Thursday, May 17, 2007

నా చీకటి రహస్యాలు

నేను ఇన్నాళ్ళుగా దాచుకున్న రెండు చీకటి రహస్యాలు ఈ బ్లాగు ద్వారా బయట పెడుతున్నాను...

మొదటి రహస్యం - నాకు కుక్కలంటే భయం. ఈ భయాన్ని ఇంగ్లీషులో 'Cynophobia' అంటారట.

రెండో రహస్యం - నాకు ఇంజెక్షన్లంటే భయం. ఈ భయానికి కూడా ఏదో ఇంగ్లీషు పదముండే ఉంటుంది..కానీ ఆ పదమేంటో తెలుసుకోవాలంటే కూడా భయం నాకు.
మా ఇంటి బయట ఎప్పుడూ రెండు కుక్కలుంటాయి. కంఫ్యూజ్ కాకూడదని నేను వాటికి పేర్లు పెట్టాను - 'నల్ల కుక్క ', 'నల్ల కుక్క పక్కనుండే కుక్క ' - మూడేళ్ళుగా రోజూ వీటి ముందు నుంచే వెళ్తున్నా కూడా నన్ను చూసినప్పుడల్లా మొరుగుతాయి. నా డ్రైవర్స్
లైసెన్సో, కంపెనీ ID కార్డో చూపిస్తే తప్ప నన్ను కదలనివ్వవు.

ట్రాఫిక్ పోలీసులు వైర్లెస్సు లో మాట్లాడుకున్నట్టు ఈ కుక్కలకు కూడా ఏవో ఫోన్లలో మాట్లాడుకునే సదుపాయం ఉంది. నేను ఏ ఏరియా వైపు బయలుదేరుతుంటే ఆ ఏరియా కుక్కలకు మెస్సేజ్ చేరిపోతుంది. నిద్రపోతున్న కుక్కలు, భోంచేస్తున్న కుక్కలు అన్నీ పనులు మానుకుని నాకోసం ఎదురుచూస్తాయి..నేను కనిపించగానే ఆర్.నారాయణ మూర్తి సినిమాలో సైడ్ డాన్సర్ల లాగా ఆవేశంతో నా మీదకు వస్తాయి...

మనుషుల్లో ఉనట్టు జాతి,ప్రాంత భేధాలు కుక్కల్లో ఉండవు..ఏ ఊరి కుక్కైన, ఏ జాతి కుక్కైన నన్ను చూసి మొరుగుతుంది, నా వెంట పడి నన్ను తరుముతుంది..

నేను పదో క్లాసులొ ఉండేప్పుడు శివప్రసాదరావు గారింటికి లెక్కల ట్యూషన్‌కెళ్ళేవాడిని.
"లెక్కలు, కుక్కలు ఒకటే రా...వాటిని చూసి నువ్వు భయపడి పరిగెడితే అవి నీ వెంటపడతాయి...వెనక్కు తిరిగి 'దీని సంగతేందో చూద్దాం తీ' అనుకుంటే తోక ముడుస్తాయి" ఆంటూండేవాడాయన...
దీనిని అమలు పరుద్దామని నేను ఒకసారి నా వెనకాల పడ్డ కుక్కల మీదకు రాయి విసిరాను. అవి ఆగిపొయ్యాయి....ఆ విజయ గర్వంలో పూనకమొచ్చినోడి లాగా ఓ రెండు నిముషాలు రాళ్ళు విసురుతూనే ఉన్నాను. ఆ కుక్కల మూక నా లాగా తిక్కది కాదు...నా చుట్టూ ఉండే రాళ్ళన్నీ అయిపొయ్యేంతవరకు వెయిట్ చేసాయి...ఆ తరువాత పక్కవీధిలో ఉండే మరో ఆరు కుక్కలకు SMS చేసి పిలిపించి, ఊరు దాటేంత వరకు నా వెంటబడ్డాయి. ఊరు దాటాక 4 X 400 మీటర్స్ రిలే రేసులో లాగా ఆ పక్క ఊరి కుక్కలకు నన్ను అప్పగించి తిరిగి వెళ్ళి పొయ్యాయి...

నాకెప్పుడో ఊహ తెలియని వయసులో ఇంజెక్షన్ వేయించారు మా ఇంట్లో వాళ్ళు. ఆ తరువాత నాకు 18 ఏళ్ళొచ్చేంతవరకు ఎప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్ళినా ఆ సిరంజిలో ఉండే మందు లోటాలో పోసుకుని తాగానే కానీ సూది పొడిపించుకోలేదు....

ఆ తరువతైనా సూది వేయించుకున్నది నాకేదో మైనారిటీ తీరిపొయ్యిందని కాదు.....నన్ను నా పధ్ధెనిమిదో ఏట కుక్క కరిచింది..అందుకు.

నేను మయూరా బేకరీ దగ్గర బటర్ బన్ తింటూ ఉంటే నా వెనకాల ఎవరో అమ్మాయి చిన్న కుక్క పిల్లను ఎత్తుకుని "చో చ్వీట్, చో క్యూట్ " అని దాన్ని ముద్దాడుతోంది..నేను దరిదాపుల్లోనే ఉన్నట్టు ఆ కుక్కపిల్ల పసిగట్టినట్టుంది..ఆ అమ్మాయి చేతుల్లోంచి కిందకు దూకి, గట్టిగా మొరుగుతూ నా కాళ్ళ మీదకు ఎగిరింది. అది గిల్లిందో, కరిచిందో తెలియదు కానీ బొటనవేలు చివరి నుండి రక్తమొచ్చింది.....

నా చుట్టూ నుంచున్న వాళ్ళలో ఒకడు (నాకు వాడెవడో కూడా తెలియదు) "గిల్లినా కొరికినా ఇంజెక్షన్లు తప్పవు" అని మొదలెట్టాడు. మిగతా వాళ్ళు కూడా ఆ డిస్కషన్ లో పాల్గొని యధాశక్తి నన్ను భయపెట్టరు. చివరకు "నువ్వు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోకపోతే బ్రతకటం కష్టం " అని తేల్చేసారు...

కుక్క కరిచిన 24 గంటల లోపు ఇంజెక్షన్ వేయించుకోవాలన్నారు జనాలు. ఆ రోజు రాత్రంతా ఆలోచించి అన్నాళ్ళ నా సూది బ్రహ్మచర్యం వదిలెయ్యాలని నిర్ణయించుకున్నాను...అది కూడా 'బొడ్డు చుట్టూ ఇంజెక్షన్ ' ల కాన్సెప్టు అప్పటికి పొయ్యింది కాబట్టి...లేకుంటే జీవితాంతం అలా మొరుగుతూ ఉండేవాడినేమో కానీ ఇంజెక్షన్లు మాత్రం వేయించుకునే వాడిని కాను.

నెలన్నర వ్యవధిలో 5 ఇంజెక్షన్లు వేయించుకున్నాను - కుడి చేతికి మూడు, ఎడమ చేతికి రెండు....అన్నీ అయ్యిన తరువాత పోలీసు స్టేషన్ కు వెళ్ళి ఆ డాక్టర్ మీద 'attempt to murder' కేసు పెట్టాను. అంత తక్కువ టైము లో అన్ని సార్లు ఇంజెక్షన్లు వేయించుకోవటం తో నాకు అవంటె 'భయం ' పొయ్యింది...'విపరీతమైన భయం ' మొదలయ్యింది.

ఈ కుక్కల భయం తో జీవితాంతం బ్రతకలేనని, నేను నాలుగేళ్ళ క్రితం ఒక Psychiatrist దగ్గరకు వెళ్ళాను. ఆయన "చూడు బాబూ..నీకు కుక్కలంటే భయం పోవాలంటే నువ్వు మొదట చెయ్యవలసింది వాటికి దగ్గరగా ఎక్కువ సమయం గడపటం...వాటితో ఆడుకో. ఒక్క సారి ఇది ప్రయత్నించి చూడు " అన్నాడు. ఆ సలహా ప్రకారమే నేను దాదాపు ఒక సంవత్సరం పాటు 'మోతీలాల్ తో చాల చనువుగా ఉన్నాను...వాడితో ఆడుకున్నాను (మోతీలాల్ అంటే కుక్క కాదు...మా ప్రొఫెస్సర్. వాడిలాంటి నీచుడు ఇంకోడు లేడు..వాడికి లేని కుక్క బుధ్ధి లేదు). ఎన్ని చేసినా నేను కుక్కలకు దగ్గర కాలేక పొయ్యాను. చివరి సెమిస్టరులో ఒక సారి మా హాస్టలు మెస్సులో టిఫిన్ చేద్దామనుకుంటుండగా కిటికీలోంచి ఒక కుక్క కనిపించింది. డాక్టర్ చెప్పింది గుర్తుకొచ్చి నా ప్లేటుతో సహా బయటకొచ్చాను. ఊహించినట్టే నన్ను చూసి అది మొరగటం మొదలుపెట్టింది. నా ప్లేటులొ ఉండే ఇడ్లీ దానికేసాను..అది పారిపొయ్యింది. మా మెస్సులో చేసె రబ్బర్ లాంటి ఇడ్లీలు మేమే అనుకున్నా...కుక్కలు కూడా తినవన్నమాట...చేసేదేమీ లేక ఆ ఇడ్లీలు మూల టేబుల్లొ కూర్చుని టిఫిన్ తింటున్నమోతీలాల్ గాడికిచ్చేసాను..

ఈ భయాన్ని నేను జయించలేను..నా పరిధుల్లో నెనుండటం మంచిది.

అందుకే అప్పటినుంచి నేను ఎవ్వరి ఇంటికి వెళ్ళినా వాళ్ళ గేట్ బయట "కుక్క లేదు..అజాగ్రత్త " అనే బోర్డు ఉంటే తప్ప లోపలకు వెళ్ళను.

మొన్న అడయార్ లో ఒక ఇల్లు ఖాళీగా ఉందంటే చూడటానికి వెళ్ళాను. ఇంటి గేటు మీద "కుక్కలు లేవ" న్నబోర్డు చూసి ఆనందంతో లోపలకు నడిచాను...గేటు తెరవబోతూ ఆ బోర్డు మళ్ళీ చూసాను...కింద చాక్పీసు తో సన్నటి అక్షరాలతో "దినకర్ ఉన్నాడు జాగ్రత్త " అని రాసుంది..ఇదేంటి ఇలా రాసుంది అని పక్కన్నే బొంగరాలు ఆడుకుంటున్న పిల్లల్ని అడిగితే విషయం తెలిసింది. దినకర్ అంటే ఆ ఇంటి ఓనర్..'మొరిగే కుక్క కరవదు ' అనే విషయాన్ని నలుగురికీ తెలపాలని మొరుగుతున్న ఒక వీధి కుక్క నోట్లో చెయ్యి పెట్టాడంట..20 నిముషాలపాటు ఆ చేతిని వదలకుండా పట్టుకుందంట ఆ కుక్క..ఆ ప్రయోగం ఫెయిల్ అయ్యిందన్న బాధలొ "కరిచే మనిషి మొరగడు " అనే కొత్త విషయాన్ని జనాలకు తెలియజెప్పటానికి.. తన ఇంట్లోకి ఎవరొస్తారా అని ఎదురు చూస్తున్నాడంట.

"కుక్క కాటుకు చెప్పు దెబ్బ " అనేది ఒక తప్పుడు సామెత. "కుక్క కాటుకు 5 ఇంజెక్షన్లు" అనేది కరెక్టు....ఈ సవరణ నా సామెతల పుస్తకంలో నేనెప్పుడో చేసుకున్నా..

28 comments:

suresh said...

మీ రాతలు నిఝ్ఝెంగా ’బ్లాగు’న్నాయి......ఇలానే రాస్తూ ఉండండి....ఎదో ఒక రోజు, మిమ్మల్ని దూల దర్శన్ లో శాంతి స్వరూప్ గారు interview చేస్తారు.

జ్యోతి said...

అమోఘంగా ఉంది! ఈ మధ్య మీ టపాల ఫ్రీక్వెన్సీ తగ్గింది. క్వాలిటీ ఏ మాత్రం తగ్గలేదు. ఈ వారం లో ఇంకో టపా రాయాలి మరి!

Manaswini said...

Mee motilal joke bagundandi..
baaga navvukunnanu

వెంకట రమణ said...

చాలా రోజుల తరువాత వ్రాసినా, ఎప్పటిలానే చాలా బాగా వ్రాశారు.

swathi said...

చాలా నవ్వొచ్చింది ఎప్పటిలాగానే!
thanks.

ప్రవీణ్ గార్లపాటి said...

మరో హాస్యపు జల్లు. భేషో...
అన్నట్టు నా బైకు ని చూసి కుక్కలు నాతో ఎన్నో సార్లు రేసులు పెట్టుకున్నాయి. అదృష్టం కొద్దీ ఎప్పుడూ నేనే గెలిచాను.

Ravi said...

chala bagundhi goutham..neeku kukkala bayam vundhani naku telavadey..mari dinakar proyogam palinchedela..ela ela..

Sreenivas Kishore said...

yeppatilaaganey mastugundi.brilliant.

radhika said...

మీ బ్లాగు,విహారి గారి బ్లాగు చదవడం మొదలు పెట్టాకా తెలుగు హాస్య సినిమాలు చూస్తే నవ్వు రావడం లేదు.ఎందుకిలా జరుగుతుంది చెప్మా?

Anonymous said...

ఎందుకో మీ స్థాయిలో లేదు అనిపిస్తుంది. SlapStick comedy లా వుంది.

కొత్త పాళీ said...

తేనెగూడులో మీది కొత్తటపా వచ్చిందని చూసి .. అఫీసులో లంచి టైములో చదవడం అంత మంచిది కాదని తెలిసీ కుతూహలం ఆపుకోలేక చదివేశా. తింటున్న భోజనం కొరబోయి చచ్చే చావయ్యింది. పోనీ నవ్వడం ఆపుదామంటే . అదీ సాధ్యం కాలేదు.

BTW రాధికా, తెలుగు సినిమా కామెడీతో పోల్చడం చాలా అన్యాయం. తోటరాముడికీ, తెలుగుసినిమా కామెడీకీ హస్తి మశకాంతరం ఉంది!

Pavan said...

chaalaa humourous ga undi. poddunney haayigaa navvukunnaa.keep up the good work.

కిరణ్ said...

addaragottesaarandi baabu...HAHAHA
:-D

ప్రసాద్ said...

పడి పడి నవ్వా మీ కుక్కల కథ చూసి.

అయినా కుక్కల చూసి పారిపోకుండా భయపడనట్లు నటిస్తూ నించోవాలి గానీ వాతిమీదికి రాళ్ళు విసిరితే అవి వూరకుంటాయా?

--ప్రసాద్
http://blog.charasala.com

రానారె said...

నా అభిమాన బ్లాగుల్లో "రెండురెళ్లు ఆరు" ముఖ్యమైనది.

నాగరాజా said...

రెండు రహస్యాలా? ఇంకో "రెళ్ళు" దొరకబడితె "ఆరు" ఉంటాయి!!! బాగుంది టపా!

Lalithaa Sravanthi Pochiraju said...

adirindandi
malli jhandhyaala cinema choosinattu undi

Anonymous said...

mama .. nenu chandu(chandra abau reddy) kathaluuu bagaunnayi ra... nenu kooda kathaloo radhamani anukuntunna ... ami ayina salaha isthavaaaaa... :-)

Moyin said...

నేను ఇ బ్లాగు ప్రపంచానికి కొంచం కొత్త.మీ వర్ననా సైలి చాల బాగా నచింది.I am learning to write.

Ravi Kiranam said...

మీ శునక పురణానికి హాట్స్ ఆఫ్. ఈ శునక పురాణాన్ని సీరియల్ గా కూడ రాయచ్చు మీరు. మీకు లానే నాకూ శునకాలను చూస్తే వెన్ను నుండి చలి మొదలవుతుంది.

Anand said...

kekaaaaaaa

Ravi Kanth said...

ikkadaki ravadam ide first time....
chaala chaala bavunnayi posts anni..

Anonymous said...

kummindi .. waitin for next one.

Oka anandudu.. said...

mee kingfisher story chala chala bagundi.. asalu office lo mee blog oka prabhanjanamaindi.. vipareetamga taluchukoni navvukuntunnamu... ila rastuu vundandi.. all the best DSG.. oka jandhyala cinemanoo.... vamsi cinemano choostunnattu vuntundi mee topics chaduvutunte..

Yogi said...

Baagundi DSG...........
Venna Bun tintunna mimmalni ventapadi karichina Kukka pillani pattukunna Ammayi ela spandinchindo cheppaledu........
Akkada Sympathy tho oka story jarigindemo ani xpect chesaa.......

Yogi said...

naaku picha picha ga navvu vachindi eppudante, Kukka lu kuda tinani aa Rubber idli lu MotiLal ki vesaaru kadaaa...........Appudu...........

Anonymous said...

em jarugutundi paina...??
wats happening...??

Sudha said...

ఈ అనానిమస్సేంటండీ...పిచ్చి కుక్కలాగ బ్లాగుని కరిచి కరిచి వదిలిపెడుతున్నాడూ. గౌతమ్........ఎక్కడికి పారేపోయారూ...నిఝ్ంగా భయమే...సే(చెప్పండీ)