Wednesday, December 3, 2008

కళ్ళు మూసుకో - 1,2,3 - కళ్ళు తెరు

నేను పడుకుని 50 గంటలు అవుతోంది....

గత రెండు రోజులుగా ఆపకుండా ఒక పుస్తకం చదువుతున్నాను. ఆ పుస్తకం పేరు "నిద్రపోవటం ఎలా?"..ఒక పెన్ను తో ఆ పుస్తకం మీదున్న టైటిల్ కొట్టేసి "నిద్ర రాకుండా పోవటం ఎలా?" అని మార్చాను..

ఏదో trance లో ఉన్నట్టుంది..నేను నుంచున్నానో, కూర్చున్నానో కూడా తెలియట్లేదు. ఆకలేస్తొందో లేదో అర్థమవ్వట్లేదు....ఏమయినా తిందామని ఫ్రిజ్ తెరిచాను........కానీ ఎందుకు తెరిచానో గుర్తుకు రావట్లేదు. నా మెదడుకు ఏదయినా ప్రాబ్లం వచ్చిందేమోనని భయమేసింది.....ఛ...అలాంటిదేమీ అయ్యుండదు. ఫ్రిజ్ మూసేసి వెనక్కు రెండడుగులు వేసాను....." ఇల్లు ఊడ్చి, బట్టలు ఉతుకుదాము " అనిపించింది! వామ్మో...నా మెదడు ఖచ్చితంగా దెబ్బతినింది..లేకపొతే ఇలాంటి విపరీతమైన ఆలోచనలు రావటమేంటి? కాస్త చల్ల గాలి కోసమని తలుపు తెరిచి...బాల్కనీ లోని బెంచి మీద కూర్చున్నాను.

ఎదురుగా ఉన్న సముద్రం నుండి చల్ల గాలి వీస్తోంది.. బెంచి మీద నా పక్కన బంగారు కిరీటం, నగలు పెట్టు కునికూర్చున్న ఆయనతో - "ఎంత హాయిగా ఉంది కద సార్.. ఈ గాలి, ఈ బెంచి, మీరు, నేను.....కానీ నాకు హాయితో పాటూ ఒక డౌటు కూడా ఉంది సార్...మా ఇల్లు గ్రౌండు ఫ్లోర్ లో కదా ఉండేది - మరి తలుపు తెరవగానే ఈ బాల్కనీ, బెంచి ఏంటి...పైగా బెంగళూరులో సముద్రం ఏంటి.....అవును...మీరెవరు?????

ఆ కిరీటం, నగలాయన నాకు తన చెయ్యి ఇస్తూ " కాల్ మి డు...దేవుడు " అన్నారాయన..

"OK...డు - దేవుడు గారు...ఎవరు మీరు...ఈ బాల్కనీ, సముద్రం ఎలా వచ్చాయని నేను తలబద్దలు కొట్టుకుంటుంటే..మీరు మా ఇంట్లోకి ఎలా వచ్చారు?" అనడిగాను...

"ఓరీ భక్తి లేని భక్తా! నేను దేవుడిని రా..మొన్నేదో మంచి పని చేసి ఏడ్చినట్టున్నావు...నీకో వరమిమ్మని పంపించారు నన్ను....నీ బుర్ర మామూలు కండిషన్ లో ఉన్నప్పుడు వస్తే తట్టుకోలేవని ఈ రోజు వచ్చా. ఇప్పుడయితే..ఏది కలో, ఏది నిజమో తెలుసుకోలేని పరిస్థితి లో ఉన్నావు కాబట్టీ అంత షాక్ తినవు...సరే..ఈ ఉపోద్ఘాతము చాలు కానీ, ఏ వరం కావాలో కోరుకో." అన్నారాయన...

"వరాలు తరువాత...మీ ID కార్డు ఏదయినా ఉంటే చూపించండి " అనడిగాను..

"ఏరా...తిమ్మిరి తిమ్మిరిగా ఉందా?"

"లేకపోతే మీరు దేవుడని ఎలా సార్ నమ్మటం? పోనీ ఏదయినా మ్యాజిక్ చేసి చూపించండి"

"సరే - 1 నుండి 50 లోపు ఒక నంబరు అనుకో....."

"మీరు 1 నుండి 500 లోపు ఒక నంబరు అనుకోండి - ఏదనుకున్నారో నేను చెప్పేస్తా....ఇలాంటి మ్యాజిక్ లు కాదు సార్. దిమ్మ తిరిగి పోవాలి..అలాంటిదేదయిన ఉంటే చూపించండి."

"OK....నీకు ఇష్టమయిన క్రికెటర్ ఎవరో చెప్పు" అనడిగారు...కిరీటం తీసి పక్కన పెడుతూ..

"జయమాలిని.........
అదేంటి సార్ ' టెండుల్కర్ ' అందామనుకుంటే ' జయమాలిని ' అని వచ్చింది నోట్లోంచి?"

"మరదే...ఇప్పుడు తెలిసిందా నా శక్తుల గురించి..."

నేను జవాబిచ్చేలోపు వెనక నుంచి నా తలపైన ఎవరో బలంగా కొట్టారు. వెనక్కు తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు...

దేవుడు నా తల మీద రుద్దుతూ " దిమ్మ తిరిగిపోవాలి అన్నవుగా....అందుకే ఈ ఏర్పాటు..... సరే అడుగు ఏ వరం కావాలో?" అన్నాడు, అరచెయ్యి వరమిచ్చే పొజిషన్ లో పెడుతూ....

"ఏముంది సార్....ఈ ప్రపంచమంతా సుఖశాంతులతో, సకల సంపదలతో......."

"ఆగు - నిజం చెప్పు"

"ఈ సారి నా Annual appraisal లో నాకు నూట ఇరభై పర్సెంటు ఇంక్రిమెంటు వచ్చేట్టు చూడండి సార్...ఇదయ్యాక కూడా నా వరం లో ఇంకొంచం మిగిలుంటే - ఆ హిమాన్షు గాడి ఉద్యోగం ఊడేట్టు చూడండి "..అనడిగాను వినయంగా..

"ఇంతోటి దేవుణ్ణి...అంత దూరం నుంచి వస్తే ఇదా నువ్వు కోరుకునేది?? కమాన్ యార్..ఇంకాస్త ఆలోచించు. మొన్నెప్పుడో ఎవరితోనో 'ఏంటి ఈ జీవితం - ఇక ఇంతేనా?' అన్న డైలాగ్ అన్నట్టున్నావ్"...

"బాగా గుర్తుచేసారు సార్..ఏమి చెప్పమంటారు - ఈ ఉద్యోగం బొరు కొడుతోంది...ఏదో అసంతృప్తి...రోజూ చిరాకే. ఇలా కాకుండా బాగా exciting గా ఉన్న ఉద్యోగం ఇప్పించండి సార్...ప్రతి రోజూ థ్రిల్లింగ్ గా ఉండాలి..." అన్నాను..

" రైట్....కళ్ళు మూసుకో - 1,2,3 - కళ్ళు తెరు "

కళ్ళు తెరిచాను..

ఒక పెద్ద బోను లో ఉన్నాను. చేతిలో హంటర్ ఉంది. చిన్న అలికిడి లాగ వినిపిస్తే కిందకు చూసాను......

......నా ఎదురుగా నేల మీద ఆరు సింహాలు కూర్చుని ఉన్నాయి!

మాంచి conditioner తో తల స్నానం చేసొచ్చినట్టున్నాయి...జూలు గాలికి అటూ ఇటూ ఎగురుతోంది..

నా ప్రమేయం లేకుండానే నా కుడి చేయి హంటర్ ను నేల మీద గట్టిగా కొట్టింది...ఆ చప్పుడు కు సింహాల కన్నా ముందు నాకు భయమేసింది. ఒక్కొక్క సింహం పైకి లేచి మెల్లగా నా చుట్టూ తిరగటం మొదలు పెట్టింది..నా చొక్కా, నా ప్యాంటు తడిసి పోయాయి (రెండూ చమట వల్లే.........అనుకుంటా)..

నా చుట్టూ మూడు ప్రదక్షణాలు అయ్యాక సింహాలన్నీ ఒక మూల చేరి ఏవో మాట్లాడుకోవటం మొదలుపెట్టాయి.. పది సెకెండ్ల తరువాత సింహాలన్నీ "high five" అని చేతులు కొట్టుకుని నా వైపు తిరిగాయి..అందులో ఒక సింహం కింద కూర్చుని తమలపాకులకు సున్నం రాస్తోంది...నన్ను తినేసాక వేసుకోవటానికి తాంబూలాలు రెడీ చేస్తున్నట్టుంది...మిగతా సింహాలు నా వైపు అడుగులేస్తున్నాయి...ఇంకొద్ది సేపట్లో ఈ బోను లోని సింహాలు నన్ను తిని, నా బోన్స్ తో పాచికలు చేసుకోవటం ఖాయం...ఒక్క సారిగా సింహాలు నా మీదకు ఎగిరాయి..కళ్ళు మూసుకుని గట్టిగా అరిచాను - "దేవు............."

"..........డా" అని కళ్ళు తెరిచాను.........

మళ్ళీ బాల్కనీలో బెంచి మీద కూర్చుని ఉన్నా. ఎదురుగా దేవుడు. అంతా నిశ్శబ్దం.

ఇందాక నేను సింహాలు బోనులోకి వెళ్ళినప్పుడు 'pause' చేసిన సీను మళ్ళీ 'play' చేసాడు దేవుడు....మళ్ళీ సముద్రపు హోరు, చల్ల గాలి, మొదలయ్యాయి..

"ఏంటి సార్....అంత పని చేసారు?" అన్నాను చమట తుడుచుకుంటూ...

"చిన్న ప్రివ్యూ ఇచ్చాను తమ్ముడూ...ఇందాక నువ్వు చేసావే...రోజూ exciting గా, థ్రిల్లింగ్ గా ఉండే ఉద్యోగం అదొక్కటే....వేరే ఏ ఉద్యోగం అయినా...కొద్ది రోజులకు బోర్ కొడుతుంది..మంచి వ్యాపకాలేవయినా ఏర్పరచుకుని సంతోషంగా ఉండటానికి ప్రయత్నించు........సరే - ఏ వరం కావాలో కోరుకో"..

"ఉండండి సార్...భయం తో గొంతు ఎండిపోయింది..లోపలకెళ్ళి నీళ్ళు తాగొస్తా. మీకూ ఓ గ్లాసు పట్రమ్మంటారా?" - అడిగాను...

"వద్దు....నేను మా లోకం నుంచి ఫ్లాస్క్ లో అమృతం తెచ్చుకున్నాను...నువ్వు నీళ్ళు తాగి రా"..

నేను వెళ్ళి నీళ్ళు తాగుతుంటే నా వెనకాలే దేవుడు కూడా వచ్చాడు..

"ఈ గిటార్ నీదేనా? వాయిస్తుంటావా?" అనడిగాడాయన నా మంచం పక్కనున్న నా గిటార్ ను చూపిస్తూ..

"అంటే సార్...అది...అప్పుడప్పుడూ...ఎప్పుడోఅప్పుడు"

"రేయ్ మూర్ఖా...ఇటువంటి వాయిద్యాలు ఇంట్లో ఉంచుకుని కూడా ఎప్పుడో ఒక సారి వాయిస్తాననటం మహా పాపం రా"

"ఊరుకోండి సార్..అలా భయపెట్టకండి..ఇప్పటికే తెలిసో తెలియకో ఎన్నో పాపాలు చేసుంటాను...ఇటువంటి చిన్న చిన్న విషయాలను కూడ పాపాల లిస్టులో చేరిస్తే ఇక నా లాంటి వాళ్ళు స్వర్గానికి వెళ్ళటం అసాధ్యం" అన్నాను...

"సరే...ఆ గిటార్ సంగతి చెప్పు...ఎందుకు రోజూ సాధన చెయ్యట్లేదు?"

"సమయం దొరక్క సార్...ఒక్క గిటార్ అనే కాదు...ఎన్నో ఉన్నాయి సార్ నేను చేయాలనుకునేవి...టైం లేదంతే..రోజుకు ఇంకొక్క
' ఆరు గంటలు ' ఎక్కువుంటేనా........"

"కావాలా?"

" అంటే...కుదురుతుందా సార్....రోజుకు 30 గంటలు...నిజంగా వీలు అవుతుందా?" అనడిగాను...

" కళ్ళు మూసుకో - 1,2,3 - కళ్ళు తెరు "

కళ్ళు మెల్లగా తెరిచాను..నా మంచం మీద పడుకుని ఉన్నాను..పక్కనే గడియారం...టైం ఉదయం 7:30 అయ్యింది..ఎదురుగా TV ఆన్ చేసి ఉంది....NDTV 30/7 అనే చానెల్ వస్తోంది....ఆహా...ఐతే రోజుకు 30 గంటలు వచ్చేసాయన్నమాట...మెల్లగా నిద్ర లేచి, తయారయ్యి ఆఫీసుకు చేరేప్పటికి 10:30 అయ్యింది..ఆఫీసు మెయిల్ నిదానంగా చెక్ చేసుకోవచ్చని G-talk లోకి లాగిన్ అయ్యాను...

'Hi....Hi.....Hi.....Hi....' అని నాలుగు విండోలు తెరుచుకున్నాయి....హేమ, లలిత, విద్య, నీల్ విజయ్ ఆన్లైన్ ఉన్నారు..

(ఈ క్రింది సన్నివేశం లో కెమేరా నా లాప్టాప్ స్క్రీన్ వైపు తిప్పబడింది)

-----

హేమ - ఏంటి లేటయ్యింది?
నేను - అవును..లేటయ్యింది..

లలిత - చాక్లెట్ తెచ్చావా?
నేను - నువ్వు డబ్బు తెచ్చావా?
లలిత - తెచ్చా
నేను - ఇలా ఇవ్వు...వెళ్ళి పట్టుకొస్తా

విద్య - భవ్......హహహ....భయపడ్డావా
నేను - ప్లీజ్ యా....పొద్దున్నే అలా భయపెట్టకు

నీల్ విజయ్ - రేయ్...ఇవ్వాళ డేట్ ఎంత?
నేను -

-------

హేమ - టిఫిన్ చేసావా....ఇవ్వాళ మా ఇంట్లో ఇడ్లీ..చట్నీ భలే ఉండింది...నీకు పెట్టనుగా...హహహ.
నేను - నేను కూడా ఇడ్లీనే తిన్నా...మీ నాన్న అదే హోటల్ నుండి పార్సెల్ కట్టించుకెళ్ళాడు..

లలిత - నీకొక విషయం తెలుసా...హిమాన్షు ఇవ్వాళ పొద్దున్నే బాసుకు రవ లడ్లు, మెరపకాయ బజ్జీలు తెచ్చిచ్చాడు...ఈ సారి వాడి ప్రమోషన్ గ్యారంటీ..
నేను - అసలు వాడికి సిగ్గుందా?? ఇరిటేటింగ్ ఫెలో..
లలిత - నాకు కూడా అదే అనిపించింది...ప్రమోషన్ కోసం మరీ ఇంత దిగజారటమా?
నేను - ప్రమోషన్ గురించి కాదు లల్లీ..బుధ్ధున్నోడు ఎవడయినా మెరపకాయ బజ్జీలు పొద్దున తెస్తాడా?? సాయంకాలం స్నాక్స్ టైములో తీసుకురావాలి కానీ....

నీల్ విజయ్ - రేయ్...ఉన్నావా....రిప్లై ఇవ్వరా...
నేను -

--------

విద్య - బోర్ కొడుతోంది...బ్రేక్ కు వెళదామా?
నేను - టూ మినిట్స్

హేమ - నువ్వు, విద్య బ్రేక్ కు వెళ్తున్నారట గా...ఇప్పుడే పింగ్ చేసింది..అవును లే..మమ్మల్ని ఎందుకు పిలుస్తారు..పెద్ద వాళ్ళయిపోయారు..
నేను - ఏంటి హేమ..అలా అంటావు..నేనే నిన్ను పిలుద్దామనుకుంటున్నా ...ఈ లోపే నీకు చెప్పేసిందా??

లలిత - నిన్న రాత్రి మీ ఇంట్లో ఏమి కూర?
నేను - ఒక్క నిముషం..ఇప్పుడే వస్తా..

నీల్ విజయ్ - రేయ్...ఇవ్వాళ రాత్రికి PVR లో సెకెండ్ షో టికెట్లు దొరికాయి..
నేను - ఆ చెప్పరా...ఇంతసేపు ఒక కాల్ లో ఉన్నాను.....షో ఎన్నింటికి?

--------

బ్రేక్, లంచ్, తరువాత ఇంకో బ్రేక్ తీసుకున్నాక నా మెయిల్ చెక్ చేసుకున్నా....నా బాసు దగ్గర్నుండి ఏదో మెయిల్....అందులో చివరి వాక్యం మాత్రం 16 ఫాంటు సైజు లో, బోల్డు అక్షరాలతో, ఎర్రటి రంగులో - "send it to me by the end of day, today" అని ఉంది...పని మొదలెడదామని గడియారం చూస్తే మధ్యాహ్నం 3:40 అయ్యింది...ఇవ్వాళ పని జరగటం అసంభవం...రేపటి దాక టైం అడుగుదామని నా బాసు క్యాబిన్ కు వెళ్ళాను..తలుపు తెరవంగానే "be aggressive, be proactive, take initiative, by the end of the day, youtube blocked, Gtalk blocked, messenger blocked" లాంటి నాలుగైదు విషయాలు మొరిగి నన్ను పంపించేసాడు...వాడి మాటల హోరుకు నాకు కళ్ళు తిరిగి పడిపోయాను...

కళ్ళు తెరిచేప్పటికి మళ్ళీ ఇంట్లో ఉన్నాను...దేవుడు నా గిటార్ వాయిస్తూ కనిపించాడు..

"చూసావా..30 గంటలు కాదు..రోజుకు 300 గంటలు ఇచ్చినా నీ బుధ్ధి మారదు....కాబట్టి వేరే వరమేదయినా కోరుకో.."

నేను అడిగేలోపు దేవుడు "హలో..ఆ చెప్పు...OK...OK" అంటున్నాడు....ఎవరో ఫోన్ చేసినట్టున్నారు...మనకు వైర్ లెస్ లాగా వీళ్ళకు ఫోన్ లెస్ అనుకుంటా..చేతిలో ఏ ఫోనూ లేకుండా రెండు నిముషాలు మాట్లాడేసాడు దేవుడు..

"ఏంటి సార్ ఏమయినా ప్రాబ్లమా?" అడిగాను ఆయన ఫోను పెట్టంగానే..

"Recession అయ్యా...అందుకే అందరికీ టెన్షన్ గా ఉంది..మీరు బచ్చాగాళ్ళు..ఓ పది, పదిహేను బాంకులు మూసేసారు...మాకున్న క్రైసిస్ కు మేము 3 గ్రహాలు మూసేసాము తెలుసా..ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియదు..."

నాకు తలియకుండానే గట్టిగా నవ్వేసాను...

"ఏరా కొవ్వెక్కిందా...నా ఉద్యోగం ఊడుతుందంటే నవ్వొస్తోందా నీకు? నా గురించి నీకు పూర్తిగా తెలిసి నట్టు లేదు రా రేయ్..నీ Engineering Graphics పేపర్ గుర్తుందా? పరీక్ష ముందు రోజు కూడా ఏదో తోక ఆడించావు...అందుకే 34 మార్కుల దగ్గర ఆపేసాను నీ పేపర్"

"అది చేసింది మీరా??????????????"

"అన్ని క్వశ్చన్ మార్కులెందుకు?"

"లేకపోతే ఏంటి సార్...ఏదో పొరబాటున రెండు మాటలు అనుంటాను..దానికి Engineering Graphics లాంటి పేపర్ ఇంకో సారి రాయించారా నాతో..." అని మొహం మాడ్చుకుని ఏడ్చేసాను..

"సర్లే ఊరుకో..ఇప్పుడెందుకు ఏడుపు... అయినా ఆ తరువాతి సారి పాస్ చేయించాగా...లేకపొతే నువ్వేసిన పూలకుండి, సైకిల్ టైర్ బొమ్మలకు ఎవడిస్తాడు చెప్పు 65 మార్కులు.....ఏడుపాపి ఏమి కావాలో కోరుకో.." అన్నారాయన నాకు కర్చీఫ్ అందిస్తూ...

"ఇంతకు ముందు కోరుకున్నవేవీ వద్దు సార్....ఈ ఒక్క కోరిక తీర్చండి...ఇక జీవితం లో ఎప్పుడూ ఏమీ కోరుకోను" అన్నాను..

"నేను చిన్నప్పుడు పేపర్ కిరీటాలు పెట్టుకునే రోజుల నుండి చూస్తున్నాను..ఏ కోరిక కోరినా 'ఇదొక్కటే తీర్చు స్వామీ..ఇంకేమీ అడగను ' అంటూనే ఉన్నారు మీరు...సరే అడుగు "....

"ఒక అందమైన, తెలివైన అమ్మాయి నన్ను ప్రేమించి పెళ్ళి చెసుకునే వరమివ్వండి సార్" అన్నాను...

"బాగుంది రా....' బాబుకి లేక బాలకృష్ణ సినిమా దొంగ DVD చూస్తుంటే, కొడుకొచ్చి జేంస్ బాండ్ కొత్త సినిమా కు మొదటి రోజు టికెట్లు అడిగాడంట '......నాకే 700 సంవత్సరాలుగా పెళ్ళి కుదరట్లేదంటే...నీకొక అమ్మాయిని చూడాలా...."

"ఇవ్వలేనప్పుడు ఎందుకు సార్ అడగటం??? అయినా ఇప్పుడు నాకు మీ సహాయం అవసరం లేదులెండి...మీ మంత్రం గుర్తుంది నాకు........' కళ్ళు మూసుకో - 1,2,3 - కళ్ళు తెరు ' "....అని కళ్ళు మూసుకుని, కళ్ళు తెరిచాను........

మళ్ళీ ఒక బోనులో ఉన్నాను..ఈ సారి బోను ఊసలకు కరెంటు కనెక్షనుంది....కిందకు చూసాను...ఎదురుగా కుర్చీలో కూర్చుని నవ్వుతూ దినకర్ గాడు కనిపించాడు....నేను తల పైకి లేపి చూసాను...దేవుడు తన బండి స్టార్ట్ చేస్తూ కనిపించాడు....

"మంత్రాన్ని దొంగలించినంత మాత్రాన....ఇంత పెద్ద శిక్ష విధించాలా సార్?"......

ఆయన నన్ను చూసి ఒక చిన్న నవ్వు నవ్వి, ఏమీ మాట్లాడకుండా... ఫస్ట్ గేర్ వేసుకుని వెళ్ళిపోయారు...