Thursday, May 17, 2007

నా చీకటి రహస్యాలు

నేను ఇన్నాళ్ళుగా దాచుకున్న రెండు చీకటి రహస్యాలు ఈ బ్లాగు ద్వారా బయట పెడుతున్నాను...

మొదటి రహస్యం - నాకు కుక్కలంటే భయం. ఈ భయాన్ని ఇంగ్లీషులో 'Cynophobia' అంటారట.

రెండో రహస్యం - నాకు ఇంజెక్షన్లంటే భయం. ఈ భయానికి కూడా ఏదో ఇంగ్లీషు పదముండే ఉంటుంది..కానీ ఆ పదమేంటో తెలుసుకోవాలంటే కూడా భయం నాకు.
మా ఇంటి బయట ఎప్పుడూ రెండు కుక్కలుంటాయి. కంఫ్యూజ్ కాకూడదని నేను వాటికి పేర్లు పెట్టాను - 'నల్ల కుక్క ', 'నల్ల కుక్క పక్కనుండే కుక్క ' - మూడేళ్ళుగా రోజూ వీటి ముందు నుంచే వెళ్తున్నా కూడా నన్ను చూసినప్పుడల్లా మొరుగుతాయి. నా డ్రైవర్స్
లైసెన్సో, కంపెనీ ID కార్డో చూపిస్తే తప్ప నన్ను కదలనివ్వవు.

ట్రాఫిక్ పోలీసులు వైర్లెస్సు లో మాట్లాడుకున్నట్టు ఈ కుక్కలకు కూడా ఏవో ఫోన్లలో మాట్లాడుకునే సదుపాయం ఉంది. నేను ఏ ఏరియా వైపు బయలుదేరుతుంటే ఆ ఏరియా కుక్కలకు మెస్సేజ్ చేరిపోతుంది. నిద్రపోతున్న కుక్కలు, భోంచేస్తున్న కుక్కలు అన్నీ పనులు మానుకుని నాకోసం ఎదురుచూస్తాయి..నేను కనిపించగానే ఆర్.నారాయణ మూర్తి సినిమాలో సైడ్ డాన్సర్ల లాగా ఆవేశంతో నా మీదకు వస్తాయి...

మనుషుల్లో ఉనట్టు జాతి,ప్రాంత భేధాలు కుక్కల్లో ఉండవు..ఏ ఊరి కుక్కైన, ఏ జాతి కుక్కైన నన్ను చూసి మొరుగుతుంది, నా వెంట పడి నన్ను తరుముతుంది..

నేను పదో క్లాసులొ ఉండేప్పుడు శివప్రసాదరావు గారింటికి లెక్కల ట్యూషన్‌కెళ్ళేవాడిని.
"లెక్కలు, కుక్కలు ఒకటే రా...వాటిని చూసి నువ్వు భయపడి పరిగెడితే అవి నీ వెంటపడతాయి...వెనక్కు తిరిగి 'దీని సంగతేందో చూద్దాం తీ' అనుకుంటే తోక ముడుస్తాయి" ఆంటూండేవాడాయన...
దీనిని అమలు పరుద్దామని నేను ఒకసారి నా వెనకాల పడ్డ కుక్కల మీదకు రాయి విసిరాను. అవి ఆగిపొయ్యాయి....ఆ విజయ గర్వంలో పూనకమొచ్చినోడి లాగా ఓ రెండు నిముషాలు రాళ్ళు విసురుతూనే ఉన్నాను. ఆ కుక్కల మూక నా లాగా తిక్కది కాదు...నా చుట్టూ ఉండే రాళ్ళన్నీ అయిపొయ్యేంతవరకు వెయిట్ చేసాయి...ఆ తరువాత పక్కవీధిలో ఉండే మరో ఆరు కుక్కలకు SMS చేసి పిలిపించి, ఊరు దాటేంత వరకు నా వెంటబడ్డాయి. ఊరు దాటాక 4 X 400 మీటర్స్ రిలే రేసులో లాగా ఆ పక్క ఊరి కుక్కలకు నన్ను అప్పగించి తిరిగి వెళ్ళి పొయ్యాయి...

నాకెప్పుడో ఊహ తెలియని వయసులో ఇంజెక్షన్ వేయించారు మా ఇంట్లో వాళ్ళు. ఆ తరువాత నాకు 18 ఏళ్ళొచ్చేంతవరకు ఎప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్ళినా ఆ సిరంజిలో ఉండే మందు లోటాలో పోసుకుని తాగానే కానీ సూది పొడిపించుకోలేదు....

ఆ తరువతైనా సూది వేయించుకున్నది నాకేదో మైనారిటీ తీరిపొయ్యిందని కాదు.....నన్ను నా పధ్ధెనిమిదో ఏట కుక్క కరిచింది..అందుకు.

నేను మయూరా బేకరీ దగ్గర బటర్ బన్ తింటూ ఉంటే నా వెనకాల ఎవరో అమ్మాయి చిన్న కుక్క పిల్లను ఎత్తుకుని "చో చ్వీట్, చో క్యూట్ " అని దాన్ని ముద్దాడుతోంది..నేను దరిదాపుల్లోనే ఉన్నట్టు ఆ కుక్కపిల్ల పసిగట్టినట్టుంది..ఆ అమ్మాయి చేతుల్లోంచి కిందకు దూకి, గట్టిగా మొరుగుతూ నా కాళ్ళ మీదకు ఎగిరింది. అది గిల్లిందో, కరిచిందో తెలియదు కానీ బొటనవేలు చివరి నుండి రక్తమొచ్చింది.....

నా చుట్టూ నుంచున్న వాళ్ళలో ఒకడు (నాకు వాడెవడో కూడా తెలియదు) "గిల్లినా కొరికినా ఇంజెక్షన్లు తప్పవు" అని మొదలెట్టాడు. మిగతా వాళ్ళు కూడా ఆ డిస్కషన్ లో పాల్గొని యధాశక్తి నన్ను భయపెట్టరు. చివరకు "నువ్వు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోకపోతే బ్రతకటం కష్టం " అని తేల్చేసారు...

కుక్క కరిచిన 24 గంటల లోపు ఇంజెక్షన్ వేయించుకోవాలన్నారు జనాలు. ఆ రోజు రాత్రంతా ఆలోచించి అన్నాళ్ళ నా సూది బ్రహ్మచర్యం వదిలెయ్యాలని నిర్ణయించుకున్నాను...అది కూడా 'బొడ్డు చుట్టూ ఇంజెక్షన్ ' ల కాన్సెప్టు అప్పటికి పొయ్యింది కాబట్టి...లేకుంటే జీవితాంతం అలా మొరుగుతూ ఉండేవాడినేమో కానీ ఇంజెక్షన్లు మాత్రం వేయించుకునే వాడిని కాను.

నెలన్నర వ్యవధిలో 5 ఇంజెక్షన్లు వేయించుకున్నాను - కుడి చేతికి మూడు, ఎడమ చేతికి రెండు....అన్నీ అయ్యిన తరువాత పోలీసు స్టేషన్ కు వెళ్ళి ఆ డాక్టర్ మీద 'attempt to murder' కేసు పెట్టాను. అంత తక్కువ టైము లో అన్ని సార్లు ఇంజెక్షన్లు వేయించుకోవటం తో నాకు అవంటె 'భయం ' పొయ్యింది...'విపరీతమైన భయం ' మొదలయ్యింది.

ఈ కుక్కల భయం తో జీవితాంతం బ్రతకలేనని, నేను నాలుగేళ్ళ క్రితం ఒక Psychiatrist దగ్గరకు వెళ్ళాను. ఆయన "చూడు బాబూ..నీకు కుక్కలంటే భయం పోవాలంటే నువ్వు మొదట చెయ్యవలసింది వాటికి దగ్గరగా ఎక్కువ సమయం గడపటం...వాటితో ఆడుకో. ఒక్క సారి ఇది ప్రయత్నించి చూడు " అన్నాడు. ఆ సలహా ప్రకారమే నేను దాదాపు ఒక సంవత్సరం పాటు 'మోతీలాల్ తో చాల చనువుగా ఉన్నాను...వాడితో ఆడుకున్నాను (మోతీలాల్ అంటే కుక్క కాదు...మా ప్రొఫెస్సర్. వాడిలాంటి నీచుడు ఇంకోడు లేడు..వాడికి లేని కుక్క బుధ్ధి లేదు). ఎన్ని చేసినా నేను కుక్కలకు దగ్గర కాలేక పొయ్యాను. చివరి సెమిస్టరులో ఒక సారి మా హాస్టలు మెస్సులో టిఫిన్ చేద్దామనుకుంటుండగా కిటికీలోంచి ఒక కుక్క కనిపించింది. డాక్టర్ చెప్పింది గుర్తుకొచ్చి నా ప్లేటుతో సహా బయటకొచ్చాను. ఊహించినట్టే నన్ను చూసి అది మొరగటం మొదలుపెట్టింది. నా ప్లేటులొ ఉండే ఇడ్లీ దానికేసాను..అది పారిపొయ్యింది. మా మెస్సులో చేసె రబ్బర్ లాంటి ఇడ్లీలు మేమే అనుకున్నా...కుక్కలు కూడా తినవన్నమాట...చేసేదేమీ లేక ఆ ఇడ్లీలు మూల టేబుల్లొ కూర్చుని టిఫిన్ తింటున్నమోతీలాల్ గాడికిచ్చేసాను..

ఈ భయాన్ని నేను జయించలేను..నా పరిధుల్లో నెనుండటం మంచిది.

అందుకే అప్పటినుంచి నేను ఎవ్వరి ఇంటికి వెళ్ళినా వాళ్ళ గేట్ బయట "కుక్క లేదు..అజాగ్రత్త " అనే బోర్డు ఉంటే తప్ప లోపలకు వెళ్ళను.

మొన్న అడయార్ లో ఒక ఇల్లు ఖాళీగా ఉందంటే చూడటానికి వెళ్ళాను. ఇంటి గేటు మీద "కుక్కలు లేవ" న్నబోర్డు చూసి ఆనందంతో లోపలకు నడిచాను...గేటు తెరవబోతూ ఆ బోర్డు మళ్ళీ చూసాను...కింద చాక్పీసు తో సన్నటి అక్షరాలతో "దినకర్ ఉన్నాడు జాగ్రత్త " అని రాసుంది..ఇదేంటి ఇలా రాసుంది అని పక్కన్నే బొంగరాలు ఆడుకుంటున్న పిల్లల్ని అడిగితే విషయం తెలిసింది. దినకర్ అంటే ఆ ఇంటి ఓనర్..'మొరిగే కుక్క కరవదు ' అనే విషయాన్ని నలుగురికీ తెలపాలని మొరుగుతున్న ఒక వీధి కుక్క నోట్లో చెయ్యి పెట్టాడంట..20 నిముషాలపాటు ఆ చేతిని వదలకుండా పట్టుకుందంట ఆ కుక్క..ఆ ప్రయోగం ఫెయిల్ అయ్యిందన్న బాధలొ "కరిచే మనిషి మొరగడు " అనే కొత్త విషయాన్ని జనాలకు తెలియజెప్పటానికి.. తన ఇంట్లోకి ఎవరొస్తారా అని ఎదురు చూస్తున్నాడంట.

"కుక్క కాటుకు చెప్పు దెబ్బ " అనేది ఒక తప్పుడు సామెత. "కుక్క కాటుకు 5 ఇంజెక్షన్లు" అనేది కరెక్టు....ఈ సవరణ నా సామెతల పుస్తకంలో నేనెప్పుడో చేసుకున్నా..

Thursday, May 3, 2007

" ఇక్కడ మంచు పడుతోంది "...

...అని న్యూ యార్క్ నుంచి రాంకిరణ్ ఫోన్ చేసినప్పుడల్లా నా కడుపు రగులుతుంది. కారణం - ఇక్కడ మద్రాసు లో నిప్పులు కురుస్తున్నాయి.

2004 లో అనగనగా ఒక నేను మద్రాసు లో వచ్చి పడ్డాను. ఈ మూడేళ్ళలో సంవత్సరానికి 10 చొప్పున 30 ఎండాకాలాలు చూసాను. మార్చ్, ఏప్రెల్, మే నెలలలో ఎవరైనా మద్రాసు కు పెళ్ళికో, బంధువుల ఇంటికో వచ్చారంటే సిక్కిం బంపర్ లాటరీ కొట్టినట్టే. దగ్గర్దగ్గిర 180 డిగ్రీ సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది వాతావరణం.

అసలు మాటర్ ఏంటంటే.....'Big Bang' జరిగిన తరువాత మన విశ్వం లో అన్నీ చల్లబడి సర్దుకుంటున్న టైములో 'Small Bang' అనే చిన్న విస్పోటం ఇంకోటి జరిగింది. ఆ నిప్పు రేణువులు పడటం వల్ల మన విశ్వం లో కొన్ని ప్రాంతాలు మాత్రమే వేడిగా అలా ఉండిపొయ్యాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగినవి సూర్యుడు, సహారా ఎడారి, మద్రాసు...

ఇప్పటి వాళ్ళ లాగానే రాతియుగం నాటి మద్రాసు వాస్తవ్యులు కూడా కోతి నాయాళ్ళు. తంగ వేల్, శరవణ వేల్, బొటన వేల్, చిటికెన వేల్ అనే నలుగురు అన్నదమ్ములు దోమలు ఎక్కువగా కుడుతున్నాయని ఓజోన్ పొర ను చించి దోమతెరలు కుట్టుకున్నారంట. దాని ఫలితం ఇప్పటి జనాలు అనుభవిస్తున్నారు.
వీళ్ళకంటే అలవాటైపొయ్యింది....తలరాత తమిళ దేవుడు రాసి మద్రాసు లో ఉద్యోగం వచ్చిన నాలాంటి వాళ్ళ సంగతి ఏంటి??

'మద్రాసు ' ను 'చెన్నై' అని పేరు మారిస్తే పరిస్థితి మారుతుందేమో అని ప్రయత్నించారు. అసలుకే మోసం వచ్చి ఎండ మూడింతలయ్యింది. ఆ వేడికి బుర్ర బాయిలింగ్ పాయింట్ దాటి...మామూలు మనుష్యుల్లాగా అలోచించే శక్తి కోల్పొయ్యి, ఏమి చెయ్యాలో తోచని వాళ్ళు రాజకీయాల్లోకి ప్రవేశించి..ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు అయ్యారు (మీరుగానీ నేను కరుణానిధి, జయలలిత గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా??? ఐతే మీకు వంద మార్కులు...నేను వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను).

మా ఆఫీసు లో ఫార్మల్ వేర్ తప్పనిసరి....మార్చ్, ఏప్రెల్, మే నెలల్లో మేము పడే కష్టాలు గమనించి మానేజ్మెంట్ వాళ్ళు అందరికీ మెయిల్ చేసారు - "మీకు ఏ డ్రస్సు సౌకర్యంగా ఉంటే అదే వేసుకురండి" అని....మరుసటి రోజు అందరూ నిక్కర్లూ, బనియన్లూ వేసుకుని తయారయ్యారు..

కాసిన్ని వానలు పడితే ఐనా భూమి కాస్త చల్లబడుతుంది...కానీ అదంత వీజీ కాదు..

ఉన్న కొండలన్నీ పగలగొట్టి KPJ లక్కీ స్టోన్స్ వాళ్ళు ఉంగరాల్లో పెట్టి అమ్మటం మొదలు పెట్టారు..అశోకుడు మద్రాసు లో కూడా రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటించాడంట. కానీ ఇక్కడ టీ కొట్లనుంచి కార్ షోరూముల దాకా చెట్లు కొట్టేసి, ఫూట్పాత్లు చెరిపేసి కట్టిన ఇల్లీగల్ కట్టడాలు చాలా ఉన్నాయి...ఇప్పుడు మద్రాసు మొత్తానికి 13 చెట్లు మిగిలున్నాయి - అందులోవి ఆరు గులాబీ మొక్కలు...

కొండలూ, చెట్లు ఏమీ లేకపోతే వర్షాలు ఎక్కడినుండి పడతాయి??

అలాగని అస్సలు వర్షాలే ఉండవని కాదు..అప్పుడప్పుడూ కొన్ని అకాల వర్షాలు పడుతుంటాయి - అది కూడా కేవలం మద్రాసులో ఇండియా క్రికెట్ మాచులు ఉన్నప్పుడు మాత్రమే...ఈ మాట చాలా మంది నమ్మక పోవచ్చు....కావాలంటే ఈ సారి మనవాళ్ళ మాచ్ ఏదైనా మద్రాసు లో ఉన్నప్పుడు ఇక్కడకు రండి. ఆ రోజు పొద్దున వాన పడే సూచన ఏమాత్రం లేకున్నా సగం మంది గొడుగులు పట్టుకుని కనిపిస్తారు...మిగతా సగం 'అడవి రాముడు ' సినిమాలో వాన పాట డ్రస్సులేసుకుని తిరుగుతుంటారు. మనవాళ్ళు గనక గెలిచే పొజిషన్ లో ఉంటే ఆరోజు మధ్యాన్నానికల్లా తుఫానొచ్చి మద్రాసు చుట్టుపక్కల రెండు మూడు ఊర్లు మునిగిపోతాయి..

నేను నా స్నేహితులను కలవటానికి సగటున మూడు నెలలకొకసారి బెంగళూరు వెళ్తుంటాను. మద్రాసు నుండి వస్తున్న బస్సు బెంగళూరు ప్రవేశించబోతోంది అనగా ఒక అనౌన్సుమెంటు చేస్తారు - "మద్రాసు నుండి వస్తున్న ప్రజలార...ఇప్పుడు మీరు మీకు తెలియని ఒక కొత్త అనుభూతికి లోనవబోతున్నారు...దీనిని 'చలి ' అంటారు. సీట్ల కింద దూరడమో, డ్రైవర్ పక్కనున్న ఇంజను మీద కూర్చోవడమో చెయ్యండి...లేకపొతే చచ్చి ఊరుకుంటారు " అని...

మద్రాసు లోని లోకల్ బొబ్బిలి బ్రహ్మన్న 'చలి 'ని ఎప్పుడో 'గ్రామ బహిష్కరణ ' చేసాడు.. అందుకే ఇక్కడ 'చలికాలం ' అనే మాటకు అర్థం చాలా మందికి తెలియదు...ఇక్కడ డిసెంబర్, జనవరి నెలల్లో కూడా ఎయిర్ కూలర్ల అమ్మకాలు మాంచి జోరుగా ఉంటాయి...

మూడు నెల్ల క్రితం పేపర్లో వచ్చిన ఒక సంచలన వార్త అందరూ చదివే ఉంటారనుకుంటా - "మద్రాసు లో స్వటర్లు అమ్మటానికి ప్రయత్నించిన దినకర్ అనే వ్యక్తిని పిచ్చాసుపత్రిలో చేర్పించిన పోలీసులు " అని...మొదట్లో ఇదేదో పోలీసులు పన్నిన కుట్ర అనుకున్నారు మిగతా ప్రాంతాల వారు...కానీ అదే దినకర్ పిచ్చాసుపత్రి నుండి రెలీజ్ అయ్యాక మద్రాసు ఎండలో 'sun bath ' చేద్దామని రెండు చిన్న గుడ్డ పేలికలు కట్టుకుని మరీనా బీచులో పడుకున్నాడంట...ఆ ఫొటోలు పేపర్లో రావటం తో కొంచెం తేడా కాండిడేట్ అని నిర్ధారించుకున్నారు..

గంట సేపుగా కంప్యూటర్ ముందు కూర్చున్నానేమో...వళ్ళంతా చెమటలు పట్టేసాయి..ఈ రోజు చెయ్యవలసిన నాలుగో స్నానానికి టైమయ్యింది...