Wednesday, January 16, 2008

క్షుర ' ఖర్మ '

స్థలం: ఆఫీసు - conference రూము

రోజు/సమయం: శుక్రవారం 3.30 P.M

జరుగుతున్నది: కంపెనీ ని అభివృధ్ధి లోకి ఎలా తీసుకురావాలో నా బాసు మాట్లాడుతున్నాడు....కొద్దికొద్దిగా వస్తున్న నిద్రను అభివృధ్ధిలోకి తీసుకురావటానికి నేను ప్రయత్నిస్తున్నాను...

45 నిముషాలపాటు ఏమి మాట్లాడాడో తెలియదు - మధ్యమధ్యలో ఏవో కొన్ని పదాలు తప్ప (లంచ్, హాలిడేస్, డిన్నర్, ఆప్షనల్ హాలిడేస్, స్నాక్స్, స్పెషల్ హాలిడేస్)...కరెక్టుగా 46 వ నిముషం లో " ఇంకో వారం రోజుల తరువాత మన టీం లో శృతి అనే అమ్మాయి చేరబోతోంది " అన్నాడు.....

....ఊహల్లో తిరుపతికి వెళ్ళి నిమ్మకాయ సోడా తాగుతున్న బుర్ర జెట్ ఎయిర్వేస్ లో తిరిగి కాంఫరెన్సు రూము కు వచ్చేసింది.....ఆ మీటింగు లో నాతో పాటు ఊహల్లో ఉన్న సాటి పురుష పురుగులు కూడా ఇప్పుడే ఫ్లైటు దిగినట్టు ఉన్నారు.

అందరమూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని ఆనందంగా నవ్వుకున్నాము...

మళ్ళీ నా బాసు గాడే మాట్లాడుతూ " మొదటి రోజు శృతి కి మన ఆఫీసు లో అందరిని పరిచయం చేసి, తను సెటిల్ అవ్వటానికి ఏమి కావాలో చూసి కాస్త తోడుగా ఉండాలి...హేమలతా, నువ్వు ఆ బాధ్యత తీసుకుంటావా " అని అడిగాడు.....

అక్కడున్న ' సిగ్గు 'లేని వాళ్ళలో ' సి ' కూడా లేని వెధవ నీల్ విజయ్ ఒక్కసారిగా పైకి లేచి " సార్..సార్....ప్లీస్ సార్....మేమెవరైనా చేస్తాము సార్...ఇప్పుడు టీము లో ఉన్న అమ్మాయిలు ఎలాగూ మా మొహాలు చూడట్లేదు...కనీసం కొత్తగా వచ్చే అమ్మాయితోనైనా కాస్త మాట్లాడే అవకాశం ఇవ్వండి సార్..మీ కాళ్ళు పట్టుకుంటాం సార్ " అని కళ్ళ నీళ్ళు పెట్టుకుని మా అందరి తరపున దీనంగా దేబిరించాడు. దానికి బాసు గాడు " సరే ఆపు......(నన్ను చూసి) ఏమయ్య.. నువ్వు చేస్తావా " అని అడిగాడు....

నేను లేచి " చేస్తాను బాసు గారు " అని..టేబుల్ పైకెక్కి - "ఆకాశంలో ఒక తారా...నాకోసమొచ్చింది ఈ వేళ " అని పాడి నా ఆనందాన్ని వ్యక్తపరిచాను. టేబుల్ చుట్టూ నుంచున్న నా టీం మేట్స్ అందరూ "ఝుం ఝుం ఝుం....ఝుం తన ఝుం"...అని కోరస్ లో నన్ను అభినందించారు....పాట చరణం లోకి వెళ్ళకముందే మా బాసు "కట్" చెప్పి, నన్ను చూసి "కాస్త హెయిర్ కట్ చెయించుకోవయ్యా...మరీ అలా చింపిరి జుట్టేసుకుని ఎదురుపడకు ఆ అమ్మాయికి " అన్నాడు...

ఈ మధ్యన వచ్చిన 'చింపిరి' అనే తెలుగు సినిమా లో హీరో హెయిర్ స్టయిల్ లా ఉందని కాంప్లిమెంటు ఇచ్చాడేమో అనుకున్నా...తరువాత తెలిసింది...దువ్వుకోలేనంత జుట్టు తల మీద పెట్టుకుని దువ్వుకోకుండా ఆఫీసుకు వచ్చినందుకు నా బాసు గాడు తిట్టిన తిట్టని..

*************

నాకు ఊహ తెలిసి తల దువ్వుకోవటం మొదలుపెట్టినప్పటినుండి నాకు, నా జుట్టుకు కొన్ని వేల యుధ్ధాలు జరిగాయి...జరుగుతూనే ఉన్నాయి....ఇప్పటిదాకా నేను గెలవలేదు....

సన్ ఫ్లవర్ లాగా రోజుకు రెండు సార్లు డైరెక్షను మారుస్తుంది నా జుట్టు...కొబ్బరి నూనే, ఆముదమే కాదు....ఫెవికాల్ రాసి దువ్వుకున్నా కుదురుగా ఉండదు నా జుట్టు..

తిరుపతి లో గోవిందరాజుల స్వామి గుడి దగ్గర శ్రీనివాసా హెయిర్ డ్రెస్సర్స్ అని ఒక సెలూన్ ఉంటుంది..పొరపాటున కూడా హెయిర్ కట్ చేయించుకోవటానికి అక్కడకు వెళ్ళకండి...వాడు చేసేది 'హెయిర్ డ్రెస్సింగ్' కాదు....'హెయిర్ వస్త్రాపహరణం'....వాడి దగ్గర కటింగ్ చేయించుకుంటే నిండుసభ లో అవమానంతో జుట్టు దించుకోవలసిందే...

నేను వాడి సెలూను కు వెళ్ళిన ప్రతిసారీ మొదటి పావుగంట నాకు హెయిర్ కట్ ఎలా కావాలో చెబుతాను...."చూడు బాబూ...సైడుకు కాస్త పొట్టిగా చెయ్యి...వెనకవైపు కూడా అంతే...ముందు మాత్రం కాస్త ఉండనివ్వు.. మరీ పొట్టిగా చేస్తావేమో...అస్సలు దువ్వుకోవటానికి రాదు...అలాగని అస్సలు కత్తరించకుండా వదిలెయ్యకు...కరెంటు షాకు కొట్టినట్టు నిక్క బొడుచుకునుంటాయి "....అని ఒక పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇస్తాను......
నేను ఇలా కష్టపడి వాడికి వివరిస్తుంటే..వాడి కళ్ళు నన్ను చూస్తుంటాయి...చెవులు మాత్రం TV లో వస్తున్న తెలుగు సినిమా వింటుంటాయి....హీరొ మొదటి హీరోయిన్ ను చేసుకుంటాడా, పాటలకు మాత్రమే వాడుకున్న రెండో హీరోయిన్ ను చేసుకుంటాడా అని వాడి టెన్షన్.....సినిమా చివర్లో ఏమాత్రమూ సిగ్గులేకుండా హీరోయిన్లు ఇద్దరూ ఒక్కడినే పెళ్ళిచేసుకున్నాక వాడు ఊపిరి పీల్చుకుని నా వైపు చూస్తాడు......
నేను అంత సేపు చెప్పిందానికంతా తలూపి చివరకు.. " మీకు కటింగ్ ఎలా కావాలి సార్ " అని గోడకున్న NTR, ANR, శోభన్ బాబు, క్రిష్ణ ఫొటోలు చూపిస్తాడు....వాళ్ళ లాంటి జుట్టు కావాలనుకుంటే వీడి దగ్గరకు ఎందుకు వస్తాను - ఏ విగ్గులమ్మే కొట్టుకో వెళ్తానుగానీ...

మొన్న ఆదివారం తిరుపతి వెళ్ళినప్పుడు 'శ్రీనివాసా హెయిర్ డ్రెస్సర్స్' కు వెళ్ళాను...ఈ సారి శ్రుతి దగ్గర మంచి మార్కులు లయబద్దంగా కొట్టేయ్యాలని..."చూడగానే అమ్మాయిలు 'వావ్'అనే లాగా కటింగ్ కావాలి" అని మెడలో ఒక బోర్డు తగిలించుకుని సెలూన్లోకి అడుగుపెట్టాను..

దువ్వెన, కత్తెర పట్టుకుని...యుధ్ధానికి దిగిన సైనికుడి బార్బర్లాగా నా మీదకు వచ్చి, నా జుట్టును ఒక పది సార్లు అటూ, ఇటూ చూసి.."ఇలా అర్థం పర్థం లేకుండా ఎవడు సార్ కటింగ్ చేసింది...ఇదివరకు ఎక్కడ చేయించారేంటి?" అని అడిగాడు..."నీ సెలూన్ లోనే రా వంకర కత్తెర వెధవ " అని అందామనుకుని...చుట్టుపక్కల చాలా కత్తులు, కత్తెరలు ఉన్నాయని ఊరుకున్నా..

వెనకాల ఉన్నఒక బెంచి మీద కొంతమంది కుర్రాళ్ళు కూర్చుని నన్నే చూస్తున్నారు..."ఏంటి అందరూ అలా చూస్తున్నారు?" అని అడిగాను...."వాళ్ళంతా ఇక్కడ కటింగ్ నేర్చుకోవటానికి వచ్చిన interns సార్ " సమాధానమిచ్చాడు సెలూను ఓనరు..

స్కూటరు, కారు నేర్పించేప్పుడు ఒక డొక్కు బండి మీద నేర్పించినట్టు...కటింగ్ నేర్పించటానికి నా లాంటి తల కొసం ఎదురు చూస్తుంటాడు ఈ ఎదవ...
"కటింగ్ ప్రారంభించక ముందే షేవింగ్ చేస్తాను సార్" అన్నాడు..సరే ఇది ఈ మధ్య కొత్తగా వచ్చిన రూలేమోనని ఒప్పుకున్నా....సగం గెడ్డం గీసాక ఆపేసాడు.... నా తల మీద ప్రయోగాలు చేస్తారని తెలిసినా నేను ఇక బయటకు పారిపోలేనుఅని నిర్ధారించుకున్నక...బెంచీ మీద కూర్చున్న ఒక్కొక్కడినీ పిలిచి నా జుట్టుతో చెడుగుడు మొదలు పెట్టాడు....మొదటొచ్చినోడు కుడి వైపు కాస్త ఎక్కువగా కత్తెరించేసాడు...." అరెరే పొరపాటైపొయ్యింది సార్ ".. అని ఇంక ఏదొ అనబొయ్యేంతలోపు ఆ ఓనర్ గాడు "పరవాలేదు...మొదట్లో ఇలాంటి 'పొరబాట్లు ' జరుగుతూ ఉంటాయి...నువ్వు కానీ " అన్నాడు......అలా మరో గంటన్నర పాటు మిగతా interns కూడా 'పొరబాట్లు ' చేసాక...అప్పటిదాకా నా కళ్ళకు కట్టిన గంతలు, నోట్లో కుక్కిన గుడ్డ తీసేసారు....

ఇంతలో లోపలి రూము లోంచి ఒకడు చేతిలో కిరొసిన్ డబ్బా పట్టుకొచ్చి "సార్...జుట్టు ' బ్లీచింగ్ ' చెయ్యమంటారా?" అని అడిగాడు...'బ్లీచింగ్' అంటే కిరొసిన్ తలకు అంటుతాడేమోనని భయమేసి "నో " అని నొక్కి వక్కాణిద్దామనుకున్నా..
కానీ కిరొసిన్ వాసనంటే నాకు చిన్నప్పటి నుండి ఎంతో ఇష్టం...అందుకే TV సీరియళ్ళలో లాగా "అదీ...విషయమేంటంటే...అసలు ఏమి జరిగిందంటే...నేను చెప్పొచ్చేదేంటంటే " అని కాసేపు లాగి...గుండె నిండా ఆ వాసన పీల్చి..."కిరొసిన్ జుట్టుకు అంటితే ప్రమాదమేమీ లేదా?" అని అడగటానికి నోరు తెరవబొయ్యేలోగా.....ఆ సెలూను ఓనర్ " రే మనోహర్...ఇది ఇంట్లో ఇచ్చి రా " అని ఆ కిరోసిన్ డబ్బా ఒక కుర్రాడికి ఇచ్చాడు....
"చెప్పండి సార్...బ్లీచింగ్ చెయ్యమంటారా " అని మళ్ళీ అడిగాడు....వీడి ముందు చులకన కారాదని "బ్లీచింగ్ కిరోసిన్ తో చెయ్యరని నాకు కూడా తెలుసు " అన్నాను..వాడికి ఏమీ అర్థం కాలా...పక్కనున్న ఒక ఫొటొ చూపించి " ఇది చూడండి " అన్నాడు....

వార్నీ.. అది నా స్నేహితుడి ఫొటో...వాడి పేరు విక్రం (పేరు మార్చబడింది....అసలు పేరు - ఎం. దినకర్, అడ్రస్ - 11111, Bangalore - 111111, mobile - 9999999999)...వాడి జుట్టు కు పిచ్చిపిచ్చిగా గోదుమ రంగు, పసుపు పచ్చ రంగు పూసున్నాయి...నేను గట్టిగా నవ్వి.." బాగా చేసారు ఎదవకి...ఏంటి.. కటింగ్ చేయించుకుని డబ్బు ఎగ్గొట్టాడా...మధ్య మధ్యలో ఆ గ్యాపులు ఎందుకు వదిలారు...మొత్తం రాసెయ్యల్సింది ఆ దిక్కుమాలిన రంగు " అని...ఇంకాస్సేపు నవ్వి..." ఇప్పుడు చెప్పు.. ఆ బ్లీచింగ్ గురించి....అది చేయించుకున్నవాడి ఫొటోలు ఏవైనా ఉంటే చూపించయ్యా...డిసైడ్ చేసుకోవటం కాస్త సులభంగా ఉంటుంది " అన్నాను......

నేను అన్న ఏమాటకు వాడికి కాలిందో తెలియదు..అక్కడున్న interns లో ఫెయిల్ మార్కులు తెచ్చుకున్న ఇద్దరిని నా మీదకు వదిలి...ఒక్కొక్కరికి చెరోవైపు ఇచ్చి లైట్లు ఆర్పేసాడు...

కొంత కాలం గడిచాక (అంటే ఓ రెండు గంటల తరువాత)...

ఇలాంటి జుట్టు తో శృతి కంట పడితే నన్ను మొదటి రోజే "హాయ్ 'ఫ్రెండ్' " అనే ప్రమాదముంది....ఒక అందమైన అమ్మయితో 'ఫ్రెండ్' అనిపించుకోవటంకంటే 'అన్నయ్య ' అనిపించుకోవటం మంచిది.......సోమవారం దాక టైముంది ఆలోచించుకోవటానికి..ఏమి చెయ్యాలో పాలుపోవటం లేదు...పిరికి వాడిలాగ జుట్టు మళ్ళీ పెరిగేంతవరకు శెలవు పెడదామా....లేక ధైర్యవంతుడి లాగ పరిస్థితి ని ఎదురుకుని ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేద్దామా.......