Wednesday, March 14, 2007

సాపాటు ఎటూ లేదు....

మా ఊరు తిరుపతి. యాస లో చెప్పాలంటే..."యోవ్..మాది తిరపతి యా". మద్రాసు నుండి వారవారం ఇంటికి వెళ్తుంటాను. ప్రతీసారిలా కాకుండా, మొన్న శనివారం కాస్త త్వరగా లేచి బయలుదేరాను.

ఉరుకులు పరుగుల మీద బస్టాండు చేరుకున్నా. పర్సు లొ ఇరవై రూపాయలే ఉన్నాయి. బస్టాండులో ఉన్న ATM లో ఐదు వందలు తీసాను. వందల నోట్లు లేవనుకుంటా. ఒక ఐదు వందల నోటు వచ్చింది..తీసుకుని తిరుపతి ప్లాట్ఫారం దగ్గరకు వెళ్ళాను.

తిరుపతి బస్సు కనపడగానే ముందూ వెనకా ఆలోచించకుండా ఎక్కేసాను. లోపల బోలెడు సీట్లు ఖాళీగా ఉన్నాయి. నమ్మశక్యంగా లేదు.డ్రైవర్ ను అడిగాను "ఇది తిరుపతి బస్సే కదండీ"..డ్రైవర్ - "ఔను సార్...కూర్చోపొండి" అన్నాడు. ఆనందం పట్టలేక, ఒక సీట్లో బాగు పడేసి మాగజీనేదైన కొందామని కిందకు దిగాను.

పుర్సులో ఒక ఐదువందల నోటు కాకుండా ఇంకొ ఇరవై రూపాయలు ఉంది. రెండు న్యూస్ పేపర్లు తీసుకున్నను. "చిప్స్ కావాల సార్" అని ఆ కొట్టోడు అడిగాడు. వొద్దని ఒక సినిమా పత్రిక కొని, వెళ్ళి నా సీట్లో కూర్చున్నాను.

గత జన్మలో పుణ్యం చేసుకుంటే ఈ జన్మలొ మనిషి గా పుడతారంట - ఇందులో ఎంత నిజముందో నాకు తెలియదు.
వరుసగా గత పది జన్మలలో విపరీతమైన పుణ్యం చేసుకుంటే మద్రాసు నుంచి తిరుపతి వెళ్ళే బస్సులో కిటికీ పక్కన సీటు దొరుకుంది - ఇది నూటికి నూరుపాళ్ళు నిజం.

ఆకలి గా ఉంది..మళ్ళీ కిందకు దిగి ఎమైన కొనుక్కొద్దామా అనుకునేంతలో రెండు అరవ బాచీలు బస్సు ఎక్కాయి. మద్రాసు లో జనాలు మామూలుగ కలసి మెలసి ఉంటారో లేదో తెలియదు కానీ, తిరుపతికి బయలుదెరేటప్పుడు మాత్రం కాలనీలు కాలనీలు కలిసి బస్సెక్కుతారు. ఇప్పుడు కిందకు దిగితే చచ్చానే..ఇక్కడ "ఈ సీటు నాది" అనటానికి కర్చీఫులు, బాగులు పెడితే, వాటితో సీటు తుడుచుకుని కూర్చుంటారు.మన చెయ్యో,కాలో కోసి పెడితే తప్ప మన సీటు సేఫ్ కాదు. వెధవ రిస్కు ఎందుకు..ఇంకొ గంటన్నర లో ఎలాగూ 'హోటల్ కాశీ' దగ్గర బస్సాపుతాడు.అక్కడ దిగి కావలసింది తినొచ్చు.సీటు నుంచి మాత్రం లేచేది లేదు.

బస్సు నిండింది. డ్రైవర్ పోనిచ్చాడు. ఇక్కడి బస్సులకు రెండే గేర్లు ఉంటాయి - న్యూట్రల్, నాలుగో గేరు. బండి న్యూట్రల్ లొ లేదూ అంటే మేఘాల్లో తేలిపోతూ ఉంటుంది..అందుకే ఇక్కడ బస్టాండు లోపల కూడా ట్రాఫిక్ సిగ్నళ్ళు ఉంటాయి.

కండక్టరు వచ్చాడు..ఐదు వందలు నోటిచ్చాను..టికెటిచ్చి "చిల్లర తరువాత తీసుకో" అన్నాడు.

బస్సు కదిలిన ఐదు నిముషాలకు అరవ బాచి నెంబర్ 1 వాళ్ళ దగ్గర ఉన్న ఒక పెద్ద బాగు లోంచి పదిహేను పులొహోర పొట్లాలు తెరిచి, వాళ్ళ మూకకు సరఫరా చెసారు. నా ఆకలి రెండింతలయ్యింది. బస్సాపినప్పుడు నేను కూడా పులిహోర తిందామనుకున్నను - మూడు ప్లేట్లు.

మద్రాసు బస్సుల్తో ఇంకో చిక్కేంటంటే - దారిపొడుగునా జనాలను ఎక్కిస్తూనే ఉంటారు. తిరుపతి చెరేటప్పటికి ఒక బస్సులోంచి శ్రీలంక జనాభా అంత మంది దిగుతారు.

మద్రాసు దాటుతున్నామనగా ఎవరొ ఒకావిడ, ముగ్గురు పిల్లలు ఎక్కారు. వాళ్ళలో ఒక పిల్లాడిని నా దగ్గరకు పంపుతూ "కూర్చో రా..మావయ్య ఎమీ అనుకోడు" అంది. ఒక్క దెబ్బకు రెండూ పిట్టలు కొట్టింది ఆంటీ!

మొదటి పిట్ట - "మావయ్య" అన్న మాట వల్ల నేను ఆవిడ వైపు వంకరగ చూడలేను

రెండో పిట్ట - బంధుత్వం కలిపింది కాబట్టీ ఆ పిల్లోడు నా ఒళ్ళో, నెత్తి మీద..ఎక్కడైన కూర్చోవచ్చు.

నా ఆకలి తీవ్ర స్థాయికి చెరుకుంది. ఎప్పుడు 'హోటల్ కాశి ' చేరుకుంటామ అని ఎదురుచూస్తున్నా.

పావు గంట తరువాత అరవ బాచి నెంబర్ 2 పులిహోర పొట్లాలు తెరిచారు. వార్నీ..బట్టలకు ఒక బాగు, పులిహోర పొట్లాలకు నాలుగు బాగులు తెచ్చుకున్నారు వీళ్ళూ. వీళ్ళు తిని ఊరుకుంటే పరవాలేదు..నా వెనక కూర్చున్నోడు నా ముందు కూర్చున్న వాడికి నన్ను పొట్లం అందించమంటాడు. ఆ చివ్వర ఉన్నోడెవడొ "పులిహోర భలేగుంది" అని అందరికి వినిపించేట్టు అరుస్తాడు..నా ఆకలి నిముష నిముషానికి పెరుగుతోంది. అన్ని పొట్లాలు అందించాను..మాట వరసకైన "మీరూ కాస్త రుచి చూడండి" అని అనలేదు..ముష్టి వెధవలు.

ఆకలిని, బాధని దిగమింగుకుని కళ్ళు మూసుకుని పడుకున్నాను. బస్సువాడు చక్కటి బాలసుబ్రహ్మణ్యం పాట పెట్టాడు..వింటూ అలా ఎప్పుడు నిద్ర పొయ్యనో తెలియదు..కానీ ఎప్పుడూ లేచానో తెలుసు..ఎక్కడినుంచో అస్సహ్యంగా రమణ గోగుల గొంతు వినిపించినప్పుడు. కళ్ళు తెరిచి చూస్తే.."హోటల్ కాశి" అని కనపడింది. ప్రాణం లేచొచ్చింది. బస్సు కిటికీలొంచి అలాగే కిందకు దూకేసాను. "మూడు ప్లేట్ పులిహోర" అని అరవబొయ్యి ఆగాను...నా పర్సులో డబ్బు లేదు..కండక్టరు గాడు చిల్లర ఇవ్వలా. ఉన్న ఇరవై రూపాయలు మద్రాసు బస్టాండు లొ ఊదేసాను.

చుట్టూ చూసాను..కండక్టరు కనిపించలా. అటూ ఇటూ తెగ వెతికాను. ఎక్కడా లేడు.ఈ హోటలు వాడా కార్డులు తీసుకోడు..ఒ నెల క్రితం వీడి దగ్గర తిన్నప్పుడు credit card ఇస్తే..దాని బరువు చూసి "దీనికి పావల కన్నా ఎక్కువ రాదు సార్" అన్నాడు.

మా బస్సు హార్ను వినిపించింది. అందరు ఎక్కి కూర్చున్నారు. పరిగెట్టుకుంటూ వెళ్ళి ఎక్కాను. బస్సు కదిలింది. కండక్టరు గాడి దగ్గరకు వెళ్ళి నా చిల్లర అడిగాను..వాడి బాగు చూపించి "అందరూ 500, 1000 నోట్లు ఇస్తే నేను మాత్రం చిల్లర ఎక్కడి నుంచి తెచ్చేది సార్? తిరుపతి బస్టాండు లొ దిగాక అక్కడ చిల్లర చేసి అందరికీ ఇస్తాను" అన్నాడు.

చేసేదేమీ లేక వెళ్ళి నా సీట్లొ కూర్చున్నాను. డ్రైవర్ మళ్ళీ పాటలు పెట్టాడు.

పెళ్ళిపుస్తకం లో వన భోజనం పాట..

"పప్పప్పప్పప్పప్పు దప్పళం...అన్నం..నెయ్యి..వేడి అన్నం కాచిన్నెయ్యి....వేడి వేడి అన్నం మీద...కమ్మని పప్పు కాచిన్నెయ్యి"

ఏంటిది..అందరూ కలిసి నా మీద దండ యాత్ర చేస్తున్నారు...ఇంకే పాటా దొరకలేదా వీడికి..ఒక వైపు ఆకలి తొ నా ప్రాణం పోతుంటే..నెయ్యి, పప్పు, ఆవకాయ..."ఆకలి" నుంచి "ఆఆఆఅకలి" స్థితికి చేరుకున్నాను.

ఎన్ని గంటల తరువాత తిరుపతి చేరుకున్నానో తెలియదు..బస్సు దిగంగానె కండక్టరు గాడితో చిల్లర తీసుకున్నాను. ఇంటికి వెళ్ళే వరకు ఆగే ఓపిక లేదు. బస్టాండు కాంటీన్ కు వెళ్ళి ఒక పులిహోర ఆర్డర్ చేసాను..వాడు ఫ్రెష్ గా మూడు రోజుల క్రితం పులిహోర తెచ్చిపెట్టాడు....ఎంత కమ్మగా ఉంది!!

24 comments:

radhika said...

హ హ..అదరగొట్టేసారు.తెగనవ్వానండి.మీరు పులిహోర అన్నప్పటి నుండి నాకూ ఆకలేస్తుంది.రేపొద్దన్నే చేసుకుని తినాలి ఫ్రెష్షుగా.

oremuna said...

రాధిక గారూ,

ఆ రేపో ఎల్లుండో మాకు చెపితే మేము కూడా వస్తాము :)

పారుపల్లి said...

యోవ్ బాగుందియా

Kishore Paritala said...

addirindi...baabu DSG...meeru raasey frequency kaastha penchochu kadaa...maree vaaraaniki okka postena....

radhika said...

ఈ రోజు పులిహోర చెసేసానోచ్.మీకెవ్వరికీ పెట్టనుగా.ummmmmmm yummy

spandana said...

భలే నవ్వించారు మీ ఆకలితో!

--ప్రసాద్
http://blog.charasala.com

రానారె said...

ఏమప్పా సామీ, పులిహోర చిత్రాన్నాలు ఎందుకప్పా గుర్తుజేసి సంపుతారు. పొద్దున్నే టిపినీ యేమీ తినకండా పన్లోకొచ్చినా. ఓహో,సెప్పుకుంటే బాధ సగమౌతుందనా? నీమాటలు యింటాంటే నీ కడుపులో ఆరాటం మాకు జేరిందియా యోవ్ తిపరతాయనా!

కొత్త పాళీ said...

అద్భుతం

సుధాకర్ said...

అందుకే ఐపాడ్లు గట్రా కొనుక్కోవాలి. అవి పెట్టేసుకుని ఓ కళ్ళూ మూసేసుకుని (మిగతావి ఎలాగు మూసుకుపోయాయి కాబట్టీ) నాలుగు చెత్త పాటలయినా మంచి హోరులో వినేస్తుంటే ఈ చుట్టుపక్కల గోల వినిపించదు.

నవీన్ గార్ల said...

సుధాకర్ నువ్వు కూడా భలే క్యామిడీ వ్రాస్తావే!!!

"మిగతావి ఎలాగు మూసుకుపోయాయి కాబట్టి"

హ్హ హహ్హ్హ్హ హ్హ్హ హ్హ్హ్హహ హ్హ్హ్హ......:)

సుధాకర్(శోధన) said...

నవీన్,

నా బ్లాగులో ఏదో సీరియస్ గా వాగుతానని నన్ను గంటు మొహం గాడి కింద జమకట్టారా ఏమిటి? ఇది అన్యాయం :-)

నాగరాజా said...

సూపర్‌. చక్కటి హాస్యం.

Dileep said...

హా హా అయ్యా బాబొయి నవ్వలెకా చస్తున్నా అది ఆపిసులొ అందరు ఎమి అయింది అంటె, నా లెప్టు ,రైటు కు కుడా చదివి వినిపిచి మల్లి మల్లి నవ్వాను, చాలా బాగుందండి. దన్యవాదాలు.
దిలీప్.

vijju said...

"యోవ్..మాది తిరపతి యా" - ఈ line చాలా బాగా నచ్చింది... ఎందుకంటె... మా ఒఫ్ఫిచె లొ కూడా ఒకతను... ఇలానే మాట్లాడుతాడు.... nice

Anonymous said...

meeru tirapati annaru .. yekkada aa yaasa kanipinchaledu ani chustunananu... mottaniki redu blogs lo kanipinchindi... "tiratai yaa..." nice..

బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్ said...

ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళెముందు మీ బ్లాగు మీద ఓ లుక్కిచ్చా. మీ టపా చదివిన వెంటనే నాకు ఆకలి మొదలయింది. ఇంటికి తొందరగా వెళ్ళాలి ;-)

మీరు టపాలతో కదుపు నెప్పే తెప్పిస్తారు అనుకున్నాను. ఆకలి కూడా పెంచగలరన్నమాట.

Anonymous said...

Good one

Anonymous said...

yoyy...maadhi gooda tirupathee yaa...

Harinath Pudipeddi said...

Dongalu padda aaru nelalaki policelu vachinattu, I am reading this post today after more than a year it is posted.

Prastutam americalo vunnanu, nooru vipareetanga oorutundi...eppude pulihora tinali...kaani intikelledaaka wait cheyali...

waaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa

Soujanya said...

chala baagundi.deenni chaduvutunnanta sepu yento haayiga undi.chaduvutunnantasepu navvutuune unnanu.mee kadhalanni yento baagunnai.
telugulo inta chakkaga haasyam pandistunnanaduku meeku "hats off".
meeru ilaanti kadhalu inka yennenno rayali, avi chadivi mem andaram haayiga navvukovali.

Jithender V said...

YOV EMI RASAVAYYA......

Anonymous said...

Simply superb...

no said...

sir, mee patha saamaanlu kontaam ... article nu 3.2.2013 adivaram andhrajyothi lo prachuristunnaam.
This is for your kind information.

- editor, sunday desk

no said...

sir, mee patha saamaanlu kontaam ... article nu 3.2.2013 adivaram andhrajyothi lo prachuristunnaam.
This is for your kind information.

- editor, sunday desk