Wednesday, June 6, 2007

నేను - బినీతా - చంద్రబాబు రెడ్డి

మొన్న ఒక రోజు ఆఫీసులో బిజీగా పని చేసుకుంటున్నట్టు డ్రామా ఆడుతుండగా ఒక ఫోను వచ్చింది...బెంగళూరు లాండ్లైన్ నంబరు..

నేను - హలో

అవతలి వ్యక్తి - హలో...నేను రా

నేను - ఇవతల కూడా 'నేనే' మాట్లాడేది...ఎవరు మీరు..

అవతలి వ్యక్తి - నేను రా...నీ ఎంకమ్మా..

నేను - చెప్పండి ఎంకమ్మ గారూ

అవతలి వ్యక్తి - ఎదవా...నేను దినకర్ రా

నేను - ఓ...నువ్వా....ఐతే రాంగ్ నంబర్

దినకర్ - చెప్పేది విను...ఇవ్వాళ మా ఆఫీసులో బినీతా చేరింది రా...మా టీం లోనే. ఇన్నాళ్ళు నా హీరోఇజాన్ని ఎవరిమీదా ప్రదర్శించాలా అని ఎదురుచూస్తున్నా..ఇక చూడు...వీలుంటే ఈ వారం బెంగళూరికి రా. నేనూ, బినీతా ఏ రెస్టారెంటులో నో..సినిమా హాలు లోనో కనిపిస్తాము. ఇందాకే చందు గాడికి కూడా ఫొను చేసి చెప్పాను...

ఫొను కట్ అయ్యింది.....

'బినీతా ' అంటే నా ఇంజనీరింగ్ లో క్లాసుమేటు. 'చందు ' అంటే కోట్ల చంద్రబాబు రెడ్డి - నా ఇంజనీరింగ్ ఫ్రెండు....ఒక్కసారిగా నా జీవితం లోని కొన్ని చేదు సంఘటనలు గుర్తుకొచ్చాయి...


*******************************


అవి నేను కొత్తగా ఇంజనీరింగ్ లో చేరిన రోజులు. మాకు పనికిమాలిన 'ప్రాక్టికల్స్' బోలెడు ఉండేవి. లాబు క్లాసుల్లో స్టూడెంట్స్ ను గ్రూపులుగా విభజించేవాళ్ళు. ఒక గ్రూపు కు నలుగురు. మా మొదటి సెమిస్టర్ లో నోటీసు బోర్డు లో ఏ గ్రూపు లో ఎవరెవ్వరు ఉంటారో లిస్టు పెట్టారు...నేను మూడో గ్రూపు. నా గ్రూపు లో నెనొక్కడే అబ్బాయిని..మిగతా ముగ్గురూ అమ్మాయిలు - భార్గవి, బిందు, బినీతా.
ఆ రొజు 'స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ ' క్లాసు అవ్వంగానే ముగ్గురమ్మాయిలూ నన్ను వెతుక్కుంటూ వచ్చి "మనమంతా ఒకే లాబ్ బ్యాచ్" అని చెప్పారు. ఓ రెణ్ణిముషాల పరస్పర పరిచయ కార్యక్రమం కూడా జరిగింది.

ఈ విషయం తెలియంగానే మా కాలేజీ లో తెలుగు వాళ్ళంతా కలిసి 'మయూరా'లో పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసారు..ఏడెనిమిదేళ్ళుగా అదే కాలేజి లో ఇంజనీరింగ్ డిగ్రీ కోసం పోరాడుతున్న మా పూర్వీకులందరూ వచ్చారు...నాకు 'తెలుగు తేజం' అనే బిరుదిచ్చి ఒక పెద్ద పూలదండ వేసారు.

చివరగా మా సూపర్ సేనియర్ జోషి మాట్లాడుతూ " 'తెలుగు అబ్బాయిలతో అమ్మాయిలు మాట్లాడరు ' అన్న అపవాదుకు ఈ రోజుతో తెర పడబోతోంది. ఇన్నాళ్ళుగా మేమెవ్వరూ సాధించలేనిది మన వాడు సాధించాడు " అన్నాడు...ముందు వరసలో కూర్చున్న గోపాల క్రిష్ణ ఆనంద భాష్పాలతో "నీలాంటి వాడు బాచుకు ఒక్కడున్నా చాలు రా...మేమంతా గర్వంగా తలెత్తుకుని తిరుగుతాము " అన్నాడు.

సరే..'ఫంక్షన్ ' అనే సాకు అయిపొయ్యింది కాబట్టీ అసలు కార్యక్రమం మొదలయ్యింది - మందు పార్టీ..ఎవడికి తోచింది వాడు తాగాడు..అక్కడుండే వాళ్ళలో సగానికి పైగా పడిపొయ్యారు....

"ఈ రోజు మీరు తాగినదానికి బిల్లు గౌతం గాడు కడతాడు" అని చంద్ర బాబు రెడ్డి గాడు గట్టిగా అనౌన్సు చేసాడు. ఆ మాట వినపడటం తో కింద పడిపొయ్యిన వాళ్ళంతా లేచి మొహాలు కడుక్కుని ఫ్రెష్ అయ్యి మళ్ళీ తాగటం మొదలు పెట్టారు. 'ఒక ప్రాణి ఇంత ద్రవ పదార్థం తాగగలదా " అని తిమింగలాలు కూడా అనుమానించే లాగా తాగాడు ప్రతి ఒక్కడు..మూడు నాలుగు గంటలు అలా తాగాక వాళ్ళందరిని ఒక ఇసక లారీలోకి ఎక్కించి హాస్టల్ కు పార్సెల్ చేసాము...

సీనియర్ల ప్రసంగాలు బాగా ఇన్స్పైర్ చేసాయో ఏమో,ఆ రోజు రాత్రి పడుకున్నప్పుడు ఏవేవో ఆలోచనలు...మరుసటి రోజు నేను లాబ్ కు వెళ్ళగానే నా బాచీ అమ్మాయిలు "వావ్....వాట్ ఎ మాన్" అని అరిచి నన్ను వాటేసుకున్నట్టు...నన్నొక కుర్చీ లో కూర్చో పెట్టి ద్రాక్షపళ్ళు తినిపిస్తూ జ్యూసులు తాగించినట్టు...ఇవన్నీ చూసిన మా ప్రొఫెసర్లు నన్ను మెచ్చుకుని అప్పటి నుంచి ఫైనల్ ఇయర్ దాకా జరిగే అన్ని పరీక్షలలో పాస్ చేసేసినట్టు.......చక్కటి ఊహలు.

నా ముగ్గురు లాబ్ పార్ట్నర్లలో బినీతా కూడ ఉందని ఇందాకే చెప్పాను గా..ఆ అమ్మాయి మా కాలేజికి మాధురీ దీక్షిత్ లాంటిది. పుస్తకాల రంగూ రుచి వాసన తెలియని బీహారబ్బాయిల నుంచి సోడా బుడ్డి బెంగాలీల దాక కళ్ళూ, కళ్ళద్దాలూ ఆర్పకుండా చూసే వారు ఆ అమ్మాయి అటుగా వెళ్తుంటే....అలాంటిది, వారానికి మూడు సార్లు అనిల్ కపూర్ లా ఆ అమ్మాయి పక్కన్నే నుంచొనే చాన్సు కొట్టేసా....

మా హాస్టల్ లో మామూలుగా పొద్దున తొమ్మిదింటిలోపు ఎవ్వడూ స్నానాలు చెయ్యడు..క్లాసు ఏ ఎనిమిది కో ఎనిమిదిన్నరకో ఉంటే ఆ రోజొంతా స్నానం ఉండదు..అలాంటిది నేను పొద్దున్నే ఏడింటికే నిద్ర లేచి, స్నానం చేసి, హాస్టల్ ముందు ముగ్గేసి..లాబ్ కు బయలుదేరాను...

నేను వెళ్ళేటప్పటికే మా లేడీస్ ముగ్గురూ వచ్చేసారు.."హాయ్.." అన్నాను..వాళ్ళు కూడా హాయ్ లు చెప్పి షేక్ హాండ్ ఇచ్చారు...షేక్ హాండ్!....ఈ విషయం మా వాళ్ళకు తెలిస్తే నాకు 'భారత రత్న ' ఇచ్చి సత్కరిస్తారు....ఇంతలో బినీతా "మ్మ్...నువ్వేసుకున్న డియోడరెంట్ భలే వాసనొస్తోంది...ఏ డియోడరెంట్ వాడతావెంటి?" అని అడిగింది...లాబ్ లో మూలకు ఉన్న టేబుల్ పక్కన నుంచున్న దినకర్ "నాది..నాది...ఆ డియోడరెంట్ నాది...ఇప్పుడే రూము కెళ్ళి పట్టుకొస్తాను " అని పరిగెట్టాడు...

మా ప్రొఫెసర్ రాంగానే అందరము వెళ్ళి మా టేబుళ్ళ ముందు నుంచున్నాము...మాకొక ఎక్స్పెరిమెంటు ఇచ్చి, వెళ్ళి దానికి కావలసిన ఎక్విప్మెంట్ తెచ్చుకొమన్నాడు.... ముగ్గురమ్మాయిలూ నా వైపు చూసి " గౌతం...pleeeeeaaasssssseeeeee...ఆ ఎక్విప్మెంట్ తీసుకు రావా? " అని అడిగారు. వెంటనే నేను మోకాళ్ళ దాకా పాంటు మడతెట్టుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళి, కావలసిన వన్నీ పట్టుకొచ్చాను....అప్పుడు మడతెట్టిన పాంటు నాలుగేళ్ళదాకా కిందకు దించలా...ఎప్పుడు ఏ వయర్లు కావాలన్నా...ఏ మీటర్లు తేవాలన్నా బినీతా నా వైపు చూసి "pleeeeeaaasssseeeeee... " అంటుంది...మొదట ఓ నాలుగైదు సార్లు ఎదో మనల్ని హీరో గా భావించి తెమ్మంటున్నారనుకున్నా. కానీ ప్రతీ సారీ ఇలా జరుగుతుండటం తో మెల్లగా నా కళ్ళు తెరుచుకున్నాయి....

అంత చాకిరీ చేసినా కూడా ఎక్స్పెరిమెంటు చేసెప్పుడు నన్ను ఎక్విప్మెంట్ ముట్ట నిచ్చే వాళ్ళు కాదు...ఒక్క సర్క్యూటుకు కూడా కనెక్షన్లు ఎలా పెట్టాలో తెలిసేది కాదు నాకు..ముగ్గురూ తమలో తాము రహస్యంగా ఎక్స్పెరిమెంటు చేసేసుకుని, వీలుంటే నా మీద రెండు మూడు జోకులేసుకుని (నాకు వినబడేలా), టైం అయిపొంగానే మళ్ళీ నన్ను చూసి "ఇవన్నీ తిరిగి లోపల పెట్టెయ్యవా pleeeeeaaasssseeeeee..." అనేవాళ్ళు.....

ఈ విషయాలేవీ హాస్టల్ లో జనాలకు ఎవ్వరికీ తెలియదు. అమ్మాయిలతో మాట్లాడటానికి కిటుకులు నేర్పమని నా దగ్గరకు రోజుకొకడు వచ్చేవాడు...నిజం బయటకు చెప్పెస్తే జరిగే పర్యవసానాలు బాగా తెలుసు కాబట్టి ఏవొ అరవ,మలయాళ సినిమాల్లొ హీరోలు హీరోయిన్ల వెంటబడేప్పుడు వాడె టెక్నిక్కులను తర్జుమా చేసి సలహాలుగా మా వాళ్ళకు పడేసే వాణ్ణి.

ఇలాంటి తరుణం లో ఒకసారి నా పుట్టిన రోజొచ్చింది....లాబ్ లో నాపాటికి నేను వైర్లు, కుర్చీలూ మోసుకుని తిరుగుతుండగా..చంద్ర బాబు రెడ్డి గాడు మా లాబ్ కు వచ్చి , తలుపు దగ్గర నుంచి గట్టిగా " హాపీ బర్త్ డే రా గౌతం" అని అరిచి వెళ్ళిపొయ్యాడు..అప్పటివరకు చప్రాసి పనికి తప్ప నా తో ఎప్పుడూ మాట్లాడని అమ్మాయిలు ముగ్గురూ నా దగ్గరకు వచ్చి ఒకటికి రెండు సార్లు విష్ చేసి " ఇవ్వాళ సాయంకాలం ట్రీట్ ఇవ్వాల్సిందే " అన్నారు..నేను ఒప్పుకోలేదు...బినీతా నా దగ్గరకు వచ్ఛి పక్కన్నే పడి ఉన్న వైర్ ముక్క తీసుకుని నన్ను చిన్నగా గోకి "pleeeeeaaasssseeeeee..." అనింది..........తరువాతి సీన్ లో అందరమూ ఐస్క్రీం పార్లర్ లో ఉన్నాము...

ఆ వచ్చేటప్పుడు తన రూమ్మేట్స్ ను కూడా వెంటేసుకొచ్చింది బినీతా.....ఐస్క్రీం లు తినింది, STD బూత్ లో ఇంటికి ఫోన్ చేసుకుంది....పక్క కొట్లో సబ్బులు, గూడ్నైట్ మాట్లు, చీపురు కట్టలు..ఇలా వాళ్ళ ఇంటికి కావలసిన సామన్లన్నీ కొనింది బినీతా డార్లింగ్.............అన్నింటికీ బిల్లు తనే కూడా కట్టింది (ఈ ఆఖరి వాక్యం నిజమని నమ్మిన వాళ్ళు....... డాక్టరు దగ్గరకు వెళ్ళవలసిందిగా ప్రార్థన).

చివరగా అక్కడున్న అందరూ కలిసి నాకొక రెనాల్డ్స్ పెన్ను గిఫ్టుగా ఇచ్చారు...

నేను ఐస్క్రీం పార్లర్ లో అమ్మాయిలతో కూర్చుని ఉండటం చూసిన చంద్ర బాబు రెడ్డీ గాడు హ్సస్టల్ కు వెళ్ళి అక్కడ అందరికీ "అమ్మాయిలంతా కలిసి గౌతం గాడికి ట్రీట్ ఇచ్చార్రో " అని దండోర వేసాడు....ఆ రోజు రాత్రికి మాళ్ళీ ఓ పెద్ద సమావేసం ఏర్పాటు చేసి నాకు 'తెలుగు వజ్రం ' అని ప్రమోషన్ ఇచ్చి, మళ్ళీ తాగి తందనాలాడారు.........బిల్లు నేను కట్ట లేదు (ఈ ఆఖరి వాక్యం నిజమని నమ్మిన వాళ్ళు........ఏంటి డాక్టర్ ఊరిలో లేడా??? )

ఇండియా టీం క్రికెట్ మాచులో గెలిచినప్పుడు...మా యూనివర్సిటీ లో రిజల్ట్ బాగా వచ్చినప్పుడు.. అటల్ బిహారీ వాజ్ పాయి బాత్రూము లో కింద పడినప్పుడు....ఇలా మన దేశం లో ఏమి జరిగినా...చంద్ర బాబు రెడ్డి గాడు అందరి ముందు నన్నొచ్చి అభినందించటం...బినీతా నన్ను ట్రీట్ అడగటం....మా వాళ్ళు నాకొక కొత్త బిరుదివ్వటం.....నేను మా ఇంట్లో "special fee" అని చెప్పి డబ్బు తెప్పించుకోవటం.....ఎన్నో సార్లు జరిగాయి.....


*********************


వెంటనే బెంగళూరు బయలుదేరాను...ఎలాగైనా దినకర్ ను కాపాడదామని. బస్టాండు నుంచి నేరుగా దినకర్ ఆఫీసుకు వెళ్ళాను..కాబిన్ లోకి వెళ్ళ బోతుండగా అక్కడ దినకర్, బినీతా కనిపించారు...తలుపు దగ్గర దాక్కుని వాళ్ళ మాటలు విన్నాను.

"బాగున్నావా బినీతా " అన్నాడు దినకర్...

బినీతా "బాగున్నాను దినకర్....ఔనూ...ఏదో మంచి వాసనొస్తోంది.. ఎక్కడి నుంచి?" అని అడింగింది

వెంటనే మా తింగరోడు తన చంక పైకి లేపి "ఇదిగో...నీకిష్టమైన డియోడరెంట్ వేసుకొచ్చాను " అన్నాడు..

ఈ లోపు ఆఫీస్ బాయ్ ఒక పెద్ద బొకే తీసుకొచ్చాడు..

"ఏంటిది?" - అడిగాడు దినకర్...

"ఎవరో చందు అనే అతను మీకు పంపాడు సార్...ఇవ్వాళ మీ పుట్టిన రోజంట కదా...హాపీ బర్త్ డే సార్ " అని ఆ బొకే ఇచ్చి వెళ్ళి పొయ్యాడు..

దినకర్ "అదేంటి...ఇవ్వాళ నా పుట్టిన రోజు కాదే..." అని ఇంకా ఏదో అనబోతుండగా..... బినీతా దినకర్ చెయ్యి పట్టుకుని " హాపీ బర్త్ డే దినకర్...ఇవ్వాళ ఆఫీసు అవ్వంగానే ట్రీట్ ఇవ్వాలి" అంది.....

మళ్ళీ తనే మాట్లాడుతూ "దినకర్...దినకర్...నాకు ఫాస్ట్ గా టైప్ చెయ్యటం రాదు...ఈ రెండు డాక్యుమెంట్స్ టైప్ చేసి పెట్టవా pleeeeeaaasssseeeeee..." అంది.

నేను అక్కడి నుండి బయటకొచ్చేసాను....పరిస్థితి చెయ్యిజారి పొయ్యింది...నేనేమీ చెయ్యలేను....

కానీ లోక కల్యాణం కోసం ఒక చిన్న ప్రకటన మాత్రం ఇవ్వగలను:

అమెరికా లో ఉండే ఆంధ్రుల్లారా....న్యూ జర్సీ లో 'కోట్ల చంద్ర బాబు రెడ్డి ' అనే ఒక దొంగ వెధవ ఉంటాడు...వాడు గానీ మీకు కనిపిస్తే...దగ్గర లో ఉండే పోలీసు స్టేషన్ కు తీసుకెళ్ళి "వీడు, ఒసామా బిన్ లాడెన్ కలిసి బీడీలు కాల్చేవాళ్ళు" అని చెప్పండి..చాలు....