా దిగా చూసి "నువ్వు కాస్త నీటుగా ఉండే బట్టలేసుకోవాలి మరి....అలా జుట్టు పెంచుకుంటే కుదరదు" అని ఐదు పైసల సలహాలు రెండు ఇచ్చి పోతాడు. ఛీ.. ఇలా మాటలు పడటం కన్నా ఆ ఆడ అమ్రీష్ పురి ని చేసుకోవటం మేలనిపిస్తుంది.

జాతకాలు: పిల్లవాడు పుట్టాక బర్త్ సర్టిఫికేట్ తీసుకోవటం మరచిపొయ్యినా జాతకం రాయించటం మాత్రం పొరపాటున కూడా మరువరు తల్లిదండ్రులు. పెళ్ళిళ్ళు కుదరటం వెనకాల ఉన్న కష్టాలు తెలుసుకున్న జ్యోతిష్యులు జాతకాలు రాసేటప్పుడు చాలా జాగ్రత్త పడుతున్నారు.

నా ఫ్రెండు దినకర్ జాతకం ఓ జ్యోతిష్యుడు ఇలా రాసాడు:

చదువు - అద్భుతం
ధనం - అద్భుతం
కళ్యాణ యోగం - అద్భుతం (conditions apply)

మనతో పాటూ చదువుకున్న వాళ్ళ పెళ్ళిళ్ళయ్యే కొద్దీ ఇంట్లో వాళ్ళకు బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది...."వాడిని అడిగైన తెలుసుకో ఏమి తప్పు చేస్తున్నావో " అంటారు. మనమేమీ మాట్లాడలేము. మనతో పాటూ ఫెయిల్ అవుతున్న ఫ్రెండు సడన్ గా 35 మార్కులతో పాస్ అయ్యి "పరీక్షలలో పాస్ కావటం ఎలా " అని సలహా ఇచ్చినట్టు... వాడూ ఏవో రెండు మాటలు చెప్తాడు.

ఇంట్లో వాళ్ళ ఎమొషనల్ బ్లాక్మెయిల్ వల్ల పెళ్ళికి సిధ్ధ పడ్డ అబ్బాయిలు చాలా మంది తెలుసు నాకు.
అమ్మాయిలకు జరిగే బలవంతపు పెళ్ళిళ్ళతో పోల్చుకుంటే ఇది పెద్ద సమస్య కాదు...అలా అని మరీ కొట్టిపారేసేంత చిన్నదీ కాదు..అందుకేనెమో ఇలాంటి సమస్య ఒకటి ఉంది అని ఎక్కువ మంది గుర్తించరు...

Wednesday, March 21, 2007

మల్లెపూలూ - మసాలా వడ

ఈ క్రింద ఉన్నదంతా కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగ వ్రాయబడింది..ఇందులోని ఏ పాత్రా కల్పితము కాదు..
ఇంకో విషయం...మన తెలుగు సినిమాల లాగానే పైన ఉన్న టైటిల్ కూ కింద రాసిన దానికీ ఏ మాత్రమూ సంబంధం లేదు...ఏ పేరు తోచక పెట్టింది మాత్రమేతలుపు కొట్టిన చప్పు డయ్యింది. వెళ్ళి చూస్తే ఎదురుగా 'రెండు రెళ్ళు ఆరు ' నిలబడుంది.

నేను - హలో..బాగున్నావా

రెండు రెళ్ళు ఆరు - నెను బాగానే ఉన్నాను. నీ విషయం చెప్పు. వారం దాటిపొయ్యినా కలవటానికి రాకపొతే నెనే వచ్చా..ఏంటి సంగతులు?

నేను - మంచి పని చేసావు. నిజానికి నెనే నీ దగ్గరకు వద్దామనుకున్నా

ఇంతలొ మళ్ళీ తలుపు చప్పుడయ్యింది. తెరిచి చూస్తే 'ఆఫీసు పని ' కనిపించింది. బట్టలన్నీ చిరిగి పొయ్యి, చింపిరి తలతో చాలా అస్సహ్యంగా ఉంది

నేను - నువ్వా..మళ్ళీ ఎందుకొచ్చావ్? దయచేసి నన్ను కాస్సేపు వదిలెయ్యి..చాలా రోజుల తరువాత నా ఫ్రెండుతొ ఓ గంట సేపు సరదాగ గడపాలనుకుంటున్నా. ఐనా నిన్ను ఆఫీసు లో రోజూ కలుస్తూనే ఉన్నాను గా..ఇంటికెందుకొచ్చినట్టు?

ఆఫీసు పని - నీ బాసు పంపించాడు..నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు కాస్త ఆనందంగా ఉండటం చూసినట్టున్నాడు. ఎక్కడో మూలకు పడి ఉన్న నన్ను వెతికి నీ కోసం పంపాడు. నాకు స్నానం చేయించి, కొత్త బట్టలు తొడిగి, తల దువ్వి, పౌడర్ రాసి పంపాలట.

నేను 'రెండు రెళ్ళు ఆరు ' వైపు చూసాను.

రెండు రెళ్ళు ఆరు - పరవాలేదు. నెను వెయిట్ చెస్తాను. దాని సంగతి చూడు

'ఆఫీసు పని ' కి గంట సేపు స్నానం చేయించినా జిడ్డు వదల్లేదు. నా ఓపిక నశించింది..చేయించిన స్నానం చాలనుకుని, చాలీ చాలని బట్టలు తొడిగి దానిని పంపించేసాను..

హమ్మయ్య...ఇప్పుడు ఎవ్వరొచ్చినా సరే 'రెండు రెళ్ళు ఆరు ' తో కనీసం ఓ అర గంటైన గడపాలి..

తలుపు చప్పుడయ్యింది. వెళ్ళి కిటికీ లోంచి చూసాను.

బయట 'నిద్ర ' నుంచుని ఉంది. నేను తలుపు తెరవలా.

ఇంతవరకు తలుపు మెల్లగా తట్టిన 'నిద్ర ' ఇప్పుడు దబ దబా బాదుతోంది...సరే దీని సంగతేంటొ చూద్దామని తలుపు తెరిచా

నేను - నువ్వు మామూలుగ ఆఫీసు లో ఉన్నప్పుడు కదా వస్తావు...ఇలా ఇంటికొచ్చావేంటి?

నిద్ర - మాష్టారూ..మనము కలిసి రెండు రోజులౌతోంది. నా వెనకాలే 'జ్వరం' కాచుకుని ఉంది..దానిని ఇంకాస్త వెయిట్ చెయ్యమని నచ్చజెప్పి నేను వచ్చాను..ఈ రోజైన కనీసం నాలుగు గంటలు నాతో గడపక పోతే రెపు పొద్దున్నే ఆ 'జ్వరం' నిన్ను వచ్చి కలుస్తుందంట..మూడు నాలుగు రోజులక్కానీ నిన్ను వదలదు మరి...ఆలోచించుకో.

'నిద్ర ' మాటల్లో నిజం లేక పోలేదు. ఏమి చెయ్యాలో తోచక 'రెండు రెళ్ళు ఆరు ' దగ్గరకు వెళ్ళాను

నేను - ఏమీ అనుకోకు..ఓ రెండు రోజులు గా 'నిద్ర ' ను బాగా నిర్లక్ష్యం చేసాను..ఈ రోజు కూడా దానిని పలకరించక పోతే ఇబ్బందులొస్తాయి. మనము రేపు తప్పకుండా కలుద్దాం..ఎమంటావు?

'రెండు రెళ్ళు ఆరు ' - అలాగే కానీ..నీ ఇష్టం. రేపు ఎన్నింటికి రమ్మంటావు?

నేను - నేనే వస్తాను. రెపు నేను చెయ్యవలసిన పని ఒకటుంది..వారం రోజులుగా మా బాబాయి కొడుకు 'తీరిక ' కనిపించట్లేదు. వాడిని ఎలాగైన వెతికి పట్టుకోవాలి..'తీరిక ' దొరకంగానే నేనే నిన్ను వచ్చి కలుస్తాను.

ఎంతో బాధతో 'రెండు రెళ్ళు ఆరు ' వెళ్ళిపొయ్యింది. నేను అబద్దం చెప్పానని దానికీ తెలుసు. మా బాబాయి కొడుకు పేరు 'తీరిక ' కాదు ..'సాకు '. పైగ వాడెప్పుడూ నాతోటే ఉంటాడు....కాని ఏమి చెయ్యను?? రేపు ఆఫీసుకి వెళ్ళిన వెంటనే నిన్న నేను స్నానం చేయించిన 'ఆఫీసు పని 'ని నా బాసు గాడు బురద లో దొర్లించి మళ్ళీ నా దగ్గరకు పంపుతాడు. ఈ సారి దానిని రెడీ చెయ్యటానికి ఎంత సేపు పడుతుందో? అందుకే అలా అబద్దం ఆడాల్సి వచ్చింది.

కారణం అదొక్కటే కాదు...నన్ను కలవటానికి వచ్చే విజిటర్స్ లో ఇంకో వెధవ ఉన్నాడు. వాడి పేరు 'సోమరితనం'. వీడు నాతో ఉన్నంతసేపు ఎవ్వరు వచ్చినా నేను తలుపు తియ్యను. ఎవ్వరి తోను మాట్లాడను..వీడు నన్ను వదిలి నా బాసు గాడి దగ్గరకు వెళ్ళినప్పుడల్లా వాడి దగ్గర ఉన్న 'ఆఫీసు పని ' నా దగ్గరకు వస్తూ ఉంటుంది.

సరే, ఏదోలాగా మసి పూసి మారేడికాయ చేసి వీళ్ళందరిని వదిలించుకుని 'రెండు రెళ్ళు ఆరు ' తో మీటింగు ఏర్పాటు చేసుకుంటే...నా మంచం కింద దాక్కుని ఉన్న 'దిగులు ' బయటకు వస్తుంది. ఇదో రాక్షసి. అస్సలు ఇది ఎలా వస్తుందో తెలియదు..ఏమి కావాలో అడగదు..ఎవరు పంపిస్తే వచ్చిందో చెప్పదు. ఉన్నంతసేపు ప్రాణం మాత్రం తోడేస్తుంది.

ఇంత మంది శత్రువుల తో పోరాడితే తప్ప 'రెండు రెళ్ళు ఆరు 'ని కలవలేక పోతున్నా.

వచ్చే వారంలో నైనా 'రెండు రెళ్ళు ఆరు 'ని కాస్త త్వరగా కలిసి..దానితో కాస్త ఎక్కువ సేపు గడపాలి..చూద్దాం..

Wednesday, March 14, 2007

సాపాటు ఎటూ లేదు....

మా ఊరు తిరుపతి. యాస లో చెప్పాలంటే..."యోవ్..మాది తిరపతి యా". మద్రాసు నుండి వారవారం ఇంటికి వెళ్తుంటాను. ప్రతీసారిలా కాకుండా, మొన్న శనివారం కాస్త త్వరగా లేచి బయలుదేరాను.

ఉరుకులు పరుగుల మీద బస్టాండు చేరుకున్నా. పర్సు లొ ఇరవై రూపాయలే ఉన్నాయి. బస్టాండులో ఉన్న ATM లో ఐదు వందలు తీసాను. వందల నోట్లు లేవనుకుంటా. ఒక ఐదు వందల నోటు వచ్చింది..తీసుకుని తిరుపతి ప్లాట్ఫారం దగ్గరకు వెళ్ళాను.

తిరుపతి బస్సు కనపడగానే ముందూ వెనకా ఆలోచించకుండా ఎక్కేసాను. లోపల బోలెడు సీట్లు ఖాళీగా ఉన్నాయి. నమ్మశక్యంగా లేదు.డ్రైవర్ ను అడిగాను "ఇది తిరుపతి బస్సే కదండీ"..డ్రైవర్ - "ఔను సార్...కూర్చోపొండి" అన్నాడు. ఆనందం పట్టలేక, ఒక సీట్లో బాగు పడేసి మాగజీనేదైన కొందామని కిందకు దిగాను.

పుర్సులో ఒక ఐదువందల నోటు కాకుండా ఇంకొ ఇరవై రూపాయలు ఉంది. రెండు న్యూస్ పేపర్లు తీసుకున్నను. "చిప్స్ కావాల సార్" అని ఆ కొట్టోడు అడిగాడు. వొద్దని ఒక సినిమా పత్రిక కొని, వెళ్ళి నా సీట్లో కూర్చున్నాను.

గత జన్మలో పుణ్యం చేసుకుంటే ఈ జన్మలొ మనిషి గా పుడతారంట - ఇందులో ఎంత నిజముందో నాకు తెలియదు.
వరుసగా గత పది జన్మలలో విపరీతమైన పుణ్యం చేసుకుంటే మద్రాసు నుంచి తిరుపతి వెళ్ళే బస్సులో కిటికీ పక్కన సీటు దొరుకుంది - ఇది నూటికి నూరుపాళ్ళు నిజం.

ఆకలి గా ఉంది..మళ్ళీ కిందకు దిగి ఎమైన కొనుక్కొద్దామా అనుకునేంతలో రెండు అరవ బాచీలు బస్సు ఎక్కాయి. మద్రాసు లో జనాలు మామూలుగ కలసి మెలసి ఉంటారో లేదో తెలియదు కానీ, తిరుపతికి బయలుదెరేటప్పుడు మాత్రం కాలనీలు కాలనీలు కలిసి బస్సెక్కుతారు. ఇప్పుడు కిందకు దిగితే చచ్చానే..ఇక్కడ "ఈ సీటు నాది" అనటానికి కర్చీఫులు, బాగులు పెడితే, వాటితో సీటు తుడుచుకుని కూర్చుంటారు.మన చెయ్యో,కాలో కోసి పెడితే తప్ప మన సీటు సేఫ్ కాదు. వెధవ రిస్కు ఎందుకు..ఇంకొ గంటన్నర లో ఎలాగూ 'హోటల్ కాశీ' దగ్గర బస్సాపుతాడు.అక్కడ దిగి కావలసింది తినొచ్చు.సీటు నుంచి మాత్రం లేచేది లేదు.

బస్సు నిండింది. డ్రైవర్ పోనిచ్చాడు. ఇక్కడి బస్సులకు రెండే గేర్లు ఉంటాయి - న్యూట్రల్, నాలుగో గేరు. బండి న్యూట్రల్ లొ లేదూ అంటే మేఘాల్లో తేలిపోతూ ఉంటుంది..అందుకే ఇక్కడ బస్టాండు లోపల కూడా ట్రాఫిక్ సిగ్నళ్ళు ఉంటాయి.

కండక్టరు వచ్చాడు..ఐదు వందలు నోటిచ్చాను..టికెటిచ్చి "చిల్లర తరువాత తీసుకో" అన్నాడు.

బస్సు కదిలిన ఐదు నిముషాలకు అరవ బాచి నెంబర్ 1 వాళ్ళ దగ్గర ఉన్న ఒక పెద్ద బాగు లోంచి పదిహేను పులొహోర పొట్లాలు తెరిచి, వాళ్ళ మూకకు సరఫరా చెసారు. నా ఆకలి రెండింతలయ్యింది. బస్సాపినప్పుడు నేను కూడా పులిహోర తిందామనుకున్నను - మూడు ప్లేట్లు.

మద్రాసు బస్సుల్తో ఇంకో చిక్కేంటంటే - దారిపొడుగునా జనాలను ఎక్కిస్తూనే ఉంటారు. తిరుపతి చెరేటప్పటికి ఒక బస్సులోంచి శ్రీలంక జనాభా అంత మంది దిగుతారు.

మద్రాసు దాటుతున్నామనగా ఎవరొ ఒకావిడ, ముగ్గురు పిల్లలు ఎక్కారు. వాళ్ళలో ఒక పిల్లాడిని నా దగ్గరకు పంపుతూ "కూర్చో రా..మావయ్య ఎమీ అనుకోడు" అంది. ఒక్క దెబ్బకు రెండూ పిట్టలు కొట్టింది ఆంటీ!

మొదటి పిట్ట - "మావయ్య" అన్న మాట వల్ల నేను ఆవిడ వైపు వంకరగ చూడలేను

రెండో పిట్ట - బంధుత్వం కలిపింది కాబట్టీ ఆ పిల్లోడు నా ఒళ్ళో, నెత్తి మీద..ఎక్కడైన కూర్చోవచ్చు.

నా ఆకలి తీవ్ర స్థాయికి చెరుకుంది. ఎప్పుడు 'హోటల్ కాశి ' చేరుకుంటామ అని ఎదురుచూస్తున్నా.

పావు గంట తరువాత అరవ బాచి నెంబర్ 2 పులిహోర పొట్లాలు తెరిచారు. వార్నీ..బట్టలకు ఒక బాగు, పులిహోర పొట్లాలకు నాలుగు బాగులు తెచ్చుకున్నారు వీళ్ళూ. వీళ్ళు తిని ఊరుకుంటే పరవాలేదు..నా వెనక కూర్చున్నోడు నా ముందు కూర్చున్న వాడికి నన్ను పొట్లం అందించమంటాడు. ఆ చివ్వర ఉన్నోడెవడొ "పులిహోర భలేగుంది" అని అందరికి వినిపించేట్టు అరుస్తాడు..నా ఆకలి నిముష నిముషానికి పెరుగుతోంది. అన్ని పొట్లాలు అందించాను..మాట వరసకైన "మీరూ కాస్త రుచి చూడండి" అని అనలేదు..ముష్టి వెధవలు.

ఆకలిని, బాధని దిగమింగుకుని కళ్ళు మూసుకుని పడుకున్నాను. బస్సువాడు చక్కటి బాలసుబ్రహ్మణ్యం పాట పెట్టాడు..వింటూ అలా ఎప్పుడు నిద్ర పొయ్యనో తెలియదు..కానీ ఎప్పుడూ లేచానో తెలుసు..ఎక్కడినుంచో అస్సహ్యంగా రమణ గోగుల గొంతు వినిపించినప్పుడు. కళ్ళు తెరిచి చూస్తే.."హోటల్ కాశి" అని కనపడింది. ప్రాణం లేచొచ్చింది. బస్సు కిటికీలొంచి అలాగే కిందకు దూకేసాను. "మూడు ప్లేట్ పులిహోర" అని అరవబొయ్యి ఆగాను...నా పర్సులో డబ్బు లేదు..కండక్టరు గాడు చిల్లర ఇవ్వలా. ఉన్న ఇరవై రూపాయలు మద్రాసు బస్టాండు లొ ఊదేసాను.

చుట్టూ చూసాను..కండక్టరు కనిపించలా. అటూ ఇటూ తెగ వెతికాను. ఎక్కడా లేడు.ఈ హోటలు వాడా కార్డులు తీసుకోడు..ఒ నెల క్రితం వీడి దగ్గర తిన్నప్పుడు credit card ఇస్తే..దాని బరువు చూసి "దీనికి పావల కన్నా ఎక్కువ రాదు సార్" అన్నాడు.

మా బస్సు హార్ను వినిపించింది. అందరు ఎక్కి కూర్చున్నారు. పరిగెట్టుకుంటూ వెళ్ళి ఎక్కాను. బస్సు కదిలింది. కండక్టరు గాడి దగ్గరకు వెళ్ళి నా చిల్లర అడిగాను..వాడి బాగు చూపించి "అందరూ 500, 1000 నోట్లు ఇస్తే నేను మాత్రం చిల్లర ఎక్కడి నుంచి తెచ్చేది సార్? తిరుపతి బస్టాండు లొ దిగాక అక్కడ చిల్లర చేసి అందరికీ ఇస్తాను" అన్నాడు.

చేసేదేమీ లేక వెళ్ళి నా సీట్లొ కూర్చున్నాను. డ్రైవర్ మళ్ళీ పాటలు పెట్టాడు.

పెళ్ళిపుస్తకం లో వన భోజనం పాట..

"పప్పప్పప్పప్పప్పు దప్పళం...అన్నం..నెయ్యి..వేడి అన్నం కాచిన్నెయ్యి....వేడి వేడి అన్నం మీద...కమ్మని పప్పు కాచిన్నెయ్యి"

ఏంటిది..అందరూ కలిసి నా మీద దండ యాత్ర చేస్తున్నారు...ఇంకే పాటా దొరకలేదా వీడికి..ఒక వైపు ఆకలి తొ నా ప్రాణం పోతుంటే..నెయ్యి, పప్పు, ఆవకాయ..."ఆకలి" నుంచి "ఆఆఆఅకలి" స్థితికి చేరుకున్నాను.

ఎన్ని గంటల తరువాత తిరుపతి చేరుకున్నానో తెలియదు..బస్సు దిగంగానె కండక్టరు గాడితో చిల్లర తీసుకున్నాను. ఇంటికి వెళ్ళే వరకు ఆగే ఓపిక లేదు. బస్టాండు కాంటీన్ కు వెళ్ళి ఒక పులిహోర ఆర్డర్ చేసాను..వాడు ఫ్రెష్ గా మూడు రోజుల క్రితం పులిహోర తెచ్చిపెట్టాడు....ఎంత కమ్మగా ఉంది!!

Wednesday, March 7, 2007

దూలదర్శన్

కాలాలు నాలుగు - ఎండా కాలం, వానా కాలం, చలి కాలం, పొయ్యే కాలం. మొదటి మూడు కాలాలు సంవత్సరం లొ ఏ ఏ నెలల్లో వస్తాయో చెప్పే వీలుంది. కానీ ఆ నాలుగోది ఎప్పుడు ఏ రూపం లొ వస్తుందో చెప్పలేము.

నాకు ఆ పొయ్యేకాలం గత వారం వచ్చింది.

మా ఆఫీసు లొ తెలుగు వాళ్ళము ఒక ఇరవై మంది దాకా ఉంటాము...వాళ్ళలో పట్టాభి ఒకడు. పొయిన వారం వాడి పుట్టిన రొజు. ఆఫీసు కాంటీను లో అందరికి జ్యూసు ఇప్పించాడు. ఎవరి కక్కుర్తి కొద్దీ వాళ్ళు బాగనే తాగారు. ఈ లోపు విద్యా అనే అమ్మాయి ఎదో చీటీల గేం మొదలు పెట్టింది.

ప్రతి ఒక్కరు టేబుల్ మీద ఉన్న చీటీలు తియ్యాలి. చీటీలొ ఏమి రాసుంటే ఆ పని చెయ్యలి (ఔను..మా దిక్కుమాలిన ఆఫీసులొ పుట్టిన రోజు పండగలకి ఇలాంటి ఆటలే ఆడుతారు).

మొదటి చీటీ విద్యానే తీసింది.."వరుసగా రెండు జ్యూసులు తాగాలి" అని చదివింది. నాకు అనుమానమే. చీటీలు రాసింది అది. లోపల ఏమున్నా, నొటికొచ్చింది చదివి, తేరగా రెండు జ్యుసులు తాగేసింది. ఆ తరువాత చాలా మంది చీటీలు తీసారు. 'పాట పాడాలి ', 'నాలుక తో ముక్కును తాకాలి ' లాంటి మెదడుకు పదును పెట్టే చేష్టలెన్నో చేసారు.

చివరగా పట్టాభి చీటీ తీసాడు. అందులో "నీకు ఇష్టమైన TV ప్రోగ్రాం గురించి చెప్పాలి" అని ఉంది.

వాడు "నా ఫేవరెట్ ప్రోగ్రాం 'ప్రగతి పథం'" అన్నాడు.

"ఏ ఛానెల్ లొ వస్తుంది?" ఎవరో అడిగారు.

"దూరదర్శన్ - తెలుగు" అన్నాడు పట్టాభి.

అంతే....అంత వరకు కోలాహలంగా ఉన్న ఆఫీసు కాంటీన్ ఒక్క సారిగా నిశ్శబ్దంగా మారింది. ఒక్కొక్కరుగా కాంటీన్ నుంచి వెళ్ళిపొయ్యారు.

వెళ్ళేటప్పుడు ఎవ్వరూ పట్టాభి గాడిని విష్ కూడా చెయ్యలేదు.

చాలా బాధేసింది..పట్టాభి ని చూసి. చాల కోపమొచ్చింది..వెళ్ళిపోతున్న జనాలను చూసి.

పట్టాభి గాడు "నాకు AIDS ఉంది" అన్నా కూడా ఇంత దారుణంగా ప్రవర్తించేవాళ్ళు కాదేమో.

అస్సలు వాడు చేసిన తప్పేంటో నాకు అర్థం కాలా. దూరదర్శన్ చూడటం అంత పెద్ద నేరమా?

వాడితొ ఎవ్వరూ మాట్లాడట్లేదు. వాడితొ కలిసి భొజనం చెయ్యటం మానేసారు. ఇదివరకు వాడిపక్కన సీట్ ఉన్న వాళ్ళంతా ప్లేసు మార్చేసారు.

రెండు రోజుల తరువాత - బాగా బధ్ధకంగా ఉంటే ఆఫీసుకు సెలవు పెట్టాను.

TV ఛానళ్ళు మారుస్తూ దూరదర్శన్ దగ్గర ఆగాను. పట్టాభి కి జరిగిన అవమానం గుర్తుకు వచ్చింది. అంతే...వెంటనే నిర్ణయించుకున్నాను - ఈ రోజంతా దూరదర్శన్ చూసి, రేపు ఆఫీసుకు వెళ్ళి అందరితో చెప్తాను. ఏమి చెస్తారో చూద్దాం.

(నేను మొదట్లొ చెప్పినట్టు 'పొయ్యేకాలం' ఎప్పుడు ఎలా వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఒకే ఒక్క సూచన ఉంది 'పొయ్యేకాలం' రాకను పసిగట్ట టానికి - "దూరదర్శన్ చూడాలి" అనే ఆలొచన రావటం).

సరే.. ఎలాగూ ఛానెల్ మార్చను కదా అని, దూరదర్శన్ పెట్టి, రిమోట్ అవతల పారెసి...ఈసీ చైర్ లొ జారబడి కూర్చున్నా.

శాంతి స్వరూప్, విజయ దుర్గ ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు. ఎప్పుడో చూసాను వీళ్ళని. ఇద్దరూ బాగా లావయ్యారు..శాంతి స్వరూప్ లో ఎదో తేడా కనిపిస్తోంది. ఎంటబ్బా అని అలోచిస్తుండగా....శాంతి స్వరూప్ తన విగ్గు తీసి, బట్ట తల గోక్కొని, మళ్ళీ పెట్టుకున్నాడు. ఒహ్..ఇదా విషయం.

విజయ దుర్గ ఎదో ఉత్తరం చదువుతోంది.

గుర్తు పట్టెసా..ఇది 'జాబులు జవాబులు ' కార్యక్రమం!

కానీ వాళ్ళిద్దరి వెనకాల ఉన్న నీలం రంగు గుడ్డ మీద 'జాబు - జవాబు ' అని రాసుంది. పేరు మార్చారెమో అనుకున్న. ఒక అరగంట పాటు చూసాక అర్థమయ్యింది. ఒకే ఒక్క ఉత్తరం వచ్చింది వాళ్ళకు - అది కూడా ఫిబ్రవరి నెలలొ దూరదర్శన్ కేంద్రం ఆఫీసుకు వచ్చిన కరెంటు బిల్లు. విజయ దుర్గ ఆ బిల్లులొ ఉన్న ప్రతి అక్షరం చదివి "చాలా మంచి సూచన్లిచ్చారండి" అంది. తరువాత శాంతి స్వరూప్ "కరెంటు" మీద ఒక కవిత చెప్పాడు.

అరగంట తరువాత జాబు జవాబు ముగిసింది. శాంతి స్వరూప్ కుర్చీలోంచి లేచి వెళ్ళిపోయాడు. విజయ దుర్గ ముందు టేబుల్ తెచ్చి వేసారు. కెమేరా వైపు చూసి "తరువాయి కార్యక్రమం..కొత్త సినిమా పాటలు" అని అనౌన్సు చెసింది.

ఆహా..కొత్త పాటలా... అరగంట పాటు ఎంజాయ్ చెయ్యొచ్చు అనుకున్న.

ప్రోగ్రాం మొదలయ్యింది..

'ఈ పిల్లకు పెళ్ళవుతుందా', 'పులి బిడ్డ ', 'జగన్మోహిని ' - ఒక్కొక్క సినిమాలొంచి రెండు రెండు పాటలేసారు.

అప్పుడర్థమయ్యింది...'కొత్త సినిమ పాటలు ' అంటే - తెలుగు సినిమా మొదలయ్యిన కొత్తలో పాటలని.

మెల్లగా నాకు చెమట పడుతొంది. పైకి చూసాను. ఫాను తిరుగుతూనే ఉంది. మరి చెమట ఎలా పడుతొందా అని ఆలొచిస్తుండగా...మళ్ళీ విజయ దుర్గ వచ్చింది. "ఇప్పుదు డిసెంబరు నెలలొ జరిగిన అసెంబ్లీ సమావేశాలు చూస్తారు" అంది.

ప్రోగ్రాం మొదలయ్యింది. అసెంబ్లీలో ఎవ్వరూ లేరు. నలుగురు ఆడవాళ్ళు కసువు ఊడుస్తున్నారు. ఒక అరగంటయ్యింది...వెరే ఎవరొ వచ్చి సీట్లన్నీ తుడిచి, వాటర్ బాటిల్స్ పెట్టి వెళ్ళారు. తరువాత MLA లు ఒక్కరొక్కరుగా రావటం మొదలు పెట్టారు.

నాకేమి అర్థం కావటంలా...అసెంబ్లీ సమావెశాలంటే MLA లు పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి, వాళ్ళ దినచర్య అంతా చూపిస్తారా...

నాలొ కొద్దిగా భయం మొదలయ్యింది. దూరదర్శన్ ను ఎంత తక్కువగా అంచనా వేసానో ఇప్పుడు అర్థమయ్యింది.

టైము చూసాను....ప్రోగ్రాం మొదలయ్యి చాలా సేపయ్యింది. ఇంకో పది నిముషాలలొ సమావెశాలు ముగిసిపొతాయి అనుకుంటుండగా విజయ దుర్గ మళ్ళీ వచ్చింది. "అనివార్య కారణాలవల్ల సమావెశాలు పూర్తిగా చూపించలేక పొయాము. ఈ రోజు రాత్రి యెనిమిదింటికి కార్యక్రమం మొదటి నుంచి మళ్ళీ ప్రసారం చేస్తాము" అంది.

అమ్మో... త్వరగా బయటపడాలి అని పైకి లేవబొయ్యాను...నా వల్ల కాలేదు. వీపు పట్టెసింది..అస్సలు కదలలేక పొయ్యాను. సరే ఛానెల్ మారుద్దాం అని రిమోట్ కోసం చూసాను.

"దరిద్రుడు బాత్రూము లోకి పోతే... శనిగాడు బయట నుంచి గొళ్ళెం పెట్టేసాడంట"

ఇందాక వెరే ఛానెల్ ఎదీ చూడను అన్న ఆవేశం లొ రిమోట్ ఎక్కడో పారెసాను. ఇప్పుడు అది దొరకట్లేదు. కుర్చీలోంచి లేవటానికి విశ్వప్రయత్నం చేసాను..లాభం లేదు.

చెసేదేమీ లేక అలా ఆ క్షోభను అనుభవిస్తూ కూర్చున్నాను...

నేను చిన్నప్పుడు చదువుకున్నాను - "1926 లొ జె.ఎల్.బైర్డ్ టెలివిజన్ కనుగొన్నాడు" అని. మహానుభావుడు ఎక్కడున్నడో....భవిష్యత్తు లొ దూరదర్శన్ కార్యక్రమాలు ప్రసారమౌతాయి అని తెలిసుంటే TV ని పురిట్లొనే చంపేసేవాడు.

వార్తలు మొదలయ్యాయి. నేనెలాగూ నాశనం అయ్యాను...కనీసం మిగతా ప్రపంచమన్నా బగుందో లెదో తెలుసుకుందాం....

శాంతి స్వరూప్ - "నమస్కారం...ఈ రోజు వార్తల్లోని ముఖ్యంశాలు చదివేముందు....'వార్త ' అనే మాట మీద చిన్ని కవిత"

పది నిముషాల పాటు కవితలు, చాటువుల తరువాత వార్తలు అయిపొయ్యయి.

దుర్గమ్మ తల్లి మళ్ళీ వచ్చి "తరువాయి కార్యక్రమం...డాక్టర్ సలహాలు...live program...మీరు డైల్ చెయ్యవలసిన నెంబరు - 040 23454261. ఈ రోజు అంశం....మూత్ర సంబంధిత వ్యాధులు, తీసుకోవలసిన జాగ్రత్తలు"

శాంతి స్వరూప్ తయారయ్యాడు.

శాంతి స్వరూప్ - "ప్రేక్షకులకు నమస్కారం..మా డాక్టర్ గారు ఇంకా రాలేదు. మీరు ఈలోపు ఫొన్ చెస్తే..నా తొ మాట్లాడొచ్చు"

ఇంతలొ ఫొన్ మోగింది..

వీళ్ళకు ప్రేక్షకులు ఫొన్ చేసి చాల కాలమైంది అనుకుంటా...ఫొన్ మోగంగానె స్టూడియో లొ ఉన్న అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఒక చిచ్చు బుడ్డి కూడా కాల్చారు.

శాంతి స్వరూప్ ఫొన్ తీసుకుని - "హలో"

కాలర్ - నమస్కారం సార్...నా పేరు శ్రీనివాస్. నేను హైదరాబాదు నుంచి మాట్లాడుతున్నాను.

శాంతి స్వరూప్ - శ్రీనివాస్ గారూ...మీ TV వాల్యూం కాస్త తగ్గించుకొవాలి

కాలర్ - లేదు సార్...మా ఇంట్లో ఎవ్వరూ దూరదర్షన్ చూడరు. మీరు భయపడకండి.

శాంతి స్వరూప్ - సరే చెప్పండి

కాలర్ - నిన్న నాకు జ్వరంగా ఉంటే డాక్టర్ కు చూపించాను సార్

శాంతి స్వరూప్ - అలాగా...మరి డాక్టర్ ఏమన్నాడు

కాలర్ - జ్వరమొచ్చిందన్నాడు

శాంతి స్వరూప్ - మరి ఇంకేంటి సమస్య...శ్రీనివాస్ గారు, మన స్టూడియో కు డాక్టార్ గారు రావటానికి ఇంకా సమయం పట్టొచ్చు. ఈలోపు నెనొక కవిత చదువుతాను....వినాలి తమరు.

నా రూం లొ కరెంటు పొయ్యింది..ఆహా...కరెంటు పొయ్యినందుకు నేను ఇంతగా ఎప్పుడూ ఆనందించలేదు. ఈ చీకటి నా జీవితంలొకి మళ్ళీ వెలుగు తీసుకొచ్చింది....

దెబ్బతగిలినప్పుడు Dettol రాసుకుంటే మొదటి 10 సెకండ్లు మంటేసి తరువాత చల్లగా ఉంటుంది. ఆ 10 సెకండ్ల మంట ఒక రోజు మొత్తం ఉంటే ఎలా ఉంటుందొ దూరదర్శన్ చూసాక తెలిసింది.

Wednesday, February 28, 2007

పాత సామాన్లు కొంటాం.......

-----------------------------------------------------------------------
ప్రకటన

ఆమ్మబడును - ఒక Yamaha Rx 135 బండి

ఈ బండి కొనదల్చుకున్న వారు మద్రాసు రోడ్ల మీద తిరగ వలసిందిగా ప్రార్థన.రోడ్డుపక్కన ఒక yamaha Rx 135 స్టార్ట్ కాక అవస్థపడుతూ ఏవరైన కనిపిస్తే...అది నేనే.స్పాట్ లో బండి ఇవ్వబడును.

వెల - మీ సుఖశాంతులు
-----------------------------------------------------------------------

నా బండి కొని రెండేళ్ళు అయిపొయ్యింది.ఇప్పటిదాక ముప్పై సార్లు ఆఫీసుకు వేసుకెళ్ళుంటాను - అందులొ రెండు సార్లు కింద పడ్డాను, పది సార్లు దారిలొ ఆగిపొయ్యింది, మిగత పద్దెనిమిది సార్లు ఇంటి దగ్గరే స్టార్ట్ అవ్వలేదు - ఇదీ నా బండి ట్రాక్ రికార్డు.

దాన్ని నిరంతరం నడుపుతూనే ఉండాలి.ఒక్క పది నిముషాలు పార్క్ చెసినా స్టార్ట్ అవ్వదు.అటువంటిది... మూడు రోజులు ఊరిలో లేను..ఇవ్వాళ పొద్దున్నే దిగాను.స్టార్ట్ అయ్యే సమస్యే లేదని తెలిసు.కాని ...చూద్దాం....ఆఫీసుకు తయారయ్యి,దాన్ని శుభ్రంగా తుడిచాను.

పావుగంట కిక్కు కొట్టాను.చమటలు, కాలు నొప్పి.బండి మాత్రం స్టార్ట్ అవ్వలా.ఇంగ్లీషులొ "చచ్చాడు" అనటానికి "Kicked the bucket" అంటారట.సుద్ద తప్పు."Kicked Yamaha Rx 135" అనాలి.

ఆఫీసుకు లేటు అవుతొంది.ఇక లాభం లేదని ఆటో ఎక్కటానికి బయటకు నడిచాను.అక్కడ పాచి పళ్ళేసుకుని నవ్వుతూ ఆటో డ్రైవర్ గాడు నాకొసం కాచుకుని ఉన్నాడు.కావేరీ నదీ జలాల కేసు తమిళనాడు గెలిచిందిగా....చాల రోజుల తరువాత వీడు స్నానం చెసినట్టున్నాడు.

"ఎన్న సార్....వండి స్టార్ట్ ఆవ్లియా" అని అడిగాడు.దీనిని తెలుగు లొకి అనువదిస్తే - "దొరికావురా నాకు..ఇవ్వాళ నీకు గుండే" అని అర్థం.

వేరే గత్యంతరం లేక ఆటో ఎక్కాను.ఆ డ్రైవర్ గాడు ఇంకా నవ్వుతూనే ఉన్నడు.వాడికి తెలుసు.. ఇంకో వారం రోజుల వరకు వెరే పార్టీ వెతుక్కోవలసిన పని లేదని...

యాభై నాలుగు వేల రూపాయలు - రెండేళ్ళ పాటు ఈ బండికి వాయిదాలు కట్టాను.తలుచుకుంటేనే కళ్ళలొంచి పెట్రోలు కారుతుంది.ఈ ఆటో డ్రైవర్ గాడికి ఇలాంటి కష్టం రాకపొతుందా...అప్పుడు నేనూ నవ్వక పొతానా...

కసి కొద్దీ వాడిని అడిగాను "ఎంతకు కొన్నవు ఈ ఆటొ?"
వాడు "మూడున్నర లక్షలు" అన్నాడు.
"ఎన్ని వాయిదాలు?" అని అడిగాను
వాడు నవ్వి ఊరుకున్నాడు....

అప్పుడు అర్థమయ్యింది...నేను ఎంత వెర్రి ప్రశ్న వెసానో అని.

మనలాంటి వాళ్ళము లోన్లు తీసుకుంటాము గానీ....మద్రాసు ఆటో డ్రైవర్లకు ఏంటి ఖర్మ? రాత్రి పూట రెండు ట్రిప్పులు వేస్తే ఒక ఆటో కొనెయ్యవచ్చు.ఒక నెల రోజులు నైట్ డ్యుటీ చేస్తే మన దేశం వరల్డ్ బ్యాంకు కు చేసిన అప్పు తీర్చెయ్యవచ్చు.మొన్నీమధ్య ఆటో డ్రైవర్ ల కాలనీ లొ Income Tax వాళ్ళు రైడు కూడ చెసారంట! పేరు కు ఆటొ డ్రైవర్లు కానీ....వీళ్ళ ఆదాయం చూస్తే మన డిగ్రీలన్ని మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకుంటాయి.

మా ఆఫీసు ముందు ఆటో బ్రేకు వెయ్యగానే బాధాకరమైన ఆ ఆలొచనల్లోంచి ఈ లోకం లొకి వచ్చాను.ఆ ఆటో వాడికి ఒక పది పోస్ట్ డేటెడ్ చెక్కులిచ్చి ఆఫీసులోకి వెళ్ళాను.రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆఫీసు కారు ఉండటంతొ నా పర్సు కాస్త ఊపిరి పీల్చుకుంది.

ఇంటికి చేరగానే బయట నా బండి కనిపించింది.కోపం పట్టలేక వెనక టైరు మీద లాగి కొట్టాను."సరే...రేపు పొద్దున వస్తావుగా" అన్నట్టు చూసింది నన్ను.

దీన్ని అమ్మటానికి మనసు ఒప్పదు...అమ్మి ఇంకొకడి గొంతు కోసిన పాపం ఎందుకని.

కేవలం నేను ఉన్నాను అన్న ధైర్యంతొ మా ఆటో దరిద్రుడు వాడి బండి కి credit card swiping machine కూడా పెట్టించాడు.

రేపు కూడా బండి స్టార్ట్ కాకపొతే....నేను ఉద్యొగం మానేసి ఒక ఆటో కొనుక్కుంటాను.

వంశీ గనక ఇప్పుడు "చెట్టు కింద ప్లీడరు" సినిమా మళ్ళీ తీస్తే.. అందులొ ఆ కారుకు బదులు తప్పకుండ నా బండే వాడతాడు.

పాత సామాన్లు కొంటాం.......

Wednesday, February 21, 2007

ఇక మొదలు

నా మొదటి పొస్టు...స్టాంపు లేకుండా