Wednesday, April 11, 2007

పరీక్షల రాక్షసి

మొన్న వీకెండ్ ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో చాలా చోట్ల గ్రౌండ్లలో పిల్లలు క్రికెట్ ఆడుతూ కనిపించారు. అందరికీ పరీక్షలు అయిపోయినట్టున్నాయి.

పరీక్షలు...exams...భాషా బేధం లేకుండా ఒంట్లో దడ పుట్టించేవి.

నేను ఆఖరి సారి పరీక్షలు రాసి దాదాపు మూడేళ్ళు కావొస్తోంది. ఇప్పటికికూడా పరీక్షల టైము గుర్తుకు వస్తే ఎదో తెలియని చిరాకు.

నేను ఇంటర్మీడియట్ వరకు మా వూళ్ళోనే ఉండి చదువుకున్నాను. ఇంట్లో వాళ్ళు ఎప్పటికప్పుడు నేను బాగా ప్రిపేర్ ఔతున్నానా లేదా అని చూసుకోవటం వల్ల అప్పటి పరీక్షలకు సంబంధించిన విషయాలు పెద్దగా జ్ఞాపకం లేవు.

ఒక్క సారి ఇంటి నుంచి బయటకొచ్చి హాస్టల్లో పడ్డప్పటి నుంచి రాసిన ప్రతి పరీక్ష గుర్తుంది....మేలుకున్న ప్రతి రాత్రి గుర్తుంది...వచ్చిన ప్రతి రిజల్టు గుర్తుంది...

పరీక్షల డేటు రాంగానే ఎవడి రూము లో వాడు కూర్చుని ఏఏ సబ్జెక్టు ఎన్ని రోజులలో పూర్తి చెయ్యాలో టైము టేబులు తయారు చేసుకుని గోడకు అతికించుకుంటాడు. ఎవరో ఒకరిద్దరు తప్ప మిగతా అందరూ చదవడం 'రేపటి ' నుంచి మొదలుపెట్టేలా టైము టేబులు తయరుచేసుకుంటారు. టైము టేబులు రెడీ అయిపొయ్యింది కాబట్టీ ఇంక టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. ఆ రోజు రాత్రి ఏదైన సినిమాకు వెళ్ళొచ్చి హ్యాపీగా పడుకుండిపోవటం.

గోడకతికించిన టైము టేబులు ఒక్క రోజు మాత్రమే నీటు గా ఉంటుంది. రోజులు గడిచేకొద్దీ అందులో పెన్నుతో కొట్టివేతలు..మార్పులు..అందుకు బోలెడు కారణాలుంటాయి. పుస్తకం తెరిచినప్పుడు టైము 7:45 అయ్యుంటే "8:00 నుంచి మొదలుపెడదాం" అనిపిస్తుంది. "నా మాట విను..ఇప్పుడే మొదలు పెట్టు" అని మనసు చెప్తుంది - మనకు వినబడదు. శనివారం వచ్చేటప్పటికి టైము టేబులు ప్రకారం చదవలేక పోతే..."సోమవారం నుంచి ఫ్రెష్షు గా మొదలుపెడదాం " అని మళ్ళీ అనిపిస్తుంది. "రేయ్..ఇలా చేస్తూ పోతే మట్టికొట్టుకు పోతావ్... " అని మనసు ఇంకా ఎదో చెప్పేలోపు దాని నోట్లో గుడ్డలు కుక్కి ఓ మూల కూర్చోపెడతాం. పరీక్షలకు రెండు రోజుల ముందు గోడకున్న ఆ టైము టేబులు పీకేసి అక్కడ ఏ ఐశ్వర్య రాయ్ ఫొటొనో అతికించుకుంటాం.

పరీక్షల డేటు ప్రకటించినప్పటినుంచి - పరీక్షలు మొదలయ్యేలోపు...చాలా సార్లు "exams postponed" అనే కమ్మటి మాటలు వినబడతాయి. ఈ పుకార్లు ఎవరు మొదలుపెడతారో తెలియదు..."మా మామకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ సెక్షన్ లో పని చేసేవాడు చెప్పాడు " నుంచి - "ఇందాకే TV లో చెప్పారంట " వరకు అన్ని రకాల మాటలు వినిపిస్తాయి. అయినా "ఎలా తెలిసింది...ఎవరు చెప్పారు " లాంటి ప్రశ్నలు ఎక్కువ మంది అడగరు. అప్పటికి పుస్తకం మూసెయ్యటానికి ఒక సాకు దొరికితే చాలు..మిగతా సంగతులు తరువాత. పరీక్షలు పోస్టుపోను అయ్యాయి అని తెలిసి కూడా పుస్తకం పట్టుకునేంత రాతి గుండె ఎవ్వరికీ ఉండదు...మళ్ళీ సినిమా...గంటకొకసారి కాలేజికి వెళ్ళి నోటీసు బోర్డు లో ఈ పరీక్షలు పొస్టుపోను అయిన విషయం గురించి ఏమైన ఉందేమో అని చూడటం...

ఎన్ని రోజులకూ ఆ శుభ వార్త రాకపోవటం తో ఒక్కొక్కరుగా పుస్తకాలు తీయటం మొదలుపెడతారు.

పరీక్షల టైములో వచ్చే ఆటంకాలలో క్రికెట్ అనేది చాలా పెద్దది. మన అదౄష్టం మీద దురదౄష్టం టాసు గెలిచి సరిగ్గా ఎగ్జాం టైము లో ఇండియా ఆడే టోర్నమెంటు ఏదైన ఉంటే అంతే సంగతులు...ఎంతో పెద్ద మనసు తో మనవాళ్ళు ఈ సారి లాగ ఫస్టు రౌండు లో తిరిగొస్తే తప్ప పరీక్షలలో గట్టెక్కటం కష్టం.

పరీక్షల టైము లో చదివేవాళ్ళు, చదవని వాళ్ళు అనే బేధం లేకుండా ప్రతి ఒక్కడూ 'night out' చెయ్యలనుకుంటాడు. అదేంటో.. రాత్రంతా మేలుకుంటే చాలు మనము పాసైపొయ్యినట్టె అనే భ్రమ లో ఉండేవాళ్ళం. మా హాస్టలు కు కొద్ది దూరం లో ఒక టీ కొట్టు ఉండేది. ఆ కొట్టోడు పరీక్షల టైము లో మాకోసం రాత్రంతా ఉండేవాడు. ఈ టీ కాన్సెప్టు మాలో చాలా మందికి పని చేసేది కాదు. పదకొండింటికి ఒక పెద్ద గ్లాసులో టీ తాగి సుబ్బరంగా పడుకునేవాళ్ళం. రెండింటికి మెలుకువస్తే ఫ్లాస్కు లో మిగిలిన టీ తాగేసి మళ్ళీ పడుకుండిపోవటం...కొన్ని సార్లు ఆ టీ సరిగ్గా పనిచెయ్యక పోవటం వల్ల రాత్రంతా మేలుకున్నా..."కరెంటెప్ప్పుడు పోతుందా" అని ఎదురు చూడటం.

మా కాలేజి వెనకాల ఉండే గుడికి మామూలు రోజుల్లో ఒకరిద్దరు తప్ప ఎవ్వరూ వెళ్ళేవారు కాదు. పరీక్షలు దగ్గరయ్యేకొద్దీ క్రౌడు పెరిగేది. హాల్టికెట్లు, పెన్నులకు తెగ పూజలు జరిగేవి. సబ్జెక్టుకొక కొబ్బరికాయ చొప్పున కొన్ని వేల కొబ్బరికాయలు పగిలేవి ఆ గుడి ముందు. వాటిలో సగం కాయలు మా సీనియర్ హనుమా రెడ్డి కొట్టేవాడు..వాడు ప్రతి సెమిస్టరు వచ్చి ఆ గుళ్ళో కొబ్బరికాయలు కొట్టి, పరీక్షలు రాయకుండా తిరిగి ఇంటికి వెళ్ళిపొయ్యేవాడు.

పరీక్షల టైము లో తప్పనిసరిగా వచ్చే డిస్కషన్ - 'సెలవులు ఎలా గడపాలి ' అని..చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ పాల్గొంటారు ఈ చర్చ లో..ఇంటికెళ్ళి తిరిగి రాంగానే ఎక్కడికైన ట్రిప్పుకెళ్ళాలి...ఆలస్యం చేస్తే రిజల్ట్స్ వచ్చేసే ప్రమాదముంది. అవి కాస్త అటో ఇటో ఐతే మళ్ళీ టైము టేబులు తయారు చెయ్యటం, నైటౌట్లు...అమ్మో టైము ఉందదు...అందుకే ఆ ట్రిప్పుకి పరీక్షల టైము లో ప్లాన్ వెయ్యటమే కరెక్టు!

ఇలా ఏవో ఆటంకాలు వచ్చి రోజులు గడిచిపొతాయి..ఆ దుర్దినం రానే వస్తుంది.

పరీక్ష ముందు రోజు జనం నాలుగు గ్రూపులుగా విడిపోతారు -

1. ముందు నుంచి బాగా ప్రిపేర్ అయ్యి...రివైజ్ చేసుకునే వాళ్ళు
2. ఒక్క రాత్రిలో ఎదోలాగ చదివేసి పాస్ అయిపోదామనుకునే వాళ్ళు
3. ఎనిమిది గంటలు చదివి పరీక్షలో ఊడబొడిచేది ఏమీ లేదని మరుసటి రోజు పరీక్షకు తీలోదకాలిచ్చేసి...తన లాంటి వాళ్ళను ఓ నలుగురిని పొగేసి.."మాయావతి అందంగా ఉంటుందా..విజయకాంత్ అందంగా ఉంటాడా " లాంటి దేశాన్ని పీడించే సమస్యల గురించి చర్చించేవాళ్ళు
4. కాపీ చీటీలు తయారు చేసుకునేవాళ్ళు...వీళ్ళంతా ఒక పెద్ద రూం లో సమావేశమయ్యి చకచకా చీటీలు రాసేస్తుంటారు..నా ఫ్రెండు దినకర్ కాపీ చీటీలు రాయటం లో దిట్ట..పరీక్షలకు వారం ముందు నుంచి "కాపీ చీటీలలో ఏ సైజు ఫాంట్ వాడాలి, చీటీలు సన్నగా ఎలా మడవాలి, వేళ్ళ సందులో పెట్టుకుని ఎలా రాయాలి " లాంటి అంశాల మీద workshop నిర్వహిస్తుండేవాడు.

పైన చెప్పిన నాలుగు రకాలలో ఎక్కువగ కనిపించేది రెండో రకం జనం. ఏదో ఒకటి చేసి పాస్ అయిపోవాలి అనుకునేవాళ్ళు. పుస్తకాలు తాకితే చేతికి సెప్టిక్ ఔతుందేమో అని భయం భయంగా తెరిచి చదవటం మొదలుపెడతారు. సెమిస్టర్ సరుకు...ఒక్క రాత్రిలో బుర్రలోకి తొయ్యాలంటే ఎలా కుదురుతుంది? మన బుర్ర తీసుకోగలిగినంత తీసుకుని మిగిలింది బయటకు తోసేస్తుంది....సరిగ్గా అలా బయటకు తోసేసిందాంట్లొంచే ఒక పది మార్కుల క్వశ్చను, మూడు ఐదు మార్కుల క్వశ్చన్లు వస్తాయి...ఆ క్వశ్చన్లు చూస్తే ఎక్కడో చదివినట్టే అనిపిస్తుంది...ఒక్క ముక్కా గుర్తుకు రాదు. ఇలాంటి టైములోనే మనము ఎప్పుడో నోట్లో గుడ్డ కుక్కిన మనసు కష్టపడి ఆ గుడ్డ తీసేసి "నేను ముందే చెప్పానా...చూడు ఎలాంటి పరిస్థితి తెచ్చుకున్నావో..వచ్చే సెమిస్టర్లో నైనా బాగా చదువు" అంటుంది.

ఇంట్లో వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకం...నెల నెలా మనకు పంపే డబ్బు గుర్తుకు వచ్చి పేపరు ఇద్దామా వద్దా అని కాస్సేపు తటపటాయించి..చివరకు చేసేదేమీ లేక ఇన్విజిలేటరుకు మన ఆన్సర్ పేపరిచ్చి హాలు బయట పడతాం..

ఏంటి ఇంకా ఎవ్వరూ బయటకు రాలేదే అని చూస్తే లోపల మోహన్ గాడు తెగ రాసేస్తూ కనిపిస్తాడు..ఒక పేపర్ మొత్తం నిండాక తను రాసింది తప్పనిపిస్తుందో ఏంటో..మొత్తం కొట్టేస్తాడు..వాడి చుట్టూ కూర్చున్న ఆరు మంది "రేయ్..ఇంత రాసాక కొట్టేస్తావేంట్రా" అని గట్టిగా అరిచి, వాళ్ళ పేపర్లో ఉండేది కూడా కొట్టేస్తారు...ఇన్విజిలేటరుకు అనుమానమొచ్చి మోహన్ గాడి ప్లేసు మార్చగానే ఈ ఆరు గురు పేపర్లు ఇచ్చేసి బయటకొచ్చేస్తారు.....

50 మార్కులకు చదువుకెళ్ళి...40 మార్కులకు పేపర్ రాసొచ్చి...35 మార్కులతో పాస్ అయిపోవాలి అనుకునే అత్యాశావాదులం మేము......

ఎలా గడిచిపొయ్యిందో గడిచిపొయ్యింది ఆ కాలం....పరీక్షలతో లెక్క లేనన్ని సార్లు చేసిన యుధ్ధం...

23 comments:

shanthi said...

ఓహొ లొల్లి..సంపేశ్నవ్ పో
ఫస్టు కామెంట్ నాదే

Anonymous said...

ఒర్నాయనో ఇందులో..కిసుక్..lol..కిల కిలా....గిలిగింతలు అన్నీ వున్నాయి.

బాసూ మీకో ప్రతిపాదన. మనమిద్దరమూ కలిసి ఓ హాస్య పత్రిక పెడదామా?

పార్ట్ నర్ విహారి

మాకినేని ప్రదీపు said...

చాలా బాగుందండి. నాకు కూడా దినకర్ అనే ఒక స్నేహితుడు ఉండే వాడు. అతనయితే పరీక్ష హాలుకు ముందే వెళ్ళిపోయి, తనకు అనుకూలంగా బెంచీలను సర్దేసేవాడు.

సత్యసాయి కొవ్వలి said...

చాలా బాగా చెప్పారు. మా పరీక్షల ప్రహసనాలన్నీ ఒకసారి సినిమా రీళ్ళలా చకచకా కళ్ళముందు కదిలాయ్. సెమెస్టర్ పద్ధతవ్వడం వల్ల ఎప్పుడూ పరీక్షలు వ్రాసినట్టే ఉండేది.

ప్రవీణ్ గార్లపాటి said...

పరీక్షలా మజాకా ?
ఆ సమయంలో ఎక్కడ పక్క వాడు చదివేస్తాడో అని వాడిని చెడగొట్టే వాళ్ళు కూడా తయారవుతారు. పదరా క్రికెట్ ఆడుకుందాం, లేదా సినిమా చూద్దాం, పార్టీ చేసుకుందాం అని తీసుకుపోతారు.

DSG said...

విహారి గారు హాస్య పత్రిక అంటే గుర్తొచ్చిందీ, ఇది వరకు 'హాసం' అనే పత్రిక వచ్చేది. సంగీతం కూడ కవర్ చేసే వారందులో. మంచి సాహిత్య విలువలతో ఒక treasure trove అనదగ్గట్టుండేది ఆ పత్రిక. ఈ మధ్య ఎక్కడా చూసినట్టు గుర్తు లేదు. హాసం ఇంకా పబ్లిష్ అవుతూందంటారా?

- గౌతమ్

కొత్త పాళీ said...

హాసం నిలిచిపోయింది సుమారు రెండేళ్ళ క్రితం. ఆ పత్రిక సంపాదకులు ఎంబీయెస్ ప్రసాద్ గారు రచ్చబండ యాహూ గ్రూపులో తమ అనుభవాలు చెబుతున్నారు.

Ravi said...

ఈ ప్రతిపాదన బగు౦ది.. పత్రిక ఎప్పుడు ఎక్కడ మొదలు పీట్తలొ అలొచి౦చు..మనము కాపీ రెయ్ట్సు తిసుకొవాలి..

Srinivas Ch said...

ఆహా..చాలా బాగా రాశారండి. నా పరీక్షల రోజులు అన్నీ కళ్లముందు ఒక్కసారి సినిమా రీళ్లలాగా కదలాడాయి. అప్పట్లో పరీక్షకు మనం ఎంత చదివాము అన్న దాని కన్నా, పక్క వాడు ఎంత చదివాడు అన్నదే మనకు ముఖ్యంగా ఉండేది. పక్క వాడిని ఎలా డిస్టర్బ్ చేయాలా, వాడు ఇంపార్టెంట్ ప్రశ్నలు చదవకుండా ఎలా పక్కదారి పట్టించాలా ఇవే ఆలోచనలు ఉండేవి. మొత్తానికి ఆ రోజులు మళ్లీ గుర్తు చేసారు. మీ రచనా శైలికి జోహార్లు.

radhika said...

అమ్మో పరీక్షలని గుర్తు చేయకండి.చదువు ఆపేసి 4 ఏళ్ళు అయినా ఇప్పటికీ నాకు కలలొస్తూవుంటాయి పరీక్షలు వచ్చేసినట్టు,ఇంకా ఒక్క సబ్జెక్ట్,ఒక్క పోర్షన్ పూర్తిచేయనట్టూ... ఈ నాలుగేళ్ళలో ఎన్ని సారులు ఉలిక్కిపడ్డానో?

రానారె said...

మాయావతి!!! సరే.
విజయకాంత్!!!!!!!??
దేశాన్ని పీడించే సమస్యలు - వాటిమీద చర్చలు.

జంధ్యాల రేంజ్ టచ్ ...ఇది మాత్రం. శభాషో!!

Anonymous said...

చాలా బాగుంది.

Lalithaa Sravanthi Pochiraju said...

baboi....naa pareekshalu eppatikii pareekshale

gammathu entante..
jeevatam lo pareekshalu raasi paattaalu nerchukuntaam

student gaa unnappudu...paattaalu nerchukuni pareekshalu raasthaam

"haasam" konni rojulu aagi poyina maata nijam
malli publish avuthondi

Raj.N said...

very good.
i laughed like any thing.
my friends in the internet lab saw me and thought i got mad.
hats of to u
keep it up.

teresa said...

manasu gatamloki toMgi choosi venakki raanani moraayistoMdi.
Pareekshala raakshasi minahhayiMchi aa hostel life, friendships.. very precious memory!
Thanks for sharing.

Ravi Kiranam said...

మళ్ళీ నా ఇంజినీరింగ్ రోజులు గుర్తుకు వచ్చాయి. కరెంట్ పోతే ఆనందం తో గుండాగినంత పనయేది మాకూను. పరీక్ష ముందు వెనుక సినిమా మాత్రం మామూలే. హాస్య పత్రిక కు చందా యెంతో చెప్పండి.

chinni said...

good one

సుబ్బు said...

కాలేజీ రోజులు గుర్థుకొచ్హాయీ బాసు...

Anonymous said...

wowwwwwww excellent ga vundandi nenu nuvutunte naa pakka cubicles valu naku pichi anukuntaremo ani bhayanga vundi

Padma..

Anonymous said...

wowwwwwww excellent ga vundandi nenu nuvutunte naa pakka cubicles valu naku pichi anukuntaremo ani bhayanga vundi

Padma..

tulasi said...

బాగుంది.

Pradeep's said...

పుస్తకాలు తాకితే చేతికి సెప్టిక్ ఔతుందేమో అని భయం...

hmm kekaaa

Anonymous said...

eenadu patrika lo chusina link nundi modalina naa telugu blogs chadavatam ane kotta alavatu...meeru mee blog lo rasina anni blogs chadivaka aa alavatu kasta oka vyasanam ayipoyindi. nenu modasitisari intala navvokovatam..chala bagunnai ... keep writing.