Wednesday, May 21, 2008

ఆకాశ వీధిలో ' ఆకుపచ్చ కన్నీరు '

'ఆకుపచ్చ కన్నీరు ' అనేది చంటబ్బాయి సినిమాలో జంధ్యాల గారు వాడిన మాట.

మనిషి కి శారీరకంగా కానీ, మానసికంగా కానీ తట్టుకోలేని బాధ కలిగినప్పుడు కన్నీళ్ళొస్తాయి. బాధకలుగుతోంది శరీరానికో, మనసుకో డిసైడ్ చేసుకోనీకుండా మన ప్రాణానికి నరక యాతన కలుగుతున్నప్పుడు మన ఆత్మ పెట్టేది 'ఆకుపచ్చ కన్నీరు '
.
-----------------

గత నెలలో ఆఫీసు పని మీద హైదరాబాదు వెళ్ళాల్సి వచ్చింది. ట్రావెల్ డెస్కు వాడు సెలవు పెట్టటంతో నేనే రంగం లోకి దిగాను.

online booking చేసుకునేప్పుడు పెద్దల సహాయం తీసుకోమన్నారు పెద్దలు. "ఏ ఫ్లైటు చేయించుకోమంటారు అలౌకాంకిత గారు" అని పెద్దగా అడిగాను అలౌకాంకిత గారిని...

"Deccan Airways లో చేయించుకోండి..ఉండే ఫ్లైట్ల లో అన్నింటికన్నా చీప్ అదే" అంది ఆవిడ..సరేనని Deccan Airways వెబ్ సైటు తెరిచి హైదరాబాదుకు one way ఫ్లైట్ సెలెక్టు చేసుకున్నా..క్రెడిట్ కార్డు నంబరు అడిగింది...ఇచ్చా..వెంటనే "Payment received - Flight cancelled...దిక్కున్నచోట చెప్పుకో పో" అని మెసేజ్ వచ్చింది.ఏమి చెయ్యాలో తోచక అలౌకాంకితను పిలిచి జరిగినిది చెప్పా..

"మీకు కూడా ఇలాగే జరిగిందా..ఐతే నేను విన్నది నిజమేనన్న మాట" అని నవ్వటం మొదలు పెట్టింది.

నాకు కోపం, అసహ్యం, చిరాకు కలిసి ఏడుపొచ్చింది. "నీవు భవిష్యత్తు లో ఇలాంటి దుర్మార్గాలు చేస్తావనే మీ అమ్మా నాన్నా నీకా దిక్కుమాలిన పేరు పెట్టింది...అలౌకాంకిత అంట....ETV సీరియళ్ళ టైటిల్ గా పెట్టుకోవటానికి తప్ప ఇంకెందుకూ పనికిరాదే నీ ముష్టి పేరు.." అని ఎప్పటినుండో అణుచుకున్న కోపాన్ని వెళ్ళగక్కాను.

మళ్ళీ నేనే బుక్ చేసుకోవటానికి ప్రయత్నించి క్రెడిట్ కార్డెందుకు కాల్చుకోవటం అని...రమేష్ రెడ్డి కి ఫోన్ చేసి విషయం చెప్పా. ఫ్లైట్ల ఫేర్ లతో ఒక మెయిల్ చేసాడు.

" రేయ్..ఈ కింది ఫేర్లు చూసి నీకు ఏది కావాలో చెప్పు...చేయిస్తా -

Spice Jet - fare: Rs 200 - tax: Rs 1,99,800
Jet Airways - fare: Rs 150 - tax: Rs 1,99,800
Kingfisher - fare, tax తరువాత...ముందు కింద చూడు -

మరుక్షణమే రమేష్ కు ఫోన్ చేసి "Kingfisher లో చేయించు..ప్రయాణం సుఖప్రదంగా ఉంటుంది" అన్నాను.

దానికి రమేష్ "నెను మెయిల్ లో Kingfisher ఫేర్ రాయలేదు కానీ ఉండేవాటిలో అన్నింటికన్న ఎక్కువ అదేరా...అనవసరమైన డబ్బు ఖర్చు...ఆలోచించుకో" అన్నాడు..

నేను వెంటనే నా పక్కనున్న టేప్ రికార్డర్ లో భగవద్గీత క్యాసెట్టు ప్లే చేసి - " పిచ్చివాడా...తుచ్చమైన, అశాశ్వతమైన ధనం కోసం ఏ ఫ్లైటులో పడితే దానిలో ప్రయాణం చేస్తామా...నో....వేరే ఆలోచనలు లేకుండా Kingfisher లో చేయించు....డబ్బు మా అన్నయ్యనడిగి తీసుకో....సర్వేజనా సుఖినోభవంతు!" అని ఫోన్ పెట్టేసాను.

మరుసటి రోజు ఎడమ చేతిలో ఫ్లైట్ టికెట్టు, కుడి చేతిలో బాగు...గుండెలో ఆ air hostess ల ఫొటో తో ఫ్లైట్ ఎక్కాను...ఒక్కొక్కరుగా air hostess లు దర్శనమిచ్చారు. ఆర్.నారాయణ మూర్తి సినిమా షూటింగ్ ఎగరగొట్టి నేరుగా ఇక్కడకు వచ్చినట్టు...అందరూ ఎర్రని దుస్తుల్లో ఉన్నారు. విజయ్ మాల్యా Kingfisher బీర్లు 10,12 తాగి స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు...పనిలో పనిగా అక్కడి అప్సరసలను campus recruitment లో భూలోకానికి తీసుకొచ్చి ఇక్కడ Air hostess లుగా నియమించినట్టున్నాడు.

ఫ్లైట్ లో చాలా సేట్లు ఖాళీగా ఉన్నాయి...నా సీటు దగ్గరకు వెళ్ళాను...నా పక్క సీట్లలో ఇద్దరు కూర్చుని ఉన్నారు...నా సీట్లో నేను సెటిల్ అయ్యాను...

ఏదో అనౌన్సుమెంటు వచ్చింది. ముగ్గురు అప్సరసలు వరుసగ నుంచొని...సీటు బెల్టులు ఎలా పెట్టుకోవాలి, ఫ్లైటు సముద్రం లో పడిపోతే బాధ తెలియకుండా ఎలా చావాలి...లాంటి విషయాలు చెప్పటానికి.. చిన్నప్పుడు స్కూల్లో డ్రిల్ పీరియడ్ లో చేసే ఎక్సర్సైసులు చేసి చూపించారు.

మరో అనౌన్సుమెంటు వచ్చింది.... ఒక సీనియర్ అప్సరస మైకందుకుని "ఫ్లైట్ take off కి సిద్ధంగా ఉంది...దయ చేసి ప్రయాణికులంతా తమ తమ సీట్లలో కూర్చోవలసిందిగా ప్రార్థన" అని చెప్పింది. అంతే...అంతవరకు సీట్లలో కూర్చున్న వారంత ఒక్కసారిగా లేచి బాత్రూముకు, వెనక సీటు వాళ్ళతో మాట్లాడటానికి వెళ్ళారు...."దయచేసి కూర్చోండి...ఇంకో పది నిముషాల్లో మనము గాల్లో ఉంటాము..అప్పుడు కావలంటే బాత్రూముకు వెళ్ళొచ్చు....ప్లీజ్...." అని వేడుకుంటోంది సీనియర్ అప్సరస...లాభం లేదు...ఎవడి పనులు వాడు తీరిగ్గా ముగించుకొని వచ్చి తమ సీట్లలో కూర్చున్నారు...

ఫ్లైట్ take off కు రెడీ గా ఉంది అంటే మళ్ళీ ఇలానే చేస్తారని ఈ సారి అనౌన్సుమెంటు చెసేప్పుడు కాస్త జాగ్రత్త పడింది Air hostess..."ప్రయాణికులారా..మనము ఇప్పుటప్పటిలో బయలుదేరెట్టు లేము. కాకపోతే మీరు మీ సీటు బెల్టు పెట్టుకోండి...కంగారు
పడకండి...మనము ఎక్కడకు వెళ్ళట్లేదు.....ఉత్తినే..." అంది.. అందరూ చక చకా సీటు బెల్టు పెట్టేసుకున్నారు...

ఇలాంటి చాన్సు మళ్ళీ దొరకదని ఆ air hostess పైలెట్ వైపు తిరిగి గట్టిగా "ఉస్కో" అని అరిచింది......రన్వే మీద కూడా పోనివ్వకుండా డైరెక్తుగా గాల్లోకి ఫ్లైటు లేపాడు పైలెట్.....

గాల్లో ఉన్నాము...

అప్సరసల్లో ఒక అత్యద్భుతప్సరస నా దగ్గరకు నడిచి వచ్చి..."Let me help you sir" అని నా బ్యాగు తీసుకుని పైన పెట్టింది..."Do you need anything else sir" అని అడిగింది...."Yes...నీ ఫొటో, జాతకం, గోత్రం, నక్షత్రం, రాసి ఇస్తే మా అమ్మకు చూపించి నిన్ను పెళ్ళిచేసుకుంటా" అని అనాలని మనసంతా ఉన్నా...ఇంత మందిలో అడిగితే సిగ్గుపడుతుందని..."నా బ్యాగు మళ్ళీ తీసి ఇవ్వరా" అని అడిగాను. కాబొయ్యే భర్త మాట ఎలా కాదంటుంది...బ్యాగు తీసిచ్చి వెళ్ళిపొయ్యింది.

"ఆహా! ఇంత కన్నా ఏమి కావాలి జీవితంలో...ఈ ప్రపంచంలో నా కన్నా అద్రుష్టవంతుడు ఉండడు. ఒక వేళ ఉన్నా...ఇదే ఫ్లైట్లో ఎక్కడో కూర్చుని ఉంటాడు...ఈ ఆనందం ఇలానే కలకాలం ఉంటే ఎంత బావుంటుంది".....అని మనసులో అనుకుంటుండగా ఆకాశవాణి గట్టిగా నవ్వింది...టైము కాని టైము లో ఈ నవ్వేంటని కిటికీ లోంచి బయటకు చూడబోతుండగా నా పక్క సీట్లో కూర్చున్నాయన నా భుజం తట్టాడు.....తిరిగి చూసాను.

" హలో...నా పేరు దినకర్...నేను జోకులు బాగ వేస్తుంటానని మా వీధిలో అందరూ అంటుంటారు" అన్నాడు.

"కంగ్రాట్స్" అన్నాను..

"కంగ్రాట్స్ ఎందుకు లేండి..దేవుడు ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క టాలెంట్ ఇస్తాడు...నాకు 23 ఇచ్చాడు..సమయం సందర్భం బట్టి ఒక్కొక్కటి వాడుతుంటాను" అన్నాడు..

మళ్ళీ తనే అందుకుని.."ఇందాకే ఒక జోక్ రాసాను..చెప్పమంటారా?" అని అడిగాడు...

"చెప్పండి" అన్నాను ఉత్సాహంగా...

" - 'ఐ లవ్ యూ ప్రియా ' అన్నాడు ప్రియుడు. 'ఐ టూ లవ్ లవ్ యూ ప్రియా ' అన్నది ప్రేయసి..'అదేంటి..Two లవ్ యూ అన్నావు..అంటే నువ్వు కాకుండా మరొకరు కూడా నన్ను ప్రేమిస్తున్నారా అన్నాడు ప్రియుడు....'హా....' ఖంగుతింది ప్రేయసి"

"ఎలా ఉంది సార్" అని అడిగాడు దినకర్...

నాకు ఏమనాలో తెలియట్లేదు....ఇలాంటి జోకు విన్నందుకు నాకు గోహత్య చేసినంత పాపం అంటుతుందేమోనని భయంగా ఉంది..మరి చెప్పినోడికి వాడికెలా ఉండాలి....ఏ మాత్రం సిగ్గులేకుండా ఆ జోకుకు ఫీడ్ బాక్ అడుగుతున్నాడు....

పెద్దగా పరిచయం కూడా లేని వ్యక్తి....తిడితే బాగోదని..."చాలా బాగుంది సార్...జోకు మా పక్కింట్లోనో, ఎదురింట్లోనో జరిగినట్టు సహజత్వానికి దగ్గరగా ఉంది...'ప్రేయసి ', 'ప్రియుడు ' కూడా పాత్రలకు అతుక్కుపోయారు...మీ narration నన్ను కడుపుబ్బ నవ్వించింది" అన్నాను దినకర్ భాషలోనే మాట్లాడుతూ....

"ఓకే...ఇప్పుడు ఇంకోటి చెబుతా వినండి" అని ఏదో చెప్పబోతుండగా నేను మధ్యలో ఆపి..."మీరు చెప్పిన మొదటి జోకు తెప్పించిన నవ్వునుంచే నేనింకా తేరుకోలేదు...అప్పుడే ఇంకోటా...ఈ జోకు ఆ పక్కనాయనికి చెప్పండి..ఆయన కూడా ఆనందిస్తాడు" అన్నాను....

ఆ పక్కాయన నా వైపు కోపంగా చూసాడు...

దినకర్ నా దగ్గరకు జరిగి "మీరు రాక ముందే ప్రయత్నించాను సార్....ఆయన కేరళ ఆయన....తెలుగు రాదు.....సరే కాని....మీరెక్కడికీ వెళ్ళకండి..బాత్రూముకు వెళ్ళి ఇప్పుడే వస్తా" అని లేచి వెళ్ళాడు....

దినకర్ అటు వెళ్ళగానే నేను ఆ పక్కాయనతో "నిజం చెప్పండి సార్....మీరు తెలుగోళ్ళే గా....ఈ పిచ్చొడు జోకులు చెబుతాడని అబధ్ధాలు ఆడుతున్నారు..అంతేనా..." అన్నాను.

"ఔను సార్...కానీ మీకో విషయం చెప్పనా..ఈ మనిషి నన్ను బోర్డింగు పాసు తీసుకునే దగ్గర ఇలాంటి జోకులతో హింసించాడు...నేను ఫ్లైటు ఎక్కంగానే సన్ గ్లాసెస్ పెట్టుకున్నా...నా పక్క సీటులో వచ్చి కూర్చున్నాడు కానీ నన్ను గుర్తుపట్టలా..."హలో సార్..నా పేరు దినకర్...నేను జోకులు బాగా వేస్తుంటానని మా వీధిలో అంతా అంటుంటారు" అని మళ్ళీ మొదలు పెట్టాడు....సరే ఒక రాయి వెద్దామని 'నాకు తెలుగు రాదు..మాది కేరళ ' అన్నాను...అంతే..మిమ్మల్ని తగులుకున్నాడు" ...అని బ్రహ్మ రహస్యం చెప్పాడు...

"ఔనా...ఐతే మీ కళ్ళద్దాలు కాస్సేపు ఇవ్వండీ సార్..నేనూ తప్పించుకుంటాను" అని ఆ ఆపద్భాందవుడి శరణు కోరాను..

ఆయన తన కళ్ళజోడు నాకిస్తూ.."అయినా ఈ దినకర్ ను అని లాభం లేదు సార్..అదేదో TV చానెల్ లో 'నవ్వరా నవ్వు ' అనే కార్యక్రమం వస్తుంది...అందులో జనాలు చెప్పే జోకుల ముందు వీడి జోకులు బలాదూర్...ఆ పనికిమాలిన కార్యక్రమం లో ఈ పనికిమాలినోడు ఫైనలిష్ట్...రెపే ఫైనల్స్...తను ఫైనల్ లో చెప్పబొయ్యే జోకులను జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలుసుకోవటానికి ఇలా అందరికి చెబుతూ తిరుగుతున్నాడంట"....

దినకర్ వస్తుండటం గమనించి నేను వెంటనే పక్కాయన ఇచ్చిన కళ్ళద్దాలు పెట్టుకుని..నా సిగ్నల్ లేని మొబైల్ లో హిందీ లో మాట్లాడటం మొదలుపెట్టాను. దినకర్ తన సీట్లో కూర్చుంటూ.."అదేంటి సార్..ఈయన కళ్ళజోడు పెట్టుకున్నారు మీరు?" అని అడిగాడు..

క్లైమాక్సు ఫైటింగులో రివాల్వరులో బులెట్లు అయిపొయ్యిన విలన్ లాగ లొంగిపొయ్యాను నేను...పక్కాయనకు కళ్ళద్దాలు తిరిగిచ్చేసాను. ఆయన నావైపు జాలిగా చూసి 'దేనికైన సుడి ఉండాలి సార్ ' అన్న వాక్యాన్ని సింబాలిక్ గా తన బొటన వేలుతో నుదుటి మీద గీసుకుని చూపించాడు... ..లేకపొతే..కళ్ళద్దాలు తీసేసిన ఆయన్ను గుర్తుపట్టకుండా...కమల హాసన్ లాగ నటిస్తున్న నన్ను గుర్తుపట్టాడు ఈ దినకర్..

"ఈ Air hostess లకు అస్సలు sense of humour లేదు సార్..కాస్సేపు ఇక్కడి వాళ్ళకు జోకులు చెప్పి ప్రజల నాడి తెలుసుకుందామనుకుంటుంటే...ఒప్పుకోవట్లేదు..."

అర క్షణం సైలెంటుగా ఉన్నాడు...నాకు కొత్త జీవితం వచ్చినట్టయ్యింది...

మరు అరక్షణమే మళ్ళీ "నాకొక ఐడియా వచ్చింది సార్...మధ్యలో భోజనానికి ఏ ధాబా దగ్గరో ఆపుతాడుగా విమానం...అప్పుడూ మీరు ఇగ్నిషన్ తాళం చెవి దాచెయ్యండి...నేను ఆ టైములో ప్రజల నాడి తెలుసుకుంటా...ఏమంటారు?" అనడిగాడు..

"సారీ సార్...మీకంటే జోకులు చెప్పి చెప్పి క్రిమినల్ గా మంచి అనుభవం ఉంది...నాకిలాంటివి చేతకావు...నన్నొదిలెయ్యండి" అన్నాను....

సరే ఆ పక్కయాన సాయం అడుగుదామని దినకర్ అటువైపు తిరిగాడు..ఏమీ అడగక ముందే ఆయన "sorry..i can't help you.I don't know Telugu" అన్నాడు...."పరవాలేదు సార్" అని దినకర్ తన సీటు లోంచి పైకి లేచాదు....

నేను ఉండబట్టలేక "దినకర్ గారు..మీరు ఒక నాణ్యమైన వెధవ అన్న విషయం మీకు తెలుసా?" అనడిగాను....నా మాటలేవి వినకుండా తన బ్యాగు కిందకు దించి అందులోంచి ఒక పుస్తకం తీసి ఏదో చూసాడు...నా వైపు తిరిగి "ఇంకేంటి సార్ విశేషాలు?" అనడిగాడు....

పొరబాటున "మీరే చెప్పాలి" అన్నాను..

"ఇందాక ఆ చివరి సీటాయనకు ఒక పొడుపు జోకు పొడిచాను...నవ్వాడో లేదొ కనుక్కునొస్తా...ఈ లోపు మీరు నవ్వుకోవటానికి ఒక జోకు -

'కాస్త పంచదార ఉంటే ఇస్తారా '..అడిగింది పక్కింటి పంకజాక్షి...'మా ఇంట్లో "కాస్త" పంచదార లేదండి..ఒక డబ్బాడు ఉంది...కాబట్టి ఇవ్వను ' అంది కామాక్షి ముసి ముసి గా నవ్వుతూ. ఆశ్చర్యపోవటం పంకజాక్షి వంతయ్యింది'.....ఇదెలా ఉంది సార్"

కంట్లో నీళ్ళు రాకుండా ఏడవటం ఎలాగో ఆ క్షణం తెలుసుకున్నాను నేను...

"సరే నేను ఆ వెనక సీటాయన దగ్గరకు వెళ్ళొస్తా" అని వెళ్ళిపొయ్యాడు....

ఇందాక దినకర్ జోకు మొదలు పెట్టగానే లేచి వెళ్ళిన మా పక్క సీటాయన జోకు అయిపోంగానే తిరిగొచ్చాడు.....వచ్చీ రావటంతోనే "చీ..తూ" అని తిట్లు ఉమ్మటం మొదలు పెట్టాడు..దానికి నేను "జోకు వినని మీకే అంత అస్సహ్యమేస్తే, నా బాధలు ఎవరితో చెప్పుకోవాలి చెప్పండి" అన్నాను....

దానికి ఆయన..."అది కాదు సార్...ఆ ఐదు పైసల 'నవ్వరా నవ్వు ' కార్యక్రమంలో ఈ కాండిడేట్ ఫైనల్స్ కు చేరుకున్నాడు...ఈ లెక్కన ఆ మొదటి రౌండ్లలో ఓడిపొయ్యిన వాళ్ళని..వీళ్ళందిరికి మార్కులేస్తున్న ఆ జడ్జిలను ఏమనాలి?" అని కూరుకుపోతున్న గొంతుతో బాధ వెళ్ళగక్కాడు...

ఇంతలో దినకర్ మా దగ్గరకు వచ్చి "ఆ వెనక సీటాయన కనిపించట్లేదు సార్....ముందు పక్క సీట్లలొ కూర్చున్నాడేమో చూసొస్తా" అని ముందుకు వెళ్ళాడు. దినకర్ అలా ముందుకు వెళ్ళగానే వెనకనుంచి ఒకాయన మాదగ్గరకు పరిగెట్టుకుంటూ వచ్చి..నా పక్క సీటతనికి కళ్ళద్దాలు తిరిగిస్తూ "చాలా థాంక్స్ సార్" అని వెళ్ళిపొయ్యాడు....

నా కోపం విమానం సీలింగ్ దాకా చేరుకుంది......కళ్ళద్దాలు పెట్టుకుంటే ఎవ్వరిని గుర్తుపట్టడు...ఒక్క నన్ను తప్ప....సైకో సాలే గాడు.

తిట్టుకుంటుండగానే వచ్చి కూర్చున్నాడు...."ఆయన ఎక్కడికెళ్ళాడో తెలియట్లేదు సార్....సరే...ఇంకేంటి విశేషాలు?" అన్నాడు...

"ఏమీ లేవు...మీరు కూడా ఏమి చెప్పకండి" అన్నాను...

"మీకు మూడ్ బాగున్నట్టు లేదు..మాంచి జోకు చెబుతాను వినండి.....రెండు చీమలు స్కూటర్ మీద వెళ్తుంటాయి..." అని ఇంకా ఏదో చెప్పబోతుండగా....

"నాకు చీమల జోకులు నచ్చవు...ఆపండి" ..

"పర్లేదు...ఇంకోటి చెబుతాను....రెండూ ఏనుగులు స్కూటర్ మీద వెళ్తుంటాయి..."

నా ఓపిక కు తులసి నీళ్ళు తాగించెసి...."బుధ్ధుందా లేదా నీకు...నువ్వు వెంటనే నోరు ముయ్యక పోతే నీ మీద మానభంగం కేసు పెట్టి జైల్లోకి తోయిస్తాను..విమానం ఇంకాస్సేపట్లో కిందకు దిగబోతొంది...నోరిప్పావంటే రేపు నీ ప్రోగ్రాము కు వచ్చి నువ్వు స్టేజ్ ఎక్కంగానే కోడి గుడ్లతో కొడతా..."

దినకర్ కు విషయం అర్థమయినట్టుంది...

విమానం శంశాబాద్ airport లో దిగేంతవరకు నోరు విప్పలేదు...నా పక్కాయన నా ధైర్యానికి మెచ్చుకుని నేను వెళ్ళెటప్పుడు తన సన్ గ్లాసెస్ బహుమతిగా ఇచ్చి వెళ్ళాడు....

నేను వెళ్ళి మెహదీపట్నం బస్సెక్కాను. ఐదు నిముషాల తరువాత దినకర్ వచ్చి నా పక్క సీటులో కూర్చున్నాడు....చాలా సేపు ఏమీ మాట్లాడలేదు. నాకెందుకో బాధేసింది....దినకర్ వైపు చూసి "సారీ సార్...ఇందాక కోపం లో ఏదో అనేసాను...ఏమీ అనుకోకండి" అన్నాను...

"పర్లేదు సార్" అన్నాడు దినకర్..

బస్సు వాడు 'ఒక్క మగాడు ' సినిమా పాటలు పెట్టాడు..

దినకర్ ఆ పాటకు చిటికెలు వేస్తూ "ఒక్క మగాడు చూసారా సార్....సూపర్ సినిమా" అన్నాడు..

"మీ వీధిలో వాళ్ళు కరెక్టే సార్...మీరు నిజంగా జోకులు బాగా వేస్తారు...ఈ జోకు మాత్రం అదిరింది"

నేను మామూలుగా మాట్లాడటం చూసిన దినకర్ "మీరు మంచి మూడ్లోకి వచ్చినట్టున్నారు.....ఈ సందర్భంగా ఒక జోక్....ఇద్దరు 'ఒక్క మగాడు ' లు స్కూటర్ మీద వెళ్తుంటారు ..........................."

అప్పుడర్థమయ్యింది నాకు..ఆకాశవాణి ఎందుకు నవ్విందో...