Thursday, October 18, 2007

ఆ నాలుగు గంటలు..

మన దేశం లో ఎక్కడైనా పార్టీలు, గెట్ టుగెదర్లు జరిగేటప్పుడు జనాలు మూడు గ్రూపులుగా విడిపోయి మాట్లాడుకుంటుంటారు.

మొదటి గ్రూపు - సినిమాల గురించో, క్రికెట్ గురించో మాట్లాడుకునేవాళ్ళు

మిగతా రెండు గ్రూపుల వాళ్ళు ఏమి మాట్లడుకుంటారో నాకు తెలియదు...ఎందుకంటే నేను ప్రతీసారీ ఖచ్చితంగా ఆ మొదటి గ్రూపులోనే ఉంటాను...

సెప్టెంబరు నెలలో T20 ప్రపంచకప్పు జరిగినన్ని రోజులు నేను ఎక్కడికెళ్ళినా జనాలంతా ఒకే గ్రూపులో ఉండేవాళ్ళు...మొదటి గ్రూపు!

T20 కప్పు ఫైనల్ జరిగిన ఇన్ని రోజులకు ఈ టపా పోస్టు చెయ్యటానికి ఒక కారణం ఉంది........ఈ టపా రాసింది ఇవ్వాళే.

ప్రస్తుతం ఆస్ట్రేలియా తో జరుగుతున్న సేరీస్ లో మనవాళ్ళు చితగ్గొట్టించుకుంటున్నా పరవాలేదు...ఇక నుంచి మన వాళ్ళు ఆడే ప్రతీ సీరీసూ ఓడిపొయ్యినా పరవాలేదు...ఈ T20 కప్పు చాలు...1983 లో ఇండియా ప్రపంచ కప్పు గెలిచినప్పుడు నేను చూడలేదు...మరోసారి అటువంటి మధుర క్షణాలు ఇక రావేమో అని అనుకున్నా...వచ్చాయి...ఈ గెలుపుకి బంగారు పూత - ఫైనల్ లో పాకిస్తాన్ పై విజయం....

కొంతమంది భారతీయ ప్రేక్షకులు గ్రౌండు మీద జరిగే ఏవో చిన్న చిన్న సంఘటనలను చూసి పాకిస్తాన్ క్రికెటర్లను ద్వేషిస్తుంటారు...నేను వాళ్ళలో ఒకడిని కాను.....

అసలు ప్రత్యేకమైన కారణాలేవీ లేకుండా.. పాకిస్తాన్ క్రికెటర్లను చూడగానే ద్వేషిస్తుంటారే కొంతమంది మూర్ఖులు...వాళ్ళలో ఒకడిని నేను..

-------------------

సెప్టెంబరు 24....టైము 2:30 అయ్యింది. 5:30 కు మ్యాచు మొదలు...మా ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళటానికి కనీసం నలభయ్యైదు నిముషాలు పడుతుంది. కాస్త పని మిగిలుంది..కానీ అది రేపొచ్చి చెయ్యొచ్చు..ఎలాగోలా తెగించి నా బాసు క్యాబిన్ కు వెళ్ళాను..."సార్..నాకు కడుపు నొప్పిగా ఉంది....ఇంటికెళ్తాను సార్..రేపు తెల్లవారుజామునే వచ్చి..."

"మ్యాచు ఐదున్నరకు కదయ్యా...ఇప్పటి నుంచే ఎందుకు డ్రామాలు...చస్తున్నాను నీతోటి...ఇందాక దినకర్ అని నీ ఫ్రెండు ఎవడో ఫోను చేసి "సార్ నాకు కడుపు నొప్పిగా ఉంది..మా వాడిని రెండున్నర కు వదిలెయ్యండి" అని అన్నాడు...కడుపు నొప్పేంటయ్యా స్కూలు పిల్లల్లాగా..వేరే సాకులే తోచలేదా మీకు...ఐదు గంటలకి ఒక్క నిముషం ముందైన నువ్వు నీ సీటు నుంచి కదిలావంటే...నిన్నేమీ చెయ్యను...నీ ఫ్రెండున్నాడే ఆ దినకర్...వాడి బాసుకు ఫోను చేసి మీ వాడి తిత్తి తీయిస్తాను " అని వార్నింగ్ ఇచ్చాడు..

నేను సరిగ్గా 4:58 కు నా సీటు నుంచి బయలుదేరాను....నా బాసు గాడికి కనపడేట్టు....

ఆఫీసు నుంచి బయటపడి ఆటోకోసం చూస్తున్నా....

నేను ఉద్యోగరిత్యా మూడు నెలల క్రితం మద్రాసు నుండి బెంగళూరుకు వచ్చి పడ్డా....ఈ మూడు నెలల్లో నేనొక ఈక్వేషన్ కనుగొన్నాను...

If

మద్రాసు ఆటోవాడు = నీచ్, కమీనా, కుత్త్తా..

Then

బెంగళూరు ఆటోవాడు = ఇద్దరు మద్రాసు ఆటోవాళ్ళు


బెంగళూరు ఆటో వాళ్ళు మనము ఏ ఏరియాకైతే వెళ్ళాలంటామో.. సరిగ్గా అదే ఏరియా కు రాము అంటారు...కారణం చెప్పరు....ఒక వేళ వచ్చినా (ఆటో మనమే నడుపుతాము అని ఒప్పించాక) 'మీటర్ మీద ఎక్స్ట్రా' అంటారు...చీకటి పడినా,వర్షం వస్తున్నా...వచేట్టు సూచనలున్నా, ట్రాఫిక్కు ఎక్కువగా ఉన్నా, మనకు మీసాలు లేక పొయ్యినా మీటర్ మీద ఓ 2000 రూపాయలు అడుగుతారు...

ఒక పావుగంట పొరాడాక ఆటో దొరికింది...నేను ఇల్లు చేరేప్పటికి ఖచ్చితంగా మ్యాచ్ మొదలయ్యుంటుంది....ఆ బాధలో నాకు తెలియకుండా కంట్లో నీళ్ళొచ్చాయి...ఆటో వాడు నేను ఏడవటం చూసి..."బాధపడకండి సార్...ఈ అమ్మాయి కాకపొతే ఇంకో అమ్మాయి " అన్నాడు....వాడికి విషయమేంటో చెబుదామనుకుంటుండగా ఫోను మోగింది....నీల్ విజయ్ గాడు.....

"ఏరా మ్యాచ్ చూస్తున్నావా??" అని అడిగాడు...

"లేదు రా..దారి లో ఉన్నా..ఎమయ్యింది?"

"సెహ్వాగ్ గాడు...."

ఆ తరువాత మాట వినపడలేదు..

"హలో...సెహ్వాగ్ గాడు ఏంట్రా....చెప్పు "

ఫోను కట్ అయ్యింది...

నాకు ఏ క్షణం లో నైనా గుండె పోటు రావచ్చు... అంత ఖంగారు గా ఉంది....సెహ్వాగ్ ఫోర్ కొట్టాడా..అవుట్ అయ్యాడా (ఛీ ఛీ.. అపశకునం)...ఏమీ అర్థం కావట్లేదు.....

మళ్ళీ నీల్ గాడికి ప్రయత్నిస్తుంటే లైను తగలట్లేదు....

ఇంతలో ఆటో వాడు "ఏంటి సార్ సెహ్వాగ్ గాడు అవుటయ్యాడా...వాడు టీం లో ఉంటే మనము ఓడిపోవటం ఖాయం " అన్నాడు..

టెన్షన్ తట్టుకోలేక కార్తీక్ గాడికి ఫోన్ చేసాను...

(సినిమాల్లో ఫోన్ లో మాట్లాడేటప్పుడు జరిగే సంభాషణ ప్రేక్షకులకు తెలియాటానికి అవతలి వ్యక్తి మాట్లాడే ప్రతి మాటా రెపీట్ చేసినట్టు.. మా ఆటో వాడి కోసం నేను కూడా చేసాను)

ట్రింగ్...ట్రింగ్

"ఏంటీ.. హలో నా? ఏంటీ.. ఇంకా మ్యాచ్ మొదలవ్వలేదా? ఏంటీ... సెహ్వాగ్ టీం లో లేడా? ఏంటీ.. 'నీ యబ్బ ' నా? ఏంటీ.. ఫోన్ పెట్టేస్తావా?"

విషయం మొత్తం ఆటో వాడికి అర్థమయిపొయ్యింది...

"సెహ్వాగ్ గాడు టీం లో లేడా సార్...వాడు టీం లో లేకపోతే మనము ఓడిపోవటం ఖాయం " అన్నాడు...

వీడి మీటర్ పడిపోనూ...ఆ కంపు నోట్లోంచి ఒక్క మంచి మాటా రాదే.....

బెంగళూరు ట్రాఫిక్కుకు ఒక ప్రత్యేకత ఉంది...సిగ్నల్ పడో, ఏ స్కూటర్ వాడు కార్ వెనకాల గుద్దో..ఒక రెండు మూడు బళ్ళు ఆగాయనుకోండి....వెంటనే ఏవో అద్రుశ్య శక్తులు ప్రత్యక్షమయ్యి ఆ రోడ్డుకు అడ్డంగా ఒక పెద్ద గోడ కట్టేస్తాయి....అంతే...ఒక ఐదారు గంటల వరకు ట్రాఫిక్కు ఒక్క అంగుళం కూడా కదలదు....

మ్యాచ్ తప్పకుండా మొదలయ్యుంటుంది....

ఎవరికి ఫోన్ చేస్తే ఏ దుర్వార్త చెబుతారోనని ఎవ్వరికీ చెయ్యట్లేదు...కాల్ వస్తే కట్ చెసేస్తున్నా...sms లు చూడట్లేదు......

ఈ ట్రాఫిక్కు లో మా ఆటో గంటకు తొమ్మిది కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ లా దూసుకెళ్తోంది...కరెక్టుగా ఒక బట్టల కొట్టు పక్కన మళ్ళీ ఆగింది...అక్కడ కొట్టు తలుపు చివర్న నుంచొని ఒక పది, పదిహేనుగురు మ్యాచ్ చూస్తున్నారు...ఒక్కసారిగా అందరూ గట్టిగా అరిచారు...నా వల్ల కాలేదు...ఆటో లోంచి తల బయటకు పెట్టి "ఏమయ్యింది గురూ " అని అడిగాను..వాళ్ళలో నా మాట వినపడ్డ వాడెవడో "యూసఫ్ పఠాన్ సిక్సర్ " అన్నాడు........చ్చీ...నా మీద నాకే అస్సహ్యమేసింది...ఎందుకీ చదువులు...ఎందుకీ ఉద్యోగాలు..మన వాళ్ళు సిక్సర్లు కొడుతుంటే నేను ఇక్కడ ఆటో లో FM రేడియో వింటున్నా.....

రెండు నిముషాలు ప్రయత్నించాక రవి గాడికి ఫోన్ తగిలింది.."ఏరా యూసఫ్ పఠాన్ సిక్స్ కొట్టాడంట గా "...అని అడిగాను...."ఆ...కొట్టాడు...అవుట్ కాక ముందు " అన్నాడు............బాధ తో నా గొంతు కూరుకు పొయ్యింది...మాట రావట్లేదు...ఫోన్ కట్ చేసి, పేస్ట్ చేసాను.........

ఇంకొ ఇరవై నిముషాలు ఈ నరకయాతన అనుభవిస్తూ ప్రాణాలు ఆటో లో పెట్టుకుని ప్రయాణించాక రూముకు చేరుకున్నాను...అక్కడ అప్పటికే మా వాళ్ళు బోలెడు మంది కూర్చుని చూస్తున్నారు...ఒక పెద్ద కార్టన్ లో మందు సీసాలు కూడా ఉన్నాయి....గెలిస్తే ఆనందంలో, ఓడిపోతే (ఛీ ఛీ అపశకునం) బాధలో తాగుదామని తెచ్చారంట......దేవుడిని తలచుకుని కుడికాలు లోపల పెట్టాను...ఒక్క వికెటే పడింది....

"తరువాతి బాలు వుంటాడా ఊడతాడా " అని బాలు బాలుకూ గుండెపోటు తెచ్చుకోవటం ఆరోగ్యానికి అంత మంచిది కాదని..నా రూములోకెళ్ళి DVD పెట్టి గూబలు గుభేల్ మనేలా వాల్యూం పెట్టాను....పెట్టింది "ఖతర్నాక్" సినిమా కావటం తో స్కోరు చెప్పటానికి కూడా నా ఫ్రెండ్స్ ఎవ్వరూ నా రూము దరిదాపుల్లోకి రావటానికి సాహసించలేదు..

ఒక గంట సేపు ఆ సినిమా చూసాక...అటువంటి సినిమా తీసిన ఆ డైరెక్టర్ కు కళ్ళూ, ముక్కూ, చెవులు పని చెయ్యకుండా చేతబడి చేసి....రూము బయటకు వచ్చాను....

అప్పుడు తెలిసింది.....మన వాళ్ళు 157 చేసారని..ఆ స్కోరు పాకిస్తాన్ వాళ్ళకు చపాతీల్లోకి నంచుకోవటానికి కూడా సరిపోదు....మ్యాచు చెయ్యి జారిపొయ్యినట్టే.....

మన వాళ్ళు ఓడిపోతే అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోదామని ఆ రోజు పొద్దున్నే నిర్ణయించుకుని ఆఫీసు లో అందరికీ చెప్పేసాను....ఈ స్కోరు చూసాక ....ఫ్రెండ్స్ అందరితో ఆటోగ్రాఫు పుస్తకం లో చెత్తా చెదారం రాయించుకుని హిమాలయా ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోవటం మొదలుపెట్టాను....అసలే వచ్చే నెలలో అక్కడ 'Miss Himalaya' పోటీలు జరగబోతున్నాయి...అందులో ఒక రౌండులో ఆడ సన్యాసినిలు కాషాయం స్విం సూట్లలో తిరుగుతారని ఒక పుకారు ఉంది...ఇప్పటి నుండే ప్రయత్నించకపోతే ఇల్లు దొరకటం కష్టం.....హిమాలయాల్లో ఒక టూ బెడ్రూం అపార్ట్మెంటులో సన్యసిస్తున్న మా ఇంటి ఓనర్ కొడుకుకి ఫోన్ చేసి నాకు ఒక ఇల్లు, కావలసిన కాస్ట్యూంస్ కాస్త చూసిపెట్టమని చెప్పాను.....

ఒక వైపు నా ఏర్పాట్లు జరుగుతూంటే..మరోవైపు పాకిస్తాన్ వాళ్ళ బాటింగ్ మొదలయ్యింది...

మళ్ళీ నా రూములోకి వెళ్ళిపొయ్యాను..."ఖతర్నాక్" సినిమా పెట్టాను....

మధ్యమధ్యలో హాల్లోంచి మా వాళ్ళ అరుపులు వినిపిస్తున్నాయి...పాకిస్తాన్ వాళ్ళ వికెట్లు బాగానే పడుతున్నట్టున్నాయి...ఇక లాభం లేదని నేను కూడా మ్యాచ్ చూద్దామని TV ముందు కూర్చున్నా....

తరువాతి బాట్స్మన్ యూనిస్ ఖాన్...పాడ్లు కట్టుకుంటున్నాడు...పక్కన్నే బెంచి మీద కూర్చున్న అజీత్ అగార్కర్ యూనిస్ ఖాన్ దగ్గరకు వచ్చి ..."ఆవేశంగా కొట్టటానికి పొయ్యి అనవసరంగా అవుట్ కాకు...నువ్వొక 10 ఓవర్లు ఉన్నావనుకో...అప్పుడు నేను బౌలింగ్ వేస్తాను..ఆలోచించుకో " ...కుడి కాలి బొటన వేలుతో నేల మీద గోకుతూ...పెదవి కొరుకుతూ అన్నాడు.......యూనిస్ ఖాన్ కు ఆశ కలిగింది...అగార్కర్ గాడు బౌలింగ్ వేస్తె ఒక్కొక్క బాల్ కు రెండు సిక్సర్లు కొట్టొచ్చు....పైగా..బాట్స్మన్ కాస్త అలసిపొతే...తిరిగి పుంజుకునేంత వరకు..వైడ్లు, నోబాళ్ళు వేస్తూ ఉంటాడు...అమ్మో ..ఈ అవకాశం వదలుకోరాదు " అని అనుకొని.....వెళ్ళి ఒక ఐదు ఓవర్లు అవుట్ కాకుండా...రన్లు కొట్టకుండా జాగ్రత్తగా ఆడాడు....స్టేడియం లో ఉన్న భారతీయ సపోర్టర్లు యూనిస్ ఖాన్ కటౌట్ కు పాలాభిషేకం చెస్తుంటే...ఏదో తేడా ఉందని అర్థమయ్యింది వాడికి....వెంటనే ధోనీ దగ్గరకు వెళ్ళి..."అగార్కర్ కు ఎప్పుడిస్తావురా బౌలింగు " అని అడిగాడు..."ఇంకో పది ఓవర్ల తరువాత " అన్నాడు...యూనిస్ ఖాన్ గాడికి కాలింది...మ్యాచ్ లో మిగిలుందే 8 ఓవర్లు...జరిగిన మోసం అర్థమయిపొయ్యింది..అసలు అగార్కర్ టీం లోనే లేడు ఆ రోజు..ఆ బాధ లో అవుటైపోయి...తెలుగు సినిమాలో సెకండు హీరొయిన్ లాగా అస్తమిస్తున్న సూర్యుడి వైపు నడుచుకుంటూ వెళ్ళిపొయ్యాడు....

*********
అజీత్ అగార్కర్ ప్రస్తావన వచ్చింది కాబట్టీ ఒక చిన్న సర్వే.....

అజీత్ అగార్కర్ మంచి బౌలర్ అని అనుకునే వాళ్ళంతా చేతులు పైకి లేపండి (ఎవడా మూల చెయ్యి లేపింది...రే అజీత్ అగార్కర్ గా...దించరా చెయ్యి)..
*********

ఒక పక్క వికెట్లు పడిపోతున్నాయి...నా హిమాలయా ట్రిప్పు కాన్సల్ అయ్యేలాగే ఉంది....

4 ఒవర్లు ఉన్నాయి...54 రన్లు కొట్టాలి...3 వికెట్లు మిగిలున్నాయి....బెంగళూరులో బాణాసంచా కాలవటం మొదలు పెట్టారు జనాలు...ఇక్కడ మా వాళ్ళు మందు సీసాలు బయటపెడుతున్నారు...క్రితం రోజు న్యూస్స్పేపర్ కింద పరచి దాని మీద వేరుశనగ పప్పులూ, చిప్సూ పోసారు....

మా బాసు గాడికి ఫోన్ చేసి "నాకు కడుపు నొప్పిగా ఉంది...రేపు ఆఫీసుకు రావట్లేదు సార్" అని చెబుదామని బయటకు వెళ్ళాను...నంబర్ పూర్తిగా డయల్ చేసేలోపు రూములొ నుంచి పెద్ద పెద్దగా ఏడుపులు వినిపించాయి....ఖంగారు గా లోపలకు వెళ్ళాను...మా వాళ్ళందరూ కింద కూర్చుని ముందుకూ వెనక్కూ ఊగుతూ "ఈ మిస్బా ఉల్ హక్ గాడు ఎంత పని చేసాడు రో దేవుడో....ఇప్పుడు మాకు దిక్కెవ్వర్రా నాయనో " అని గట్టిగట్టిగా ఏడుస్తున్నారు...ఏమయ్యిందా అని స్కోరు చూసాను.....ఒక ఓవర్ మిగిలుంది... 13 రన్లు కొట్టాలి అంతే.......నేను బయటకు వెళ్ళినప్పుడు మిస్బ ఉల్ హక్ హర్భజన్ సింగ్ ఓవర్లో మూడు సిక్సర్లు కొట్టాడంట.....

నాకు ఏమీ పాలుపోవటం లేదు...ఎలా జరిగింది ఇదంతా??????

చివరి ఓవర్ జోగీందర్ శర్మ కు ఇచ్చారు....

మొదటి బాలు వైడు....రెండవ బాలు సిక్సర్...అయిపొయ్యింది...అంతా అయిపొయ్యింది.........చలో హిమాలయాస్......

వెళ్ళే ముందు ఒక్క సారి దేవుడితో మాట్లాడదామని ఫోన్ చేసి విషయం చెప్పాను....దానికి దేవుడు "భయపడకు...ఆ T20 కప్పు తయారుచెయ్యగానే నేను స్టీలు సామాన్ల వాడి రూపం లో వచ్చి దాని మీద ఇండియా పేరు చెక్కేసాను..లొపలకు వెళ్ళి మ్యాచ్ చూడు" అన్నాడు....

ఇంట్లోకి వెళ్ళాను....

జోగీందర్ శర్మ బాల్ వేసాడు...అంతవరకు అద్భుతంగా ఆడిన మిస్బా గాడికి ఎమయ్యిందో తెలియదు...వికెట్ల పక్కకు జరిగి వెనక్కు కొట్టాడు.......

కామెంటరీ చెబుతున్న రవి శాస్త్రి "in the air" అన్నాడు....అది కనిపిస్తూనే ఉంది...కానీ బౌండరీ లైను అవతల "in the air"ఆ, బౌండరీ లైను ఇవతల"in the air"ఆ?...బాల్ మెల్లగా కిందకు వస్తోంది...మేమంతా మెల్లగా పైకి లేస్తున్నాము........రూము లో నిశ్శబ్దం....దినకర్ చిప్స్ నములుతున్న శబ్దం తప్ప ఇంకేమీ వినిపించట్లేదు..

..................

శ్రీశాంత్ క్యాచ్ పట్టేసాడు!

ఆ తరువాత ఏమి జరిగిందో గుర్తు లేదు.......

మరుసటి రోజు న్యూస్పేపర్లలో, TV ఛానళ్ళలో "ఇరు జట్లకు కేవలం 5 రన్నులే తేడా...కాబట్టీ నిజానికి గెలిచింది క్రికెట్.....రెండు టీములూ విజేతలే " అని చాలా మంది అన్నారు.

నాన్సెన్స్ - ఐదు రన్లు కాదు.....సగం రన్నుతో గెలిచినా సరె....గెలిచిన వాడే హేరో..

ఇప్పటికీ ఆ మ్యాచ్ హైలైట్స్ చూసేప్పుడు ఆ చివరి బాల్ మిస్బా గాడు గాల్లోకి లేపంగానే ఛానల్ మార్చేస్తాను....శ్రీశాంత్ ఎదవ ఎక్కడ క్యాచ్ వదిలేస్తాడోనని భయం.....

43 comments:

బ్లాగేశ్వరుడు said...

T20 కప్పు ప్రత్యక్ష పసారం, మరియు ముఖ్య ఝటనలు మీశైలి లొ బాగా చూపించారు.

Srinivas Ch said...

బాసూ, మొత్తానికి లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చారు కదా, ఈ T20 మ్యాచ్ మీ శైలిలో అదరగొట్టేసారు, ముఖ్యంగా అజిత్ అగార్కర్ మీద జోక్ అదుర్స్...

Anonymous said...

adbhutam! ee postu lo sixerley sixerlu.

బ్లాగాగ్ని said...

కెవ్వ్, కేక, కత్తి, అరుపులు. చించేశారండీ గురూగారూ, ముఖ్యంగా అజీత్ అగార్కర్ యూనిస్ ఖాన్ తో మాట్లాడింది చదివేటప్పుడు ఆఫీసులో వున్నానని కూడా మర్చిపోయి గట్టిగా నవ్వేశాను.

RSG said...

Baasu... Bangalore auto valla meeda satire keka :)

Kastha frequent ga rayi basoo...

Sreenivas Kishore said...

కొత్తగా ఏమని రాయమంటావు భయ్యా..ఇరగదీసావు ఎప్పటిలాగానే.ఈ వారం లో ఇంకో టపా రాయకపోతే నేను పోతాను హిమాలయాలకు.

karthik said...

super... dummuleparu. maro sari mee speciality chupincharu.

ప్రవీణ్ గార్లపాటి said...

గుడ్ వన్... బాగుంది.
అగార్కర్ మీద సెటైర్లు బాగా పేలాయి.

Anonymous said...

adirindi guru -- srinivas

Ravi said...

GGGGGGGGGGGGGGUUUUUUUUUUUUUDDDDDDDDDDD........666666......

Ravi said...

Over ki 666666 but Nee Tapa ki 666666666

రానారె said...

కామెంట్ రాయడానికి మాటలు దొరకడం లేదు. 999/100. దీర్ఘాయుష్మాన్ భవ!

Anonymous said...

Abbov abbov....adbhutam....agarkar satirlu adbhutam...

బ్లాగేశ్వరుడు said...

ఏమోయ్ రానారె మాటలు రావడం లేదన్నావ్ మాటలు వ్రాశావ్ అంకెలు వేస్తే సరిపోయేవి కదా!!!

లలితా స్రవంతి said...

adirindi sir....
kaasta tarachuu raasi mammalni navvinchanDi sir....
leka pOtE mEmantaa himaalayaalaku veLLAlsi unTundi
agaarkar meeda jOku baagundi
cinna dharma sandEham....evaranDii ee dinakar,prati saari meeku bali ayipOtunTADu...

జ్యోతి said...

సూపర్ ... ఇంతకంటే మంచి పదం నాకు దొరకటంలేదు. ఐనా ఒక్కో పోస్ట్ ఇలా అదరగోట్టేస్తూ, రాయడానికి మాత్రం చాలా టైం తీసుకోవడం అస్సలు బాలేదు.

Giri said...

చాలా నవ్వించింది మీ కామెంటరి..

వేణు said...

ఇంట్లో తిట్లు మొదలయ్యాయి...ఎందుకు నవ్వుతున్నానో అర్థం కాక....
బ్లాగు అదిరింది మాస్టారు...

వేణు

naakathalu said...

తోటరాముడు గారు మీ బ్లాగులన్నీ చదివాను చాలా బాగున్నాయి మీ బరువు బాధ్యత బ్లాగు తరువాత రోజు మీ బ్లాగును పరీక్షిస్తున్నాను క్రొత్తవి ఏమైన రాసారేమో అని చాణ్ణాళ్ళకు రాసారు బాగుంది.నేను కూడ ఈ బ్లాగు ప్రపంచములో చేరి ఒక బ్లాగు రాసాను తీరిక చూసుకొని చదవగలరని మరియు మీ అభిప్రాయము తెలుపగలరని ప్రార్ధన.

నాగరాజా said...

నేను అత్యధికంగా నవ్విన టపా ఇదే!
God bless you Brother

నల్లమోతు శ్రీధర్ said...

చాలా నవ్వు తెప్పించింది మీ వర్ణన!

- నల్లమోతు శ్రీధర్

Leo said...

Goutham garu, mee haasya kavitha chathuryam ee software jeevithaalaku nijam ga tonic vantidi.

puligoru said...

blog chala baaga vachindandi...
Extraordinary performance.....
routine ki bhinnamgaa vachindandi...

100 days..175 days...

Sravish N said...

ippude 4 time chadiva
keka blog...
inko 10 times chadivina bore kottademo

surender said...

blog excellent ga undi. chadivinantha sepu navvaleka chacha. too much!- surender parupalli

Manaswini said...

Na blog a nenu inni sarlu chaduvukonu....
alantidhi mee blog mathram malli malli chaduvuthu untanu.....
eppudu edo okati rasthu undandi

Vamsi said...

re,hero..ne next blog kosam janalandaru waiting..tondaraga rayira..chalakalmiyindi manasara navuukuni...

Anil said...

=====
అజీత్ అగార్కర్ మంచి బౌలర్ అని అనుకునే వాళ్ళంతా చేతులు పైకి లేపండి (ఎవడా మూల చెయ్యి లేపింది...రే అజీత్ అగార్కర్ గా...దించరా చెయ్యి)..
====
ఇప్పటికీ ఆ మ్యాచ్ హైలైట్స్ చూసేప్పుడు ఆ చివరి బాల్ మిస్బా గాడు గాల్లోకి లేపంగానే ఛానల్ మార్చేస్తాను....శ్రీశాంత్ ఎదవ ఎక్కడ క్యాచ్ వదిలేస్తాడోనని భయం.....
====

Excellent!!!

Niharika said...

super guru. after a long time, I laughed heartfully by reading a blog. Keep up the good work.

lavanya said...

chala chala bagundi, baruvu-badyata tarvata nundi chala wait chestunnanu.chivariki eroju chadivanu..its very very funny..i laughed alot by reading this..

thotaramudu garu, excellent articles by u..great...

PRADEEP said...

సర్ ఇప్పడ్నించీ మీ రచన రాగానే నాకు మెయిల్ చేయండి. మా సైట్ లో లంకె వేస్తా. altius@oneindia.in

tink said...

first time choosthunna mee blog. office lo undaga eppudu choodakoodadani ippude decide chesukunna. navvi navvi naaku kadupu noppi vachela undi

Anonymous said...

మీ బ్లాగులు చాలా బావున్నాయి. చక్కటి శైలి, సృజనాత్మకత, అంతకు మించి అంతులేని హాస్య ప్రియత్వం మీలో ఉన్నాయి. ఇలాగే వ్రాస్తూ పోతే శ్రీరమణ గారినీ ముళ్ళపూడి వారినీ కూడా మించి పోగలరు. శుభాకాంక్షలు!

బాలు said...

కడుపునొప్పి అని బాస్ తో చెప్పడం (చిన్న పిల్లల్లా) ... మీసం లేకపోతే మీటర్ మీద ఎక్కువ తీసుకోవడం బాగుంది. Agarkar survey is too good.

Anonymous said...

Intha kaalam enduku teliya leda ani badhaga undi.Sa ri ga ma pa 2008 programme choosthunnantha aanamdamgaa undi. Dhanyavaadaalu chaala chinna padam. s.v.subrahmanyam.

Bhaskar said...

"If
మద్రాసు ఆటోవాడు = నీచ్, కమీనా, కుత్త్తా..
Then
బెంగళూరు ఆటోవాడు = ఇద్దరు మద్రాసు ఆటోవాళ్ళు"

ఆద్దిరింది..కుర్చీలొంచి లెచి పడి పడి నవ్వాను.

sumanb said...

excellent...
nenu mee fan ayipoyaanu
kaasta frequent gaa raastoo undandi.

Nag said...

దినకర్ చిప్స్ నములుతున్న శబ్దం తప్ప ఇంకేమీ వినిపించట్లేదు..

ఈ ఒక్క ముక్క కి .... నేనింకా నవ్వుతూనే వున్నాను గౌతం గారు .... మీ టపాలన్నీ చదివాను ... అన్నీ చాలా బాగున్నాయి ... ముఖ్యం గా మీ ఫ్రెండ్ దినకర్ ఎపిసోడ్స్ చాలా చాలా బాగున్నాయి ... థాంక్ యు వేరి మచ్ ....

vinu said...

ee goutham dinkar ni close frnd aa eee tapa chadivina dinkar lekunda story ledhuu

swathi said...

Mind blogging
first time I am seeing you blog.
great.

rams said...

"ఇప్పటికీ ఆ మ్యాచ్ హైలైట్స్ చూసేప్పుడు ఆ చివరి బాల్ మిస్బా గాడు గాల్లోకి లేపంగానే ఛానల్ మార్చేస్తాను....శ్రీశాంత్ ఎదవ ఎక్కడ క్యాచ్ వదిలేస్తాడోనని భయం....."
కేకో కేక...

Unknown said...

సూపర్ గ వుంది...నవ్వ లేక చచ్చాను...

Anonymous said...

goutham garu meeru chala baaga blaagu rastaru , nenu meeku pedda abhimanini