Wednesday, March 28, 2007

పెళ్ళెప్పుడు???

కొత్తగా ఉద్యోగం లో చేరాక మనకు తెలిసిన వాళ్ళెవరైన కనిపిస్తే.. "ఎలా ఉన్నావు? " అని అడిగినా అడగకపొయినా "పెళ్ళెప్పుడు? " అని మాత్రం తప్పకుండా అడుగుతారు.

సినిమాల్లో పెళ్ళి కాని అమ్మాయిల కష్టాలు చూపిస్తారు కానీ చదువు అవగొట్టి, ఉద్యోగం తెచ్చుకుని, పెళ్ళి కాని అబ్బాయిల బాధలు ఎవ్వరూ పట్టించుకోరు.

నా ఫ్రెండు ఒకడు "ఇంకో సంవత్సరం దాకా నాకు పెళ్ళి ఒద్దు మొర్రో " అని ఎంత గింజుకున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వినలా..
తన మాటలు నచ్చక అందరూ రెండు రోజులు భోజనం మానేస్తారేమో అనుకున్నాడు. కానీ వీడికి తిండి పెట్టడం ఆపేసారు. దాంతో ఒప్పుకోక తప్పలేదు.ఇలాంటి పరిస్థితే దాదాపు అందరిదీ.

పెళ్ళికి ఒప్పుకోగానే మన బాధ్యతంతా అయిపోదు. నిజానికి అప్పటి నుంచే అసలు టార్చర్ మొదలు.

మొదట చెయ్యవలసింది..పెళ్ళిళ్ళ మార్కెట్లోకి వదలటానికి మంచి ఫొటోలు తీయించుకోవటం.

ఫొటోలు: ఏ ఫొటోలు పడితే అవి ఇవ్వకూడదంట..స్టూడియోలో నీలం గుడ్డ ముందు నుంచుని ఒకటి, కుర్చీలో కూర్చుని ఒకటి, ఫొటో మొత్తం మొహం మాత్రమే కనపడేలా ఒకటి తీయించుకోవాలి. "ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండదు " అన్నామంటే.. మనము ఇంటర్మీడియట్లో పరీక్ష హాల్ టికెట్ కోసం తీయించుకున్న ఫొటో ఇస్తామని బెదిరిస్తారు.
పెళ్ళి సంబంధాల కోసం ఫొటోలు తీయటానికి 'స్పెషలిస్ట్ 'లు ఉంటారు. వీళ్ళ దృష్టిలో అక్కడకు ఫొటో లు తీయించుకోవటానికి వచ్చిన వాళ్ళంతా శత్రు దేశ యుధ్ధ ఖైదీలు..స్టూడియో లోకి వెళ్ళగానే ఇంటరాగేషన్ టైము లో వేసినట్టు పెద్ద పెద్ద లైట్లు వేస్తారు. "సరిగ్గా నుంచోండి సార్..కాస్త నవ్వండి..పై పళ్ళు నాలుగు, కింది పళ్ళు ఒకటిన్నర మాత్రమే కనపడాలి...ఎక్కువగా నవ్వకండి...ఆ చొక్కా గుండీ మీద ఇంకు మరకేంటి..తుడిచెయ్యండి "....ఇలా ఓ గంట సేపు రాగింగ్ చేసాక ఏవో ఫొటోలు తీసి పంపుతాడు. ఫొటోలు తీసినంత సేపూ మన మొహంలో ఏ పార్టూ సరిగ్గా లేదంటూ నిముషానికి ఒకసారి ఏడిపించి, అవమానించి..మన దగ్గర 1000 నుంచి 1500 రూపాయలు గుంజేస్తాడు.

బయోడాటా: ఫొటోలు రెడీ అయ్యాక చెయ్యవలసిన పని బయోడాటా తయారు చెయ్యటం. మన గురించి, మన అలవాట్ల గురించి చాలా జాగ్రత్తగా రాయాలి. ఈ బయోడాటా మాటి మాటికీ మారుస్తూ ఉంటే చాలా ఇబ్బందులపాలవ్వాల్సి వస్తుంది.
నా ఫ్రెండొకడు పేపర్ లో 'వధువు కావలెను ' అనే ప్రకటన లో మొదట "కట్నం లేకున్నా పరవాలేదు " అని ఇచ్చాడు. వాడికి తెలిసిన వాళ్ళెవరో "అలా ఇస్తే నీలో ఎదో లోపముందనుకుంటారు " అన్నారట. "కట్నం తప్పనిసరిగా కావాలి " అని మార్చాడు. అయినా లాభం లేక పొయ్యింది. ఇలా కాదని.. "కట్నం తీసుకు రాకపోతే పెట్రోలు పోసి తగలబెట్టేస్తాను..ఖబడ్దార్!" అని మార్చాడు. కొత్త సంబంధాలు ఏమీ రాలేదు కానీ పోలీసుల నుంచి ఫోను మాత్రం వచ్చింది...
అందుకే మొదటి సారే ఆచి తూచి బయొడాట తయారు చేసుకోవాలి. "సిగరెట్టు, మందు అలవాటు లేదు " లాంటి చిన్ని చిన్ని అబధ్ధాలు పరవాలేదు కానీ "నేను అందంగా ఉంటాను..రోజూ ఎక్సరసైసు చేస్తాను...అజీత్ అగార్కర్ బౌలింగ్ బాగా వేస్తాడు"... లాంటి పచ్చి బూతులు రాయకూడదు...అసలుకే మోసం వస్తుంది.

మధ్యవర్తులు: వీళ్ళు చేసే అన్యాయం అంతా ఇంతా కాదు - మనకు నెలనెలా వచ్చే జీతం నుంచి..మన అండర్వేరు సైజు వరకు ఎవ్వరికీ చెప్పని వ్యక్తిగత విషయాలన్నీ దబాయించి అడిగి తెలుసుకుంటారు..వాళ్ళు తెచ్చిన ప్రతీ సంబంధానికి "అమ్మాయి భూమిక లాగ ఉంటుంది..కళ్ళు మూసుకుని చేసుకోవచ్చు " అంటారు. తీరా వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి అమ్రీష్ పురి లాగ ఉంటుంది.

ఇంట్లో వాళ్ళ కంగారు: ఒక్క సారి సంబంధాలు చూడటం మొదలు పెట్టాక ఇంట్లో వాళ్ళు పడేదానికన్నా మనల్ని పెట్టే కంగారు ఎక్కువ.ఇంటికి వచ్చిన ప్రతీ వాడితో "మా వాడికి ఏవైన సంబంధాలు ఉంటే చూడరదూ " అంటారు. ఆ వచ్చినోడు మనల్ని ఎగా దిగా చూసి "నువ్వు కాస్త నీటుగా ఉండే బట్టలేసుకోవాలి మరి....అలా జుట్టు పెంచుకుంటే కుదరదు" అని ఐదు పైసల సలహాలు రెండు ఇచ్చి పోతాడు. ఛీ.. ఇలా మాటలు పడటం కన్నా ఆ ఆడ అమ్రీష్ పురి ని చేసుకోవటం మేలనిపిస్తుంది.

జాతకాలు: పిల్లవాడు పుట్టాక బర్త్ సర్టిఫికేట్ తీసుకోవటం మరచిపొయ్యినా జాతకం రాయించటం మాత్రం పొరపాటున కూడా మరువరు తల్లిదండ్రులు. పెళ్ళిళ్ళు కుదరటం వెనకాల ఉన్న కష్టాలు తెలుసుకున్న జ్యోతిష్యులు జాతకాలు రాసేటప్పుడు చాలా జాగ్రత్త పడుతున్నారు.

నా ఫ్రెండు దినకర్ జాతకం ఓ జ్యోతిష్యుడు ఇలా రాసాడు:

చదువు - అద్భుతం
ధనం - అద్భుతం
కళ్యాణ యోగం - అద్భుతం (conditions apply)

మనతో పాటూ చదువుకున్న వాళ్ళ పెళ్ళిళ్ళయ్యే కొద్దీ ఇంట్లో వాళ్ళకు బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది...."వాడిని అడిగైన తెలుసుకో ఏమి తప్పు చేస్తున్నావో " అంటారు. మనమేమీ మాట్లాడలేము. మనతో పాటూ ఫెయిల్ అవుతున్న ఫ్రెండు సడన్ గా 35 మార్కులతో పాస్ అయ్యి "పరీక్షలలో పాస్ కావటం ఎలా " అని సలహా ఇచ్చినట్టు... వాడూ ఏవో రెండు మాటలు చెప్తాడు.

ఇంట్లో వాళ్ళ ఎమొషనల్ బ్లాక్మెయిల్ వల్ల పెళ్ళికి సిధ్ధ పడ్డ అబ్బాయిలు చాలా మంది తెలుసు నాకు.
అమ్మాయిలకు జరిగే బలవంతపు పెళ్ళిళ్ళతో పోల్చుకుంటే ఇది పెద్ద సమస్య కాదు...అలా అని మరీ కొట్టిపారేసేంత చిన్నదీ కాదు..అందుకేనెమో ఇలాంటి సమస్య ఒకటి ఉంది అని ఎక్కువ మంది గుర్తించరు...

Wednesday, March 21, 2007

మల్లెపూలూ - మసాలా వడ

ఈ క్రింద ఉన్నదంతా కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగ వ్రాయబడింది..ఇందులోని ఏ పాత్రా కల్పితము కాదు..
ఇంకో విషయం...మన తెలుగు సినిమాల లాగానే పైన ఉన్న టైటిల్ కూ కింద రాసిన దానికీ ఏ మాత్రమూ సంబంధం లేదు...ఏ పేరు తోచక పెట్టింది మాత్రమేతలుపు కొట్టిన చప్పు డయ్యింది. వెళ్ళి చూస్తే ఎదురుగా 'రెండు రెళ్ళు ఆరు ' నిలబడుంది.

నేను - హలో..బాగున్నావా

రెండు రెళ్ళు ఆరు - నెను బాగానే ఉన్నాను. నీ విషయం చెప్పు. వారం దాటిపొయ్యినా కలవటానికి రాకపొతే నెనే వచ్చా..ఏంటి సంగతులు?

నేను - మంచి పని చేసావు. నిజానికి నెనే నీ దగ్గరకు వద్దామనుకున్నా

ఇంతలొ మళ్ళీ తలుపు చప్పుడయ్యింది. తెరిచి చూస్తే 'ఆఫీసు పని ' కనిపించింది. బట్టలన్నీ చిరిగి పొయ్యి, చింపిరి తలతో చాలా అస్సహ్యంగా ఉంది

నేను - నువ్వా..మళ్ళీ ఎందుకొచ్చావ్? దయచేసి నన్ను కాస్సేపు వదిలెయ్యి..చాలా రోజుల తరువాత నా ఫ్రెండుతొ ఓ గంట సేపు సరదాగ గడపాలనుకుంటున్నా. ఐనా నిన్ను ఆఫీసు లో రోజూ కలుస్తూనే ఉన్నాను గా..ఇంటికెందుకొచ్చినట్టు?

ఆఫీసు పని - నీ బాసు పంపించాడు..నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు కాస్త ఆనందంగా ఉండటం చూసినట్టున్నాడు. ఎక్కడో మూలకు పడి ఉన్న నన్ను వెతికి నీ కోసం పంపాడు. నాకు స్నానం చేయించి, కొత్త బట్టలు తొడిగి, తల దువ్వి, పౌడర్ రాసి పంపాలట.

నేను 'రెండు రెళ్ళు ఆరు ' వైపు చూసాను.

రెండు రెళ్ళు ఆరు - పరవాలేదు. నెను వెయిట్ చెస్తాను. దాని సంగతి చూడు

'ఆఫీసు పని ' కి గంట సేపు స్నానం చేయించినా జిడ్డు వదల్లేదు. నా ఓపిక నశించింది..చేయించిన స్నానం చాలనుకుని, చాలీ చాలని బట్టలు తొడిగి దానిని పంపించేసాను..

హమ్మయ్య...ఇప్పుడు ఎవ్వరొచ్చినా సరే 'రెండు రెళ్ళు ఆరు ' తో కనీసం ఓ అర గంటైన గడపాలి..

తలుపు చప్పుడయ్యింది. వెళ్ళి కిటికీ లోంచి చూసాను.

బయట 'నిద్ర ' నుంచుని ఉంది. నేను తలుపు తెరవలా.

ఇంతవరకు తలుపు మెల్లగా తట్టిన 'నిద్ర ' ఇప్పుడు దబ దబా బాదుతోంది...సరే దీని సంగతేంటొ చూద్దామని తలుపు తెరిచా

నేను - నువ్వు మామూలుగ ఆఫీసు లో ఉన్నప్పుడు కదా వస్తావు...ఇలా ఇంటికొచ్చావేంటి?

నిద్ర - మాష్టారూ..మనము కలిసి రెండు రోజులౌతోంది. నా వెనకాలే 'జ్వరం' కాచుకుని ఉంది..దానిని ఇంకాస్త వెయిట్ చెయ్యమని నచ్చజెప్పి నేను వచ్చాను..ఈ రోజైన కనీసం నాలుగు గంటలు నాతో గడపక పోతే రెపు పొద్దున్నే ఆ 'జ్వరం' నిన్ను వచ్చి కలుస్తుందంట..మూడు నాలుగు రోజులక్కానీ నిన్ను వదలదు మరి...ఆలోచించుకో.

'నిద్ర ' మాటల్లో నిజం లేక పోలేదు. ఏమి చెయ్యాలో తోచక 'రెండు రెళ్ళు ఆరు ' దగ్గరకు వెళ్ళాను

నేను - ఏమీ అనుకోకు..ఓ రెండు రోజులు గా 'నిద్ర ' ను బాగా నిర్లక్ష్యం చేసాను..ఈ రోజు కూడా దానిని పలకరించక పోతే ఇబ్బందులొస్తాయి. మనము రేపు తప్పకుండా కలుద్దాం..ఎమంటావు?

'రెండు రెళ్ళు ఆరు ' - అలాగే కానీ..నీ ఇష్టం. రేపు ఎన్నింటికి రమ్మంటావు?

నేను - నేనే వస్తాను. రెపు నేను చెయ్యవలసిన పని ఒకటుంది..వారం రోజులుగా మా బాబాయి కొడుకు 'తీరిక ' కనిపించట్లేదు. వాడిని ఎలాగైన వెతికి పట్టుకోవాలి..'తీరిక ' దొరకంగానే నేనే నిన్ను వచ్చి కలుస్తాను.

ఎంతో బాధతో 'రెండు రెళ్ళు ఆరు ' వెళ్ళిపొయ్యింది. నేను అబద్దం చెప్పానని దానికీ తెలుసు. మా బాబాయి కొడుకు పేరు 'తీరిక ' కాదు ..'సాకు '. పైగ వాడెప్పుడూ నాతోటే ఉంటాడు....కాని ఏమి చెయ్యను?? రేపు ఆఫీసుకి వెళ్ళిన వెంటనే నిన్న నేను స్నానం చేయించిన 'ఆఫీసు పని 'ని నా బాసు గాడు బురద లో దొర్లించి మళ్ళీ నా దగ్గరకు పంపుతాడు. ఈ సారి దానిని రెడీ చెయ్యటానికి ఎంత సేపు పడుతుందో? అందుకే అలా అబద్దం ఆడాల్సి వచ్చింది.

కారణం అదొక్కటే కాదు...నన్ను కలవటానికి వచ్చే విజిటర్స్ లో ఇంకో వెధవ ఉన్నాడు. వాడి పేరు 'సోమరితనం'. వీడు నాతో ఉన్నంతసేపు ఎవ్వరు వచ్చినా నేను తలుపు తియ్యను. ఎవ్వరి తోను మాట్లాడను..వీడు నన్ను వదిలి నా బాసు గాడి దగ్గరకు వెళ్ళినప్పుడల్లా వాడి దగ్గర ఉన్న 'ఆఫీసు పని ' నా దగ్గరకు వస్తూ ఉంటుంది.

సరే, ఏదోలాగా మసి పూసి మారేడికాయ చేసి వీళ్ళందరిని వదిలించుకుని 'రెండు రెళ్ళు ఆరు ' తో మీటింగు ఏర్పాటు చేసుకుంటే...నా మంచం కింద దాక్కుని ఉన్న 'దిగులు ' బయటకు వస్తుంది. ఇదో రాక్షసి. అస్సలు ఇది ఎలా వస్తుందో తెలియదు..ఏమి కావాలో అడగదు..ఎవరు పంపిస్తే వచ్చిందో చెప్పదు. ఉన్నంతసేపు ప్రాణం మాత్రం తోడేస్తుంది.

ఇంత మంది శత్రువుల తో పోరాడితే తప్ప 'రెండు రెళ్ళు ఆరు 'ని కలవలేక పోతున్నా.

వచ్చే వారంలో నైనా 'రెండు రెళ్ళు ఆరు 'ని కాస్త త్వరగా కలిసి..దానితో కాస్త ఎక్కువ సేపు గడపాలి..చూద్దాం..

Wednesday, March 14, 2007

సాపాటు ఎటూ లేదు....

మా ఊరు తిరుపతి. యాస లో చెప్పాలంటే..."యోవ్..మాది తిరపతి యా". మద్రాసు నుండి వారవారం ఇంటికి వెళ్తుంటాను. ప్రతీసారిలా కాకుండా, మొన్న శనివారం కాస్త త్వరగా లేచి బయలుదేరాను.

ఉరుకులు పరుగుల మీద బస్టాండు చేరుకున్నా. పర్సు లొ ఇరవై రూపాయలే ఉన్నాయి. బస్టాండులో ఉన్న ATM లో ఐదు వందలు తీసాను. వందల నోట్లు లేవనుకుంటా. ఒక ఐదు వందల నోటు వచ్చింది..తీసుకుని తిరుపతి ప్లాట్ఫారం దగ్గరకు వెళ్ళాను.

తిరుపతి బస్సు కనపడగానే ముందూ వెనకా ఆలోచించకుండా ఎక్కేసాను. లోపల బోలెడు సీట్లు ఖాళీగా ఉన్నాయి. నమ్మశక్యంగా లేదు.డ్రైవర్ ను అడిగాను "ఇది తిరుపతి బస్సే కదండీ"..డ్రైవర్ - "ఔను సార్...కూర్చోపొండి" అన్నాడు. ఆనందం పట్టలేక, ఒక సీట్లో బాగు పడేసి మాగజీనేదైన కొందామని కిందకు దిగాను.

పుర్సులో ఒక ఐదువందల నోటు కాకుండా ఇంకొ ఇరవై రూపాయలు ఉంది. రెండు న్యూస్ పేపర్లు తీసుకున్నను. "చిప్స్ కావాల సార్" అని ఆ కొట్టోడు అడిగాడు. వొద్దని ఒక సినిమా పత్రిక కొని, వెళ్ళి నా సీట్లో కూర్చున్నాను.

గత జన్మలో పుణ్యం చేసుకుంటే ఈ జన్మలొ మనిషి గా పుడతారంట - ఇందులో ఎంత నిజముందో నాకు తెలియదు.
వరుసగా గత పది జన్మలలో విపరీతమైన పుణ్యం చేసుకుంటే మద్రాసు నుంచి తిరుపతి వెళ్ళే బస్సులో కిటికీ పక్కన సీటు దొరుకుంది - ఇది నూటికి నూరుపాళ్ళు నిజం.

ఆకలి గా ఉంది..మళ్ళీ కిందకు దిగి ఎమైన కొనుక్కొద్దామా అనుకునేంతలో రెండు అరవ బాచీలు బస్సు ఎక్కాయి. మద్రాసు లో జనాలు మామూలుగ కలసి మెలసి ఉంటారో లేదో తెలియదు కానీ, తిరుపతికి బయలుదెరేటప్పుడు మాత్రం కాలనీలు కాలనీలు కలిసి బస్సెక్కుతారు. ఇప్పుడు కిందకు దిగితే చచ్చానే..ఇక్కడ "ఈ సీటు నాది" అనటానికి కర్చీఫులు, బాగులు పెడితే, వాటితో సీటు తుడుచుకుని కూర్చుంటారు.మన చెయ్యో,కాలో కోసి పెడితే తప్ప మన సీటు సేఫ్ కాదు. వెధవ రిస్కు ఎందుకు..ఇంకొ గంటన్నర లో ఎలాగూ 'హోటల్ కాశీ' దగ్గర బస్సాపుతాడు.అక్కడ దిగి కావలసింది తినొచ్చు.సీటు నుంచి మాత్రం లేచేది లేదు.

బస్సు నిండింది. డ్రైవర్ పోనిచ్చాడు. ఇక్కడి బస్సులకు రెండే గేర్లు ఉంటాయి - న్యూట్రల్, నాలుగో గేరు. బండి న్యూట్రల్ లొ లేదూ అంటే మేఘాల్లో తేలిపోతూ ఉంటుంది..అందుకే ఇక్కడ బస్టాండు లోపల కూడా ట్రాఫిక్ సిగ్నళ్ళు ఉంటాయి.

కండక్టరు వచ్చాడు..ఐదు వందలు నోటిచ్చాను..టికెటిచ్చి "చిల్లర తరువాత తీసుకో" అన్నాడు.

బస్సు కదిలిన ఐదు నిముషాలకు అరవ బాచి నెంబర్ 1 వాళ్ళ దగ్గర ఉన్న ఒక పెద్ద బాగు లోంచి పదిహేను పులొహోర పొట్లాలు తెరిచి, వాళ్ళ మూకకు సరఫరా చెసారు. నా ఆకలి రెండింతలయ్యింది. బస్సాపినప్పుడు నేను కూడా పులిహోర తిందామనుకున్నను - మూడు ప్లేట్లు.

మద్రాసు బస్సుల్తో ఇంకో చిక్కేంటంటే - దారిపొడుగునా జనాలను ఎక్కిస్తూనే ఉంటారు. తిరుపతి చెరేటప్పటికి ఒక బస్సులోంచి శ్రీలంక జనాభా అంత మంది దిగుతారు.

మద్రాసు దాటుతున్నామనగా ఎవరొ ఒకావిడ, ముగ్గురు పిల్లలు ఎక్కారు. వాళ్ళలో ఒక పిల్లాడిని నా దగ్గరకు పంపుతూ "కూర్చో రా..మావయ్య ఎమీ అనుకోడు" అంది. ఒక్క దెబ్బకు రెండూ పిట్టలు కొట్టింది ఆంటీ!

మొదటి పిట్ట - "మావయ్య" అన్న మాట వల్ల నేను ఆవిడ వైపు వంకరగ చూడలేను

రెండో పిట్ట - బంధుత్వం కలిపింది కాబట్టీ ఆ పిల్లోడు నా ఒళ్ళో, నెత్తి మీద..ఎక్కడైన కూర్చోవచ్చు.

నా ఆకలి తీవ్ర స్థాయికి చెరుకుంది. ఎప్పుడు 'హోటల్ కాశి ' చేరుకుంటామ అని ఎదురుచూస్తున్నా.

పావు గంట తరువాత అరవ బాచి నెంబర్ 2 పులిహోర పొట్లాలు తెరిచారు. వార్నీ..బట్టలకు ఒక బాగు, పులిహోర పొట్లాలకు నాలుగు బాగులు తెచ్చుకున్నారు వీళ్ళూ. వీళ్ళు తిని ఊరుకుంటే పరవాలేదు..నా వెనక కూర్చున్నోడు నా ముందు కూర్చున్న వాడికి నన్ను పొట్లం అందించమంటాడు. ఆ చివ్వర ఉన్నోడెవడొ "పులిహోర భలేగుంది" అని అందరికి వినిపించేట్టు అరుస్తాడు..నా ఆకలి నిముష నిముషానికి పెరుగుతోంది. అన్ని పొట్లాలు అందించాను..మాట వరసకైన "మీరూ కాస్త రుచి చూడండి" అని అనలేదు..ముష్టి వెధవలు.

ఆకలిని, బాధని దిగమింగుకుని కళ్ళు మూసుకుని పడుకున్నాను. బస్సువాడు చక్కటి బాలసుబ్రహ్మణ్యం పాట పెట్టాడు..వింటూ అలా ఎప్పుడు నిద్ర పొయ్యనో తెలియదు..కానీ ఎప్పుడూ లేచానో తెలుసు..ఎక్కడినుంచో అస్సహ్యంగా రమణ గోగుల గొంతు వినిపించినప్పుడు. కళ్ళు తెరిచి చూస్తే.."హోటల్ కాశి" అని కనపడింది. ప్రాణం లేచొచ్చింది. బస్సు కిటికీలొంచి అలాగే కిందకు దూకేసాను. "మూడు ప్లేట్ పులిహోర" అని అరవబొయ్యి ఆగాను...నా పర్సులో డబ్బు లేదు..కండక్టరు గాడు చిల్లర ఇవ్వలా. ఉన్న ఇరవై రూపాయలు మద్రాసు బస్టాండు లొ ఊదేసాను.

చుట్టూ చూసాను..కండక్టరు కనిపించలా. అటూ ఇటూ తెగ వెతికాను. ఎక్కడా లేడు.ఈ హోటలు వాడా కార్డులు తీసుకోడు..ఒ నెల క్రితం వీడి దగ్గర తిన్నప్పుడు credit card ఇస్తే..దాని బరువు చూసి "దీనికి పావల కన్నా ఎక్కువ రాదు సార్" అన్నాడు.

మా బస్సు హార్ను వినిపించింది. అందరు ఎక్కి కూర్చున్నారు. పరిగెట్టుకుంటూ వెళ్ళి ఎక్కాను. బస్సు కదిలింది. కండక్టరు గాడి దగ్గరకు వెళ్ళి నా చిల్లర అడిగాను..వాడి బాగు చూపించి "అందరూ 500, 1000 నోట్లు ఇస్తే నేను మాత్రం చిల్లర ఎక్కడి నుంచి తెచ్చేది సార్? తిరుపతి బస్టాండు లొ దిగాక అక్కడ చిల్లర చేసి అందరికీ ఇస్తాను" అన్నాడు.

చేసేదేమీ లేక వెళ్ళి నా సీట్లొ కూర్చున్నాను. డ్రైవర్ మళ్ళీ పాటలు పెట్టాడు.

పెళ్ళిపుస్తకం లో వన భోజనం పాట..

"పప్పప్పప్పప్పప్పు దప్పళం...అన్నం..నెయ్యి..వేడి అన్నం కాచిన్నెయ్యి....వేడి వేడి అన్నం మీద...కమ్మని పప్పు కాచిన్నెయ్యి"

ఏంటిది..అందరూ కలిసి నా మీద దండ యాత్ర చేస్తున్నారు...ఇంకే పాటా దొరకలేదా వీడికి..ఒక వైపు ఆకలి తొ నా ప్రాణం పోతుంటే..నెయ్యి, పప్పు, ఆవకాయ..."ఆకలి" నుంచి "ఆఆఆఅకలి" స్థితికి చేరుకున్నాను.

ఎన్ని గంటల తరువాత తిరుపతి చేరుకున్నానో తెలియదు..బస్సు దిగంగానె కండక్టరు గాడితో చిల్లర తీసుకున్నాను. ఇంటికి వెళ్ళే వరకు ఆగే ఓపిక లేదు. బస్టాండు కాంటీన్ కు వెళ్ళి ఒక పులిహోర ఆర్డర్ చేసాను..వాడు ఫ్రెష్ గా మూడు రోజుల క్రితం పులిహోర తెచ్చిపెట్టాడు....ఎంత కమ్మగా ఉంది!!

Wednesday, March 7, 2007

దూలదర్శన్

కాలాలు నాలుగు - ఎండా కాలం, వానా కాలం, చలి కాలం, పొయ్యే కాలం. మొదటి మూడు కాలాలు సంవత్సరం లొ ఏ ఏ నెలల్లో వస్తాయో చెప్పే వీలుంది. కానీ ఆ నాలుగోది ఎప్పుడు ఏ రూపం లొ వస్తుందో చెప్పలేము.

నాకు ఆ పొయ్యేకాలం గత వారం వచ్చింది.

మా ఆఫీసు లొ తెలుగు వాళ్ళము ఒక ఇరవై మంది దాకా ఉంటాము...వాళ్ళలో పట్టాభి ఒకడు. పొయిన వారం వాడి పుట్టిన రొజు. ఆఫీసు కాంటీను లో అందరికి జ్యూసు ఇప్పించాడు. ఎవరి కక్కుర్తి కొద్దీ వాళ్ళు బాగనే తాగారు. ఈ లోపు విద్యా అనే అమ్మాయి ఎదో చీటీల గేం మొదలు పెట్టింది.

ప్రతి ఒక్కరు టేబుల్ మీద ఉన్న చీటీలు తియ్యాలి. చీటీలొ ఏమి రాసుంటే ఆ పని చెయ్యలి (ఔను..మా దిక్కుమాలిన ఆఫీసులొ పుట్టిన రోజు పండగలకి ఇలాంటి ఆటలే ఆడుతారు).

మొదటి చీటీ విద్యానే తీసింది.."వరుసగా రెండు జ్యూసులు తాగాలి" అని చదివింది. నాకు అనుమానమే. చీటీలు రాసింది అది. లోపల ఏమున్నా, నొటికొచ్చింది చదివి, తేరగా రెండు జ్యుసులు తాగేసింది. ఆ తరువాత చాలా మంది చీటీలు తీసారు. 'పాట పాడాలి ', 'నాలుక తో ముక్కును తాకాలి ' లాంటి మెదడుకు పదును పెట్టే చేష్టలెన్నో చేసారు.

చివరగా పట్టాభి చీటీ తీసాడు. అందులో "నీకు ఇష్టమైన TV ప్రోగ్రాం గురించి చెప్పాలి" అని ఉంది.

వాడు "నా ఫేవరెట్ ప్రోగ్రాం 'ప్రగతి పథం'" అన్నాడు.

"ఏ ఛానెల్ లొ వస్తుంది?" ఎవరో అడిగారు.

"దూరదర్శన్ - తెలుగు" అన్నాడు పట్టాభి.

అంతే....అంత వరకు కోలాహలంగా ఉన్న ఆఫీసు కాంటీన్ ఒక్క సారిగా నిశ్శబ్దంగా మారింది. ఒక్కొక్కరుగా కాంటీన్ నుంచి వెళ్ళిపొయ్యారు.

వెళ్ళేటప్పుడు ఎవ్వరూ పట్టాభి గాడిని విష్ కూడా చెయ్యలేదు.

చాలా బాధేసింది..పట్టాభి ని చూసి. చాల కోపమొచ్చింది..వెళ్ళిపోతున్న జనాలను చూసి.

పట్టాభి గాడు "నాకు AIDS ఉంది" అన్నా కూడా ఇంత దారుణంగా ప్రవర్తించేవాళ్ళు కాదేమో.

అస్సలు వాడు చేసిన తప్పేంటో నాకు అర్థం కాలా. దూరదర్శన్ చూడటం అంత పెద్ద నేరమా?

వాడితొ ఎవ్వరూ మాట్లాడట్లేదు. వాడితొ కలిసి భొజనం చెయ్యటం మానేసారు. ఇదివరకు వాడిపక్కన సీట్ ఉన్న వాళ్ళంతా ప్లేసు మార్చేసారు.

రెండు రోజుల తరువాత - బాగా బధ్ధకంగా ఉంటే ఆఫీసుకు సెలవు పెట్టాను.

TV ఛానళ్ళు మారుస్తూ దూరదర్శన్ దగ్గర ఆగాను. పట్టాభి కి జరిగిన అవమానం గుర్తుకు వచ్చింది. అంతే...వెంటనే నిర్ణయించుకున్నాను - ఈ రోజంతా దూరదర్శన్ చూసి, రేపు ఆఫీసుకు వెళ్ళి అందరితో చెప్తాను. ఏమి చెస్తారో చూద్దాం.

(నేను మొదట్లొ చెప్పినట్టు 'పొయ్యేకాలం' ఎప్పుడు ఎలా వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఒకే ఒక్క సూచన ఉంది 'పొయ్యేకాలం' రాకను పసిగట్ట టానికి - "దూరదర్శన్ చూడాలి" అనే ఆలొచన రావటం).

సరే.. ఎలాగూ ఛానెల్ మార్చను కదా అని, దూరదర్శన్ పెట్టి, రిమోట్ అవతల పారెసి...ఈసీ చైర్ లొ జారబడి కూర్చున్నా.

శాంతి స్వరూప్, విజయ దుర్గ ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు. ఎప్పుడో చూసాను వీళ్ళని. ఇద్దరూ బాగా లావయ్యారు..శాంతి స్వరూప్ లో ఎదో తేడా కనిపిస్తోంది. ఎంటబ్బా అని అలోచిస్తుండగా....శాంతి స్వరూప్ తన విగ్గు తీసి, బట్ట తల గోక్కొని, మళ్ళీ పెట్టుకున్నాడు. ఒహ్..ఇదా విషయం.

విజయ దుర్గ ఎదో ఉత్తరం చదువుతోంది.

గుర్తు పట్టెసా..ఇది 'జాబులు జవాబులు ' కార్యక్రమం!

కానీ వాళ్ళిద్దరి వెనకాల ఉన్న నీలం రంగు గుడ్డ మీద 'జాబు - జవాబు ' అని రాసుంది. పేరు మార్చారెమో అనుకున్న. ఒక అరగంట పాటు చూసాక అర్థమయ్యింది. ఒకే ఒక్క ఉత్తరం వచ్చింది వాళ్ళకు - అది కూడా ఫిబ్రవరి నెలలొ దూరదర్శన్ కేంద్రం ఆఫీసుకు వచ్చిన కరెంటు బిల్లు. విజయ దుర్గ ఆ బిల్లులొ ఉన్న ప్రతి అక్షరం చదివి "చాలా మంచి సూచన్లిచ్చారండి" అంది. తరువాత శాంతి స్వరూప్ "కరెంటు" మీద ఒక కవిత చెప్పాడు.

అరగంట తరువాత జాబు జవాబు ముగిసింది. శాంతి స్వరూప్ కుర్చీలోంచి లేచి వెళ్ళిపోయాడు. విజయ దుర్గ ముందు టేబుల్ తెచ్చి వేసారు. కెమేరా వైపు చూసి "తరువాయి కార్యక్రమం..కొత్త సినిమా పాటలు" అని అనౌన్సు చెసింది.

ఆహా..కొత్త పాటలా... అరగంట పాటు ఎంజాయ్ చెయ్యొచ్చు అనుకున్న.

ప్రోగ్రాం మొదలయ్యింది..

'ఈ పిల్లకు పెళ్ళవుతుందా', 'పులి బిడ్డ ', 'జగన్మోహిని ' - ఒక్కొక్క సినిమాలొంచి రెండు రెండు పాటలేసారు.

అప్పుడర్థమయ్యింది...'కొత్త సినిమ పాటలు ' అంటే - తెలుగు సినిమా మొదలయ్యిన కొత్తలో పాటలని.

మెల్లగా నాకు చెమట పడుతొంది. పైకి చూసాను. ఫాను తిరుగుతూనే ఉంది. మరి చెమట ఎలా పడుతొందా అని ఆలొచిస్తుండగా...మళ్ళీ విజయ దుర్గ వచ్చింది. "ఇప్పుదు డిసెంబరు నెలలొ జరిగిన అసెంబ్లీ సమావేశాలు చూస్తారు" అంది.

ప్రోగ్రాం మొదలయ్యింది. అసెంబ్లీలో ఎవ్వరూ లేరు. నలుగురు ఆడవాళ్ళు కసువు ఊడుస్తున్నారు. ఒక అరగంటయ్యింది...వెరే ఎవరొ వచ్చి సీట్లన్నీ తుడిచి, వాటర్ బాటిల్స్ పెట్టి వెళ్ళారు. తరువాత MLA లు ఒక్కరొక్కరుగా రావటం మొదలు పెట్టారు.

నాకేమి అర్థం కావటంలా...అసెంబ్లీ సమావెశాలంటే MLA లు పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి, వాళ్ళ దినచర్య అంతా చూపిస్తారా...

నాలొ కొద్దిగా భయం మొదలయ్యింది. దూరదర్శన్ ను ఎంత తక్కువగా అంచనా వేసానో ఇప్పుడు అర్థమయ్యింది.

టైము చూసాను....ప్రోగ్రాం మొదలయ్యి చాలా సేపయ్యింది. ఇంకో పది నిముషాలలొ సమావెశాలు ముగిసిపొతాయి అనుకుంటుండగా విజయ దుర్గ మళ్ళీ వచ్చింది. "అనివార్య కారణాలవల్ల సమావెశాలు పూర్తిగా చూపించలేక పొయాము. ఈ రోజు రాత్రి యెనిమిదింటికి కార్యక్రమం మొదటి నుంచి మళ్ళీ ప్రసారం చేస్తాము" అంది.

అమ్మో... త్వరగా బయటపడాలి అని పైకి లేవబొయ్యాను...నా వల్ల కాలేదు. వీపు పట్టెసింది..అస్సలు కదలలేక పొయ్యాను. సరే ఛానెల్ మారుద్దాం అని రిమోట్ కోసం చూసాను.

"దరిద్రుడు బాత్రూము లోకి పోతే... శనిగాడు బయట నుంచి గొళ్ళెం పెట్టేసాడంట"

ఇందాక వెరే ఛానెల్ ఎదీ చూడను అన్న ఆవేశం లొ రిమోట్ ఎక్కడో పారెసాను. ఇప్పుడు అది దొరకట్లేదు. కుర్చీలోంచి లేవటానికి విశ్వప్రయత్నం చేసాను..లాభం లేదు.

చెసేదేమీ లేక అలా ఆ క్షోభను అనుభవిస్తూ కూర్చున్నాను...

నేను చిన్నప్పుడు చదువుకున్నాను - "1926 లొ జె.ఎల్.బైర్డ్ టెలివిజన్ కనుగొన్నాడు" అని. మహానుభావుడు ఎక్కడున్నడో....భవిష్యత్తు లొ దూరదర్శన్ కార్యక్రమాలు ప్రసారమౌతాయి అని తెలిసుంటే TV ని పురిట్లొనే చంపేసేవాడు.

వార్తలు మొదలయ్యాయి. నేనెలాగూ నాశనం అయ్యాను...కనీసం మిగతా ప్రపంచమన్నా బగుందో లెదో తెలుసుకుందాం....

శాంతి స్వరూప్ - "నమస్కారం...ఈ రోజు వార్తల్లోని ముఖ్యంశాలు చదివేముందు....'వార్త ' అనే మాట మీద చిన్ని కవిత"

పది నిముషాల పాటు కవితలు, చాటువుల తరువాత వార్తలు అయిపొయ్యయి.

దుర్గమ్మ తల్లి మళ్ళీ వచ్చి "తరువాయి కార్యక్రమం...డాక్టర్ సలహాలు...live program...మీరు డైల్ చెయ్యవలసిన నెంబరు - 040 23454261. ఈ రోజు అంశం....మూత్ర సంబంధిత వ్యాధులు, తీసుకోవలసిన జాగ్రత్తలు"

శాంతి స్వరూప్ తయారయ్యాడు.

శాంతి స్వరూప్ - "ప్రేక్షకులకు నమస్కారం..మా డాక్టర్ గారు ఇంకా రాలేదు. మీరు ఈలోపు ఫొన్ చెస్తే..నా తొ మాట్లాడొచ్చు"

ఇంతలొ ఫొన్ మోగింది..

వీళ్ళకు ప్రేక్షకులు ఫొన్ చేసి చాల కాలమైంది అనుకుంటా...ఫొన్ మోగంగానె స్టూడియో లొ ఉన్న అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఒక చిచ్చు బుడ్డి కూడా కాల్చారు.

శాంతి స్వరూప్ ఫొన్ తీసుకుని - "హలో"

కాలర్ - నమస్కారం సార్...నా పేరు శ్రీనివాస్. నేను హైదరాబాదు నుంచి మాట్లాడుతున్నాను.

శాంతి స్వరూప్ - శ్రీనివాస్ గారూ...మీ TV వాల్యూం కాస్త తగ్గించుకొవాలి

కాలర్ - లేదు సార్...మా ఇంట్లో ఎవ్వరూ దూరదర్షన్ చూడరు. మీరు భయపడకండి.

శాంతి స్వరూప్ - సరే చెప్పండి

కాలర్ - నిన్న నాకు జ్వరంగా ఉంటే డాక్టర్ కు చూపించాను సార్

శాంతి స్వరూప్ - అలాగా...మరి డాక్టర్ ఏమన్నాడు

కాలర్ - జ్వరమొచ్చిందన్నాడు

శాంతి స్వరూప్ - మరి ఇంకేంటి సమస్య...శ్రీనివాస్ గారు, మన స్టూడియో కు డాక్టార్ గారు రావటానికి ఇంకా సమయం పట్టొచ్చు. ఈలోపు నెనొక కవిత చదువుతాను....వినాలి తమరు.

నా రూం లొ కరెంటు పొయ్యింది..ఆహా...కరెంటు పొయ్యినందుకు నేను ఇంతగా ఎప్పుడూ ఆనందించలేదు. ఈ చీకటి నా జీవితంలొకి మళ్ళీ వెలుగు తీసుకొచ్చింది....

దెబ్బతగిలినప్పుడు Dettol రాసుకుంటే మొదటి 10 సెకండ్లు మంటేసి తరువాత చల్లగా ఉంటుంది. ఆ 10 సెకండ్ల మంట ఒక రోజు మొత్తం ఉంటే ఎలా ఉంటుందొ దూరదర్శన్ చూసాక తెలిసింది.