Wednesday, December 3, 2008

కళ్ళు మూసుకో - 1,2,3 - కళ్ళు తెరు

నేను పడుకుని 50 గంటలు అవుతోంది....

గత రెండు రోజులుగా ఆపకుండా ఒక పుస్తకం చదువుతున్నాను. ఆ పుస్తకం పేరు "నిద్రపోవటం ఎలా?"..ఒక పెన్ను తో ఆ పుస్తకం మీదున్న టైటిల్ కొట్టేసి "నిద్ర రాకుండా పోవటం ఎలా?" అని మార్చాను..

ఏదో trance లో ఉన్నట్టుంది..నేను నుంచున్నానో, కూర్చున్నానో కూడా తెలియట్లేదు. ఆకలేస్తొందో లేదో అర్థమవ్వట్లేదు....ఏమయినా తిందామని ఫ్రిజ్ తెరిచాను........కానీ ఎందుకు తెరిచానో గుర్తుకు రావట్లేదు. నా మెదడుకు ఏదయినా ప్రాబ్లం వచ్చిందేమోనని భయమేసింది.....ఛ...అలాంటిదేమీ అయ్యుండదు. ఫ్రిజ్ మూసేసి వెనక్కు రెండడుగులు వేసాను....." ఇల్లు ఊడ్చి, బట్టలు ఉతుకుదాము " అనిపించింది! వామ్మో...నా మెదడు ఖచ్చితంగా దెబ్బతినింది..లేకపొతే ఇలాంటి విపరీతమైన ఆలోచనలు రావటమేంటి? కాస్త చల్ల గాలి కోసమని తలుపు తెరిచి...బాల్కనీ లోని బెంచి మీద కూర్చున్నాను.

ఎదురుగా ఉన్న సముద్రం నుండి చల్ల గాలి వీస్తోంది.. బెంచి మీద నా పక్కన బంగారు కిరీటం, నగలు పెట్టు కునికూర్చున్న ఆయనతో - "ఎంత హాయిగా ఉంది కద సార్.. ఈ గాలి, ఈ బెంచి, మీరు, నేను.....కానీ నాకు హాయితో పాటూ ఒక డౌటు కూడా ఉంది సార్...మా ఇల్లు గ్రౌండు ఫ్లోర్ లో కదా ఉండేది - మరి తలుపు తెరవగానే ఈ బాల్కనీ, బెంచి ఏంటి...పైగా బెంగళూరులో సముద్రం ఏంటి.....అవును...మీరెవరు?????

ఆ కిరీటం, నగలాయన నాకు తన చెయ్యి ఇస్తూ " కాల్ మి డు...దేవుడు " అన్నారాయన..

"OK...డు - దేవుడు గారు...ఎవరు మీరు...ఈ బాల్కనీ, సముద్రం ఎలా వచ్చాయని నేను తలబద్దలు కొట్టుకుంటుంటే..మీరు మా ఇంట్లోకి ఎలా వచ్చారు?" అనడిగాను...

"ఓరీ భక్తి లేని భక్తా! నేను దేవుడిని రా..మొన్నేదో మంచి పని చేసి ఏడ్చినట్టున్నావు...నీకో వరమిమ్మని పంపించారు నన్ను....నీ బుర్ర మామూలు కండిషన్ లో ఉన్నప్పుడు వస్తే తట్టుకోలేవని ఈ రోజు వచ్చా. ఇప్పుడయితే..ఏది కలో, ఏది నిజమో తెలుసుకోలేని పరిస్థితి లో ఉన్నావు కాబట్టీ అంత షాక్ తినవు...సరే..ఈ ఉపోద్ఘాతము చాలు కానీ, ఏ వరం కావాలో కోరుకో." అన్నారాయన...

"వరాలు తరువాత...మీ ID కార్డు ఏదయినా ఉంటే చూపించండి " అనడిగాను..

"ఏరా...తిమ్మిరి తిమ్మిరిగా ఉందా?"

"లేకపోతే మీరు దేవుడని ఎలా సార్ నమ్మటం? పోనీ ఏదయినా మ్యాజిక్ చేసి చూపించండి"

"సరే - 1 నుండి 50 లోపు ఒక నంబరు అనుకో....."

"మీరు 1 నుండి 500 లోపు ఒక నంబరు అనుకోండి - ఏదనుకున్నారో నేను చెప్పేస్తా....ఇలాంటి మ్యాజిక్ లు కాదు సార్. దిమ్మ తిరిగి పోవాలి..అలాంటిదేదయిన ఉంటే చూపించండి."

"OK....నీకు ఇష్టమయిన క్రికెటర్ ఎవరో చెప్పు" అనడిగారు...కిరీటం తీసి పక్కన పెడుతూ..

"జయమాలిని.........
అదేంటి సార్ ' టెండుల్కర్ ' అందామనుకుంటే ' జయమాలిని ' అని వచ్చింది నోట్లోంచి?"

"మరదే...ఇప్పుడు తెలిసిందా నా శక్తుల గురించి..."

నేను జవాబిచ్చేలోపు వెనక నుంచి నా తలపైన ఎవరో బలంగా కొట్టారు. వెనక్కు తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు...

దేవుడు నా తల మీద రుద్దుతూ " దిమ్మ తిరిగిపోవాలి అన్నవుగా....అందుకే ఈ ఏర్పాటు..... సరే అడుగు ఏ వరం కావాలో?" అన్నాడు, అరచెయ్యి వరమిచ్చే పొజిషన్ లో పెడుతూ....

"ఏముంది సార్....ఈ ప్రపంచమంతా సుఖశాంతులతో, సకల సంపదలతో......."

"ఆగు - నిజం చెప్పు"

"ఈ సారి నా Annual appraisal లో నాకు నూట ఇరభై పర్సెంటు ఇంక్రిమెంటు వచ్చేట్టు చూడండి సార్...ఇదయ్యాక కూడా నా వరం లో ఇంకొంచం మిగిలుంటే - ఆ హిమాన్షు గాడి ఉద్యోగం ఊడేట్టు చూడండి "..అనడిగాను వినయంగా..

"ఇంతోటి దేవుణ్ణి...అంత దూరం నుంచి వస్తే ఇదా నువ్వు కోరుకునేది?? కమాన్ యార్..ఇంకాస్త ఆలోచించు. మొన్నెప్పుడో ఎవరితోనో 'ఏంటి ఈ జీవితం - ఇక ఇంతేనా?' అన్న డైలాగ్ అన్నట్టున్నావ్"...

"బాగా గుర్తుచేసారు సార్..ఏమి చెప్పమంటారు - ఈ ఉద్యోగం బొరు కొడుతోంది...ఏదో అసంతృప్తి...రోజూ చిరాకే. ఇలా కాకుండా బాగా exciting గా ఉన్న ఉద్యోగం ఇప్పించండి సార్...ప్రతి రోజూ థ్రిల్లింగ్ గా ఉండాలి..." అన్నాను..

" రైట్....కళ్ళు మూసుకో - 1,2,3 - కళ్ళు తెరు "

కళ్ళు తెరిచాను..

ఒక పెద్ద బోను లో ఉన్నాను. చేతిలో హంటర్ ఉంది. చిన్న అలికిడి లాగ వినిపిస్తే కిందకు చూసాను......

......నా ఎదురుగా నేల మీద ఆరు సింహాలు కూర్చుని ఉన్నాయి!

మాంచి conditioner తో తల స్నానం చేసొచ్చినట్టున్నాయి...జూలు గాలికి అటూ ఇటూ ఎగురుతోంది..

నా ప్రమేయం లేకుండానే నా కుడి చేయి హంటర్ ను నేల మీద గట్టిగా కొట్టింది...ఆ చప్పుడు కు సింహాల కన్నా ముందు నాకు భయమేసింది. ఒక్కొక్క సింహం పైకి లేచి మెల్లగా నా చుట్టూ తిరగటం మొదలు పెట్టింది..నా చొక్కా, నా ప్యాంటు తడిసి పోయాయి (రెండూ చమట వల్లే.........అనుకుంటా)..

నా చుట్టూ మూడు ప్రదక్షణాలు అయ్యాక సింహాలన్నీ ఒక మూల చేరి ఏవో మాట్లాడుకోవటం మొదలుపెట్టాయి.. పది సెకెండ్ల తరువాత సింహాలన్నీ "high five" అని చేతులు కొట్టుకుని నా వైపు తిరిగాయి..అందులో ఒక సింహం కింద కూర్చుని తమలపాకులకు సున్నం రాస్తోంది...నన్ను తినేసాక వేసుకోవటానికి తాంబూలాలు రెడీ చేస్తున్నట్టుంది...మిగతా సింహాలు నా వైపు అడుగులేస్తున్నాయి...ఇంకొద్ది సేపట్లో ఈ బోను లోని సింహాలు నన్ను తిని, నా బోన్స్ తో పాచికలు చేసుకోవటం ఖాయం...ఒక్క సారిగా సింహాలు నా మీదకు ఎగిరాయి..కళ్ళు మూసుకుని గట్టిగా అరిచాను - "దేవు............."

"..........డా" అని కళ్ళు తెరిచాను.........

మళ్ళీ బాల్కనీలో బెంచి మీద కూర్చుని ఉన్నా. ఎదురుగా దేవుడు. అంతా నిశ్శబ్దం.

ఇందాక నేను సింహాలు బోనులోకి వెళ్ళినప్పుడు 'pause' చేసిన సీను మళ్ళీ 'play' చేసాడు దేవుడు....మళ్ళీ సముద్రపు హోరు, చల్ల గాలి, మొదలయ్యాయి..

"ఏంటి సార్....అంత పని చేసారు?" అన్నాను చమట తుడుచుకుంటూ...

"చిన్న ప్రివ్యూ ఇచ్చాను తమ్ముడూ...ఇందాక నువ్వు చేసావే...రోజూ exciting గా, థ్రిల్లింగ్ గా ఉండే ఉద్యోగం అదొక్కటే....వేరే ఏ ఉద్యోగం అయినా...కొద్ది రోజులకు బోర్ కొడుతుంది..మంచి వ్యాపకాలేవయినా ఏర్పరచుకుని సంతోషంగా ఉండటానికి ప్రయత్నించు........సరే - ఏ వరం కావాలో కోరుకో"..

"ఉండండి సార్...భయం తో గొంతు ఎండిపోయింది..లోపలకెళ్ళి నీళ్ళు తాగొస్తా. మీకూ ఓ గ్లాసు పట్రమ్మంటారా?" - అడిగాను...

"వద్దు....నేను మా లోకం నుంచి ఫ్లాస్క్ లో అమృతం తెచ్చుకున్నాను...నువ్వు నీళ్ళు తాగి రా"..

నేను వెళ్ళి నీళ్ళు తాగుతుంటే నా వెనకాలే దేవుడు కూడా వచ్చాడు..

"ఈ గిటార్ నీదేనా? వాయిస్తుంటావా?" అనడిగాడాయన నా మంచం పక్కనున్న నా గిటార్ ను చూపిస్తూ..

"అంటే సార్...అది...అప్పుడప్పుడూ...ఎప్పుడోఅప్పుడు"

"రేయ్ మూర్ఖా...ఇటువంటి వాయిద్యాలు ఇంట్లో ఉంచుకుని కూడా ఎప్పుడో ఒక సారి వాయిస్తాననటం మహా పాపం రా"

"ఊరుకోండి సార్..అలా భయపెట్టకండి..ఇప్పటికే తెలిసో తెలియకో ఎన్నో పాపాలు చేసుంటాను...ఇటువంటి చిన్న చిన్న విషయాలను కూడ పాపాల లిస్టులో చేరిస్తే ఇక నా లాంటి వాళ్ళు స్వర్గానికి వెళ్ళటం అసాధ్యం" అన్నాను...

"సరే...ఆ గిటార్ సంగతి చెప్పు...ఎందుకు రోజూ సాధన చెయ్యట్లేదు?"

"సమయం దొరక్క సార్...ఒక్క గిటార్ అనే కాదు...ఎన్నో ఉన్నాయి సార్ నేను చేయాలనుకునేవి...టైం లేదంతే..రోజుకు ఇంకొక్క
' ఆరు గంటలు ' ఎక్కువుంటేనా........"

"కావాలా?"

" అంటే...కుదురుతుందా సార్....రోజుకు 30 గంటలు...నిజంగా వీలు అవుతుందా?" అనడిగాను...

" కళ్ళు మూసుకో - 1,2,3 - కళ్ళు తెరు "

కళ్ళు మెల్లగా తెరిచాను..నా మంచం మీద పడుకుని ఉన్నాను..పక్కనే గడియారం...టైం ఉదయం 7:30 అయ్యింది..ఎదురుగా TV ఆన్ చేసి ఉంది....NDTV 30/7 అనే చానెల్ వస్తోంది....ఆహా...ఐతే రోజుకు 30 గంటలు వచ్చేసాయన్నమాట...మెల్లగా నిద్ర లేచి, తయారయ్యి ఆఫీసుకు చేరేప్పటికి 10:30 అయ్యింది..ఆఫీసు మెయిల్ నిదానంగా చెక్ చేసుకోవచ్చని G-talk లోకి లాగిన్ అయ్యాను...

'Hi....Hi.....Hi.....Hi....' అని నాలుగు విండోలు తెరుచుకున్నాయి....హేమ, లలిత, విద్య, నీల్ విజయ్ ఆన్లైన్ ఉన్నారు..

(ఈ క్రింది సన్నివేశం లో కెమేరా నా లాప్టాప్ స్క్రీన్ వైపు తిప్పబడింది)

-----

హేమ - ఏంటి లేటయ్యింది?
నేను - అవును..లేటయ్యింది..

లలిత - చాక్లెట్ తెచ్చావా?
నేను - నువ్వు డబ్బు తెచ్చావా?
లలిత - తెచ్చా
నేను - ఇలా ఇవ్వు...వెళ్ళి పట్టుకొస్తా

విద్య - భవ్......హహహ....భయపడ్డావా
నేను - ప్లీజ్ యా....పొద్దున్నే అలా భయపెట్టకు

నీల్ విజయ్ - రేయ్...ఇవ్వాళ డేట్ ఎంత?
నేను -

-------

హేమ - టిఫిన్ చేసావా....ఇవ్వాళ మా ఇంట్లో ఇడ్లీ..చట్నీ భలే ఉండింది...నీకు పెట్టనుగా...హహహ.
నేను - నేను కూడా ఇడ్లీనే తిన్నా...మీ నాన్న అదే హోటల్ నుండి పార్సెల్ కట్టించుకెళ్ళాడు..

లలిత - నీకొక విషయం తెలుసా...హిమాన్షు ఇవ్వాళ పొద్దున్నే బాసుకు రవ లడ్లు, మెరపకాయ బజ్జీలు తెచ్చిచ్చాడు...ఈ సారి వాడి ప్రమోషన్ గ్యారంటీ..
నేను - అసలు వాడికి సిగ్గుందా?? ఇరిటేటింగ్ ఫెలో..
లలిత - నాకు కూడా అదే అనిపించింది...ప్రమోషన్ కోసం మరీ ఇంత దిగజారటమా?
నేను - ప్రమోషన్ గురించి కాదు లల్లీ..బుధ్ధున్నోడు ఎవడయినా మెరపకాయ బజ్జీలు పొద్దున తెస్తాడా?? సాయంకాలం స్నాక్స్ టైములో తీసుకురావాలి కానీ....

నీల్ విజయ్ - రేయ్...ఉన్నావా....రిప్లై ఇవ్వరా...
నేను -

--------

విద్య - బోర్ కొడుతోంది...బ్రేక్ కు వెళదామా?
నేను - టూ మినిట్స్

హేమ - నువ్వు, విద్య బ్రేక్ కు వెళ్తున్నారట గా...ఇప్పుడే పింగ్ చేసింది..అవును లే..మమ్మల్ని ఎందుకు పిలుస్తారు..పెద్ద వాళ్ళయిపోయారు..
నేను - ఏంటి హేమ..అలా అంటావు..నేనే నిన్ను పిలుద్దామనుకుంటున్నా ...ఈ లోపే నీకు చెప్పేసిందా??

లలిత - నిన్న రాత్రి మీ ఇంట్లో ఏమి కూర?
నేను - ఒక్క నిముషం..ఇప్పుడే వస్తా..

నీల్ విజయ్ - రేయ్...ఇవ్వాళ రాత్రికి PVR లో సెకెండ్ షో టికెట్లు దొరికాయి..
నేను - ఆ చెప్పరా...ఇంతసేపు ఒక కాల్ లో ఉన్నాను.....షో ఎన్నింటికి?

--------

బ్రేక్, లంచ్, తరువాత ఇంకో బ్రేక్ తీసుకున్నాక నా మెయిల్ చెక్ చేసుకున్నా....నా బాసు దగ్గర్నుండి ఏదో మెయిల్....అందులో చివరి వాక్యం మాత్రం 16 ఫాంటు సైజు లో, బోల్డు అక్షరాలతో, ఎర్రటి రంగులో - "send it to me by the end of day, today" అని ఉంది...పని మొదలెడదామని గడియారం చూస్తే మధ్యాహ్నం 3:40 అయ్యింది...ఇవ్వాళ పని జరగటం అసంభవం...రేపటి దాక టైం అడుగుదామని నా బాసు క్యాబిన్ కు వెళ్ళాను..తలుపు తెరవంగానే "be aggressive, be proactive, take initiative, by the end of the day, youtube blocked, Gtalk blocked, messenger blocked" లాంటి నాలుగైదు విషయాలు మొరిగి నన్ను పంపించేసాడు...వాడి మాటల హోరుకు నాకు కళ్ళు తిరిగి పడిపోయాను...

కళ్ళు తెరిచేప్పటికి మళ్ళీ ఇంట్లో ఉన్నాను...దేవుడు నా గిటార్ వాయిస్తూ కనిపించాడు..

"చూసావా..30 గంటలు కాదు..రోజుకు 300 గంటలు ఇచ్చినా నీ బుధ్ధి మారదు....కాబట్టి వేరే వరమేదయినా కోరుకో.."

నేను అడిగేలోపు దేవుడు "హలో..ఆ చెప్పు...OK...OK" అంటున్నాడు....ఎవరో ఫోన్ చేసినట్టున్నారు...మనకు వైర్ లెస్ లాగా వీళ్ళకు ఫోన్ లెస్ అనుకుంటా..చేతిలో ఏ ఫోనూ లేకుండా రెండు నిముషాలు మాట్లాడేసాడు దేవుడు..

"ఏంటి సార్ ఏమయినా ప్రాబ్లమా?" అడిగాను ఆయన ఫోను పెట్టంగానే..

"Recession అయ్యా...అందుకే అందరికీ టెన్షన్ గా ఉంది..మీరు బచ్చాగాళ్ళు..ఓ పది, పదిహేను బాంకులు మూసేసారు...మాకున్న క్రైసిస్ కు మేము 3 గ్రహాలు మూసేసాము తెలుసా..ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియదు..."

నాకు తలియకుండానే గట్టిగా నవ్వేసాను...

"ఏరా కొవ్వెక్కిందా...నా ఉద్యోగం ఊడుతుందంటే నవ్వొస్తోందా నీకు? నా గురించి నీకు పూర్తిగా తెలిసి నట్టు లేదు రా రేయ్..నీ Engineering Graphics పేపర్ గుర్తుందా? పరీక్ష ముందు రోజు కూడా ఏదో తోక ఆడించావు...అందుకే 34 మార్కుల దగ్గర ఆపేసాను నీ పేపర్"

"అది చేసింది మీరా??????????????"

"అన్ని క్వశ్చన్ మార్కులెందుకు?"

"లేకపోతే ఏంటి సార్...ఏదో పొరబాటున రెండు మాటలు అనుంటాను..దానికి Engineering Graphics లాంటి పేపర్ ఇంకో సారి రాయించారా నాతో..." అని మొహం మాడ్చుకుని ఏడ్చేసాను..

"సర్లే ఊరుకో..ఇప్పుడెందుకు ఏడుపు... అయినా ఆ తరువాతి సారి పాస్ చేయించాగా...లేకపొతే నువ్వేసిన పూలకుండి, సైకిల్ టైర్ బొమ్మలకు ఎవడిస్తాడు చెప్పు 65 మార్కులు.....ఏడుపాపి ఏమి కావాలో కోరుకో.." అన్నారాయన నాకు కర్చీఫ్ అందిస్తూ...

"ఇంతకు ముందు కోరుకున్నవేవీ వద్దు సార్....ఈ ఒక్క కోరిక తీర్చండి...ఇక జీవితం లో ఎప్పుడూ ఏమీ కోరుకోను" అన్నాను..

"నేను చిన్నప్పుడు పేపర్ కిరీటాలు పెట్టుకునే రోజుల నుండి చూస్తున్నాను..ఏ కోరిక కోరినా 'ఇదొక్కటే తీర్చు స్వామీ..ఇంకేమీ అడగను ' అంటూనే ఉన్నారు మీరు...సరే అడుగు "....

"ఒక అందమైన, తెలివైన అమ్మాయి నన్ను ప్రేమించి పెళ్ళి చెసుకునే వరమివ్వండి సార్" అన్నాను...

"బాగుంది రా....' బాబుకి లేక బాలకృష్ణ సినిమా దొంగ DVD చూస్తుంటే, కొడుకొచ్చి జేంస్ బాండ్ కొత్త సినిమా కు మొదటి రోజు టికెట్లు అడిగాడంట '......నాకే 700 సంవత్సరాలుగా పెళ్ళి కుదరట్లేదంటే...నీకొక అమ్మాయిని చూడాలా...."

"ఇవ్వలేనప్పుడు ఎందుకు సార్ అడగటం??? అయినా ఇప్పుడు నాకు మీ సహాయం అవసరం లేదులెండి...మీ మంత్రం గుర్తుంది నాకు........' కళ్ళు మూసుకో - 1,2,3 - కళ్ళు తెరు ' "....అని కళ్ళు మూసుకుని, కళ్ళు తెరిచాను........

మళ్ళీ ఒక బోనులో ఉన్నాను..ఈ సారి బోను ఊసలకు కరెంటు కనెక్షనుంది....కిందకు చూసాను...ఎదురుగా కుర్చీలో కూర్చుని నవ్వుతూ దినకర్ గాడు కనిపించాడు....నేను తల పైకి లేపి చూసాను...దేవుడు తన బండి స్టార్ట్ చేస్తూ కనిపించాడు....

"మంత్రాన్ని దొంగలించినంత మాత్రాన....ఇంత పెద్ద శిక్ష విధించాలా సార్?"......

ఆయన నన్ను చూసి ఒక చిన్న నవ్వు నవ్వి, ఏమీ మాట్లాడకుండా... ఫస్ట్ గేర్ వేసుకుని వెళ్ళిపోయారు...

Thursday, October 16, 2008

ఓణం - ఆణో - పెణ్ కుట్టి

ఓ నెల రోజుల క్రితం మాట...మా వదిన షాపింగు చెయ్యాలంటే తోడు వెళ్ళాను. తన దగ్గరున్న 1,487 జతల చెప్పులు పాతవయ్యాయని కొత్త చెప్పులు కొనటానికి 'మెట్రో షూ మార్టు ' కు వెళ్ళాము. మూడు గంటల తరువాత తను కొన్న చెప్పులకు బిల్లు కట్టటానికి పర్సులో ఉన్న డబ్బు, కారు తాళాలు, ఇంటి కాగితాలు షాపు వాడికి ఇస్తుండగా ఎవరో ఒకమ్మాయి వచ్చి మా వదినను పలకరించింది..ఓ ఐదు నిముషాల పాటు మాట్లాడుకున్నారు..దూరంగా కూర్చున్న నన్ను చూపించింది మా వదిన..ఈ చెప్పుల కొట్టోడికి నన్ను తాకట్టు పెట్టేస్తొందేమోనని కంగారు కంగారు గా పరిగెట్టుకెళ్ళాను...

"ఈ సారికి మా వాడు వస్తాడు...ఇదిగో..మాటల్లోనే వచ్చాడు....ఈ అమ్మాయి నా ఫ్రెండు శిల్ప చెల్లెలు - పూర్ణిమ...వీడు నా మరిది - గౌతం" అని పరిచయం చేసింది...

"మీరు తప్పకుండా రావాలి...అడ్రసు మీ వదినకు తెలుసు" అని చెప్పి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి..

మా వదిన నా వైపు తిరిగి "ఈ 12 వ తారీఖు వాళ్ళింట్లో ఒక ఫంక్షన్ ఉంది...నేను, మీ అన్నయ్య ఊళ్ళో ఉండట్లేదు కాబట్టి నిన్ను పంపిస్తానని మాటిచ్చాను" అంది..

"నేనెళ్ళను..ఆ రోజు నాకు ఆఫీసు లో మూడు మీటింగ్లున్నాయి, మొబైలు బిల్లు కట్టాలి, బ్యాంకు లో పనుంది, ఫ్రెండ్స్ తో సినిమా ప్లానుంది, డిన్నర్...."

"అది 'ఓణం' ఫంక్షన్...పెళ్ళి కాని మళయాళీ అమ్మాయిలు బోలెడు మంది వస్తారు"

"ఆ కవర్లు ఇటీ వదినా...ఎన్నింటికెళ్ళాలి?"

*******************************************

నాకు మళయాళంలో అత్యంత ఇష్టమైన పదాలు మూడున్నాయి - ఓణం, ఆణో, పెణ్ కుట్టి...'పెణ్ కుట్టి ' అంటే 'అమ్మాయి ' అని అర్థం..ఆ భాష లో ఇంతకన్నా అందమైన పదం ఉండటం అసాధ్యమని నా లిస్టు అక్కడితో ఆపేసాను..

మళయాళీలను 'మల్లు'లు అంటారని అందరికీ తెలుసు..కానీ మళయాళీ అమ్మాయిలను 'మల్లమ్మ'లు అంటారని కొందరికి మాత్రమే తెలుసు..(మల్లమ్మ = మల్లు + అమ్మాయి - షష్టీ తత్ 'పురుష' సంధి)..

పూర్ణిమ వాళ్ళ ఇల్లు ఇందిరా నగర్ లో - విజయనగర్ నుండి 15 కిలోమీటర్లు. త్వరగా బయలుదేరాలని ఉదయాన్నే, తెల్లవారుజామునే, మరియు పొద్దున్నే లేచాను..వెళ్తున్నది 'ఓణం' ఫంక్షన్ కు కాబట్టి..మళయాళీల సంప్రదాయ లుంగి, చొక్కా వేసుకుని, Asianet చానెల్ లో యేసుదాస్ సుప్రభాతం విని, అయ్యప్ప స్వామికి మొక్కుకుని, కొబ్బరి నూనె తో చేసిన ఇడ్లీలు తిని, పడవలో బయలుదేరాను..

నీల్ విజయ్ గాడి ఫోను వచ్చింది -

"జై ఓణం...చెప్పరా"

"ఏరా..ఓణం ఫంక్షన్ కు వెళ్తున్నావంట...మీ అన్నయ్య చెప్పాడు. నేనొక్కడే వెళ్తానంటే నా వైఫ్ ఒప్పుకోదు..మా ఇంటికి రారా..ఇద్దరూ కలిసి వెళ్దాం..అసలే మల్లమ్మలు.. "

"నోరు మూసుకుని ఇంట్లో కూర్చోరా...చూసావా..పెళ్ళి చేసుకోకపోవటం వల్ల ఉన్న లాభాలు....ఉహుహుహహహ" అని వికటాట్టహాసించాను (వికటాట్టహాసం = వికట + అట్టహాసం - 'హాసం'-పత్రిక-నిలిచిపోయింది సంధి)...

మరో అరగంటలో పూర్ణిమ వాళ్ళ ఇల్లు చేరాను..వాళ్ళ ఇంటి వెనకాల నా పడవ పార్కు చేస్తుండగా నా పక్కన ఒక TVS-50 వచ్చి ఆగింది..

"హమ్మయ్య..సరిగ్గా టైముకు వచ్చాను " అన్న మాటలు వినిపించాయి...ఇక్కడ తెలుగు మాట్లాదేది ఎవర్రా అని పక్కకు చూసాను....

దినకర్ గాడు....

"రేయ్...నువ్వేమి చెస్తున్నావిక్కడ???" అనడిగాను

"నువ్విక్కడ జరిగే ఓణం సంబరాలకు వస్తున్నావని ఇందాకే నాకొక ఆకాశరామన్న sms వచ్చింది......అయినా ఇది చాలా అన్యాయం రా..సంవత్సరానికి 9 సార్లు నాతో బర్త్ డే పార్టీలు తీసుకోవటానికి మాత్రం ఫోన్లు చేస్తుంటావే.....ఇంతమంది మల్లమ్మలను కలిసే అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఫోన్ చెయ్యవేరా??" అన్నాడు తన TVS-50 ని చెట్టుకి కట్టేస్తూ....

ఇంతలో నాకొక sms వచ్చింది..నీల్ విజయ్ గాడి దగ్గరి నుండి..

"ఉహుహుహహహ - ఇట్లు ఆకాశరామన్న" అని ఉంది..

దినకర్ గాడికి ఆ SMS చూపించాను..

"వార్నీ...నీకు కూడా నీల్ విజయ్ గాడి మొబైల్ నుండే వచ్చిందా??...ఈ ఆకాశరామన్న గాడెవడో నీల్ గాడి మొబైల్ నుండి అందరికీ మెసేజ్ లు చేస్తున్నాడు రా....వెంటనే నీల్ గాడికి ఫోను చేసి చెప్పాలి..." అని నా డ్రస్సు వైపు వింతగా చూసాడు..

"మల్లూల సంప్రదాయ దుస్తులు రా...ఓణం కదా అని" అన్నాను..

"ఇలా లుంగీలు, గోచీలు కట్టుకొస్తే అమ్మాయిలు నీ దగ్గరకు కూడా రారు... నాతో ముందే చెప్పుంటే నాలాగ 'hep' గా డ్రెస్ చేయించుండేవాడిని కదరా " అంటూ తన డ్రస్సు చూపించాడు......

గులాబి రంగు జీన్సు ప్యాంటు ....టీషర్టు మీద 'Cool Dude' అని రాసుంది........తలకు నవరత్న తైలం రాసుకుని, నుదుటికి వీబూది అడ్డబొట్టు పెట్టుకున్నాడు......

చిన్నగా నవ్వి ప్యాంటు కాస్త పైకి లేపాడు...కుడికాలికి ఎరుపు, ఎడమ కాలికి నీలం రంగు సాక్సులు వేసుకునున్నాడు....

"ఆ సాక్సులేంట్రా" అన్నాను..

"చూసావా..అమ్మాయిలు కూడా నా సాక్సులు చూడగానే ఇలానే అడుగుతారు..నేను వెంటనే వాళ్ళ పేరు, ఫోన్ నంబరు తీసుకుంటాను...గేం ఓవర్!" అని గట్టీగా అరిచి, ప్యాంటూ అలా పైకెత్తుకుని "రింగా రింగా రోజెస్...పాకెట్ ఫుల్ ఆఫ్ పోజెస్" అంటూ నా చుట్టూ తిరగటం మొదలు పెట్టాడు....

---------------------------
Flashback - 1
---------------------------

అవి నేను తొమ్మిదో తరగతి చదువుతున్న రోజులు..మా క్లాసు ఎదురుగా ఒకటో తరగతి పిల్లలు "రింగా రింగా రోజెస్...పాకెట్ ఫుల్ ఆఫ్ పోజెస్" అని ఆడుకుంటున్నారు. నేను చూస్తుంది ఆ పిల్లలను కాదు..వాళ్ళను ఆడిస్తున్న మా సరస్వతి మిస్సును...

సరస్వతి మిస్...మళయాళం అమ్మాయి.......నా ఫస్ట్ లవ్!

సరస్వతి మిస్సు మాకు సోషల్ స్టడీస్ చెప్పేది..తన అందం తో నా చదువు సర్వనాశనం చెసింది..అందమే అనుకుంటే.. అందానికి మించిన తెలివితేటలు. ఎవ్వరూ, ఎప్పుడూ వినని విషయాలెన్నో మాకు చెప్పేది మా మిస్సు. "శ్రీలంక రాజధాని ఆఫ్ఘనిస్తాన్" అన్న మా సరస్వతి మిస్ మాటలు ఆ తరువాత ఎక్కడైన ఎవరైన రాసారేమో/చెప్పారేమో అని ఎంత వెతికినా లాభం లేకపొయ్యింది...

మా మిస్సు కు నేనంటే మొదటి నుండి అదోకరకమైన ఇది..

నన్ను అప్పుడప్పుడూ 'కుట్టా' అని పిలిచేది - 'కుట్టా' అంటే మళయాళం లో 'స్వీట్ బాయ్' అని అర్థం!

చాలా సార్లు 'useless idiot' అని కూడా పిలిచేది - 'useless idiot' అంటే ఇంగ్లీషులో 'స్వీట్ బాయ్' అని అర్థం!

మా సరస్వతి మిస్ అపురూప సౌందర్యాన్ని చూసే అప్పట్లో ఇంగ్లీషు పెద్దలు ఒక సామెత కనుగొన్నారు -

"Man is a social animal" అని......అంటే - "మా సోషల్ మిస్సుని ప్రేమించని మనిషి జంతువుతో సమానం" అని అర్థం...

అటువంటి మా సరస్వతి మిస్సు..సరస్వతి మిస్సెస్ గా మారబోతోందని తెలిసింది. మా స్కూల్లో అందరికీ కార్డులు పంచింది. నా బుగ్గ నిమిరి "పెళ్ళికి తప్పకుండా రావాలి కుట్టా" అని తట్టా బుట్టా సర్దుకుని నా జీవితంలో నుండి వెళ్ళిపోయింది....

ఆ బాధ తట్టుకోలేక ఆ రోజు రాత్రంతా దగ్గు మందు తాగి దేవదాసు కామిక్స్ చదువుతూ గడిపేసాను..

ఆ మరుసటి రోజే నిర్ణయించుకున్నాను - ఇంకోసారి ప్రేమలో పడకూడదని!

-------------------------------

దినకర్ గాడు పడ్డాడు - నా చుట్టూ తిరుగుతున్న హుషారు లో ఒక గులక రాయి మీద జారి..

వాడీని పైకి లేపి "పద లోపలకు వెళ్దాం..లోపల నీ విపరీత చేష్టలు కాస్త అదుపులో పెట్టుకో" అని హెచ్చరించి లోపలకు తీసుకెళ్ళాను....


మేము ఇంట్లోకి అడుగుపెట్టగానే ఓ 30, 40 మంది మల్లమ్మలు కిల కిల, గల గల అని మళయాళం లో నవ్వుతూ కనిపించారు...అంత మంది అందమైన అమ్మాయిలను చూడగానే దినకర్ గాడికి (లేని) మతి పోయింది..

"ఆహా..నా బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ ఇన్నాళ్ళకు దొరికింది రా..నా చార్మ్ తో ఇక్కడుండే అమ్మాయిలందరిని మెస్మరైజ్ చేసి అవతల పారేస్తాను....చూస్తూ ఉండు...ఇంకో రెండు మూడూ గంటల్లో ఈ మల్లమ్మలందరూ 'దినకర్ నాకు కావాలి...దినకర్ నా వాడూ అని ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని కొట్టుకుంటారు" అని...రెండు క్షణాలాగి "సరే పద...ఇద్దరం కలిసి విజృంభిద్దాం" అని నా చెయ్యి పట్టుకు లాగాడు....

"ఇద్దరం కలిసా??...వద్దురా...'గౌతం జోగి, దినకర్ జోగి రాసుకుంటే కిలో బూడిద రాలిందంట'....ఎందుకు రిస్కు..ఎవరికి వాళ్ళు ప్రయత్నిద్దాం..ఏమంటావు?" అన్నాను...

వాడు ఏమీ అనకముందే పూర్ణిమ నన్ను గుర్తు పట్టి నా దగ్గరకు వచ్చింది..

"హై గౌతం..రండి..ఎవరో ఫ్రెండును కూడా తీసుకొచ్చినట్టున్నారు...గుడ్..సరిగ్గా టైం కు వచ్చారు..ఇప్పుడే ముగ్గుల పోటీలు జరగబోతున్నాయి..వెళ్ళీ మీ పేర్లు రెజిస్టర్ చేసుకోండి - అక్కడ" అని ఒక చిన్న టేబులుముందు నుంచున్న ముగ్గురు అమ్మాయిల వైపు చూపించింది...నేను థ్యాంక్స్ చెప్పేలోపు దినకర్ గాడు నన్ను లాక్కుని ఆ అమ్మాయిల దగ్గరకు తీసుకెళ్ళాడు..

"హెలో..వెల్కం. మీ పేర్లు రెజిస్టర్ చేసుకోండి..ఇంకో పది నిముషాల్లో పోటీ మొదలవ్వబోతోంది" అంది ఆ ముగ్గురిలోకి కాస్త పొడుగ్గా ఉన్న మల్లమ్మ..

దినకర్ గాడు వెంటనే తిరుపతి లోని ప్రతాప్ థియేటర్ ఎదురుగుండా కొన్న 67 రూపాయల సన్ గ్లాసెస్ తన జేబులోంచి తీసి పెట్టుకుని -

"నా పేరు దినకర్" అన్నాడు..

"స్పెలింగ్ చెబుతారా?" అడిగిందా అమ్మాయి..

"Dinakarqwxyz" అన్నాడు మావాడు..

"అదేంటండి??"

దినకర్ గాడు టేబుల్ మీదకెక్కి కూర్చుని, తన సన్ గ్లాసెస్ ముక్కు మీదకు జార్చి - "నా పేరులో చివరి ఐదక్షరాలు సైలెంట్.....ఒక వేళ మీకు కష్టమనిపిస్తే 'The nakar' అని రాసుకోండి" అన్నాడు..

ఆ అమ్మాయి ఏదో రాసుకుని - "మీ మెయిల్ ID ఇస్తారా..వచ్చే నెలలో మా మళయాళీ సంఘం వాళ్ళు ఒక నాటకం వెయ్యబోతున్నారు..మీకు ఇన్విటేషన్ పంపుతాము" అంది..

"తప్పకుండా...నా మెయిల్ ID - dinakardinakar@gmail.com.....password - lakshmikrishna.....నా ఫోన్ నంబరు - 9999999999"

"ఫోన్ నంబరు అవసరం లేదండి"

"పర్లేదు ఉంచండి....నంబరు మీ దగ్గరుంటే ఒకటి..నా దగ్గరుంటే ఒకటీనా.." అని తన మొబైల్ బయటకు తీసి "ఇంతకీ మీ నంబరు చెప్పలేదు" అన్నాడు...

"అవును" అని సమధానమిచ్చింది ఆ అమ్మాయి..

జరిగేదంతా నేను నిశ్శబ్దంగా చూస్తున్నాను...ఇంత నిశ్శబ్దంగా అప్పుడెప్పుడో నా కెమిస్ట్రీ ల్యాబు పరీక్షలో మా ప్రొఫెసర్ నన్ను Viva క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు ఉన్నా.....మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత ఇప్పుడు...

ఆ అమ్మాయి తన దగ్గరున్న లిస్టులో ఏవో టిక్కు మార్కులు పెట్టి మా ఇద్దరినీ ఇంకో నలుగురు అమ్మాయిలున్న టీములో వేసింది...

"అదిగో మీ టీము వాళ్ళు అక్కడున్నారు" అని రూము చివర్న పూల బుట్ట పక్కనున్న అమ్మాయిల వైపు చూపించింది..

దినకర్ గాడు ఆ రెజిస్ట్రేషన్ అమ్మాయితో ఏదో మాట్లాడుతుండంగానే నేను మా టీమ్మేట్స్ వైపు వెళ్ళాను...ఆ నలుగురిలో ఒకమ్మాయికి బుగ్గ మీద సొట్టుంది....

"నన్ను మీ టీం లో వేసారండి" అన్నాను ఆ అమ్మాయిని చూసి...

"అలాగా...నా పేరు స్మిత...మీరు?" అని చెయ్యి ముందుకు చాచింది..

"గౌతం" అని షేక్ హ్యాండు ఇచ్చాను...

షేక్ హ్యాండు ఇస్తుంటే...నా జీవితాన్ని షేక్ చేసి నాకు హ్యాండిచ్చిన 'సునయన ' గుర్తొచ్చింది..


-------------------------------
Flashback - 2
-------------------------------

సునయన - నా రెండో ఫస్ట్ లవ్...ట్రివేండ్రం అమ్మాయి...ఇంజనీరింగ్ లో నా క్లాస్మేట్...నేనెప్పుడు కనిపించినా నవ్వుతూ షేక్ హ్యాండిచ్చేది..తను నా చెయ్యి తాకినప్పుడల్లా నా జీవితం బృందావన్ గార్డెన్స్ లాగా అందంగా కనిపించేది....

సునయన ను కలిసిన మొదటి నెలలోనే నిర్ణయించుకున్నాను....'జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే సునయన నే చేసుకోవాలి'* అని....

(*కుదరక పొతే వేరే అమ్మయిని చేసుకుందాం)

మా మూడవ సంవత్సరం కాలేజీ వార్షికోత్సవానికి మేము గ్రూప్ డాన్సు చెయ్యాలని అనుకున్నాము..ఏ పాటకు చెయ్యాలనే విషయం మీద మొదలయ్యింది గొడవ...

"మనము చెసేది శాస్త్రీయ నృత్యం కాబట్టి 'నిన్నా కుట్టేసినాది, మొన్న కుట్టేసినాది గండు చీమా ' అనే తెలుగు పాటకు చేద్దాము " అని నేను...."కాదు 'ఓణం, ఆణో, పెణ్ కుట్టి' అనే మళయాళం పాటకు చేద్దామని సునయన.....చివరకు మా గ్రూపు లోని మిగతావాళ్ళంతా మళయాళం పాటకే ఓటేసారు. ఆ అవమానాన్ని నేను భరించలేకపోయాను. సునయన తో తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నాను...తను ఎప్పుడో గిఫ్టుగా నాకిచ్చిన నట్రాజ్ పెన్సిల్, ఇమామి కోల్డ్ క్రీం తనకు తిరిగిచ్చేసి - వెనక్కు తిరిగి చూడకుండా వచ్చేసాను..

(ఇందాక flashback మొదలవ్వకముందు సునయన నాకు హ్యాండిచ్చిందని అన్నాను కద....సారీ....నేనే హ్యాండిచ్చాను)


---------------------------------------

"ఎలా ఉంది ముగ్గు" అంది స్మిత...

ఉలిక్కిపడి, ఉలిక్కిలేచి...ముగ్గు చూసాను.."నన్ను పెళ్ళి చేసుకుంటావా స్మిత" అనటానికి మళయాళం లో ఏమంటారో అని ఆలోచిస్తుండగా దినకర్ గాడు నా దగ్గరకు వచ్చి "రేయ్..నేనిప్పుడే వస్తాను..అలా వాకిట్లోకెళ్ళీ కుందేలునో, జింకనో పట్టి తీసుకురావాలి" అన్నాడు...

"ఏమి మాట్లాడుతున్నావు రా...ఒక్క ముక్కా అర్థమవ్వట్లేదు" అన్నాను..

"అదిగో అక్కడ మంచి నీళ్ళు తాగుతోందే అమ్మాయి..ఆ అమ్మయిని పేరు అడిగాను రా..'పట్టీ పో' అంది...సీత రాముడిని అడిగినట్టు జింకనో, కుందేలునో పట్టి తీసుకు రమ్మందేమొనని వెళ్తున్నా" అన్నాడు...

"రేయ్ మూర్ఖుడా...'పట్టి' అంటే మళయాళం లో 'కుక్క' అని అర్థం రా"

"అవునా??"

"అవును...'పట్టి పో' అంటే......'నీ కుక్క బుధ్ధులు ఇంకెక్కడైన చూపించుకో పో...ఆ 67 రూపాయల చల్లద్దాలు తీసెయ్యి..గౌతం దగ్గర తీసుకున్న cd లు, లీటర్ పెట్రోలు ఎప్పుడూ తిరిగిస్తావు బే....TVS-50 చెట్టుకు కట్టెయ్యటమేంట్రా గులాబి రంగు జీన్సు ప్యాంటు వెధవా" అని అర్థం" అన్నాను....

"పేరు అడిగినందుకు పేరగ్రాఫ్ పొడుగు తిట్టు తిట్టిందా పట్టి మొహం ది"....అని కాస్సేపు బాధపడి...."ఏంటోరా..ఈ రోజు అంతా రివర్సే...నువ్వు ఆ ముగ్గు గొడవలో ఉండగా 14 మంది అమ్మాయిలను ట్రై చేసాను...ఒక్కరూ వర్క్ అవుట్ అవ్వలేదు.........సరే..నీ పరిస్థితి ఏంటి" అనడిగాడు...

"నాతోరా...Mrs.గౌతం ను పరిచయం చేస్తాను" అని స్మిత దగ్గరకు తీసుకెళ్ళాను..

స్మిత కూడా తన ఫ్రెండు ఎవరినో నాకు పరిచయం చెయ్యటానికి తీసుకొచ్చింది..

"దిసీజ్ గౌతం...ముగ్గుల పోటీలో మా టీం లో ఉన్నాడు..మళయాళం బాగా మాట్లాడతాడు తెలుసా" అంది..

"అవునా...ఎలా నేర్చుకున్నారు మళయాళం?" అడిగింది ఆ అమ్మాయి..

"నేను TV లో ఎప్పుడూ మళయాళం చానెల్స్ చూస్తూ ఉంటానండి..అలా పట్టేసాను..నా డ్రస్సు చూసారా....మొన్న శనివారం రాత్రి 'సూర్య' టీవీ లో చూసిన మళయాళం సినిమాలోని కాస్ట్యూంసే ఈ నా ఈ డ్రస్సుకు ఇన్స్పిరేషన్" అన్నాను...

దినకర్ గాడు నా భుజం మీద గిల్లి - "శనివారం రాత్రి 'సూర్య' టీవీ లో మనము చూసిన సినిమాలో అసలు హీరో, హీరోయిన్లు కాస్ట్యూంసే వేసుకోలేదు కద రా" అన్నాడు...

స్మిత, స్మిత స్నేహితురాలు నా వైపు అస్సహ్యంగా చూసి - "ఓణం, ఆణో, పెణ్ కుట్టి" అని ఛీదరించుకును వెళ్ళిపోయారు..

కళ్ళలో నీళ్ళతో దినకర్ గాడి వైపు చూసాను..

"సారీ రా...తప్పు చేసాను...క్షమించు" అన్నాడు...

"తప్పు నీది కాదులేరా...ఎందుకో చెబుతా విను....నీ Orkut ప్రోఫయిల్ లో, పర్సనల్ డీటెయిల్స్ లో 'Ideal Match' పక్కన 'India vs Pakistan in sharjah' అని రాసుకున్న ఏబ్రాసి వెధవవి నువ్వు..ఇది తెలిసి కూడా నాకిష్టమైన అమ్మాయిని పరిచయం చెయ్యటానికి తీసుకెళ్ళానే....నాది రా తప్పు....నా పేరు మార్చుకోవాలి రా 'దినకర్ ' అని....." అని ఏడ్చేసాను..

ఆ రోజు రాత్రి ఇంటికెళ్ళే సరికి నీల్ విజయ్ గాడు అందరికీ పార్టీ ఇచ్చాడు...నా మూడో ఫస్ట్ లవ్ ఫెయిలైనందుకు...ఆ తరువాత మా వాళ్ళు కూడా ముగ్గుల పోటీ నిర్వహించారు.....ఇదిగో..మొదటి బహుమతి పొందిన ముగ్గు -

Thursday, August 28, 2008

వివాహ భోజనంబు - వింతైన వంటకంబు

ఆగస్టు 24, 2008 – ఎవ్వరూ నమ్మని కొన్ని విచిత్రాలు జరిగాయి

- హైదరాబాదు లో హుస్సేన్ సాగర్ లోని చెత్తా చెదారం తీసేసి త్రాగు నీటి కొలను గా మార్చారు.

- లాస్ ఏంజెలస్ లో స్టీవన్ స్పీల్బర్గ్ తన తదుపరి చిత్రం బిజీ ఆర్టిస్టు నందమూరి తారకరత్న తో తీస్తున్నట్టు ప్రకటించాడు.

- బెంగళూరులో ఉంటున్న నేను ఇకపై రోజూ ఇంట్లో వంట చేసుకుని తినాలని నిర్ణయించుకున్నాను.


"ఇకనుండి రోజూ ఇంట్లోనే వంట చేద్దాం" అనుకునే ప్రతి బ్రహ్మచారి లాగనే నేను కూడా 'Food World' కు వెళ్ళి పది కిలోలు బంగాళా దుంపలు, పది కిలోలు ఉల్లిపాయలు, పది కిలోలు గట్రాలు, ఇంకో పది కిలోలు వగైరాలు తీసుకుని కొట్టు బయటకు అడుగుపెట్టాను....రెండు ఆటోలు మాట్లాడాను – రెండూ కూరగాయలకే...నేను డ్రైవర్ పక్కన కూర్చున్నా.......

కాస్త దూరం వెళ్ళాక ఆటో డ్రైవర్ తన జేబు లోంచి ఒక కార్డు తీసి – "సార్...ఇది మా తమ్ముడు సూర్య ప్రకాష్ ఫోన్ నంబరు....పెళ్ళికి కావలసిన షామియాన, వంట సామాను అద్దెకు ఇస్తాడు....వాడి దగ్గరే తీసుకోండి సార్ " అన్నాడు.......

"ఎవరి పెళ్ళికి?" అడిగాను నేను.....

"ఈ కూరగాయలన్నీ......"

"ఈ రోజు నుండి నేను రూము లో వంట చేసుకోవటం మొదలు పెడుతున్నా.....అందుకే నెలకు సరిపడ కూరగాయలన్నీ తెచుకున్నా....ఇవ్వాళ సాంబార్ వండుకుంటున్నా"

ఆటో వాడు రెండు నిముషాలు మౌనంగా ఆటో నడిపి.....ఇంకో కార్డు జేబులోంచి తీసి.... "సార్…ఇది శంకర్ నారాయణ అని మా ఎదురింటాయన నంబరు...ఆయన పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లలో మిగిలిపోయిన కూరగాయలు కొని వాటిని హోటళ్ళకు అమ్ముతుంటాడు....మీరు 'ఇక వంట నా వల్ల కాదు' అనుకున్నప్పుడు ఫోను చేస్తే మీ ఇంటికొచ్చి కూరలన్నీ కలెక్టు చేసుకుని వెళ్తాడు...................మీరు ఇవ్వాళ సాయంకాలానికి ఫోను చేస్తారని చెప్పనా సార్ ఆయనతో?" అన్నాడు

ఆటో వాడు నన్ను ఇంతగా అవమానించి నందుకు ఆటో ఆపి...కిందకు దిగి…రెండు చేతులూ పైకి లేపి… "ఈ రోజునుండి నా వంట నేను చేసుకు తింటాను...లేక పోతే ఉపవాసముంటాను.....ఏ మెరీ అఖండ్ ప్రతిగ్యా హై " అని భీష్మ ప్రతిఙ చేసాను.....ఆకాశం నల్ల బడింది....ఉరుములు, మెరుపులు, వర్షం...మబ్బుల సందులోంచి దేవతలు పూలు చల్లారు.........

దేవతల వేషం వేసిన ఎక్స్ట్రాలకు, వర్షం కురిపించిన ఫైర్ ఇంజన్లకు డబ్బులిచ్చి పంపించేసాక…..ఇల్లు చేరుకున్నాను….

మొదటి సారి వంట చేయ్యబోతున్నాను కదా....మా అమ్మకు చెబితే సంతోషిస్తుందని ఇంటికి ఫోను చేసా........సరే ఎలాగూ ఫోన్ చేసాను కదా అని ఒక చిన్న డౌటు క్లియర్ చేసుకుందామనుకున్నా......

"అమ్మా...సాంబార్ ఏలా చేస్తారు?"

"ఎవరు?" అడిగింది అమ్మ

"ఎవరైనా ఎలా చేస్తారు?"

"ఎందుకు?"

"అబ్బా.......నేను ఈరోజు ఇంట్లో వంట చేస్తున్నానమ్మా......అందుకే అడిగా...ఎలా చేస్తారో చెప్పు "

"అవునా........నువ్వు వంట చేసుకుంటున్నావా........" అని అంతులేని ఆనందంతో మా అమ్మమ్మను పిలిచి.. "అమ్మా.....గౌతం వంట చేసుకుంటున్నాడంట....." అని అరిచి చెప్పింది.........మా అమ్మమ్మ చేస్తున్న పని వదిలేసి....మా పనిమనిషి కి, మా పక్కింటి డ్రిల్ మాస్టారి పెళ్ళానికి.. "నా మనవడు వంటచేసుకుంటున్నాడంట " అని మా అమ్మకన్నా గట్టిగా అరిచి చెప్పింది.....దానికి మా పనిమనిషి "అయ్యయ్యో.....వంటలు చేసుకుని బతుకుతున్నాడామ్మా" అని అడిగింది...

నాకిక్కడ ఫోను బిల్లుతో పాటు BP కూడా పెరుగుతోంది......."అమ్మా....సాంబార్ ఎలా చెయ్యాలో చెబుతావా లేదా " అన్నాను...

మా అమ్మ "సరే....ముందు కూరగాయలన్నీ తరిగి.......పెళ్ళి చేసుకోరా" అంది...

"ఎంటి సాంబార్ చెయ్యాలంటే పెళ్ళి చేసుకోవాలా?"

"కాదు....పెళ్ళి చేసుకుంటే ఈ కష్టాలన్నీ ఉండవని............కూరగాయలు తరిగి...ఒక పక్కన పెట్టుకో"

ఎవరో కాలింగ్ బెల్లు కొట్టారు....

మా అమ్మ – "కాలింగ్ బెల్లు తరువాత కొట్టొచ్చు....ముందు కూరగాయలు తరుగు"

"నేను కాదమ్మా....ఎవరో వచ్చినట్టున్నారు......నేను తరువాత ఫోను చేస్తా " అని ఫోను పెట్టేసాను..

సాంబార్ లో పుడక లాగా వీడెవడని తలుపు తెరిచాను..

"ఎవరు కావాలండి?"

"సార్.. గౌతం అంటే..."

"నేనే...చెప్పండి "

"సార్....శ్రీనివాసులు మీకు నా కార్డు ఇచ్చానన్నాడు....అదే ఆటో డ్రైవరు.............నా పేరు శంకర్ నారాయణ సార్"

"ఆ.....చెప్పండి"

"ఎన్ని కూరగాయలున్నయో చూపిస్తే ఒక రేటు అనుకోవచ్చు "

"ఆ అవసరం లేదండి...ఏమైనా విషయముంటే నేనే మీకు ఫోను చేస్తాను"

"నేను కింద మీ సెక్యూరిటీ వాడితో మాట్లాడుతూ ఉంటాను....ఫోను చెయ్యండి సార్....రెక్కలు కట్టుకుని లిఫ్టులో వచ్చేస్తాను" అని వెళ్ళిపోయాడు....

మా అమ్మ కాని, అమ్మమ్మ కాని వంట చెయ్యటం మొదలు పెట్టాగానే TV ఆన్ చేస్తారు....TV లో వచ్చేది వింటూ చెయ్యకపోతే ఆ రుచి రాదు...అందుకే నేను కూడా TV ఆన్ చేసాను...

ఏదో తెలుగు చానెల్...."ప్రపంచంలో మొట్టమొదటి live వంటల కార్యక్రమానికి ప్రేక్షకులకు స్వాగతం.....గత కొద్ది వారాలుగా మాకు వచ్చిన ఉత్తరాల్లో చాలా మంది అడిగిన కోరిక ఒకటుంది....బ్రహ్మచారులు ఇళ్ళల్లో వండుకునే వంటకాలేమైనా చూపించండి అని....అందుకే ఈ వారం మనము బెంగళూరు విజయనగర్ లోని 'హనుమాన్ అపార్ట్మెంట్స్' కు వెళ్తున్నాము...."


నేను ఇవ్వాళ పొద్దున మా గేటు బయట పడుకునే నక్క తోక పచ్చడి పచ్చడి గా తొక్కినట్టున్నాను....లేక పొతే ఇంత అదృష్టమా??....నేను వంట చెయ్యాలనుకున్న రోజే ఎవరో బ్యాచిలర్స్ ఇంట్లో వంట కార్యక్రమం live.....బ్రహ్మచారుల కొంప కాబట్టి ఆడవాళ్ళెవ్వరూ వచ్చి "ముందు పాత్రలు కడుక్కోవాలి..ఇల్లు శుభ్రంగా వూడవాలి...jeans కనీసం రెండు సంవత్సరాలకు ఒక సారి ఉతుక్కోవాలి " లాంటి టిప్స్ ఇవ్వరు......

నేను బంగాళా దుంపలు తరుగుతూ TV చూస్తున్నాను..

"హెలో..ఎవరండీ లోపల??" అని తలుపు కొడుతూ అడిగింది మైకు పట్టుకున్నావిడ...

లోపలినుండి ఎవరో తలుపు సగం తెరిచి చెయ్యి మాత్రం బయట పెట్టారు...

"హెలో...మేము NAA TV నుండి వస్తున్నామండి....మాకు ఉత్తరం వచ్చింది ఈ అడ్రసు నుండి... నిమ్మల వెంకట రావు గారు ఉన్నారా?"

చెయ్యి లోపలకు తీసుకుని తలకాయ బయటకు పెట్టాడు ఆ లోపలున్నతను....."ఒహ్..మీరు నిజంగా TV వాళ్ళా....రెండు నిముషాలు ఉండండి" అని తలుపు వేసేసాడు....

ఆ మైకు పట్టుకున్నావిడ మొహం లో చిరునవ్వు ఏ మాత్రం చెరిగిపోకుండా కెమేరా వైపు చూసి.."చూస్తున్నారుగా....తమ ఇంట్లో చెయ్యబోయే వంటలు చూపించటానికి వీళ్ళు ఎంత ఉత్సాహంగా ఉన్నారో....ఏమి వండబోతున్నారో తెలుసుకోబొయ్యేముందు మీరు తీసుకోండి ఒక చిన్న BREAK"....

నేను కూరగాయలు తరగటం నుండి చిన్న బ్రేకు తీసుకుని స్టవ్ మీద గిన్నె పెట్టి....అందులో నీళ్ళు పోసి స్టవ్ వెలిగించాను...................నీళ్ళు ఘమ ఘమ లాడిపొతున్నాయి.......ఇంక సాంబార్ సూపర్ హిట్టే.....

స్టవ్ మీద నీళ్ళున్నాయి..తరిగిన కూరలున్నాయి..ఆ తరువాత ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తుండగా మా అన్నయ్య ఫోనొచ్చింది...

" రేయ్...నేను ఇవ్వాళ సాంబార్ వండుతున్నాను....తరిగిన కూరగాయలు నీళ్ళు ఉడికాక వెయ్యాలా....నీళ్ళు ఉడకకముందే వెయ్యాలా?" అని అడిగాను..

"నీళ్ళు 'ఉడకట'మేంట్రా....'మరగటం' అనాలి....వంట తరువాత నేర్చుకుందువు గాని...ముందు తెలుగు నేర్చుకో"....

"సరే...ఫోనెందుకు చేసావో చెప్పు"....

"కాస్త తలనొప్పిగా వుంటే ఏ మాత్రలు వాడాలి అని అడుగుదామని ఫోన్ చేసా"..

"ఓ...తలనొప్పా....మెన్నీమధ్య ఎక్కడో చదివాను..'లంఖణం పరమౌషధం' అని...కాబట్టి..నువ్వు వెంటనే మెడికల్ షాపుకెళ్ళి మూడు లంఖణాలు తెచ్చుకో...పూటకొకటి వేసుకో...........భోజనం తరువాత" అన్నాను....

మా వాడు సమాధానమేమి ఇవ్వకుండా ఫోను పెట్టేసాడు..

సరే...అన్నింటికీ నల-భీములే ఉన్నారనుకుని........

మరిగే (ఉడికే) నీళ్ళలో తరిగిన కూరగాయలు వేసా.....
సాంబార్ పొడి పాకెట్టు కట్ చేసి ఒక దోసిట్లో సరిపడా పొడి వేసా.....
ఉప్పేసా...కారమేసా...
దాహంగా ఉంటే కొన్ని నీళ్ళు తాగి...కొన్ని గిన్నెలో పోసా..
చక్కెర డబ్బా మీదకెక్కుతున్న చీమను నలిపేసా..

(భలే...నాకు తెలియకుండానే ఒక డబ్బింగు సినిమా పాట రాసేసా)

ఇంతలో TV లో బ్రేకు అయిపొయ్యింది...నేను గబ గబా గిన్నె మీద మూత తీసి TV ముందు కూర్చున్నా.....

బ్రేకు టైములో ఆ ఇంట్లోని బ్యాచిలర్సంతా నిద్ర లేచి...తలకు నీళ్ళు రాసుకుని, తలలు దువ్వుకుని తయారయ్యినట్టున్నారు....

ఆ మైకావిడ కెమేరా వైపు చూసి "Welcome back.....ముందుగా ఈనాటి మన హోస్ట్లు ఏమి చేస్తుంటారో తెలుసుకుందాం....చెప్పండి వెంకట్రావు గారు...ఏమి చేస్తుంటారు మీరు?" అంది...

వెంకట్రావు సమధానమిచ్చే లోపు అతని పక్కనున్న లుంగి కట్టుకున్న బ్యాచిలర్ మైకు లాక్కుని "రాత్రుళ్ళు బాత్రూము లైటు ఆఫ్ చెయ్యకుండా పడుకుంటుంటాడు....నేను ఉతుక్కున్న సాక్సులు, డ్రాయర్లు, ఇస్త్రీ చేసుకున్న చొక్కాలూ వేసుకెళ్తుంటాడు.....మీరు TV లో కనిపించినప్పుడు 'మాంచి కసక్కు' అని అంటుంటాడు.........." అని ఇంకా ఏదో చెప్పబొయ్యేలోపు వెంకట్రావు వాడి నోరు మూసేసి...."ఆవిడ అడిగింది ఏ ఉద్యోగం చేస్తుంటానని రా...........మేడం..మనము నేరుగా విషయానికి వచ్చేద్దాం" అన్నాడు.....

"ఓకే ఐతే...మా ప్రేక్షకుల కోసం ఈ రోజు ఏ వంటకం చెయ్యబోతున్నారు"

"ప్రతి బ్రహ్మచారి గర్వంగా...తలెత్తుకుని...రోజూ వండుకునే వంటకమే..........Noodles"....అన్నాడు...

"ఓ...గ్రేట్....మొదలెడదామా"

"ఒక్క నిముషమండీ....రెండు మూడు వస్తువులు తెప్పించాలి..." అని.......ఇందాకటి నుండి తన close-up తీయమని కెమెరా మెన్ ను బతిమాలుతున్న బ్యాచిలర్ దగ్గరకు వెళ్ళి..."రేయ్ ప్రసాదు..నువ్వు వెంటనే బయటకెళ్ళి...టొమేటోలూ, ఉల్లిపాయాలు, ఉప్పు, కారం, జింజర్-గార్లిక్ పేస్టు తీసుకురా.......అలాగే వచ్చేప్పుడు ఒక నూడుల్స్ పాకెట్టు, గ్యాస్ సిలిండర్ కూడా తీసుకురా" అని చెప్పి పంపించేసాడు...

మైకావిడ మళ్ళీ కెమేరా వైపు తిరిగి...."ప్రసాద్ గారు వస్తువులు తెచ్చేలోపు మనము తీసుకుందాం....ఒక చిన్న...” అని వెంకట్రావు, లుంగీ బ్యాచిలర్ వైపు చూసింది....వెంటనే ముగ్గురూ కలిసి.....కెమెరా కు బొటన వేలు చూపించి..... "BREAK" అన్నారు....

ఇందాక వెంకట్రావు జింజర్-గార్లిక్ పేస్టు అన్నది గుర్తొచ్చి వెంటనే నేను గిన్నె మీద నుండి మూత తీసేసి రెండు చెంచాలు జింజర్-గార్లిక్ పేస్టు వేసాను....కాసేపు గరిటె తో తిప్పుతూ ఉండగా ఎవరో కాలింగు బెల్లు కొట్టారు..

వెళ్ళి తలుపు తీసాను...మా ఇంటి ఓనరు...

"ఏంటి సార్"

"మీ ఇంట్లోంచి ఏదో రబ్బరు కాలిన వాసనొస్తోందయ్యా...అందుకే ఇలా వచ్చా" అని....హిడింబాసురుడి లాగా..."రబ్బరు వాసన.....రబ్బరు వాసన" అని అరుస్తూ వంటింటి వైపు పరిగెట్టాడు....

మర్డరు వెపన్ ను పసిగట్టిన పోలీసు కుక్క లాగ.....నా సాంబారు గిన్నె ముందు నిలబడ్డాడు మా ఓనరు....."ఏంటయ్యా...వంట చేస్తున్నావా...ముందే చెప్పుంటే టిప్స్ ఏమైనా ఇచ్చేవాడిని కదా.....ఏమి వండుతున్నావ్?" అని అడిగాడు...

"సాంబార్ సార్"

"అలాగా...ఉండు మా ఆవిడ వంటలోకి వాడే మసాలా పొడి తెస్తాను" అని పరిగెత్తుకెళ్ళి ఏదో పొడి తీసుకొచ్చి నేను ఎంత వద్దంటున్నా వినకుండా నా సాంబారు లోకి వేసాడు....

రెండు నిముషాలు....నేను మా ఓనర్ని, మా ఓనరు సాంబారు గిన్నెని చూస్తూ గడిపాము...

"ఇప్పుడు నిజంగా వస్తోంది సార్....రబ్బరు కాలిన వాసన...ఏం పొడి సార్ అది?" అని ఆడిగాను...

"ఏదైతే నీకెందుకు, ఓ ఇరవై నిముషాల పాటు మూత పెట్టుంచు...ఆ తరువాత చూడు.....మహత్తరంగా ఉంటుంది" అని వెళ్ళిపొయ్యాడు...

TV లో బ్రేకు అయిపొయ్యింది....మైకావిడ, వెంకట్రావు, లుంగి బ్రహ్మచారి..ముగ్గురూ కుర్చీల్లో కూర్చుని ఉన్నారు....

ఇంతలో ఆ ప్రసాదు చేతిలో ప్లాస్టిక్ సంచితో రూములోకి వచ్చాడు...

"ఏంట్రా...అన్ని వస్తువులు తెమ్మని పంపితే చిన్న సంచితో దిగావు??"

"కిందకెళ్ళి చూస్తే బండి పంక్చర్ అయ్యింది రా.....ఆటోలో అన్ని తీసుకురావటం ఎందుకు ఖర్చు అని.....మురుగదాస్ హోటలుకెళ్ళి నూడుల్స్ పార్సెల్ తెచ్చాను.."............

ఆ గదిలో అందరు నిశ్శబ్దంగా నుంచున్నారు.....

వెంకట్రావు ఉండబట్టలేక....."నూడుల్స్ పార్సెల్ తేవటమేంట్రా........ఇక్కడ TV వాళ్ళు ఉన్నారని తెలుసు గా.." అన్నాడు కోపంగా...

"తెలుసు రా....వాళ్ళకు కూడా రెండు ప్లేట్లు పార్సెల్ తెచ్చాను" అని కవర్లోంచి మూడు పొట్లాలు తీసి చూపించాడు....

ఇదంతా చూస్తున్న మైకావిడ అతని వైపు చూసి..."నిజం చెప్పండి....వీళ్ళు మిమ్మల్ని ప్రసాద్ అంటున్నారు కానీ....మీ అసలు పేరు దినకర్ కదూ".....అంది

"మీకెలా తెలిసింది మేడం?? మా ఇంట్లో వాళ్ళు, నా ఫ్రెండ్సు నన్ను ప్రసాద్ అని పిలుస్తారు కాని...నా అసలు పేరు దినకర్....ఎలా చెప్పగలిగారు మీరు" అనడిగాడు...

నాకు చిరాకేసి TV కట్టేసాను.......వంటింట్లోకి వెళ్ళాను....

ఇందాక రబ్బరు కాలిన వాసన ఇప్పుడు ఎలక చచ్చిన వాసన గా మారింది.....భయం భయంగా గిన్నె మీద ఉన్న మూత తెరిచాను......

నలుపు, పసుపుపచ్చ, నీలం రంగులు కలిపితే వచ్చే రంగులో ఉంది ఆ గిన్నె లోని పదార్థం......ముక్కుకి కర్చీఫు కట్టుకుని అదంతా ఒక చిన్న టిఫిన్ డబ్బాలోకి వేసి మా ఓనర్ వాళ్ళ ఆవిడకిచ్చాను........ఆ వంటకం పేరు 'కాలా పథ్థర్' అని....మా ఓనరు గాడికి తినిపించమని చెప్పి వచ్చాను........

ఫోను తీసుకుని శంకర్ నారాయణ నంబరు డయల్ చేసాను......"హెలో....ఆ...పైకి రండి....ఒక రేటు అనుకుందాం".........

వంట చెయ్యటం అస్సలు రాకుండానే.....టన్నులకొద్దీ కూరగాయలు కొని....ఆవేశం తో వంట మొదలుపెట్టి....చేతికి దొరికినవన్నీ వేసి వండి....మధ్యలో మా ఓనరు లాంటి cookక ను వేలు పెట్టనిస్తే.....ఇలాగే ఉంటుంది...............రమణ గోగుల, అను మలిక్ కలిసి పాడిన పాటకు కృష్ణ, రాజశేఖర్ కలిసి డాన్సు చేసినట్టు!

Wednesday, May 21, 2008

ఆకాశ వీధిలో ' ఆకుపచ్చ కన్నీరు '

'ఆకుపచ్చ కన్నీరు ' అనేది చంటబ్బాయి సినిమాలో జంధ్యాల గారు వాడిన మాట.

మనిషి కి శారీరకంగా కానీ, మానసికంగా కానీ తట్టుకోలేని బాధ కలిగినప్పుడు కన్నీళ్ళొస్తాయి. బాధకలుగుతోంది శరీరానికో, మనసుకో డిసైడ్ చేసుకోనీకుండా మన ప్రాణానికి నరక యాతన కలుగుతున్నప్పుడు మన ఆత్మ పెట్టేది 'ఆకుపచ్చ కన్నీరు '
.
-----------------

గత నెలలో ఆఫీసు పని మీద హైదరాబాదు వెళ్ళాల్సి వచ్చింది. ట్రావెల్ డెస్కు వాడు సెలవు పెట్టటంతో నేనే రంగం లోకి దిగాను.

online booking చేసుకునేప్పుడు పెద్దల సహాయం తీసుకోమన్నారు పెద్దలు. "ఏ ఫ్లైటు చేయించుకోమంటారు అలౌకాంకిత గారు" అని పెద్దగా అడిగాను అలౌకాంకిత గారిని...

"Deccan Airways లో చేయించుకోండి..ఉండే ఫ్లైట్ల లో అన్నింటికన్నా చీప్ అదే" అంది ఆవిడ..సరేనని Deccan Airways వెబ్ సైటు తెరిచి హైదరాబాదుకు one way ఫ్లైట్ సెలెక్టు చేసుకున్నా..క్రెడిట్ కార్డు నంబరు అడిగింది...ఇచ్చా..వెంటనే "Payment received - Flight cancelled...దిక్కున్నచోట చెప్పుకో పో" అని మెసేజ్ వచ్చింది.ఏమి చెయ్యాలో తోచక అలౌకాంకితను పిలిచి జరిగినిది చెప్పా..

"మీకు కూడా ఇలాగే జరిగిందా..ఐతే నేను విన్నది నిజమేనన్న మాట" అని నవ్వటం మొదలు పెట్టింది.

నాకు కోపం, అసహ్యం, చిరాకు కలిసి ఏడుపొచ్చింది. "నీవు భవిష్యత్తు లో ఇలాంటి దుర్మార్గాలు చేస్తావనే మీ అమ్మా నాన్నా నీకా దిక్కుమాలిన పేరు పెట్టింది...అలౌకాంకిత అంట....ETV సీరియళ్ళ టైటిల్ గా పెట్టుకోవటానికి తప్ప ఇంకెందుకూ పనికిరాదే నీ ముష్టి పేరు.." అని ఎప్పటినుండో అణుచుకున్న కోపాన్ని వెళ్ళగక్కాను.

మళ్ళీ నేనే బుక్ చేసుకోవటానికి ప్రయత్నించి క్రెడిట్ కార్డెందుకు కాల్చుకోవటం అని...రమేష్ రెడ్డి కి ఫోన్ చేసి విషయం చెప్పా. ఫ్లైట్ల ఫేర్ లతో ఒక మెయిల్ చేసాడు.

" రేయ్..ఈ కింది ఫేర్లు చూసి నీకు ఏది కావాలో చెప్పు...చేయిస్తా -

Spice Jet - fare: Rs 200 - tax: Rs 1,99,800
Jet Airways - fare: Rs 150 - tax: Rs 1,99,800
Kingfisher - fare, tax తరువాత...ముందు కింద చూడు -

మరుక్షణమే రమేష్ కు ఫోన్ చేసి "Kingfisher లో చేయించు..ప్రయాణం సుఖప్రదంగా ఉంటుంది" అన్నాను.

దానికి రమేష్ "నెను మెయిల్ లో Kingfisher ఫేర్ రాయలేదు కానీ ఉండేవాటిలో అన్నింటికన్న ఎక్కువ అదేరా...అనవసరమైన డబ్బు ఖర్చు...ఆలోచించుకో" అన్నాడు..

నేను వెంటనే నా పక్కనున్న టేప్ రికార్డర్ లో భగవద్గీత క్యాసెట్టు ప్లే చేసి - " పిచ్చివాడా...తుచ్చమైన, అశాశ్వతమైన ధనం కోసం ఏ ఫ్లైటులో పడితే దానిలో ప్రయాణం చేస్తామా...నో....వేరే ఆలోచనలు లేకుండా Kingfisher లో చేయించు....డబ్బు మా అన్నయ్యనడిగి తీసుకో....సర్వేజనా సుఖినోభవంతు!" అని ఫోన్ పెట్టేసాను.

మరుసటి రోజు ఎడమ చేతిలో ఫ్లైట్ టికెట్టు, కుడి చేతిలో బాగు...గుండెలో ఆ air hostess ల ఫొటో తో ఫ్లైట్ ఎక్కాను...ఒక్కొక్కరుగా air hostess లు దర్శనమిచ్చారు. ఆర్.నారాయణ మూర్తి సినిమా షూటింగ్ ఎగరగొట్టి నేరుగా ఇక్కడకు వచ్చినట్టు...అందరూ ఎర్రని దుస్తుల్లో ఉన్నారు. విజయ్ మాల్యా Kingfisher బీర్లు 10,12 తాగి స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు...పనిలో పనిగా అక్కడి అప్సరసలను campus recruitment లో భూలోకానికి తీసుకొచ్చి ఇక్కడ Air hostess లుగా నియమించినట్టున్నాడు.

ఫ్లైట్ లో చాలా సేట్లు ఖాళీగా ఉన్నాయి...నా సీటు దగ్గరకు వెళ్ళాను...నా పక్క సీట్లలో ఇద్దరు కూర్చుని ఉన్నారు...నా సీట్లో నేను సెటిల్ అయ్యాను...

ఏదో అనౌన్సుమెంటు వచ్చింది. ముగ్గురు అప్సరసలు వరుసగ నుంచొని...సీటు బెల్టులు ఎలా పెట్టుకోవాలి, ఫ్లైటు సముద్రం లో పడిపోతే బాధ తెలియకుండా ఎలా చావాలి...లాంటి విషయాలు చెప్పటానికి.. చిన్నప్పుడు స్కూల్లో డ్రిల్ పీరియడ్ లో చేసే ఎక్సర్సైసులు చేసి చూపించారు.

మరో అనౌన్సుమెంటు వచ్చింది.... ఒక సీనియర్ అప్సరస మైకందుకుని "ఫ్లైట్ take off కి సిద్ధంగా ఉంది...దయ చేసి ప్రయాణికులంతా తమ తమ సీట్లలో కూర్చోవలసిందిగా ప్రార్థన" అని చెప్పింది. అంతే...అంతవరకు సీట్లలో కూర్చున్న వారంత ఒక్కసారిగా లేచి బాత్రూముకు, వెనక సీటు వాళ్ళతో మాట్లాడటానికి వెళ్ళారు...."దయచేసి కూర్చోండి...ఇంకో పది నిముషాల్లో మనము గాల్లో ఉంటాము..అప్పుడు కావలంటే బాత్రూముకు వెళ్ళొచ్చు....ప్లీజ్...." అని వేడుకుంటోంది సీనియర్ అప్సరస...లాభం లేదు...ఎవడి పనులు వాడు తీరిగ్గా ముగించుకొని వచ్చి తమ సీట్లలో కూర్చున్నారు...

ఫ్లైట్ take off కు రెడీ గా ఉంది అంటే మళ్ళీ ఇలానే చేస్తారని ఈ సారి అనౌన్సుమెంటు చెసేప్పుడు కాస్త జాగ్రత్త పడింది Air hostess..."ప్రయాణికులారా..మనము ఇప్పుటప్పటిలో బయలుదేరెట్టు లేము. కాకపోతే మీరు మీ సీటు బెల్టు పెట్టుకోండి...కంగారు
పడకండి...మనము ఎక్కడకు వెళ్ళట్లేదు.....ఉత్తినే..." అంది.. అందరూ చక చకా సీటు బెల్టు పెట్టేసుకున్నారు...

ఇలాంటి చాన్సు మళ్ళీ దొరకదని ఆ air hostess పైలెట్ వైపు తిరిగి గట్టిగా "ఉస్కో" అని అరిచింది......రన్వే మీద కూడా పోనివ్వకుండా డైరెక్తుగా గాల్లోకి ఫ్లైటు లేపాడు పైలెట్.....

గాల్లో ఉన్నాము...

అప్సరసల్లో ఒక అత్యద్భుతప్సరస నా దగ్గరకు నడిచి వచ్చి..."Let me help you sir" అని నా బ్యాగు తీసుకుని పైన పెట్టింది..."Do you need anything else sir" అని అడిగింది...."Yes...నీ ఫొటో, జాతకం, గోత్రం, నక్షత్రం, రాసి ఇస్తే మా అమ్మకు చూపించి నిన్ను పెళ్ళిచేసుకుంటా" అని అనాలని మనసంతా ఉన్నా...ఇంత మందిలో అడిగితే సిగ్గుపడుతుందని..."నా బ్యాగు మళ్ళీ తీసి ఇవ్వరా" అని అడిగాను. కాబొయ్యే భర్త మాట ఎలా కాదంటుంది...బ్యాగు తీసిచ్చి వెళ్ళిపొయ్యింది.

"ఆహా! ఇంత కన్నా ఏమి కావాలి జీవితంలో...ఈ ప్రపంచంలో నా కన్నా అద్రుష్టవంతుడు ఉండడు. ఒక వేళ ఉన్నా...ఇదే ఫ్లైట్లో ఎక్కడో కూర్చుని ఉంటాడు...ఈ ఆనందం ఇలానే కలకాలం ఉంటే ఎంత బావుంటుంది".....అని మనసులో అనుకుంటుండగా ఆకాశవాణి గట్టిగా నవ్వింది...టైము కాని టైము లో ఈ నవ్వేంటని కిటికీ లోంచి బయటకు చూడబోతుండగా నా పక్క సీట్లో కూర్చున్నాయన నా భుజం తట్టాడు.....తిరిగి చూసాను.

" హలో...నా పేరు దినకర్...నేను జోకులు బాగ వేస్తుంటానని మా వీధిలో అందరూ అంటుంటారు" అన్నాడు.

"కంగ్రాట్స్" అన్నాను..

"కంగ్రాట్స్ ఎందుకు లేండి..దేవుడు ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క టాలెంట్ ఇస్తాడు...నాకు 23 ఇచ్చాడు..సమయం సందర్భం బట్టి ఒక్కొక్కటి వాడుతుంటాను" అన్నాడు..

మళ్ళీ తనే అందుకుని.."ఇందాకే ఒక జోక్ రాసాను..చెప్పమంటారా?" అని అడిగాడు...

"చెప్పండి" అన్నాను ఉత్సాహంగా...

" - 'ఐ లవ్ యూ ప్రియా ' అన్నాడు ప్రియుడు. 'ఐ టూ లవ్ లవ్ యూ ప్రియా ' అన్నది ప్రేయసి..'అదేంటి..Two లవ్ యూ అన్నావు..అంటే నువ్వు కాకుండా మరొకరు కూడా నన్ను ప్రేమిస్తున్నారా అన్నాడు ప్రియుడు....'హా....' ఖంగుతింది ప్రేయసి"

"ఎలా ఉంది సార్" అని అడిగాడు దినకర్...

నాకు ఏమనాలో తెలియట్లేదు....ఇలాంటి జోకు విన్నందుకు నాకు గోహత్య చేసినంత పాపం అంటుతుందేమోనని భయంగా ఉంది..మరి చెప్పినోడికి వాడికెలా ఉండాలి....ఏ మాత్రం సిగ్గులేకుండా ఆ జోకుకు ఫీడ్ బాక్ అడుగుతున్నాడు....

పెద్దగా పరిచయం కూడా లేని వ్యక్తి....తిడితే బాగోదని..."చాలా బాగుంది సార్...జోకు మా పక్కింట్లోనో, ఎదురింట్లోనో జరిగినట్టు సహజత్వానికి దగ్గరగా ఉంది...'ప్రేయసి ', 'ప్రియుడు ' కూడా పాత్రలకు అతుక్కుపోయారు...మీ narration నన్ను కడుపుబ్బ నవ్వించింది" అన్నాను దినకర్ భాషలోనే మాట్లాడుతూ....

"ఓకే...ఇప్పుడు ఇంకోటి చెబుతా వినండి" అని ఏదో చెప్పబోతుండగా నేను మధ్యలో ఆపి..."మీరు చెప్పిన మొదటి జోకు తెప్పించిన నవ్వునుంచే నేనింకా తేరుకోలేదు...అప్పుడే ఇంకోటా...ఈ జోకు ఆ పక్కనాయనికి చెప్పండి..ఆయన కూడా ఆనందిస్తాడు" అన్నాను....

ఆ పక్కాయన నా వైపు కోపంగా చూసాడు...

దినకర్ నా దగ్గరకు జరిగి "మీరు రాక ముందే ప్రయత్నించాను సార్....ఆయన కేరళ ఆయన....తెలుగు రాదు.....సరే కాని....మీరెక్కడికీ వెళ్ళకండి..బాత్రూముకు వెళ్ళి ఇప్పుడే వస్తా" అని లేచి వెళ్ళాడు....

దినకర్ అటు వెళ్ళగానే నేను ఆ పక్కాయనతో "నిజం చెప్పండి సార్....మీరు తెలుగోళ్ళే గా....ఈ పిచ్చొడు జోకులు చెబుతాడని అబధ్ధాలు ఆడుతున్నారు..అంతేనా..." అన్నాను.

"ఔను సార్...కానీ మీకో విషయం చెప్పనా..ఈ మనిషి నన్ను బోర్డింగు పాసు తీసుకునే దగ్గర ఇలాంటి జోకులతో హింసించాడు...నేను ఫ్లైటు ఎక్కంగానే సన్ గ్లాసెస్ పెట్టుకున్నా...నా పక్క సీటులో వచ్చి కూర్చున్నాడు కానీ నన్ను గుర్తుపట్టలా..."హలో సార్..నా పేరు దినకర్...నేను జోకులు బాగా వేస్తుంటానని మా వీధిలో అంతా అంటుంటారు" అని మళ్ళీ మొదలు పెట్టాడు....సరే ఒక రాయి వెద్దామని 'నాకు తెలుగు రాదు..మాది కేరళ ' అన్నాను...అంతే..మిమ్మల్ని తగులుకున్నాడు" ...అని బ్రహ్మ రహస్యం చెప్పాడు...

"ఔనా...ఐతే మీ కళ్ళద్దాలు కాస్సేపు ఇవ్వండీ సార్..నేనూ తప్పించుకుంటాను" అని ఆ ఆపద్భాందవుడి శరణు కోరాను..

ఆయన తన కళ్ళజోడు నాకిస్తూ.."అయినా ఈ దినకర్ ను అని లాభం లేదు సార్..అదేదో TV చానెల్ లో 'నవ్వరా నవ్వు ' అనే కార్యక్రమం వస్తుంది...అందులో జనాలు చెప్పే జోకుల ముందు వీడి జోకులు బలాదూర్...ఆ పనికిమాలిన కార్యక్రమం లో ఈ పనికిమాలినోడు ఫైనలిష్ట్...రెపే ఫైనల్స్...తను ఫైనల్ లో చెప్పబొయ్యే జోకులను జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలుసుకోవటానికి ఇలా అందరికి చెబుతూ తిరుగుతున్నాడంట"....

దినకర్ వస్తుండటం గమనించి నేను వెంటనే పక్కాయన ఇచ్చిన కళ్ళద్దాలు పెట్టుకుని..నా సిగ్నల్ లేని మొబైల్ లో హిందీ లో మాట్లాడటం మొదలుపెట్టాను. దినకర్ తన సీట్లో కూర్చుంటూ.."అదేంటి సార్..ఈయన కళ్ళజోడు పెట్టుకున్నారు మీరు?" అని అడిగాడు..

క్లైమాక్సు ఫైటింగులో రివాల్వరులో బులెట్లు అయిపొయ్యిన విలన్ లాగ లొంగిపొయ్యాను నేను...పక్కాయనకు కళ్ళద్దాలు తిరిగిచ్చేసాను. ఆయన నావైపు జాలిగా చూసి 'దేనికైన సుడి ఉండాలి సార్ ' అన్న వాక్యాన్ని సింబాలిక్ గా తన బొటన వేలుతో నుదుటి మీద గీసుకుని చూపించాడు... ..లేకపొతే..కళ్ళద్దాలు తీసేసిన ఆయన్ను గుర్తుపట్టకుండా...కమల హాసన్ లాగ నటిస్తున్న నన్ను గుర్తుపట్టాడు ఈ దినకర్..

"ఈ Air hostess లకు అస్సలు sense of humour లేదు సార్..కాస్సేపు ఇక్కడి వాళ్ళకు జోకులు చెప్పి ప్రజల నాడి తెలుసుకుందామనుకుంటుంటే...ఒప్పుకోవట్లేదు..."

అర క్షణం సైలెంటుగా ఉన్నాడు...నాకు కొత్త జీవితం వచ్చినట్టయ్యింది...

మరు అరక్షణమే మళ్ళీ "నాకొక ఐడియా వచ్చింది సార్...మధ్యలో భోజనానికి ఏ ధాబా దగ్గరో ఆపుతాడుగా విమానం...అప్పుడూ మీరు ఇగ్నిషన్ తాళం చెవి దాచెయ్యండి...నేను ఆ టైములో ప్రజల నాడి తెలుసుకుంటా...ఏమంటారు?" అనడిగాడు..

"సారీ సార్...మీకంటే జోకులు చెప్పి చెప్పి క్రిమినల్ గా మంచి అనుభవం ఉంది...నాకిలాంటివి చేతకావు...నన్నొదిలెయ్యండి" అన్నాను....

సరే ఆ పక్కయాన సాయం అడుగుదామని దినకర్ అటువైపు తిరిగాడు..ఏమీ అడగక ముందే ఆయన "sorry..i can't help you.I don't know Telugu" అన్నాడు...."పరవాలేదు సార్" అని దినకర్ తన సీటు లోంచి పైకి లేచాదు....

నేను ఉండబట్టలేక "దినకర్ గారు..మీరు ఒక నాణ్యమైన వెధవ అన్న విషయం మీకు తెలుసా?" అనడిగాను....నా మాటలేవి వినకుండా తన బ్యాగు కిందకు దించి అందులోంచి ఒక పుస్తకం తీసి ఏదో చూసాడు...నా వైపు తిరిగి "ఇంకేంటి సార్ విశేషాలు?" అనడిగాడు....

పొరబాటున "మీరే చెప్పాలి" అన్నాను..

"ఇందాక ఆ చివరి సీటాయనకు ఒక పొడుపు జోకు పొడిచాను...నవ్వాడో లేదొ కనుక్కునొస్తా...ఈ లోపు మీరు నవ్వుకోవటానికి ఒక జోకు -

'కాస్త పంచదార ఉంటే ఇస్తారా '..అడిగింది పక్కింటి పంకజాక్షి...'మా ఇంట్లో "కాస్త" పంచదార లేదండి..ఒక డబ్బాడు ఉంది...కాబట్టి ఇవ్వను ' అంది కామాక్షి ముసి ముసి గా నవ్వుతూ. ఆశ్చర్యపోవటం పంకజాక్షి వంతయ్యింది'.....ఇదెలా ఉంది సార్"

కంట్లో నీళ్ళు రాకుండా ఏడవటం ఎలాగో ఆ క్షణం తెలుసుకున్నాను నేను...

"సరే నేను ఆ వెనక సీటాయన దగ్గరకు వెళ్ళొస్తా" అని వెళ్ళిపొయ్యాడు....

ఇందాక దినకర్ జోకు మొదలు పెట్టగానే లేచి వెళ్ళిన మా పక్క సీటాయన జోకు అయిపోంగానే తిరిగొచ్చాడు.....వచ్చీ రావటంతోనే "చీ..తూ" అని తిట్లు ఉమ్మటం మొదలు పెట్టాడు..దానికి నేను "జోకు వినని మీకే అంత అస్సహ్యమేస్తే, నా బాధలు ఎవరితో చెప్పుకోవాలి చెప్పండి" అన్నాను....

దానికి ఆయన..."అది కాదు సార్...ఆ ఐదు పైసల 'నవ్వరా నవ్వు ' కార్యక్రమంలో ఈ కాండిడేట్ ఫైనల్స్ కు చేరుకున్నాడు...ఈ లెక్కన ఆ మొదటి రౌండ్లలో ఓడిపొయ్యిన వాళ్ళని..వీళ్ళందిరికి మార్కులేస్తున్న ఆ జడ్జిలను ఏమనాలి?" అని కూరుకుపోతున్న గొంతుతో బాధ వెళ్ళగక్కాడు...

ఇంతలో దినకర్ మా దగ్గరకు వచ్చి "ఆ వెనక సీటాయన కనిపించట్లేదు సార్....ముందు పక్క సీట్లలొ కూర్చున్నాడేమో చూసొస్తా" అని ముందుకు వెళ్ళాడు. దినకర్ అలా ముందుకు వెళ్ళగానే వెనకనుంచి ఒకాయన మాదగ్గరకు పరిగెట్టుకుంటూ వచ్చి..నా పక్క సీటతనికి కళ్ళద్దాలు తిరిగిస్తూ "చాలా థాంక్స్ సార్" అని వెళ్ళిపొయ్యాడు....

నా కోపం విమానం సీలింగ్ దాకా చేరుకుంది......కళ్ళద్దాలు పెట్టుకుంటే ఎవ్వరిని గుర్తుపట్టడు...ఒక్క నన్ను తప్ప....సైకో సాలే గాడు.

తిట్టుకుంటుండగానే వచ్చి కూర్చున్నాడు...."ఆయన ఎక్కడికెళ్ళాడో తెలియట్లేదు సార్....సరే...ఇంకేంటి విశేషాలు?" అన్నాడు...

"ఏమీ లేవు...మీరు కూడా ఏమి చెప్పకండి" అన్నాను...

"మీకు మూడ్ బాగున్నట్టు లేదు..మాంచి జోకు చెబుతాను వినండి.....రెండు చీమలు స్కూటర్ మీద వెళ్తుంటాయి..." అని ఇంకా ఏదో చెప్పబోతుండగా....

"నాకు చీమల జోకులు నచ్చవు...ఆపండి" ..

"పర్లేదు...ఇంకోటి చెబుతాను....రెండూ ఏనుగులు స్కూటర్ మీద వెళ్తుంటాయి..."

నా ఓపిక కు తులసి నీళ్ళు తాగించెసి...."బుధ్ధుందా లేదా నీకు...నువ్వు వెంటనే నోరు ముయ్యక పోతే నీ మీద మానభంగం కేసు పెట్టి జైల్లోకి తోయిస్తాను..విమానం ఇంకాస్సేపట్లో కిందకు దిగబోతొంది...నోరిప్పావంటే రేపు నీ ప్రోగ్రాము కు వచ్చి నువ్వు స్టేజ్ ఎక్కంగానే కోడి గుడ్లతో కొడతా..."

దినకర్ కు విషయం అర్థమయినట్టుంది...

విమానం శంశాబాద్ airport లో దిగేంతవరకు నోరు విప్పలేదు...నా పక్కాయన నా ధైర్యానికి మెచ్చుకుని నేను వెళ్ళెటప్పుడు తన సన్ గ్లాసెస్ బహుమతిగా ఇచ్చి వెళ్ళాడు....

నేను వెళ్ళి మెహదీపట్నం బస్సెక్కాను. ఐదు నిముషాల తరువాత దినకర్ వచ్చి నా పక్క సీటులో కూర్చున్నాడు....చాలా సేపు ఏమీ మాట్లాడలేదు. నాకెందుకో బాధేసింది....దినకర్ వైపు చూసి "సారీ సార్...ఇందాక కోపం లో ఏదో అనేసాను...ఏమీ అనుకోకండి" అన్నాను...

"పర్లేదు సార్" అన్నాడు దినకర్..

బస్సు వాడు 'ఒక్క మగాడు ' సినిమా పాటలు పెట్టాడు..

దినకర్ ఆ పాటకు చిటికెలు వేస్తూ "ఒక్క మగాడు చూసారా సార్....సూపర్ సినిమా" అన్నాడు..

"మీ వీధిలో వాళ్ళు కరెక్టే సార్...మీరు నిజంగా జోకులు బాగా వేస్తారు...ఈ జోకు మాత్రం అదిరింది"

నేను మామూలుగా మాట్లాడటం చూసిన దినకర్ "మీరు మంచి మూడ్లోకి వచ్చినట్టున్నారు.....ఈ సందర్భంగా ఒక జోక్....ఇద్దరు 'ఒక్క మగాడు ' లు స్కూటర్ మీద వెళ్తుంటారు ..........................."

అప్పుడర్థమయ్యింది నాకు..ఆకాశవాణి ఎందుకు నవ్విందో...

Wednesday, January 16, 2008

క్షుర ' ఖర్మ '

స్థలం: ఆఫీసు - conference రూము

రోజు/సమయం: శుక్రవారం 3.30 P.M

జరుగుతున్నది: కంపెనీ ని అభివృధ్ధి లోకి ఎలా తీసుకురావాలో నా బాసు మాట్లాడుతున్నాడు....కొద్దికొద్దిగా వస్తున్న నిద్రను అభివృధ్ధిలోకి తీసుకురావటానికి నేను ప్రయత్నిస్తున్నాను...

45 నిముషాలపాటు ఏమి మాట్లాడాడో తెలియదు - మధ్యమధ్యలో ఏవో కొన్ని పదాలు తప్ప (లంచ్, హాలిడేస్, డిన్నర్, ఆప్షనల్ హాలిడేస్, స్నాక్స్, స్పెషల్ హాలిడేస్)...కరెక్టుగా 46 వ నిముషం లో " ఇంకో వారం రోజుల తరువాత మన టీం లో శృతి అనే అమ్మాయి చేరబోతోంది " అన్నాడు.....

....ఊహల్లో తిరుపతికి వెళ్ళి నిమ్మకాయ సోడా తాగుతున్న బుర్ర జెట్ ఎయిర్వేస్ లో తిరిగి కాంఫరెన్సు రూము కు వచ్చేసింది.....ఆ మీటింగు లో నాతో పాటు ఊహల్లో ఉన్న సాటి పురుష పురుగులు కూడా ఇప్పుడే ఫ్లైటు దిగినట్టు ఉన్నారు.

అందరమూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని ఆనందంగా నవ్వుకున్నాము...

మళ్ళీ నా బాసు గాడే మాట్లాడుతూ " మొదటి రోజు శృతి కి మన ఆఫీసు లో అందరిని పరిచయం చేసి, తను సెటిల్ అవ్వటానికి ఏమి కావాలో చూసి కాస్త తోడుగా ఉండాలి...హేమలతా, నువ్వు ఆ బాధ్యత తీసుకుంటావా " అని అడిగాడు.....

అక్కడున్న ' సిగ్గు 'లేని వాళ్ళలో ' సి ' కూడా లేని వెధవ నీల్ విజయ్ ఒక్కసారిగా పైకి లేచి " సార్..సార్....ప్లీస్ సార్....మేమెవరైనా చేస్తాము సార్...ఇప్పుడు టీము లో ఉన్న అమ్మాయిలు ఎలాగూ మా మొహాలు చూడట్లేదు...కనీసం కొత్తగా వచ్చే అమ్మాయితోనైనా కాస్త మాట్లాడే అవకాశం ఇవ్వండి సార్..మీ కాళ్ళు పట్టుకుంటాం సార్ " అని కళ్ళ నీళ్ళు పెట్టుకుని మా అందరి తరపున దీనంగా దేబిరించాడు. దానికి బాసు గాడు " సరే ఆపు......(నన్ను చూసి) ఏమయ్య.. నువ్వు చేస్తావా " అని అడిగాడు....

నేను లేచి " చేస్తాను బాసు గారు " అని..టేబుల్ పైకెక్కి - "ఆకాశంలో ఒక తారా...నాకోసమొచ్చింది ఈ వేళ " అని పాడి నా ఆనందాన్ని వ్యక్తపరిచాను. టేబుల్ చుట్టూ నుంచున్న నా టీం మేట్స్ అందరూ "ఝుం ఝుం ఝుం....ఝుం తన ఝుం"...అని కోరస్ లో నన్ను అభినందించారు....పాట చరణం లోకి వెళ్ళకముందే మా బాసు "కట్" చెప్పి, నన్ను చూసి "కాస్త హెయిర్ కట్ చెయించుకోవయ్యా...మరీ అలా చింపిరి జుట్టేసుకుని ఎదురుపడకు ఆ అమ్మాయికి " అన్నాడు...

ఈ మధ్యన వచ్చిన 'చింపిరి' అనే తెలుగు సినిమా లో హీరో హెయిర్ స్టయిల్ లా ఉందని కాంప్లిమెంటు ఇచ్చాడేమో అనుకున్నా...తరువాత తెలిసింది...దువ్వుకోలేనంత జుట్టు తల మీద పెట్టుకుని దువ్వుకోకుండా ఆఫీసుకు వచ్చినందుకు నా బాసు గాడు తిట్టిన తిట్టని..

*************

నాకు ఊహ తెలిసి తల దువ్వుకోవటం మొదలుపెట్టినప్పటినుండి నాకు, నా జుట్టుకు కొన్ని వేల యుధ్ధాలు జరిగాయి...జరుగుతూనే ఉన్నాయి....ఇప్పటిదాకా నేను గెలవలేదు....

సన్ ఫ్లవర్ లాగా రోజుకు రెండు సార్లు డైరెక్షను మారుస్తుంది నా జుట్టు...కొబ్బరి నూనే, ఆముదమే కాదు....ఫెవికాల్ రాసి దువ్వుకున్నా కుదురుగా ఉండదు నా జుట్టు..

తిరుపతి లో గోవిందరాజుల స్వామి గుడి దగ్గర శ్రీనివాసా హెయిర్ డ్రెస్సర్స్ అని ఒక సెలూన్ ఉంటుంది..పొరపాటున కూడా హెయిర్ కట్ చేయించుకోవటానికి అక్కడకు వెళ్ళకండి...వాడు చేసేది 'హెయిర్ డ్రెస్సింగ్' కాదు....'హెయిర్ వస్త్రాపహరణం'....వాడి దగ్గర కటింగ్ చేయించుకుంటే నిండుసభ లో అవమానంతో జుట్టు దించుకోవలసిందే...

నేను వాడి సెలూను కు వెళ్ళిన ప్రతిసారీ మొదటి పావుగంట నాకు హెయిర్ కట్ ఎలా కావాలో చెబుతాను...."చూడు బాబూ...సైడుకు కాస్త పొట్టిగా చెయ్యి...వెనకవైపు కూడా అంతే...ముందు మాత్రం కాస్త ఉండనివ్వు.. మరీ పొట్టిగా చేస్తావేమో...అస్సలు దువ్వుకోవటానికి రాదు...అలాగని అస్సలు కత్తరించకుండా వదిలెయ్యకు...కరెంటు షాకు కొట్టినట్టు నిక్క బొడుచుకునుంటాయి "....అని ఒక పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇస్తాను......
నేను ఇలా కష్టపడి వాడికి వివరిస్తుంటే..వాడి కళ్ళు నన్ను చూస్తుంటాయి...చెవులు మాత్రం TV లో వస్తున్న తెలుగు సినిమా వింటుంటాయి....హీరొ మొదటి హీరోయిన్ ను చేసుకుంటాడా, పాటలకు మాత్రమే వాడుకున్న రెండో హీరోయిన్ ను చేసుకుంటాడా అని వాడి టెన్షన్.....సినిమా చివర్లో ఏమాత్రమూ సిగ్గులేకుండా హీరోయిన్లు ఇద్దరూ ఒక్కడినే పెళ్ళిచేసుకున్నాక వాడు ఊపిరి పీల్చుకుని నా వైపు చూస్తాడు......
నేను అంత సేపు చెప్పిందానికంతా తలూపి చివరకు.. " మీకు కటింగ్ ఎలా కావాలి సార్ " అని గోడకున్న NTR, ANR, శోభన్ బాబు, క్రిష్ణ ఫొటోలు చూపిస్తాడు....వాళ్ళ లాంటి జుట్టు కావాలనుకుంటే వీడి దగ్గరకు ఎందుకు వస్తాను - ఏ విగ్గులమ్మే కొట్టుకో వెళ్తానుగానీ...

మొన్న ఆదివారం తిరుపతి వెళ్ళినప్పుడు 'శ్రీనివాసా హెయిర్ డ్రెస్సర్స్' కు వెళ్ళాను...ఈ సారి శ్రుతి దగ్గర మంచి మార్కులు లయబద్దంగా కొట్టేయ్యాలని..."చూడగానే అమ్మాయిలు 'వావ్'అనే లాగా కటింగ్ కావాలి" అని మెడలో ఒక బోర్డు తగిలించుకుని సెలూన్లోకి అడుగుపెట్టాను..

దువ్వెన, కత్తెర పట్టుకుని...యుధ్ధానికి దిగిన సైనికుడి బార్బర్లాగా నా మీదకు వచ్చి, నా జుట్టును ఒక పది సార్లు అటూ, ఇటూ చూసి.."ఇలా అర్థం పర్థం లేకుండా ఎవడు సార్ కటింగ్ చేసింది...ఇదివరకు ఎక్కడ చేయించారేంటి?" అని అడిగాడు..."నీ సెలూన్ లోనే రా వంకర కత్తెర వెధవ " అని అందామనుకుని...చుట్టుపక్కల చాలా కత్తులు, కత్తెరలు ఉన్నాయని ఊరుకున్నా..

వెనకాల ఉన్నఒక బెంచి మీద కొంతమంది కుర్రాళ్ళు కూర్చుని నన్నే చూస్తున్నారు..."ఏంటి అందరూ అలా చూస్తున్నారు?" అని అడిగాను...."వాళ్ళంతా ఇక్కడ కటింగ్ నేర్చుకోవటానికి వచ్చిన interns సార్ " సమాధానమిచ్చాడు సెలూను ఓనరు..

స్కూటరు, కారు నేర్పించేప్పుడు ఒక డొక్కు బండి మీద నేర్పించినట్టు...కటింగ్ నేర్పించటానికి నా లాంటి తల కొసం ఎదురు చూస్తుంటాడు ఈ ఎదవ...
"కటింగ్ ప్రారంభించక ముందే షేవింగ్ చేస్తాను సార్" అన్నాడు..సరే ఇది ఈ మధ్య కొత్తగా వచ్చిన రూలేమోనని ఒప్పుకున్నా....సగం గెడ్డం గీసాక ఆపేసాడు.... నా తల మీద ప్రయోగాలు చేస్తారని తెలిసినా నేను ఇక బయటకు పారిపోలేనుఅని నిర్ధారించుకున్నక...బెంచీ మీద కూర్చున్న ఒక్కొక్కడినీ పిలిచి నా జుట్టుతో చెడుగుడు మొదలు పెట్టాడు....మొదటొచ్చినోడు కుడి వైపు కాస్త ఎక్కువగా కత్తెరించేసాడు...." అరెరే పొరపాటైపొయ్యింది సార్ ".. అని ఇంక ఏదొ అనబొయ్యేంతలోపు ఆ ఓనర్ గాడు "పరవాలేదు...మొదట్లో ఇలాంటి 'పొరబాట్లు ' జరుగుతూ ఉంటాయి...నువ్వు కానీ " అన్నాడు......అలా మరో గంటన్నర పాటు మిగతా interns కూడా 'పొరబాట్లు ' చేసాక...అప్పటిదాకా నా కళ్ళకు కట్టిన గంతలు, నోట్లో కుక్కిన గుడ్డ తీసేసారు....

ఇంతలో లోపలి రూము లోంచి ఒకడు చేతిలో కిరొసిన్ డబ్బా పట్టుకొచ్చి "సార్...జుట్టు ' బ్లీచింగ్ ' చెయ్యమంటారా?" అని అడిగాడు...'బ్లీచింగ్' అంటే కిరొసిన్ తలకు అంటుతాడేమోనని భయమేసి "నో " అని నొక్కి వక్కాణిద్దామనుకున్నా..
కానీ కిరొసిన్ వాసనంటే నాకు చిన్నప్పటి నుండి ఎంతో ఇష్టం...అందుకే TV సీరియళ్ళలో లాగా "అదీ...విషయమేంటంటే...అసలు ఏమి జరిగిందంటే...నేను చెప్పొచ్చేదేంటంటే " అని కాసేపు లాగి...గుండె నిండా ఆ వాసన పీల్చి..."కిరొసిన్ జుట్టుకు అంటితే ప్రమాదమేమీ లేదా?" అని అడగటానికి నోరు తెరవబొయ్యేలోగా.....ఆ సెలూను ఓనర్ " రే మనోహర్...ఇది ఇంట్లో ఇచ్చి రా " అని ఆ కిరోసిన్ డబ్బా ఒక కుర్రాడికి ఇచ్చాడు....
"చెప్పండి సార్...బ్లీచింగ్ చెయ్యమంటారా " అని మళ్ళీ అడిగాడు....వీడి ముందు చులకన కారాదని "బ్లీచింగ్ కిరోసిన్ తో చెయ్యరని నాకు కూడా తెలుసు " అన్నాను..వాడికి ఏమీ అర్థం కాలా...పక్కనున్న ఒక ఫొటొ చూపించి " ఇది చూడండి " అన్నాడు....

వార్నీ.. అది నా స్నేహితుడి ఫొటో...వాడి పేరు విక్రం (పేరు మార్చబడింది....అసలు పేరు - ఎం. దినకర్, అడ్రస్ - 11111, Bangalore - 111111, mobile - 9999999999)...వాడి జుట్టు కు పిచ్చిపిచ్చిగా గోదుమ రంగు, పసుపు పచ్చ రంగు పూసున్నాయి...నేను గట్టిగా నవ్వి.." బాగా చేసారు ఎదవకి...ఏంటి.. కటింగ్ చేయించుకుని డబ్బు ఎగ్గొట్టాడా...మధ్య మధ్యలో ఆ గ్యాపులు ఎందుకు వదిలారు...మొత్తం రాసెయ్యల్సింది ఆ దిక్కుమాలిన రంగు " అని...ఇంకాస్సేపు నవ్వి..." ఇప్పుడు చెప్పు.. ఆ బ్లీచింగ్ గురించి....అది చేయించుకున్నవాడి ఫొటోలు ఏవైనా ఉంటే చూపించయ్యా...డిసైడ్ చేసుకోవటం కాస్త సులభంగా ఉంటుంది " అన్నాను......

నేను అన్న ఏమాటకు వాడికి కాలిందో తెలియదు..అక్కడున్న interns లో ఫెయిల్ మార్కులు తెచ్చుకున్న ఇద్దరిని నా మీదకు వదిలి...ఒక్కొక్కరికి చెరోవైపు ఇచ్చి లైట్లు ఆర్పేసాడు...

కొంత కాలం గడిచాక (అంటే ఓ రెండు గంటల తరువాత)...

ఇలాంటి జుట్టు తో శృతి కంట పడితే నన్ను మొదటి రోజే "హాయ్ 'ఫ్రెండ్' " అనే ప్రమాదముంది....ఒక అందమైన అమ్మయితో 'ఫ్రెండ్' అనిపించుకోవటంకంటే 'అన్నయ్య ' అనిపించుకోవటం మంచిది.......సోమవారం దాక టైముంది ఆలోచించుకోవటానికి..ఏమి చెయ్యాలో పాలుపోవటం లేదు...పిరికి వాడిలాగ జుట్టు మళ్ళీ పెరిగేంతవరకు శెలవు పెడదామా....లేక ధైర్యవంతుడి లాగ పరిస్థితి ని ఎదురుకుని ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేద్దామా.......