Thursday, August 20, 2009

మగ పిల్లాడు - పిల్ల మగాడు

అనగనగా ఒక సంవత్సరం...19__. అప్పుడు నా వయస్సు __.

నేను మా అమ్మ కడుపులో ఉండగా ఆడపిల్ల పుట్టాలని కోరుకున్నారట మా ఇంట్ళో అందరూ. నేను పుట్టాక..అబ్బాయి పుట్టాడని తెలిసి.. తమ మనోభావాలను గాయపరచినందుకు నా మీద కేసు వేసారు మా వాళ్ళు. సరే జరిగిందేదో జరిగిపోయిందని...తన ముచ్చట తీర్చుకోవటానికి రెండేళ్ళ పాటు నన్ను ఒక అమ్మాయిలా పెంచిదట మా అమ్మ..నాకు గుండు గీయించిన మరుసటి రోజునుంచే విగ్గు పెట్టి జడలు వేసేదిట..

జీవితమంటే 'రోజంతా పడుకుని సీలింగు ఫ్యాను చూస్తూ ఉండటం' అని అనుకునే ఆ వయస్సులో ఇలా అమ్మాయిలా పెంచబడటం వల్లనో ఏమో..నన్ను ఎవరైనా 'నీ వయస్సెంతా?' అని అడిగితే 'నీ జీతమెంత?' అని అడుగుతాను. అవతలి వాళ్ళు తమ జీతమెంతో చెప్పగానే నా జీతం కూడా చెప్పి చేతులు దులుపుకుంటానే తప్ప..నా వయస్సు మాత్రం చెప్పను....అందుకే మళ్ళీ మొదటి లైనుకు వెళ్దాం..

అనగనగా ఒక సంవత్సరం...19__. అప్పుడు నా వయస్సు __.

అంతవరకు మా ఊరు దాటి ఎప్పుడూ వెళ్ళలేదు నేను. ఆ ఏడాది మా మావయ్య పెళ్ళికని హైదరబాదు తీసుకెళ్ళారు మా ఇంట్లో వాళ్ళు. పెళ్ళి మండపం చేరగానే నా హైటు పిల్లలున్న గుంపులోకి నన్ను తోసేసి వెళ్ళిపోయారు.

అందరూ సిటీ పిల్లలే..అందరూ ప్యాంట్లు వేసుకుని ఉన్నారు..నేను మాత్రమే నిక్కరు వెసుకుని ఉన్నాను..అది కూడా మా అమ్మ తన కాటన్ చీరలతో పాటూ గంజి పెట్టించిన నిక్కరు. అందుకేనేమో నన్ను ఎవ్వరూ పలకరించట్లేదు..నేను మా వీధిలో గోలీల ఆటలో మూడు Grand Slam లు గెలిచానని తెలిస్తేనైనా నాతో మాట్లాడతారేమోనని జేబులోంచి మూడు గోలీలు తీసి గాలిలోకి ఎగరేసాను..ఆ ప్రయత్నం కూడా గాలిలో కలిసిపోయింది.....

ఆ అవమానాన్ని భరించలేకపోయాను..మోకాళ్ళు కనిపించేలా నిక్కరేసుకుని ఉండటమే ఇందుకు కారణమని గ్రహించాను..సైలెంటైపోయాను..

మరుసటి రోజు మా ఊరు తిరిగెళ్ళి...మా స్కూలుకు వెళ్ళేదాక ఏమీ మాట్లాడలేదు నేను..స్కూలు లో భోజనాల సమయంలో గణేష్, సుధాకర్ లతో నాకు హైదరబాదు లో జరిగిన అవమానం గురించి చెప్పాను..

"గాంధీ గారిని సౌత్ ఆఫ్రికా లో ట్రైను నుంచి బయటకు తోసేస్తే ఆయన ఏమి చేసారో తెలుసా?" అన్నాను..

"తెలియదు..కానీ నన్ను ఎవరైన అలా తోసేస్తే..ఆ ట్రైను టైర్లన్నిటికీ గాలి తీసేసేంతవరకు ఆ స్టేషన్ నుండి కదలను." అన్నాడు సుధాకర్ గాడు..

"ఏడ్చావు...ఆ అవమానం జరిగాక ఆయన మన దేశానికి తిరిగొచ్చి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు. నిన్న నాకు జరిగిన అవమానం కూడా అలాంటిదే..అందుకనే నేను కూడా ఒక మగాడిగా నా స్వాతంత్ర్యం కోసం పోరాడదలచుకున్నాను..ఇక నుంచి మనము మగ పిల్లలం కాదు..పిల్ల మగాళ్ళం...(టైటిల్ జస్టిఫికేషన్)

వెంటనే ఒక అజెండా తయారు చేసుకున్నాము..

- ఇక పై ప్యాంట్లు మాత్రమే వేసుకోవాలి
- జేబులో ఎప్పుడూ డబ్బులుండాలి

అనుకున్న వెంటనే ఇవి అమలు పర్చాలని...మా నాన్న పని చేసే స్కూలుకు వెళ్ళాను నేను, నా స్నేహితులిద్దరినీ తోడు తీసుకుని..మేము వెళ్ళే సమయానికి మా నాన్న లెక్కల పాఠం చెబుతున్నాడు. నేను నేరుగా క్లాసులోకి వెళ్ళి "నాన్నా..నేను ప్యాంటు కుట్టించుకోవాలి..నాకు డబ్బివ్వు " అనరిచాను..నా ధైర్యం చూసి ముందు బెంచీ లోని అమ్మాయిలు ముక్కు మీద వేలేసుకున్నారు (ఆశ్చర్యమేసి కాదు..ముక్కు మీద దురదగా ఉంటే గోక్కోవటానికి)..మా నాన్న నా మాటలేవీ పట్టించుకోకుండా ఒకమ్మాయిని లేపి "(a+b) ని (a-b) తో గుణిస్తే ఏమొస్తుంది?" అనడిగాడు..ఆ అమ్మాయి "సల్ఫ్యూరిక్ యాసిడ్" అంది..మా నాన్నకు విపరీతమైన కోపమొచ్చింది..వెంటనే నన్ను, గణేష్ గాడిని, సుధాకర్ గాడిని గోడ కుర్చీ వేయమన్నాడు..

ముగ్గురూ పక్కపక్కన గోడకుర్చీ వేయగానే మా కాళ్ళ మీద ఒక గుడ్డ కప్పి 'గోడ సోఫా' చేసాడు మా నాన్న..క్లాసులోని అమ్మయిలంతా గ్రూప్ సాంగ్ పాడినట్టు నవ్వారు..మా వాళ్ళు నా వైపు చిరాకు గా చూసారు..మా స్కూలు లో మేము తీసే గుంజిళ్ళు, తినే తన్నులు చాలవన్నట్టు వీళ్ళ స్కూలుకొచ్చి గోడ కుర్చీ వెయ్యాలా?? ఒక గుంటూరు వాస్తవ్యుడు గోంగూర కోసం బెంగళూరొచ్చినట్టుంది ఇది..

ఈ సంఘటన తరువాత ' మా నాన్న '..' మా బాబు ' గా మారిపోయాడు...అప్పటి నుండి మా ఇద్దరి మధ్యా పచ్చ గడ్డి వేస్తే Nuclear Fusion జరిగేది. అందుకే ఇక మాటలతో ఈ సమస్య తెగదని..ఒక ఉత్తరం రాద్దామని నిర్ణయించుకున్నాను..మాంచి వింటేజ్ ఫీల్ ఉంటుందని పోస్ట్ ఆఫీసుకెళ్ళి తాళపత్రాలు కొని రాసాను..మొన్నీమధ్య జరిగిన పురావస్తు శాఖ త్రవ్వకాల్లో ఆ తాళపత్రాలు బయటపడ్డాయి..నేను రాసిన ఉత్తరం ఇదిగో -మరుసటి రోజు ఆదివారం. హృదయం లేని మా బాబు 'ఆదిత్య హృదయం' చదువుతున్నాడు పొద్దున్నే.. టీవీ లో 'మహాభారత్ ' వస్తోంది..సరిగ్గా రాహుకాలం మొదలవ్వగానే నా తాళపత్రోత్తరం తెచ్చిచ్చాడు ఒక వేగు గుర్రం మీద..ఆ ఉత్తరం చదవగానే "జానకీ!!!" అని గట్టిగా అరిచాడు మా బాబు. 'జానకి!!!' అనే పేరుతో మా ఇంట్లో ఎవ్వరూ లేకపోవటం వల్ల ఎవ్వరూ పలకలేదు..ఈ సారి మా అమ్మను పిలిచాడు..మా అమ్మ టీవీ ముందు నుంచి లేచి పరుగు పరుగున వచ్చింది..ఉత్తరం చూపించాడు..మా అమ్మ "కింతూ..పరంతూ" అని ఏదో చెబుతున్నా వినిపించుకోకుండా తాండవం మొదలెట్టాదు మా బాబు....అసలు విషయమేంటంటే - చిన్నప్పుడు ఆయన్ని అందరూ 'బాబు ' అని పిలిచేవారట..నేను ఉత్తరం లో 'అమ్మ, బాబు లకు' అని రాసాను కదా.."నన్నే పేరు పెట్టి పిలుస్తాడా పిల్ల కుంక" అని అరుస్తున్నాడు..ఇప్పుడు నేను దొరికానంటే డ్యాన్సు ఆపి ఫైటింగ్ మొదలెడతాడని..రహస్య మార్గం ద్వారా వంటింట్లోకి పారిపోయాను నేను..

అక్కడ మా అమ్మమ్మ రోట్లో అల్లం పచ్చడి రుబ్బుతోంది..నేనెళ్ళి క్వీన్ విక్టోరియా పక్కన కూర్చుని.."సుధాకర్ వాళ్ళ నాన్న వాడి పుట్టిన రోజుకు ప్యాంటు కుట్టించాడు తెలుసా? నేను ఎన్నాళ్ళిలా ఉత్తరాలు రాసి రోలు పక్కన కూర్చోవాలి?" అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాను..

"ఇంత చిన్న విషయానికి ఎందుకురా ఏడుస్తావు? ఈ సారి మళ్ళీ సుధాకర్ పుట్టిన రోజుకు వాడికి కూడా నిక్కరు కుట్టించమని చెబుదాములే వాళ్ళ నాన్నతో...ఏదీ..ఆ అను" అని రోట్లోంచి ఒక వేలుతో అల్లం పచ్చడి తీసి నా నాలుకకు రాసింది........ఆహా...అమోఘంగా ఉంది..ఆ రుచి నాలుక నుంచి నేరుగా నా బుర్రలోకి ప్రవేశించి నా కోపాన్నంతా ముక్కలు ముక్కలు చేసేసింది..నాకు తెలియకుండా నవ్వు ఎక్స్ప్రెషన్ నా మొహం మీద అలా వచ్చేసింది...

మా అమ్మమ్మ అల్లం పచ్చడి చేసినప్పుడల్లా తన పుట్టింటి నుంచి తెచ్చుకున్న అమృతం సీసలోంచి రెండు చుక్కలు వేస్తుంది..ఆ పచ్చడి నాలుకకు తగలగానే రెండు రోజులు అలా గాలిలో నిక్కరేసుకుని తేలిపోవాల్సిందే....మా పూర్వీకుడొకాయన అమృత మథనం టైం లో అక్కడే ఉన్నాడుట..పెట్రోలు కోసమని ఒక లీటర్ వాటర్ బాటిల్ పట్టుకుని బయలుదేరిన మా పూర్వీకుడు ఆ ముచ్చటంతా చూద్దామని అక్కడే ఆగిపోయాడట..అమృతం వచ్చాక ఎవరో లేడీ ...దేవతలను, రాక్షసులను కూర్చోబెట్టి "నీక్కావలసింది...నా దగ్గర ఉంది" అని పాడుతూ అమృతం పంచిపెట్టిందట..(ఇదే పాటను మన తెలుగు సినిమావాళ్ళు రైట్స్ తీసుకోకుండా వాడుకున్నారు)...ఒక దేవుడి దగ్గర బ్లాకు లో ఒక లీటర్ అమృతం కొన్నాడు మా పూర్వీకుడు..అది అలా తర తరాలుగ వస్తోంది మా ఇంట్లో........ఇంతకీ ఏమి చెబుతున్నాను?? ఆ...అల్లం పచ్చడి...అది నాలుకకు తగలగానే నేను అన్నీ మరచి పోయాను...

ఓ రెండు రోజులు ఏమీ చేయలేదు..అంటే మూడో రోజు ఏదో చెసానని కాదు..మూడో రోజూ బేవార్సే...నాలుగో రోజు - నేను వరండాలో కూర్చుని వీధిలో వచ్చీ పోయే వాళ్ళ ప్యాంట్లు చూస్తూ ఉన్నాను..మా అన్నయ్య ఇంట్లోంచి హడావిడిగా వచ్చి తన జేబులోని బాల్ పెన్ తీసి మా కాంపౌండు బయట పారేసాడు..ఐదు నిముషాల తరువాత మా అమ్మ వచ్చి కాఫీ ఇచ్చింది మా అన్నయ్య కి..మా వాడు ఎడమ చేత్తో కాఫీ అందుకుని, కుడి చేయి చాచి - "అమ్మా..నా బాల్ పెన్ ఎక్కడో పారేసుకున్నానమ్మా...శ్రధ్ధగా చదువుకుందామంటే పెన్ను లేదు " అన్నాడు....చలన చిత్ర పరిశ్రమ ఎంత మంచి నటుణ్ణి మిస్ అవుతోందో నాకు చూపిస్తూ...

మా అమ్మ వెంటనే వాడి చేతికి ఒక పెద్ద నోటిచ్చి "ఇంక్ పెన్ కొనుక్కోరా..మిగిలిన డబ్బు దాచుకో" అని లోపలికెళ్ళింది..ఈ సన్నివేశాన్నంతా ప్రేక్షకుడి లాగా చూస్తున్న నా వైపు మా అన్నయ్య చూసి "ఉహుహహహహ" అని కళ్ళతో నవ్వి కాఫీ తాగటం మొదలెట్టాడు..

నా తక్షణ కర్తవ్యమేంటో నాకు గోచరించింది..వెంటనే నా వార్డ్ రోబ్ (మా అమ్మమ్మ పెట్టె) లోంచి నా నిక్కరు ఒకటి తీసి...బ్లేడుతో ఎడా పెడా కోసేసాను..ఆ చిరిగిన నిక్కరు తీసుకుని మా అమ్మ దగ్గరకు వెళ్ళాను..ఒక గ్లాసు తో పాలిచ్చింది..

"పాలు తాగటానికి నేనింకా చిన్న పిల్లడిని అనుకుంటున్నావా? నాకు కాఫీ కావాలి " అని అరిచాను..అప్పుడే గదిలోకొచ్చిన మా అన్నయ్య తన గ్లాసు లో మిగిలిన కాఫీ నా నోట్లో పోసాడు..కాకరకాయ, కుంకుడు కాయ, శీకాయ కలిపి నాలుక మీద పడ్డట్టయ్యింది..కళ్ళు చేదుగా మూసాను..

"మొదటి కాఫీ అలానే ఉంటుంది రా" అన్నాడు మా అన్నయ్య...మొదటి కాఫీ ఇలా ఇంత చేదుగా ఉంటుందని తెలిస్తే..మొదలెట్టటమే రెండో కాఫీ తో మొదలెట్టేవాడిని......ఇవన్నీ తరువాత...వచ్చిన పని ముఖ్యం - "అమ్మా...నా నిక్కరు చిరిగిపోయిందమ్మా...శ్రధ్ధగా చదువుకుందామంటే......." నా డైలాగు పూర్తవ్వకుండానే మా అమ్మ మా అన్నయ్య చేతికి నా నిక్కరు, ఐదు రూపాయలిచ్చి ఇచ్చి - "ఇది కుట్టించుకురా" అని పంపింది...మా వాడు ఆ ఐదు రూపయలలో నాలుగున్నర పెట్టి సినిమా చూసొచ్చి, మిగిలిన అర్ధ రూపాయితో ఒక సైకిల్ షాపు వాడి దగ్గర నా నిక్కరుకు ప్యాచ్ లు వేయించుకొచ్చాడు ..

అలా తెల్ల నిక్కరుకు నల్ల సైకిల్ ట్యూబుల అలంకరణలతో నేను కాలం సాగదీస్తున్నప్పుడు ఒక రోజు -

మా పక్క కాంపౌండులో ఉన్న నీలిమ జామెట్రీ బాక్సు కావాలని నా దగ్గరకు వచ్చింది..' శృతిలయలు ' సినిమాలో సుమలత గొంతు అంత అందంగా ఉంటుంది నీలిమ.

ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది..

వెంటనే ఇంటికి పరిగెట్టాను..అక్కడ సైకిల్ తుడుచుకుంటూ కనబడ్డాడు మా అన్నయ్య..

"రేయ్...నాకు డబ్బు కావాలి " అన్నాను..

మా అన్నయ్య పైకి లేచి "సేం పించ్" అని గట్టిగా గిచ్చాడు..

"అబ్బా..అలా గిచ్చావేంట్రా."

"లేకపోత ఏంట్రా...డబ్బు ఎవరికి వద్దు చెప్పు..ఇంతకీ నీకు డబ్బు ఎంత కావాలి? ఎందుకు కావాలి?" అనడిగాడు..

"నాకు 10 రూపాయలు కావాలి రా..నేను నీలిమ ను బాల్య వివాహం చేసుకుందామనుకుంటున్నాను..మనము 10 రూపాయలు కన్యాశుల్కం ఇచ్చి వరకట్నం గా 200 రూపాయలు అడుగుదాము..అందులో సగం నాకు...ఆ మిగతా 160 రూపాయలతో నీవు మాంచి ఇల్లు కట్టుకో" అన్నాను మా అన్నయ్య భుజం తడుతూ..

"10 రూపాయల్దేముంది రా...కుక్కను తంతే రాల్తాయి..నువ్వు ముందెళ్ళి అమ్మ, నాన్న ఆశీర్వాదం తీసుకో..ఆ తరువాత కుక్కల కోసం ఇద్దరూ రోడ్డు మీదకు వెడదాం.." అన్నాడు..

నేను ఇంట్లోకి వెళ్ళాను...హాలు లో మా బాబు, అమ్మ, అమ్మమ్మ ఉన్నారు…"నేను నీలిమను బాల్య వివాహం చేసుకోవాలనుకుంటున్నను " అని నా నిర్ణయాన్ని చెప్పాను..

కెమేరా మా అమ్మమ్మ వైపు తిరిగింది...తరువాత మా మ్మ వైపు...తరువాత మా బాబు వైపు.....ఆ తరువాత లాంగ్ షాట్..

ఇక్కడ నాకు తెలియని విషయమేంటంటే...ఆ ముందు రోజు మా బాబు లెక్కల క్లాసు అవ్వగానే వాళ్ళ హెడ్మాష్టరు మా బాబుకు చిన్న క్లాసు తీసుకున్నాడట....కోపంతో ఫస్టు క్లాసు మూడ్ లో ఉన్నాడు మా బాబు..నా బాల్యవివాహపు వార్త వినగానే ఏమీ మాట్లాడకుండా పైకి లేచి..తలుపుకు తగిలించిన తన ప్యాంటు జేబులోంచి ఒక ఫొటో తీసాడు..అది వాళ్ళ హెడ్మాష్టరు ఫొటో..దాన్ని నా వీపుకు అతికించాడు..ఆ తరువాత "బాల్య వివాహం కావాలి రా నీకు??" అని నా బాల్య వీపును చితగ్గొట్టాడు..

ఏడుస్తూ ఇంట్లోంచి బయటకొస్తున్న నన్ను చూసి మా అన్నయ్య మనసు కరిగింది..నా భుజం మీద చెయ్యి వేసి...నాకు జ్ఞాన బోధ చెయ్యటానికి మా పెరట్లోకి తీసుకెళ్ళాడు..అక్కడ బోధి వృక్షాలేవీ లేకపోవటం తో ఇద్దరూ మా గులాబి మొక్క కొమ్మలెక్కి కూర్చున్నాము..

"ఇప్పుడు చెప్పరా..నీ సమస్యేంటసలు?" అడిగాడు

"ఏమని చెప్పుకోను రా...'ఇంట్లో అందరికన్నా చిన్నవాడు..కొరింది ఇస్తారు ' అని నా గురించి పబ్లిక్ టాక్..కాని నేను పడే కష్టం ఆ పబ్లిక్ టాక్ కు తెలియదు..ఇంతవయసొచ్చినా నన్నింకా మరీ చిన్న పిల్లాడిలా చూస్తున్నారు..హైదరాబాదు లో నా వయసు పిల్లలంతా పెద్దవాళ్ళైపొయారు...ప్యాంట్లు, డబ్బు...ఏది కావాలంటే అది ఉంది వాళ్ళ దగ్గర..మన బాబేమో డబ్బూ ఇవ్వడూ..ప్యాంట్లూ కుట్టించడు నాకు..ఈ నిక్కరు చూడరా..నీకు నా మీద జాలి కలగట్లేదా?? నీ ప్యాంటు మీద ఒట్టేసి చెప్పు..." అని దీనంగా అడిగాను..

వెంటనే మా అన్నయ్య నా నిక్కరు జేబు చించి...దానిని జేబు రుమాలు లా వాడి నా కన్నీళ్ళు తుడిచాడు...నా చొక్క జేబులో ఉన్న ఉసిరికాయలు తీసి నా నోట్లొ ఒకటి వేసి...తన నోట్లొ ఒకటేసుకున్నాడు..

"థ్యాంక్స్ రా" అన్నాను..

"చూసావా..నీ జేబులోంచి ఉసిరికాయ తీసి నీకిస్తే థ్యాంక్స్ చెప్పావు..నిన్ను వెధవను చేస్తున్నా గుర్తించలేని వెధవ్వి నువ్వు..అందుకే నిన్ను చిన్న పిల్లడిలా చూసేది..సరే..నువ్వు కూడా నాన్నని ' బాబు ' అనే స్టేజ్ కు చేరుకున్నావు కాబట్టీ..నీకు కొన్ని జీవిత రహస్యాలు చెబుతాను. నిన్ను ఇంట్లో వాళ్ళు పెద్దవాడిగా గుర్తించాలంటే నువ్వు నిక్కర్లు కోసుకోవటం...బాల్య వివాహం చేసుకోవటం లాంటి విపరీత చర్యలు చేయనవసరం లేదు రా..నీ డబ్బు నువ్వు సంపాదించుకో" అన్నాడు..

"అంటే బాల కార్మికుడిని అవ్వమంటావా?"

"మూర్ఖా..సంపాదించుకోమంటే - అమ్మ పర్సులోంచి, నాన్న జేబులోంచి సంపాదించుకోమని.."

నా తల వెనకాల జ్ఞాన జ్యోతి వెలిగింది (సాయంత్రమయ్యిందని మా అమ్మ పెరట్లో లైటు వేసింది)..

"ఐతే వెంటనే వెళ్ళి మన బాబు జేబు బూజు దులిపొచ్చేస్తా" అని కొమ్మ దిగాను..

"ఆ తొందరే వద్దనేది..దొంగతనం చెయ్యటమనేది ఈత కొట్టటం లాంటిది" అన్నాడు..

"అంటే ఒక్క సారి నేర్చుకుంటే ఇక ఎప్పటికీ మరచిపోము అనా"

"కాదు...సరిగ్గా నేర్చుకోకుండా దూకితే మునిగి పోతావని"..అని ఒక గొప్ప దొంగ సూత్రం నేర్పాడు నాకు..

మళ్ళీ మా అన్నయ్యే మాట్లాడుతూ - "నువ్వు fresher దొంగవి...కాని నాకు చాలా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు టీం లీడ్ ను నేను. కాబట్టీ..నువ్వు నాకు చంచాగిరి చేసావనుకో..నువ్వు పని సరిగ్గా వెలగబెట్టకపోయినా...నీకు ప్రమోషన్ వస్తుంది.." అన్నాడు..

ఆ వయసులో మా అన్నయ్య అన్న మాటలు నాకు అర్థమవ్వలేదు కాని, ఉద్యోగం చెయ్యటం మొదలెట్టాక బాగా అర్థమయ్యాయి...

ఆ తరువాత నా చేతికి ఒక పుస్తకమిచ్చాడు మా అన్నయ్య "ఇదిగో.. 'Rapidex దొంగల కోర్స్ '..దగ్గరుంచుకో..ఒక్క విషయం గుర్తుంచుకో..డబ్బు కొట్టేయాలనుకుంటే నెలలోని మొదటి ఐదు రోజుల్లోనే కొట్టెయ్యి..నెలాఖరు లో ఐతే జేబు లో ఉన్న అర్ధ రూపాయి కూడా అరక్షణానికొకసారి తడిమి చూసుకుంటాడు మన బాబు..ఈ మధ్య ఫింగర్ ప్రింటు గుర్తించే పౌడరు కూడ జేబులో చల్లుకుని తిరుగుతున్నాడు..ఎవరయినా చేతులు పెడితే పట్టుకోవాలని...జాగ్రత్త గా ఉండు. అన్నట్టు అసలు మాట - మొదటి సారే మన ఇంట్లో ప్రయత్నించకు..నీ స్నేహితులతో చేతులు కలిపి వాళ్ళ బాబులను దోచెయ్యి..బాగా అలవాటయ్యాక ఇంట్లో ప్రయత్నించు.." అని నన్ను ఆశీర్వదించి...గాలి లోంచి వీభూది పుట్టించి నా నోట్లో వేసాడు..ఆ తరువాత గొంతు లోంచి ఏదో తీస్తున్నట్టు చాల ఓవరాక్షన్ చేసి..నోట్లోంచి ఉసిరికాయ తీసిచ్చాడు...

నేను వెంటనే సుధాకర్ గాడి దగ్గరకెళ్ళి ..వాళ్ళ నాన్న జేబులో డబ్బు కొట్టేస్తే వెంటనే పెద్దవాళ్ళైపోవచ్చని చెప్పాను వాడితో..వాడు పంచాంగం చూసి మంచి ముహూర్తం నిర్ణయించాడు.ముహుర్తూం నాడు నెను సుధాకర్ ఇంటికి వెళ్ళాను..

"మనమయితే సరిగ్గా చేయగలుగుతామో లేదో నని ఒక consultant ని పిలిపించాను రా..ఇహనో ఇప్పుడో వచ్చేస్తాడు."

"కన్సల్టెంటా? ఎవర్రా?" అడిగాను..

"ఒక తమిళబ్బాయి..పుట్టి పెరిగిందంతా ఇక్కడేలే..దినకరన్ అని.."

"ఎన్నింటికొస్తాడేంటి?"

"వచ్చేస్తాడు రా..సాక్సులు ఇస్త్రీ చేయించుకొస్తానని వెళ్ళాడు.."

పది నిముషాల తరువాత చెప్పులేసుకొచ్చాడు దినకరన్..

ముగ్గురం కలిసి సుధాకర్ వాళ్ళ నాన్న గది వైపు వెళ్ళాము..ఆయన నిద్రపోతున్నారు..

నేనూ, సుధాకర్ తలుపు దగ్గరే నుంచున్నాము..దినకరన్ మెల్లిగా నడుస్తున్నాడు..ఎందుకో ఒక్క క్షణం ఆగాడు..ఆగినోడు ఊరికే ఉండక సుధాకర్ వాళ్ళ నాన్న భుజం తడుతూ "సార్...సార్ మిమ్మల్నే" అన్నాడు మెల్లిగా..అది చూసిన సుధాకర్ శబ్దం రాకుండా గట్టిగా అరిచాడు..అది విన్న దినకరన్ అరవకుండా శబ్దం చేసాడు..మెమిద్దరం గదిలోకెళ్ళి దినకరన్ ను బయటకు లాక్కొచ్చాము..

"మా నాన్నను నిద్ర లేపుతావే? నీకేమైనా పిచ్చా?" అడిగాడు సుధాకర్..

"అది కాదు..డబ్బు ఏ చొక్కా జేబులో పెట్టాడో అడుగుదామని...అంతే..అడిగాక మళ్ళీ పడుకోమని చెబుతా" అన్నాడు కన్సల్టెంట్..

నేను రంగం లోకి దిగాను.."చూడు దినకరన్..ఇప్పుడు నువ్వు చేయబోయేది పులి తోక లాగటం లాంటిది...." అని ఇంకా ఏదో చెప్పబోతుండగా సుధాకర్ గాడు "రేయ్...నువ్వు అలాంటివన్నీ అనకు..ఇప్పుడు వీడెళ్ళి మా నాన్న లుంగీ లాగినా లాగుతాడు.....చూడు దినకరన్..ఇప్పుడు నువ్వు చేయబోయేది చాల అపాయం తో కూడిన పని..కాబట్టీ ఏ పొరబాటు చెయ్యకు.." అని చెప్పి పంపాడు..

ఈ సారి లోపలేమి జరుగుతోందో చూసే ధైర్యం లేక చార్లెస్ శోభరాజ్ మీద భారమేసి నేను, సుధాకర్ బయటే ఉన్నాను..కాస్సెపయ్యాక మెల్లిగా తలుపు తెరిచి తల బయటపెట్టాడు దినకరన్..

"జేబులో ఉన్నడబ్బంతా తీసాను...ఓకేనా?" అడిగాడు దినకరన్..

సుధాకర్ గాడు ఖంగారు గా "వొద్దొద్దు..మళ్ళీ మా నాన్నకు అనుమానమొచ్చేస్తుంది..అందులో సగం తిరిగి లోపల పెట్టెయ్యి" అన్నాడు..

ఇంకొక కాస్సేపు తరువాత బయటకొచ్చాడు దినకరన్...నుదుటి మీద పట్టిన చమట చూపుడు వేలుతో తీసి గాల్లోకి విసిరాడు..

"డబ్బేది?" అడిగాము నేను, సుధాకర్ ఆత్రంగా..

తన జేబులోంచి సగం చిరిగిన యాభై రూపాయల నోటు తీసాడు దినకరన్..

"ఇదేంటి?" అని అడగలేదు నేను, సుధాకర్..

"జేబులో ఒక్క యాభై రూపాయల నోటు మాత్రమే ఉంది" అని జవాబివ్వ లేదు దినకరన్..

ఎందుకంటే మేము మాట్లాడేలోపే "ఎవర్రా అది?" అని లోపలి నుంచి సుధాకర్ వాళ్ళ నన్న గొంతు వినబడింది..

"ఎవర్రా నా లుంగీ లాగింది?" అని అరిచాడు ఆయన..

నేను, సుధాకర్ గాడు ఒకేసారి "దినక....రన్" అని అరిచాము..

అక్కడ మొదలెట్టిన రన్నింగ్ ఆ దినకరన్ ను ఊరి బయటకు తరిమేదాక ఆపలేదు...

నాలో రోజురోజుకి అసహనం పెరిగిపోయింది..డబ్బెలా సంపాదించాలో పాలు పోలేదు. అందుకే నేరుగా మా అన్నయ్య డబ్బు దాచుకునే వాడి సైన్సు టెక్స్టు పుస్తకం లోంచి 23 రూపాయలు కొట్టేసాను..డబ్బు తీసేప్పుడు ఏదో పౌడర్ తగిలింది చేతికి..అది దులుపుకుని, 23 రూపాయలతో దుమ్ము దులిపేసాను..మరుసటి రోజు ఫొరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు చేతిలో పట్టుకునొచ్చాడు మా అన్నయ్య..

"గురు ద్రోహి..నాకే పంగ నామం పెడతావు రా? ఇదే నా శాపం - ఇప్పుడే కాదు..నీకు ఎన్నేళ్ళొచ్చినా నిన్ను పిల్ల వెధవ లాగే చూస్తారు జనం" అని అన్నాడు..గడియారం గంట మోగింది...టైం కరెక్టుగా అసురసంధ్యవేళ అయ్యింది..ఆకాశం లో రౌండ్సుకు తయారౌతున్న తథాస్తు దేవతలు మా అన్నయ్య మాట వినగానే "తథాస్తు...టేక్ ఇట్ ఈసీ" అన్నారు..

అంతే..

నాకిప్పుడు __ ఏళ్ళు..హైటు పెరిగినా, ప్యాంట్లు వేసుకుంటున్నా, డబ్బు సంపాదిస్తున్నా కూడా నన్ను ఒక పెద్ద వాడిగా గుర్తించే దిక్కేలేదు..

మొన్న ఆదివారం ఎవరో వచ్చారు ఇంటికి. నేనెళ్ళి "ఏంటి?" అనడిగాను..

"ఇంట్లో పెద్దవాళ్ళనెవరినైనా పిలు బాబు" అన్నాడు..నాకు గంపెడు కోపమొచ్చింది..

"నీ కళ్ళకి నేను పెద్దవాడిలాగా కనిపించట్లేదేంట్రా...మా ఇంటికే కాదు, మా ఇంటి పక్కనున్న ఖాళీ స్థలానికి కూడా నేనే పెద్ద మనిషిని.." అని అంటుండగా మా అమ్మమ్మ నన్ను పక్కకు లాగి...ఆ వచ్చిన వాడికి నాలుగు చెక్కులిచ్చింది..వాడు ఆ చెక్కులు చూసి, అందులో ఒకటి తిరిగిస్తూ "ఇందులో సంతకం పెట్టలేదమ్మా" అన్నాడు..మా అమ్మమ్మ నా జేబులోంచి పెన్ను తీసుకుని 'D.S.Goutham' అని సంతకం చేసిచ్చింది...

"నా చెక్కులు నువ్విస్తావేంటి?" అన్నాను కోపంగా..దానికి మా అమ్మమ్మ "పోనీ కాస్సేపు మా వాడికి ఆ చెక్కులు ఇవ్వు నాయన..చెక్కాట ఆడుకుని ఇచ్చేస్తాడు" అంది..

"చెక్కాటేంటి? నీ మీద ఫోర్జరీ కేసు పెడతాను..నేనంటే ఎవ్వరికీ ఖాతరు లేకుండా పొయింది......" అంటుండగా..అల్లం పచ్చడి నంచి, పెసరట్టు నోట్లొ పెట్టింది మా అమ్మమ్మ.....అంతే..రెండు రోజులు రెస్ట్!!

ఇందాకే మా అన్నయ్యకు ఫోన్ చేసి వాడు పెట్టిన శాపానికి విమోచన ఎప్పుడని అడిగాను..తథాస్తు దేవతలను కాంటాక్ట్ చేయమన్నాడు..అందుకే డైరెక్టు గా దెవుడినే అడుగుతున్నా - "వల్లభరావు మాష్టారు..నాకెప్పుడు విరుగుడు????????????"

Wednesday, May 13, 2009

మకుటం లేని మహారాజు

ఆగండాగండి..ఈ టైటిల్ చూసి ఈ టపా ' మకుటం లేని మహారాజు ' సినిమా సమీక్ష అనుకుని.. మీ కంప్యూటర్ షట్ డౌన్ చేసి, crash చేసి..కింద పడేసి పచ్చడి పచ్చడి చేద్దామనుకుంటున్నారా?? భయపడకండి..ఈ టపా కు, ఆ సినిమాకు ఎటువంటి సంబంధమూ లేదు..నిజానికి ' మకుటం లేని మహారాజు ' అనేది ఒక తమిళ పదం..తెలుగులో దాని అర్థం ' మా ఊళ్ళో ఎలెక్షన్లు ' అని... ఒక వేళ ఇది చదువుతున్న వారిలో ఎవరికైనా తమిళం వస్తే - మనం మనం తరువాత మాట్లాడుకుందాం.

మా పక్క ఊరిలో మా ఆఫీసమ్మాయి ఉంది..ఇప్పుడా అమ్మాయి గురించి ఏమీ చెప్పను. మా ఆఫీసు లో మా పక్కూరమ్మాయి ఉంది..ఆ అమ్మాయి గురించి మాట్లాడుకుందాం ఒక ఐదు నిముషాలు..

మా పక్కూరమ్మాయి నాకు మూడు నెలల క్రితం పరిచయమయ్యింది. మా కింద ఊరి వాడింట్లో జరిగిన పార్టీలో మా వెనక ఊరివాడు, మా ఎదుటి ఊరి వాడు కలిసి పరిచయం చేసారు ఆ అమ్మాయిని. మా పక్కూరమ్మాయి పేరు నాకు గుర్తులేదు..పరిచయం అయిన రోజు తన పేరు చెప్పింది - కిరణ్మయి అనో, స్వాతి అనో, రావు గోపాల రావు అనో. ఇలా అమ్మాయి పేరు మరచిపోయినందుకు నేనొక vsecrtipjokim అని అనుకోకండి (ఆ పదం అర్థం తెలుసుకోవటానికి డిక్షనరి, GRE వర్డ్ లిస్ట్ వెతక్కండి - అక్కడ దొరకదు..మా ఊరొస్తే చెబుతా)..

సరే...కొన్నాళ్ళ క్రితం మా పక్కూరమ్మాయి నాకు ఫోన్ చేసింది..

"గౌతం - నాకొక సహాయం కావాలి"

"అమ్మాయ్ - స్మాల్ సహాయమా, మీడియం సహాయమా, లార్జ్ సహాయమా?"

"ఎక్స్ట్రా లార్జ్ సహాయం..'మీదొక ఏబ్రాసి ఊరు ' అని ఉన్న గ్రీటింగ్ కార్డు కొని పంపాలి మీ ఫ్రెండు రాం కిరణ్ కు..నిన్న
ఆన్లైన్ తగిలాడు..అమెరికా లో ఉన్నాడు కదా అని 'మీ ఊళ్ళో టైం ఎంత?' అని అడిగితే 'మీ బెవార్సు ఊరిలో టైం ఎంత?' అని సమాధానం ప్రశ్నించాడు " అంది..

"మీది బెవార్సు ఊరని వాడితో ఎవరు అన్నారో నీతో ఏమైన చెప్పాడా? " అనడిగాను టెన్షన్ గా..

"లేదు.."

"హమ్మయ్య.."

"నీకు తెలుసా ఎవరు అలా అన్నారో?" అనడిగింది..

"ఉండు..ఆలోచించి చెబుతా...ఐ మీన్ - తెలుసుకుని చెబుతా " అన్నాను...

"సరే...నువ్వు తెలుసుకునే లోపు మనము వెళ్ళి 'ఏబ్రాసి ఊరు ' కార్డు కొనాలి...రేపు తొమ్మిదింటికి 'Crossword' కు వచ్చెయ్యి.." అంది..

మరుసటి రోజు 'Crossword' లో కలిసాము ఇద్దరం..ఊళ్ళను తిట్టుకునే కార్డులు ఎక్కడ దొరుకుతాయో అడుగుదామని హెల్ప్ డెస్కు వాడి దగ్గరకు వెళ్ళాము నేను, మా పక్కూరమ్మాయి..అక్కడ హెల్ప్ డెస్కు వాడిని హెల్ప్ లెస్ గా చేస్తూ కనిపించాడు..........దినకర్ గాడు.

ఇంటర్నెట్ లో డౌన్లోడ్ చేసిన పన్నెండు కొత్త సినిమాలు ఒకే DVD లో కాపీ చేసి..అది Crossword వాళ్ళకు అమ్మటానికి ప్రయత్నిస్తున్నాడట గత గంట సేపు గా...నాటు సారా తాగిన వాడి లాగా హెల్ప్ డెస్కు వాడితో బేరసారాలు చెస్తున్నంత సేపు దినకర్ గాడు ఎవరో నాకు తెలియనట్టు కొట్టంతా తిరిగి... మా పక్కూరమ్మయికి కార్డు వెతికి కొన్నాము..

బిల్లు కట్టి బయటకు వచ్చాము...దినకర్ గాడు కూడా వచ్చాడు - సెక్యూరిటీ వాడితో నెట్టించుకుంటూ..

"హాయ్ రా దినకర్....ఎప్పుడు గెంటారు నిన్ను?" అనడిగాను..ఎప్పుడు గెంటారు, ఎలా గెంటారు, ఎందుకు గెంటారో వాడు చెబుతుంటే ఒక్క మాట కూడా వినకుండా నడుస్తున్నాము నేను, మా పక్కూరమ్మాయి...ఆకలి గా ఉంటే ఏమైనా తిందామని ఒక హోటలుకు వెళ్ళాము..

"ఏరా 23 వ తారీఖు బస్సు లో వెళ్దామా, కారులో వెళ్దామా?" అడిగాడు దినకర్..

"నువ్వు టికెట్టుకు డబ్బులు పెడితే బస్సులో వెళ్దాం...నువ్వు పెట్రోలు కొట్టిస్తే కారులో వెళ్దాం..ఇంతకీ ఎక్కడికీ?" అడిగాను..

"మన ఊరికి రా...ఎలక్షన్లు..మరచిపోయావా?" అన్నాడు..

మా పక్కూరమ్మాయి నవ్వుతూ "శెలవు రోజున సినిమాకు వెళ్ళకుండా ఓటు వెయ్యటానికి వెళ్తున్నావా? బయలుదేరాడండీ పెద్ద దేశభక్తుడు.." అంది దినకర్ గాడిని చూస్తూ..

ఆ మాటలు విన్న దినకర్ గాడి బ్లడ్ బాయిల్ అయ్యింది. బాయిల్ అవ్వగానే స్టవ్ సిం లో పెట్టి.....

(The following stunts are performed by a professional and should not be re-enacted at home)

...పక్కన్నే పిల్లవాడు ఆడుకుంటున్న రైలు బొమ్మ పైకి ఎక్కి "బలగాముడి కోసం ఆయుధం పట్టిన బ్రహ్మనాయుడి సాక్షిగా....కన్నమదాసు సాక్షిగా...నాగమ్మ సాక్షిగా...నేను దేశ భక్తుడిని అయితే...ఈ రైలు ముందుకు కాదు...వెనక్కు వెళ్తుంది...జై చెన్నకేశవా...జై చెన్నకేశవా...జై చెన్నకేశవా..." అని నానా హంగామా చేసాడు..

వీడి దెబ్బకు అప్పుడే మద్రాసు నుండి బెంగళూరు వచ్చిన రైలు స్టేషన్ లో ఆగకుండా తిరిగి మద్రాసు వెళ్ళిపొయ్యింది....వీడి దేశ భక్తి నిరూపించటానికి ఇండియన్ రైల్వేస్ కు డీజిల్ బొక్క...

వీడి చేష్టలకు నిశ్చేష్టురాలైన మా పక్కూరమ్మాయిని కదిపి..."చూసావా అమ్మాయ్..కడుపు చించుకుంటే కుట్లు పడతాయి..అనవసరంగా వాడి లోని దేశ భక్తుడిని బయటకు తీసి ఊరి మీదకు వదిలావు " అన్నాను..

దినకర్ గాడి మాటలు విని చుట్టు పక్కల వారంతా వచ్చి అభినందించారు..వాడు చివర్లో ' జై చెన్నకేశవ ' అని మూడు సార్లు అరిచేప్పటికి అది వీడు సపోర్టు చేసే అభ్యర్తి పేరనుకుని ' చెన్నకేశవ గారికే మీ ఓటు ' అని అరుస్తూ వెళ్ళారు..

వీడి దేశభక్తి ఇంకా తీరినట్టు లేదు...మా పక్కూరమ్మాయి వైపు చూసి "ఓటు వేయటం భారత పౌరులుగా మన భాధ్యత...." అని ఇంకా ఏదో అనబోతుండగా నేను వాడి చెవిలో " భా కాదు..బాధ్యత " అని గొణిగాను..అది విన్న వాడు మళ్ళీ మాట్లాడుతూ "సారీ...ఓటు వేయటం భారత పౌరులుగా మన భాకాదుబాధ్యత..నన్ను చూసి ఉత్తేజం పొంది ఈ దేశానికి మీ వంతు సేవ చెయ్యండి " అన్నాడు....దేశభక్తి నాస్తికురాలైన మా పక్కూరమ్మయికి ఈ మాటలేవి నచ్చక అక్కడి నుండి వెళ్ళిపోయ్యింది..

"సరే...ఈ శుక్రవారం శెలవు పెట్టు...మనము ఊరెళ్ళి ఫొటోలు తీయించుకుని voter ID కి అప్లై చేసి వద్దాము"...అన్నాడు.

శుక్రవారం పొద్దున్నే నేను, దినకర్ ఫొటో తీయించుకోవటానికి వెళ్ళాము..ముందుగా లోపలకు దినకర్ గాడు వెళ్ళాడు..

ఫొటోగ్రాఫర్ క్లిక్ చెయ్యబోతుండగా దినకర్ గాడు అతన్ని ఆపి.."ఒక్క నిముషం...నా ప్యాంటు ఒక వైపే ఇస్త్రీ చేసుకొచ్చాను...ఇంకో వైపు అంతా ముడతలున్నాయి..ఈ వైపు కూడ ముడతలు పెట్టుకుంటాను ఉండండి" అని..ప్యాంటు కుడి వైపు నలపటం మొదలెట్టాడు..దానికి ఆ ఫొటోగ్రాఫర్..."పర్లేదు సార్..ఆ ముడతలను పట్టించుకోకండి. ఫొటో లో మీ ప్యాంటు కనిపించదు " అన్నాడు..ఆ మాట వినగానే దినకర్ గాడికి మొహం లో ఏదో టెన్షన్ –

నా దగ్గరకు పరిగెట్టుకుంటూ వచ్చి..."అదేంట్రా...ఫొటో లో నా ప్యాంటు కనపడదు అంటున్నాడు. ఎలా రా బాబూ..అసలు లోపలేమీ వేసుకోలేదు. ఆ ఫొటోలు ఇంటర్నెట్ లో పెడతారేమో రా.." అన్నాడు..వాడు ఇంటర్నెట్ లో ఏమి చూస్తుంటాడో చెప్పకనే చెబుతూ...

"ఇక్కడ తీసేది ఫొటో రా..x-ray కాదు..." ప్యాంటు కనపడదు " అంటే వాడి ఉద్దేశం ఫొటో లో నీ నడుము పై భాగము మాత్రమే ఉంటుంది అని అర్థం...వెళ్ళి నిలబడు" అని పంపించాను..ఫొటో తీసేప్పుడు కళ్ళు ఆర్పుతాడేమో నని భయమేసి తల కిందకు దించుకు నిలబడ్డాడు దినకర్ గాడు...ఫొటో వాడి తలకాయ లాగ వచ్చింది!

స్టుడియో బయటకు వచ్చేముందు ఆ ఫొటోగ్రాఫర్ ఎవరికి ఓటు వెయ్యలనుకుంటూన్నాడో అడిగాడు దినకర్.."నేను మా సామాజిక వర్గానికి చెందిన వాడికే ఓటేస్తాను సార్" అన్నాడు..

మేము బయటకు రాగనే దినకర్ గాడు " చూసావు రా...మనము ఓటెయ్యటానికి తయారయ్యాము కానీ మన ఊళ్ళో 'సామాజిక వర్గం' అనే పార్టీ ఒకటి ఉందని మనకు తెలియదు...ఛి ఛి...రెండు నిముషాలు తల దించుకుని సిగ్గు పాటిద్దాము "....అన్నాడు..

"ఒరేయ్ సిగ్గు శిఖామణి..'సామాజిక వర్గం' అంటే 'కులం' అనిరా అర్థం. 'కులం' అన్నది ' నీ యబ్బ ' లాంటి మాట అయితే..'సామాజిక వర్గం' అన్నది ' నీ యబ్బ గారు ' లాంటిది...అర్థమయ్యిందా రా 'కులం'??" అన్నాను...

పక్క వీధిలో ఏదో రోడ్ షో జరుగుతోంది..అక్కడకు వెళ్ళాము. ఎవరో ఒకాయన జీపు మీద నిలబడి ప్రసంగిస్తున్నాడు.."ఎవరండీ ఆయన?" అడిగాను నా పక్కనున్న అతన్ని..

" అదేదో పార్టీ అధ్యక్షుడు నిమ్మల వెంకట్రావు " అన్నాడు..

"అయితే వాళ్ళ పార్టీ పేరు తెలియదా మీకు?" అడిగాను..

"చెప్పగా...'అదేదో పార్టీ'..అదే పార్టీ పేరు " అన్నాడు..

నిమ్మల వెంకట్రావు అరగంట సేపు స్పీచు దంచాడు...అలా దంచిన స్పీచు పొడిని ఒక డబ్బ లో పోసి భద్ర పరిచాడు.

ఇందాక పార్టీ పేరు చెప్పినాయన బీడి వెలిగించి ఒక దమ్ము లాగాడు. తన నోట్లో ఉన్న పొగకు గాలి ఆడదేమోనని భయపడినట్టున్నాడు...మొత్తం పొగంతా నా మొహం మీదకు ఊదాడు. మా వెనకాల గోడ మీద ' పొగ త్రాగరాదు ' అని రాసుంది..నా గురించే అనుకుని.. నా పక్కవాడు ఊదిన పొగ తాగకుండా నోరు మూసుకున్నాను. ఇందాకటి నుంచి నోరు మూసుకున్న దినకర్ గాడు గట్టిగా "కాబోయే ముఖ్యమంత్రి నిమ్మల వెంకట రావు...జిందాబాద్!" అని పూనకం వచ్చిన వాడిలాగ అరవటం మొదలెట్టాడు....పది సార్లు పెన్సిలు చెక్కిన బ్లేడు తో గుండు గీయించుకుని..ఆ గుండు మీద వేడి వేడి డెటాల్ పోయించుకున్న వాడు పెట్టిన గావు కేకల్లా ఉన్నాయి ఆ అరుపులు...

ఆ అరుపులు విన్న వెంకట రావు మైకి అందుకుని "మీ ఊళ్ళో మా పార్టీ తరపున నిలబడేది ఈ యువకుడే.." అని అనౌన్స్ చెసాడు..మా దినకర్ గాడు మా నియోజిక వర్గం లో పోటీ చేస్తున్నడన్న విషయం జీర్ణం చేసుకోవటానికి పది Digene మాత్రలు వేసుకోవలసి వచ్చింది...

మీటింగు తరువాత 'అదేదో పార్టీ' వాళ్ళ గెస్టు హౌస్ లో వెంకట్రావు గారు మాతో మాట్లాడారు..

"చూడు బాబూ..రేపు ఒక టీవీ చానెల్ లో ప్రధాన పార్టీ ల మహిళా నాయకులు, మహిళా అభ్యర్థులతో చర్చా కార్యక్రమం ఉంటుంది..మన పార్టీ తరపున కూడా కొంత మంది మహిళామూర్తులను పంపాలి. కానీ ఒక్క విషయం - ఆ పార్టీల నాయకురాళ్ళ నోళ్ళు అసలే మంచివి కావు..టీవీ అని కూడా చూడకుండా బండ బూతులు తిడతారు. కాబట్టి మనము పంపేవాళ్ళు కూడా చక్కటి బూతులు మాట్లాడేలా ఉండాలి " అన్నాడు..

ఆ మాటాలు విన్న దినకర్ గాడు కాలు మీద కాలేసుకుని "ఇంత చిన్న విషయానికి ఇన్ని వాక్యాలు చెప్పాలా సార్...నేను నాలుగేళ్ళు హాస్టల్ లో ఉన్నాను. బూతులు మాట్లడటం అనేది నాకు మంచి నీళ్ళు తాగటం లాంటిది. మా హాస్టల్ లో చేరిన మొదటి రోజే బూతులు మొదలెట్టాము..అక్కడ బూతులు మాట్లాడలేని వాడికి ఫ్యూచర్ ఉండదు....'న బూతో న భవిష్యత్ '....ఆయనెవరో అన్నట్టు మా హాస్టల్ లో 'survival of the filthiest'...." అని చార్లెస్ డార్విన్ చొక్కా చిరిగి పోయేట్టు తన సొంత థియొరీ ఆఫ్ ఎవొల్యూషన్ చెప్పాడు మా వాడు..

దినకర్ గాడిచ్చిన భరోసా తో ఉప్పొంగిపోయిన వెంకట్రావు "నీ మీద నాకా నమ్మకం ఉందయ్య..నీ లాంటి నాయకులుంటే మన రాష్ట్ర ప్రజల 'సంసారా' లు 'సుఖ 'ప్రదమౌతాయి....ఎనీ క్వెస్చన్స్?" అనడిగాడు..

పై వాక్యం లోని రెండు పదాలు విని దినకర్ గాడికి అదేదో పత్రిక లోని ప్రశ్నోత్తరాల శీర్షిక గుర్తొచ్చింది...'ఎనీ క్వెస్చన్స్ ' అన్న మాట వినగానే మా వాడు... "నా వయస్సు 28 సంవత్సరాలు...మా పక్కింటి........." అని ఇంకా ఏదో అనబోతుండగా నేను వాడి నోరు మూసి "మహిళా మూర్తులను తీసుకుని రేపు ఆ చర్చకు వెళ్తాడు సార్ మా వాడు " అని బయటకు లాక్కెళ్ళాను...

మరుసటి రోజు పొద్దున్నే ఆ చర్చ జరిగే చోటికి చేరుకున్నాను నేను..దినకర్ గాడు మహిళామూర్తులను తీసుకుని పదకొండింటికి వచ్చాడు..వాడితో పాటు ఒకమ్మాయి, ఇద్దరు కుర్రాళ్ళు ఉన్నారు.."మహిళా మూర్తులేరి?" అడిగాను..దానికి వాడు "ఇదిగో ఈవిడ మహిళ...వీళ్ళు మూర్తులు - పి.ఎస్.మూర్తి, ఆర్.కే.మూర్తి...లోపలకు వెళ్దామా?" అన్నాడు..వీడితో పాటు వచ్చిన అమ్మాయి బాగా సన్నగా ఉంది...లోపల వాళ్ళ బూతులు వింటే స్వైన్ ఫ్లూ వచ్చినా రావచ్చని...ఆ అమ్మాయిని తిరిగి పంపించేసాను..దినకర్ గాడికి రెండు vaccine లు వేసి ఆ చర్చ జరిగే గదిలోకి తోసాను..అక్కడ ఏమి జరిగిందో తెలుసుకునే ధైర్యం లేక బస్సెక్కి బెంగళూరు పారిపొయ్యి...ఎలెక్షన్ల రోజు వరకు దినకర్ గాడికి కనపడలేదు.

ఓట్లు వేసే రోజు వచ్చింది..నేను దినకర్ గాడికి ఓటేసాను - వాడు ఎవరికి వేసాడొ నాకు అనుమానంగా ఉంది. ఓటేసి బయటకు రాగానే జనాలంతా అక్కడున్న కెమేరాలను చూసి "సూపర్...బంపర్..100 డేస్" అని అరుస్తున్నారు..చాల మంది ఆ కెమేరాలకు తాము ఓటు వేసిన వేలికి ఉన్న ఇంకు మార్కు చూపిస్తున్నారు..ఓటు వేసాక ఇలా మచ్చలు చూపించాలేమొనని దినకర్ గాడు వేలికున్న ఇంకు మార్కు చూపించి...తరువాత చొక్క విప్పి వీపు మీద ఉన్న పుట్టు మచ్చలు చూపించాడు...

మే 16 న ఎలెక్షన్ ఫలితాలు తెలుస్తాయి..చూద్దాం ఎవరు గెలుస్తారో...

మా దినకర్ గాడు గెలిస్తే మా ఊరు పంట పండినట్టే. జంధ్యాల గారన్నట్టు - దురద పుట్టినప్పుడు గోక్కుంటే కలిగే తాత్కాలికమైన హాయి..మా ఊరి ప్రజలకు శాశ్వతంగా ఉంటుంది!

Tuesday, March 3, 2009

బాపు, రవి వర్మ, పికాసో, నేను..

(అంధ్రభూమి మాస పత్రిక ఫిబ్రవరి 2009 సంచిక లోని నా 'తోటరామయణం', కొన్ని మార్పులు చేర్పులతో...)


పై నలుగురి జీవితాల్లోనూ కామన్ గా ఉన్న విషయం - బొమ్మలు గీయటం. మొదటి ముగ్గురిదీ ఆ పనిలో అందె వేసిన చెయ్యి అయితే, ఆ నాలుగో వాడు అందులో చెయ్యి పెట్టిన ప్రతిసారీ కాల్చుకున్నాడు..

ఈ రోజు పొద్దున్నే నాకు రెండు ఫోన్లు వచ్చాయి - క్రాంతి విశ్వాస్, రమణ నుంచి.. "ఇవ్వాళ మా ఇంట్లో క్యారెట్ హల్వా..వచ్చెయ్యి " అన్నాడు క్రాంతి. "ఇవ్వాళ మా ఇంట్లో క్యారెట్ల హల్వా చేస్తుంది మా అమ్మ.. వచ్చెయ్యి " అన్నాడు రమణ.. రమణ గాడి వాక్యంలోని బహువచనం నన్ను వాళ్ళింటికి తీసుకెళ్ళింది....

రమణ వాళ్ళింట్లోకి అడుగు పెట్టాను..హాలులో ఎవ్వరూ లేరు. సోఫా లో కూర్చుని టీవీ ఆన్ చేసాను. 'ఆలీబాబా నలభై దొంగలు ' సినిమా వస్తోంది. ఒక గుహ ముందు నుంచుని "ఖుదా కా కసం..హసన్ కా హుకుం..ఖుల్జా ఓ సిసేం" అన్నాడు యన్‌టియార్. ఆ మంత్రం కరెక్టో కాదో దేవుడెరుగు..యన్‌టియార్ అరుపుకు గుహ ద్వారం మాత్రం తెరుచుకుంది. పక్క గది ద్వారం తెరుచుకుని రమణ వాళ్ళ నాన్న వచ్చారు.. "రమణ లేడా అండీ?" అడిగాను.."మార్కెట్టుకెళ్ళాడు బాబూ..వచ్చేస్తాడు..టీవీ చూస్తూ కూర్చో" అని మేడ మీదకు వెళ్ళారు..

ఇంట్లో అడుగు పెట్టగానే కప్పులో క్యారెట్ హల్వా ఇస్తారనుకున్నా. రమణ గాడు ఇప్పుడు మార్కెట్టుకెళ్ళాడంటే..వాడు క్యారెట్లు తీసుకొచ్చి, వాళ్ళమ్మ హల్వా వండి నా చేతికి కప్పు అందేప్పటికి 'ఆలీబాబా నలభై దొంగలు ' నుండి 'ఆలీబాబా అరడజను దొంగలు ' వరకు వచ్చిన తెలుగు సినిమాలన్నీ చూసెయ్యొచ్చు. అమ్మో..అనవసరంగా ఇరుక్కున్నానని టీవీ కట్టేద్దామని రిమోట్ చేతిలోకి తీసుకున్నాను...తప్పు బటన్ నొక్కినట్టున్నాను. ఛానల్ మారింది.. ఇంకో తెలుగు సినిమా వస్తోంది. ఇంటి బయట పడదామని కుడి అడుగులో ఎడమ అడుగు వేసుకుంటూ నడిచాను..ఇంతలో టీవీ లో "గురుదేవా" అని గర్జించారు యన్‌టియార్..మేడ మీద మూడవ క్లాసు పిల్లలకు ట్యూషన్ చెబుతున్న రమణ వాళ్ళ నాన్న పరిగెట్టుకుంటూ వచ్చారు..అరిచింది నేను కాదు, యన్‌టియార్ గారని తెలుసుకుని..."మా వాడు ఇంకా రాలేదా బాబూ.. నేనెళ్ళి చూసొస్తాను. ఈలోపు మేడ మీద ట్యూషన్ పిల్లలను కాస్త చూస్తుంటావా...లేక పోతే ఇల్లు పీకి పందిరేస్తారు " అని చెప్పి వెళ్ళారు..

నేను మేడ మీదకు వెళ్ళేప్పటికి పిల్లలు ఒకళ్ళ జుట్టు ఒకళ్ళు పీకేసుకుంటున్నారు..బలపాలు నీళ్ళలో తడుపుకుని తింటున్నారు..ఇల్లు పీకేసారు - పందిరెయ్యటానికి షామియానా, మామిడాకులు కడుతున్నారు.."నాన్సెన్స్..న్యూసెన్స్...సస్పెన్స్" అన్నాను గట్టిగా. నేను అనదల్చుకుంది "సైలెన్స్" అని గ్రహించిన పిల్లలు నిశ్శబ్దంగా నా వైపు చూసారు. "మీ మాష్టారు ఇంకో పదినిముషాల్లో వస్తారు..నిశ్శబ్దంగా మీ పనులు మీరు చేసుకోండి " అన్నాను. వెంటనే పిల్లలందరూ ఒక వేలు నోటి మీద పెట్టుకుని...ఒకళ్ళ జుట్టు ఒకళ్ళు పీక్కోవటం కొనసాగించారు..

"ఆపండ్రా నాయన..పోనీ మీ మాష్టారు బయటకెళ్ళేముందు మీకు ఏ సబ్జెక్టు చెబుతున్నారో చెప్పండి " అడిగాను...నోటి మీద పెట్టిన వేలు తీయకుండా "డ్రాయింగ్" అన్నారు పిల్లలంతా కలిసి..

'డ్రాయింగ్' అన్న మాట వినగానే - చిన్నప్పుడు కాలుతున్న కొవ్వొత్తి తో ఆడుకునేప్పుడు మొట్టమొదటి సారి నా చేతి మీద మైనం చుక్కలు పడినప్పుడు కలిగిన మంట, నొప్పి కలిగాయి..

వాళ్ళల్లో ఒకడు పెన్సిల్ తీసుకుని నా వైపు స్లోమోషన్ లో వస్తుంటే కత్తితో నన్ను పొడవటానికొస్తున్న శత్రు దేశపు విలన్ లాగ కనిపించాడు. ఆ పెన్సిల్ తీసుకున్నాను కానీ ఏమి చెయ్యలో తోచటం లేదు...పక్కన్నే టేబుల్ మీదున్న ఒక తెలుగు పత్రిక తీసుకుని..కవర్ పేజీ మీదున్న హీరొయిన్ బొమ్మకు మీసాలు గీసి పిల్లలకు చూపించాను. అది చూసి పిల్లలంతా చప్పట్లు కొట్టి, నా చేతిలోని పుస్తకం లాక్కుని అందులో ఫొటోలున్న ప్రతి పేజీ చించి మీసాలు పెట్టటం ప్రారంభించారు..ఈ పిల్లలకు ఇంతకన్నా ఎక్కువ ఙ్ఞానం ఇస్తే బొమ్మలు గీయటం లో నా అఙ్ఞానం బయటపడుతుందని..నేను ఆ గది బయట పడ్డాను.

హీరొయిన్ ఫొటోలకు మీసాలు పెట్టటం, దుమ్ము పట్టిన గాజు కిటికీల మీద నా పేరు రాసుకోవటం లాంటివి చాలా సార్లు చేసాను కాని...బొమ్మలు చక్కగా గీయటం అనేది నాకు చేతకాని పని. చాల రోజులు కష్టపడ్డాను నేర్చుకుందామని...ఆ తరువాత నేను తెలుసున్న విషయం - రాత్రి తరువాత పగలు వస్తుంది, భూమికి ఆకర్షణ శక్తి ఉంది, నేను బొమ్మలు గీయలేను, తమిళ హీరో/దర్శకుడు/రచయిత/నిర్మాత టీ.రాజేందర్ ఒక మనిషి - ఇవి ప్రకృతి సిధ్ధమైన విషయాలు.. వీటిని మార్చాలనుకోవటం మూర్ఖత్వం. (పై వాక్యంలో నేను చెప్పిన నాలుగు విషయాల్లో ఒకటి మాత్రం శుధ్ధ అబధ్ధం..ఏదో కనుక్కోండి చూద్దాం - క్లూ: ఈకింది ఫొటో లో ఉన్నది టీ.రాజేందర్)మా అమ్మ ఒక సైన్సు టీచరు. తన సర్వీసు లో ఎంతో మందికి బొమ్మలు గీయటం నేర్పింది..కానీ నాకు నేర్పలేక పోయింది..బడి లో ఇచ్చిన హోంవర్కు బొమ్మలు కూడా ఎప్పుడూ నేను వేయలేదు. ఐదవ తరగతి వరకు బొమ్మలు గీసిస్తే కానీ అన్నం తిననని గోల చేసి బొమ్మలు గీయించుకునేవాడిని..ఐదవ తరగతి తరువాత బొమ్మలు గీసివ్వకపోతే ఇంట్లో అందరికీ వండిన అన్నమంతా నేనొక్కడే తినేస్తానని బెదిరించి గీయించుకునేవాడిని..అసలు నా అక్షరాభ్యాసం సమయలో "అ", "ఆ" లకు బదులు ఏ బయాలజీ బొమ్మలో నేర్పించుంటే ఏ కష్టాలు ఉండేవి కావు..అ, ఆ లు నేర్చుకోకపొయుంటే యేమయ్యుండేది? మహా అంటే నాకు చదువొచ్చేది కాదు..నేర్చుకోవటం వల్ల నాకు బొమ్మలూ రాలేదు, చదువూ రాలేదు.

అయినా మూత తీయని స్కెచ్ పెన్నుతో నా నుదుటి బొమ్మ గీసాడు బ్రహ్మ దేవుడు..నేను ఎంత ప్రయత్నిస్తే మాత్రం ఏమి లాభం? బొమ్మలు అందంగా గీయగలగటం అనేది అందంగా పుట్టటం లాంటిది - ఎవరో కొంత మందికే లభించే వరం అది!

నేను తొమ్మిదో తరగతిలో ఉండేప్పుడు మా డ్రాయింగు మాష్టారు "మీకు తోచిన బొమ్మలు గీసి చూపించండి " అనేవారు..నేను ప్రతిసారి 'మేఘాల ' బొమ్మ గీసేవాడిని. మేఘలకు ఒక సైజూ, షేపూ ఏడవవు కాబట్టీ నాకు తోచినట్టు గీసి...వాటికి చక్కటి పసుపు రంగు అద్ది...పైన ' నీలి మేఘాలు ' అని టైటిల్ పెట్టి చూపించేవాడిని. దానికి ఆయన ఎన్ని మార్కులిచ్చేవాడనేది ప్రస్తుతానికి అప్రస్తుతం..

నా మేఘాల బొమ్మలు చూసి విసుగెత్తిన మా మాష్టారు ఒక రోజు క్లాసులో అందరికీ స్కేలు, పెన్సిలు ఇచ్చి..వాటిని ఉపయోగించి బొమ్మలు గీయమన్నారు. మిగతా పిల్లలందరూ స్కేలు వాడి గేటు బొమ్మ, డబ్బా బొమ్మ, స్కేలు బొమ్మ..ఇలాంటివి చాలా గీసారు. నేను స్కేలు ఉపయోగించి ఒక ఎర్ర గులాబి బొమ్మ గీసాను.. అది చూసి మా మాష్టారు నా స్కేలు తీసుకుని నా చెయ్యి ఎర్ర గులాబి రంగు వచ్చేంతవరకు కొట్టాడు...

మా క్లాసులో అమ్మాయిలందరూ చాలా చక్కగా గీసేవాళ్ళు బొమ్మలు..నన్ను అమ్మాయిల మధ్యలో కూర్చొపెడితే ఏమయినా గుణం కనపడుతుందేమోనని..అమ్మాయిల వరుసలోని మధ్య బెంచీలో, ఇద్దరు అమ్మయిల మధ్య కూర్చోపెట్టాడు మా మాష్టారు..నాకు బొమ్మలు గీయటం రానందుకు మొట్ట మొదటి సారి ఆనందమేసింది..అందుకు కృతఙ్ఞతగా నూట ఒక్కటి కొబ్బరికాయల బొమ్మలు గీసి బ్రహ్మదేవుడికి సమర్పించుకున్నాను..తను సృష్టించిన లోకంలో కొబ్బరి కాయలు నూటొక్క రకాలు ఉంటాయని అప్పుడే తెలిసొచ్చుంటుంది బ్రహ్మదేవుడికి..

నా జీవితం ఇలా మూడు కొబ్బరికాయలు, ఆరు కొబ్బరిచిప్పలుగా సాగుతుండగా ఒక రోజు మా డ్రాయింగు మాష్టారు శెలవు పెట్టారు. గంట సేపు ఏమి చెయ్యాలో తోచని నా బెంచి అమ్మయిలు నా అరచేతికీ, మోచేతికి, కళ్ళకు, కళ్ళద్దాలకు గోరింటాకు పెట్టారు..ఇది చూసి ఓర్వలేని మగ వెధవలంతా మరుసటి రోజు మా డ్రాయింగు మాష్టారు దగ్గరకు వెళ్ళారు. తమలో ఒక్కరికీ కూడా బొమ్మలు గీయటం రాదని, నన్ను కూర్చోబెట్టినట్టు వాళ్ళను కూడా అమ్మాయిల మధ్యలో కూర్చోబెడితే జన జీవన స్రవంతి లో కలిసిపొతామని అర్జీ పెట్టుకున్నారు...దాని ఫలితంగా నన్ను తిరిగి మగ జంతువుల మధ్యలోకి విసిరేసాడు మా మాష్టారు.

అప్పటి నుండి స్కూలులో, కాలేజీలో ఎన్నో పరీక్షల్లో ప్రశ్నలకు సమధానాలతో పాటూ బొమ్మలు కూడా గీయమనేవారు...నేను వారి కోరికను సున్నితంగా తిరస్కరించాను..కనీ ఇంజనీరింగు లో చేరాక 'ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ ' అనే సబ్జెక్టు రూపం లో వచ్చి విధి నన్ను నడి వీధి లో నిలబెట్టింది..

ఇంజనీరింగు మొదటి సంవత్సరం లో ఉండే 'ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ ' అనే సబ్జెక్టు లో కేవలం బొమ్మలుంటాయి. వింత పరికరాలతో, రకరకాలుగా, నానా రకాల హింసలు పెట్టే సబ్జెక్టు..ఇలా థర్డు డిగ్రీ టార్చరు కు గురయ్యి సాధించే డిగ్రీ నాకంత అవసరమా అని ఆలోచించటం మొదలుపెట్టాను..నాతో సైకిల్ పంక్చర్ షాపు పెట్టిద్దామా, టెలిఫోను బూత్ పెట్టీద్దామా అని మా ఇంట్లో వాళ్ళు ఆలోచించటం మొదలుపెట్టారు..

ఒక మంచి రోజు చూసుకుని మా గ్రాఫిక్స్ ప్రొఫెసర్ థామస్ పింటో దగ్గరకెళ్ళి "ఇలా ఇలా నాకు డ్రాయింగు రాదు సార్, అదీ ఇదీ చేసి మీరు నన్ను పాస్ చేయిస్తే, వాడితోనో వీడితోనో మీ బొమ్మ గీయించి, అప్పుడో ఇప్పుడో ఆ బొమ్మను ఆర్టు మ్యూసియుం లో పెట్టిస్తాను సార్" అని కాళ్ళా వేళ్ళా పడ్డాను..సరేనని నా దగ్గర ఏడొందలు ఫీజు తీసుకుని, పరీక్షలకు నెల రోజులముందు ఉద్యోగం వదిలి వెళ్ళిపోయాడు..నేను గీయించిన థామస్ పింటో గాడి బొమ్మను తీసుకెళ్ళి పోలీసు స్టేషన్ నోటీసు బోర్డు లో పెట్టొచ్చాను..

బ్రహ్మదేవుడు, విధి, థామస్ పింటో నన్ను మోసం చేసినా దినకర్ నాకు తోడుగా ఉంటానని మాటిచ్చాడు..బొమ్మల విషయం లో దినకర్ ది కూడా నా పరిస్థితే. నేను 'మేఘాల ' బొమ్మలు గీసినట్టు వీడు 'గాలి ' బొమ్మలు గీసేవాడంట...గ్రాఫిక్స్ పరీక్షలో నెగ్గుకురావటానికి నేను, దినకర్ ఒక ఉపాయం ఆలోచించాము..నేను ఐదు బొమ్మలు, వాడు ఐదు బొమ్మలు నేర్చుకుంటాము. పరీక్షలో ఎవడు నేర్చుకున్న బొమ్మలు వస్తే వాడే ఇద్దరికీ గీసిపెట్టాలి..ఆ పైన మా అదృష్టం..

పరీక్షలో నేను నేర్చుకున్న 5 బొమ్మలు వచ్చాయి. ముందుగా నా చార్టులో ఐదు బొమ్మలు గీసి, ఇన్విజిలేటరు చూడనప్పుడు నా చార్టు దినకర్ గాడికిచ్చి వాడి ఖాళీ చార్టు తీసుకుని మళ్ళీ బొమ్మలు గీసాను..నా పెన్సిల్ ముక్క విరిగిపొవటం తో దినకర్ గాడికి నా పెన్సిల్ చూపించి సైగ చేసాను..అది చూసిన ఇన్విజిలేటరు నా దగ్గరకు వచ్చి "సిగ్గులేకుండా బొమ్మలు కూడా కాపీ కొడుతున్నావా " అని నేను గీసిన బొమ్మల్లో నాలుగింటిని పెన్ను తో కొట్టేసాడు..

దినకర్ గాడి అదృష్టం చూడండి - లైసెన్సు ఇంట్లో మరచిపోయి, రెజిస్ట్రేషన్ కాగితాలు లేని స్కూటరు మీద ముగ్గురిని ఎక్కించుకుని, హెల్మెట్టు లేకుండా రోడ్డు మీద కుడి వైపు వెళ్ళినా ఎవ్వరూ పట్టించుకోరు..కానీ నాలాంటి వాడు సొంత ఇంటి కాంపౌండు లో సైకిల్ స్టాండు వేస్తున్నా 'నో పార్కింగ్', 'ఎమిషన్ టెస్ట్ ఎక్కడ?' అని 499 రూపాయలు ఫైన్ వేస్తారు...

ఆ ఇన్విజిలేటరు కొట్టెయ్యగా మిగిలిన ఒక్క బొమ్మకు పది మార్కులొచ్చాయి..ఇంజనీరింగు చివరి సంవత్సరం దాకా పోరాడి ఏడాదికి 10 మార్కుల చొప్పున నలభై మార్కులతో చివరి ఏడాది పాసయ్యను గ్రాఫిక్స్ పరీక్ష..

ఆ తరువాత ఇప్పటీదాక బొమ్మల జోలికి వెళ్ళలేదు నేను..ఈ రోజు ఈ పిల్ల థామస్ పింటోల వల్ల నాలో పెరుగన్నం తిని, నిద్రమాత్రలు మింగి నిద్రపోతున్న కళాకారుడిని బయటకు తీసుకురావలసి వచ్చింది..

గేటు చప్పుడైతే కిందకు వెళ్ళాను..రమణ, వాళ్ళ నాన్న వచ్చారు. ఒక చేతిలో విత్తనాల కవరు, ఇంకో చేతిలో చెఱుకు గెడలు పట్టుకొస్తున్న రమణ గాడు నన్ను చూసి "రారా...ఇదిగో ఈ క్యారెట్ విత్తనాలు పెరట్లో నాటి, ఈ చెఱుకు గెడల్లోంచి చక్కెర తీసేసామనుకో - ఊరెళ్ళిన మా అమ్మ తిరిగి రాగానే నిముషాల్లో క్యారెట్ హల్వా రెడీ..అందాకా లోపల కూర్చుందాం రా"..అన్నాడు..నేను లోపలకు అడుగులేస్తుంటే పైనుండి రమణ వాళ్ళ నాన్న అరుపులు వినపడ్డాయి - "నాకు మీసాలు గీయటమేంట్రా?? ఎవడు నేర్పాడు మీకిది???"....అని

ఇక్కడే ఉందామా, ఇంటికి వెళ్ళిపోదామా అని తేల్చుకోలేక టాసు వేద్దామని నా జేబులోంచి రూపాయ బిళ్ళ తీసాను..'బొమ్మ పడితే వెళ్ళిపోదాము..బొరుసు పడితే ఇక్కడే ఉందాము ' అని మనసులో అనుకుని రూపాయి బిళ్ళ పైకి విసిరాను...ఆ బిళ్ళకు రెండు వైపులా బొమ్మే ఉన్నా కూడా...బొరుసే పడింది! అంతటి శతౄత్వం - నాకూ ' బొమ్మ ' కు..

నేను ఇదివరకే అన్నట్టు..

'బొమ్మలు అందంగా గీయగలగటం అనేది అందంగా పుట్టటం లాంటిది'..

కాబట్టీ, బొమ్మలు బాగా గీయగలిగే అబ్బాయిలూ - మీరు సినిమాల్లో ప్రయత్నించుకోవచ్చు..

బొమ్మలు బాగా గీయగలిగే అమ్మయిలూ - హి హి హి...నాకింకా పెళ్ళి కాలేదు..నాకు ఈ-మెయిలో, ఫోనో చేస్తే.................

(ఎలాగూ నాలోని కళాకారుడు నిద్రలేచాడు....అందుకే ఈ చిన్ని కళ -

ప్రకృతి - పురుషుడు : Exotic art form by Siddhartha Goutham

note: ప్రకృతి = కొబ్బరి చెట్టు+సెలయేరు+గుడిసె+ఆకాశం)

Thursday, February 5, 2009

అసమర్థుని కారుయాత్ర

ఫిబ్రవరి 1, 2008 - ఉదయం 4:30 అయ్యింది

సంవత్సరం గడిచింది..

ఫిబ్రవరి 1, 2009 - ఉదయం 4:30 అయ్యింది

నిద్ర లేచాను....చాల రోజుల తరువాత స్నేహితులందరికీ కాస్త సమయం దొరకటం తో..ఇవ్వాళ "నంది హిల్స్" కు వెళ్ళాలని అనుకున్నాము...

తలుపు దగ్గర ఏదో చప్పుడయితే వెళ్ళి చూసాను..ఎవడో మా అమ్మమ్మ చేతిలోనుండి గిన్నె లాక్కుంటున్నాడు. నేను ఆవేశంగా వాడి దగ్గరకు వెళ్ళి 'ఎవడ్రా నువ్వు? మా ఇంటికొచ్చి మా మీదే దౌర్జన్యం చేస్తున్నావు?" అని అరిచాను.

దానికి వాడు "అయ్యో అదేంటి సార్..నేను మీ పాలవాడిని..రోజూ ఈ టైము లోనే వస్తాను సార్" అన్నాడు గిన్నె లో పాలు పోస్తూ..

పోసిన పాలలో ఎన్ని నీళ్ళున్నాయో తెలుసుకోవటానికి చూపుడు వేలితో ఒక చుక్క పాలు తీసి చూసింది మా అమ్మమ్మ..."ఏమీ అనుకోకు శీను..నిన్నెప్పుడూ చూడలేదు కదా మా వాడు...అందుకే.....సరే కానీ, ఈ పాలు ఒకలీటర్ బాటిళ్ళలో పోసి 'మినరల్ వాటర్ ' అని చెప్పి అమ్ము..వ్యాపారం బాగా జరుగుతుంది " అని లోపలకు వెళ్ళింది..

పాల శీను కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుని పక్కింటికి వెళ్తుండగా ఇంకొకడెవరో సైకిల్ మీద వచ్చి మా ఇంట్లోకి ఏమో విసిరాడు. నాకు మళ్ళీ కోపం వచ్చింది.."ఎవడ్రా నువ్వు..మా ఇంటికొచ్చి చెత్తా చెదారం వెస్తున్నావు?" అని అరిచాను..

"సార్ అ కుర్రాడు మీ పేపర్ వాడు...ఇదే టైములో వస్తుంటాడు రోజూ " అన్నాడు పాల శీను పక్కింటి వాళ్ళ గిన్నెలో మినెరల్ వాటర్ పోస్తూ..

రోజూ పొద్దున్నే నాకు పరిచయం లేని వాళ్ళు ఇంతమంది మా ఇంటికి వస్తారని ఈ రోజు దాకా నాకు తెలియదు. పొద్దున లేవగానే గ్లాసు లో పాలు, టేబుల్ మీద పేపరు చూసి మా ఇంట్లో అక్షయపాత్ర, శమంతకమణి టైపులో ఏవైనా ఉన్నాయేమో అనుకునేవాడిని..కానీ నాకు తెలియకుండా ఇలా కుట్రలు జరుగుతున్నాయని అనుకోలేదు..

సరే సూర్యోదయం చూద్దామని మేడమీదకు వెళ్ళాను..మా వాటర్ ట్యాంకు మీద ఎవడో చారల టీషర్టు వేసుకుని కూర్చుని ఉన్నాడు...నాకు మూడోసారి కోపమొచ్చింది.."ఎవడ్రా నువ్వు....నేనెక్కాలనుకున్న ట్యాంకు మీద నువ్వు కూర్చున్నావు? " అన్నాను గట్టిగా...దానికి ఆ చారల టీషర్టు వాడు "ష్...కాస్త మెల్లగా అరవండి సార్..నేను దొంగని,,రోజూ ఇదే టైములో మీ పక్కింటికి వస్తుంటాను..మీరు ఈ సమయం లో నిద్రపోతుంటారు " అన్నాడు..

ఒహ్...వీడు కూడా పాలు, పేపర్ వాళ్ళ బాపతు అనుకుని "అలాగా..సరే. జాగ్రత్త..అటువైపు గోడ కాస్త బలహీనంగా ఉంది..చూసుకుని దూకు " అని చెప్పి కిందకు దిగాను..

బాగా చలిగాఉంది...బీరువాలో ఉన్న నా జాకెట్ తీసి సోఫాలో పెట్టమని మా అమ్మ తో చెప్పి స్నానానికి వెళ్ళాను..స్నానం చేసి వచ్చాక సోఫా మీద చూస్తే ఒక నీలం రంగు జాకెట్ గుడ్డ, పట్టు చీర కనపడ్డాయి..

"అమ్మా...ఏంటివి?" అనడిగాను...పూజ గదిలోంచి బయటకొచ్చిన మా అమ్మ "నువ్వే కదరా జాకెట్టు కావాలని అడిగావు...అదిగో..మొన్న సుశీల పెళ్ళికెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టిన జాకెట్ గుడ్డ అది..వెళ్ళి కుట్టించుకో..దాని మాచింగ్ చీర కూడ పెట్టాను పక్కన్నే " అంది...నేను లోపలకు వెళ్ళి నా జాకెట్ తీసుకొచ్చి "నేనన్నది ఇది " అని చూపించాను..

ఏంటో నిద్రలేచినప్పటి నుండి ఒక్కటికూడా సరిగ్గా నడవట్లేదు..

సంపత్ గాడు వచ్చాడు.."కూర్చోరా..పది నిముషాల్లో తయారౌతాను " అన్నాను..

"రేయ్..నా కారు తాళాలు కనపడ లేదు..ఆటో లొ వచ్చాను..నంది హిల్స్ కు వెళ్ళటానికి ఏదైనా ఏర్పాటు చెయ్యమని దినకర్ గాడికి చెప్పాను " అన్నాడు..

"దినకర్ గాడికా????? దొంగతనం చెయ్యటానికి పోలీసు స్టేషన్ కు వెళ్ళినట్టుంది నీ తెలివి " అన్నాను తల పట్టుకుంటూ..

"నువ్వు దినకర్ గాడిని తిట్టావని అర్థమయ్యింది కాని...ఆ సామెత అర్థం కాలేదు రా " అన్నాడు సంపత్ గాడు..

ఏ ప్రకృతి వైపరిత్యం దినకర్ గాడి రూపం లో వచ్చి మా నంది హిల్స్ ప్లాను ను ముంచేస్తుందోనని భయం మొదలయ్యింది మాకు..పది నిముషాల తరువాత ఇంటిబయట కారు హార్ను వినబడింది. లోపల మేము హనుమాన్ చాలీస చదవటం మొదలెట్టాము. హనుమంతుడికి మా ప్రార్థన చేరేలోపే కాలింగ్ బెల్లు చప్పుడయ్యింది...

" ఎవరు? " అన్నాము నేను, సంపత్ కలిసి..

"గౌతం, సంపత్ " అని వినపడింది తలుపు బయటినుండి..

"మేమడిగింది తలుపుకు ఇటువైపు కాదు..అటువైపు " అన్నాను...సంపత్ గాడు నా తలమీద ఒక మొట్టికాయ వేసి "ఇందాక ఆ సమాధానం వింటే అర్థం కాలేదు రా ఎవరని?...మన తుగ్లక్ గాడే. వెళ్ళి తలుపు తెరు...లేకపొతే మీ కాలనీ వాళ్ళ పేర్లన్నీ చెబుతాడు..."తలుపుకు అటువైపు ఎవరు " అని అడిగావుగా..." అన్నాడు..

పీప్ హోల్లోంచి చూసాను..దినకర్ గాడు తనలో తనే నవ్వుకుంటూ కనబడ్డాడు. బొల్టు తీసి తలుపు లాగుతున్నా రావట్లేదు..బయట గడియ పెట్టినట్టుంది..

"ఇప్పుడు లోపలి నుండి నువ్వు కాలింగ్ బెల్లు కొట్టరా..నేను ఇక్కడ గొళ్ళెం తీస్తాను " అన్నాడు దినకర్ గాడు బయటి నుండి....

"నువ్వే గెలిచావు....తలుపు తీయరా నాయన.." అన్నాను...

తలుపు తెరిచి విజయ గర్వంతో లోపలకు వచ్చాడు దినకర్ గాడు..వచ్చీ రాంగానే సోఫా మీద ఉన్న జాకెట్ గుడ్డ మీద పడింది వాడి కన్ను...."ఇది ఆ ఎర్ర బిల్డింగు సుశీల గారి పెళ్ళిలో పెట్టింది కదూ...నాకు కూడా ఇదే రంగు జాకెట్టు గుడ్డ పెట్టారు..ఇది నాకిచ్చెయ్యిరా...రెండూ కలిపి చొక్కా కుట్టించుకుంటాను " అని ఆ జాకెట్టు గుడ్డ తీసి బ్యాగు లో పెట్టుకున్నాడు..

"పదండి రా..బయట కారు రెడీ గా ఉంది " అన్నాడు....ఆ పక్కన్నే ఉన్న పట్టు చీర జరీఅంచును చేత్తో పట్టుకుని చూస్తూ...

"నువ్వు కారు నడపటం ఎప్పుడు నేర్చుకున్నావు రా " అనడిగాను బయటకు నడుస్తూ..

వాడు ఒక నవ్వు నవ్వి, ఒక దగ్గు దగ్గి, వస్తున్న తుమ్మును తుమ్మకుండా...మా ఇద్దరికీ బయట ఉన్న కారు చూపించాడు..

కారు పైన "PVR Motor Driving School" అని ఒక బోర్డు ఉంది..డ్రైవరు పక్క సీట్లో ఎవరో కూర్చుని ఉన్నారు..కారు ముందు "నంది హిల్స్ విహార యాత్ర " అని ఒక బానర్ కట్టి ఉంది....ఇదంతా చూసి నేను, సంపత్ గాడు అడగాలనుకున్న ప్రశ్నలు అర్థమైనట్టున్నాయి శ్రీమాన్ దినకర్ గారికి....

"నేను వారం రోజులుగా డ్రైవింగు క్లాసులకు వెళ్తున్నాను రా...సంపత్ గాడు కారు తాళాలు కనిపించట్లేదు అనగానే మా గురువు గారితో మాట్లాడి, ఇవ్వాళ క్లాసు నంది హిల్స్ దాక తీసుకొండి సార్ అని రిక్వెస్టు చేసాను...అదిగో, కారులో కూర్చుంది ఆయనే..త్వరగా పదండ్రా..ఆలస్యమైతే ఆయనకు కోపమొస్తుంది " అని గబగబా వెళ్ళి డ్రైవర్ సీటులో కూర్చున్నాడు..నేను సంపత్ గాడు వెనక సీట్లో కూర్చున్నాము..

"వీళ్ళు నా స్నేహితులు సార్ - సంపత్, గౌతం....ఈయన నా డ్రైవింగ్ ఇన్స్ట్రక్టరు..పేరు PVR " - పరిచయం చేసాడు దినకర్..ఆ PVR వెనక్కి కూడా తిరగలేదు..

మళ్ళీ దినకర్ గాడే మాట్లాడుతూ "అన్నట్టు చెప్పటం మరచిపోయాను రా..నిన్న రాత్రి నీ కారు తాళాలు నా జేబులో దాచాను..నువ్వు కనిపెడతావో లేదో చూద్దామని...ఇవిగో తాళాలు " అని కారు తాళాలు ఇచ్చాడు సంపత్ గాడికి..

వాడు తాళాలు తీసుకుంటూ నా వైపు తిరిగి " నేను దొంగతనానికి వెళ్ళింది పోలీసు స్టేషన్ కు కాదు రా...ఏకంగా సెంట్రల్ జైలుకే " అన్నాడు...సంపత్ గాడు దినకర్ ను తిట్టాడని అర్థమయ్యింది కానీ....సామెత అర్థమవ్వలేదు..

కారు కదిలింది...ఆ PVR క్షణానికోసారి "క్లచ్చు, బ్రేకు...గేరు, బ్రేకు......యాక్సలరేటర్, బ్రేకు " అని...రెడ్ సిగ్నల్ పడినప్పుడు "రూలు బ్రేక్" అని దినకర్ గాడితో డిస్కో, బ్రేకు కలిపి చేయిస్తున్నాడు..

అలవాటు లేనివాడు స్కూటరు వెనక సీటు ఎక్కినప్పుడు, రెండు చేతులతో సీటు వేనకాల రాడ్ ను గట్టిగా పట్టుకుని కూర్చున్నట్టు...నేను, సంపత్ ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని కూర్చున్నాము..

బాగా రద్దీగా ఉన్న ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మా బండి ఆగి ఉంది...ఈ PVR గాడు ఎప్పుడు ఏది నొక్కమంటాడో అని టెన్షన్ లో ఉన్నాడు దినకర్ గాడు...సడన్ గా ఒక అమ్మాయి స్కూటీలో వచ్చి దినకర్ గాడి పక్కన ఆపి...వాడిని చూసి "హాయ్...యు లూక్ సో క్యూట్" అంది...దినకర్ గాడు ఆ అమ్మాయి వైపు కూడా చూడకుండా "ఉండవమ్మా....అక్కడ గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు పడుతుందా..మా సారు "ఆక్రమణ్ " ఎప్పుడు చెబుతాడా అని నేను ఖంగారు పడుతుంటే...మధ్యలో నీ నస ఒకటి " అన్నాడు...

దినకర్ గాడి వెనకాల కూర్చుని ఉన్న మాతో కూడా ఏమయినా చెబుతుందేమోనని నోరూ, కళ్ళు, కిటికీ తెరుచుకుని చూస్తున్నాము నేను, సంపత్ గాడు...ఈ లోపు సిగ్నల్ పడింది..బండి కదిలింది..

సంపత్ గాడు కోపం పట్టలేక "రేయ్...ఈ దినకర్ గాడు valentine's day రోజు రాఖీ కట్టించునే రకం రా..లేకపొతే, పాస్పోర్టు కూడా లేని వాడికి చంద్రమండలానికి వీస వస్తే వద్దంటాడా?" అన్నాడు...

ఏంటో...ఇవ్వాళ ఏ సామెత విన్నా, అన్నా...దినకర్ గాడిని తిట్టినట్టు అర్థమౌతోంది కానీ...సమెతల అర్థం తెలిసి చావట్లేదు.

ఓ పావుగంటసేపు ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు..ఈ నిశ్శబ్దాన్ని భరించలేని దినకర్ "రేయ్..పిక్నిక్ అంటే ఎలా ఉండాలి..కారు కిటికీలోంచి చేతులు బయటకు పెట్టి ఊపుతూ, అంత్యాక్షరి ఆడుకుంటూ వెళ్ళాలి.." అన్నాడు..మేము విని ఊరుకున్నాము..

మళ్ళీ వాడే మాట్లాడుతూ "సరే...నేనే మొదలెడతాను"....అని...

"నవ మన్మధుడా...అతి సుందరుడా..నిను వలచిన ఆ వరుడు " అని ఆపి....PVR వైపు చూసాడు...అప్పుడు ఇద్దరూ కలిసి "అక్కా..ఎవరే అతగాడు.." అని పాడారు..."డు...డు....డు తో పాడు " అన్నడు దినకర్ గాడు సంపత్ వైపు చూసి..

ఈ పాడు గోల ఎలాగయినా ఆపెయ్యాలని సంపత్ గాడు "రేయ్ ముష్టి వెధవ" అని అరిచాడు..

ముందు కూర్చున్న ఇద్దరూ ఒకేసారి " ఆ..ఏంటి " అన్నారు..వెంటనే దినకర్ గాడు PVR ను చూసి "అదేంటి సార్...మీ పెట్ నేం కూడా ' ముష్టి వెధవ ’ నేనా...సేం పించ్" అని గిచ్చి, సంపత్ వైపు తిరిగి "చెప్పరా...ఏంటి " అన్నాడు..

" బండాపు " అన్నాడు సంపత్..

" సాటి ముష్టి వెధవను అడుగు " అని PVR వైపు చూపించాడు..

సంపత్ గాడికి కోపం పెరిగిపోతోంది..."సార్ కాస్త బండి ఆపించండి...బాత్రూం వెళ్ళాలి " అని చిటికెన వేలు పైకి లేపి చూపించాడు..

"నేను ఇందాక ఇంటి దగ్గరే వెళ్ళాను బాత్రూం కు...ఇప్పుడు అవసరం లేదు. థ్యాంక్ యూ." అన్నాడు PVR..

దానికి సమాధానంగా సంపత్ గాడు సభ్యసమాజం హర్షించని కొన్ని మాటాలు వాడాడు..అవి సెన్సార్ చేయబడినవి.

కారు ఆగింది..సంపత్ గాడు కారు దిగి, పక్కకెళ్ళి సభ్యసమాజం హర్షించని పని చేసి తిరిగొచ్చాడు..

"రోడ్డు పక్కన, సినిమా థియేటర్ గోడల పక్కన చేసే పనికి 'బాత్రూం' అని పేరొకటి.....నువ్వు బండి పోనీవయ్యా " అన్నాడు PVR దినకర్ వైపు చూస్తూ..

దానికి దినకర్ గాడు మమ్మల్ని చూసి "ఛి ఛి..మీ వల్ల నా పరువు పోతోంది రా..నా లాగా డీసెంటు గా, హుందాగా ఉండలేరేంట్రా మీరు??" అని అరిచాడు....అరిచిన రెండు సెకెండ్ల తరువాత "సారా బుడ్డి ఉంది...కారా కిళ్ళి ఉంది " అని అంత్యాక్షరి కంటిన్యూ చేసాడు..

ఊరు దాటిన కాస్సేపటికి ఒక చిన్న హోటల్ కనబడింది..హోటల్ ముందు చాలా బళ్ళున్నాయి.."చూడు దినకర్..ఇప్పుడు నీకు కారు ఎలా పార్క్ చెయ్యాలో నేర్పుతాను...ఆ నల్ల రంగు కారుంది చూసావా " అనడిగాడు PVR..

దినకర్ గాడికి ఏమి వినబడిందో ఏంటో..కారు స్పీడుగా పోనిచ్చి ఆ నల్ల కారు వెనకాల గుద్దాడు. నల్ల కారు ముందుకు జరిగింది - మా కారు ఆ స్థానంలో నిలబడింది..

"కారు పార్కు చెయ్యటమంటే అదేదో బ్రహ్మవిద్య అనుకున్నాను సార్...మరీ ఇంత సులభమనుకోలేదు " అని కారు దిగి ఒళ్ళు విరుచుకున్నాడు..

PVR గాడు మా వైపు తిరిగి "ఆ నల్ల కారు చూసావా అనడిగాను...చూసి రమ్మంటే ఇలా కాల్చి, పోస్టుమార్టం చేసొస్తే ఎలాగయ్యా??...సర్లె...దిగండి..టిఫిన్ చేద్దాం..ఇక్కడ 12 నిముషాలు బ్రేక్ అంతే " అన్నాడు...

నలుగురమూ హోటల్లో కూర్చున్నాము..సర్వర్ వచ్చి మా పక్కన నుంచున్నాడు. సంపత్ గాడు "పూరి" అన్నాడు, నేను "ఉప్మ" అన్నాను..దినకర్ గాడు "దోసె" అన్నాడు..

PVR సర్వర్ వైపు చూసి "నలుగురికి ఒక్కొక్క ప్లేట్ ఇడ్లీ...బిల్" అన్నాడు...సర్వర్ వెళ్ళిపోయాక మా వైపు చూసి "పూరి, దోసె ఐతే బాగా ఆలస్యమౌతుంది...అందుకే నలుగురికీ ఇడ్లీలు చెప్పాను " అన్నాడు టేబుల్ పక్కన్నే చెయ్యి కడుక్కుంటూ..

మా ఓర్పు నశిస్తోంది...

సంపత్ గాడు నా వైపు చూసాడు..నేను దినకర్ గాడి వైపు చూసాను..ఇదేదో కొత్త ఆట అనుకుని దినకర్ గాడు పక్క టేబుల్ మీద కూర్చున్న వాడి వైపు చూసాడు..

ఓ రెండు క్షణాలాగి మా వైపు చూసి "జిహ్వ కొక రుచి..రెండు జిహ్వలకు రెండు రుచులు అన్నారు కదా పెద్దలు...ఇదీ అంతే. సార్ కు ఇడ్లీలు నచ్చుతాయి..సర్దుకోండి రా " అన్నాడు..

ఇప్పుడు దినకర్ గాడిని ఏమన్నా బాగోదని..కోపాన్ని దిగమింగుకుని, ఇడ్లీలు మింగాము. బిల్లు కట్టి బయటకు వచ్చాము.. మా కారు వెనక వైపు నుజ్జు నుజ్జు అయ్యుంది...దాని వెనకాల RVP Motor Driving School అని బోర్డు ఉన్న ఒక కారు కనపడింది...మాకు విషయమర్థమయ్యి కారెక్కి బయలుదేరాము...

ఈ సారి ముందు బెంచీ వాళ్ళు అంత్యాక్షరి మొదలెట్టక ముందే సంపత్ గాడు రేడియో ఆన్ చేసాడు..ఏదో FM స్టేషన్ పెట్టాడు..

"నాతో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నంబర్ - 22022000..నేనడిగిన ప్రశ్నకు సరయిన సమాధానం ఇస్తే మీరు గెలుచుకోగలరు ఒక నీలం రంగు జాకెట్ గుడ్డ..ఇక ఆలస్యమెందుకు..చెయ్యండి ఫోన్ " అంది ఆ రేడియో అమ్మాయి..

'నీలం రంగు జాకెట్ గుడ్డ ' అని విన్న వెంటనే దినకర్ గాడికి మనసు ఆగలేదు...వెంటనే ఫోను చేసాడు..తగిలింది..స్పీకర్ ఆన్ చేసాడు..

"హలో...ఎవరండి మాట్లాడేది"

"హలో...నా పేరు దినకర్ మేడం...ఇన్ని రోజుల నుండి ట్రై చేస్తుంటే ఈ రోజు తగిలింది....అస్సలు నాకు ఏమి మాట్లాడాలో తెలియట్లేదు"

"హహ....చెప్పండి దినకర్ గారు..ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? "

"మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది మేడం...మా ఫ్రెండ్స్ మీతో మాట్లాడతారంట...ఒక్క నిముషం మేడం " అని మాకివ్వబోయాడు

"దినకర్ గారు...మీ వాళ్ళతో తరువాత మాట్లాడతాను...ముందు నేను అడగబోయే ప్రశ్నకు సమధానం ఇవ్వండి "

"మేడం...ప్లీజ్ మేడం...ఈజీ క్వస్చన్ అడగండి...ప్లీజ్" అన్నాడు దినకర్ గాడు...

అప్పుడర్థమయ్యింది మాకు....ఇలా రేడియోలకు, టీవీ లకు ఫోను చెయ్యటం లో వెటరన్ వీడు....

"OK దినకర్ గారు....మీ ప్రశ్న - "అమెరికా రాజధాని ఏది?"

దినకర్ గాడు, PVR మాకు వినపడకుండా ఏదో చర్చించుకున్నారు....దినకర్ గాడు "కొలొంబో" అన్నాడు..

"అయ్యో....అది కాదండి సమధానం" అంది రేడియో ఆవిడ...

"మేడం క్లూ ఇవ్వరా ప్లీజ్....మేడం ప్లీజ్" అని తన 'ముష్టి వెధవ ' పెట్ నేం ను సార్థకం చేసుకున్నాడు దినకర్ గాడు..

"సరే...ఇదిగోండి మీ క్లూ - అందులో మొదటి నాలుగక్షరాలు 'WASH'"

మళ్ళీ దినకర్ గాడు, PVR ఏదో చర్చించుకున్నారు...

" వాష్ కొలొంబొ " అని సమధానమిచ్చాడు దినకర్..

ఈ సమధానాలు విని కారు బయటకెళ్ళి డోక్కోవటం మొదలు పెట్టాడు సంపత్ గాడు..

"అయ్యో సారీ దినకర్ గారు...ఇది కూడా సరైన సమధానం కాదు.....OK శ్రోతలారా...ఇదే ప్రశ్న మీకూ వేస్తున్నాము..అమెరికా రాజధాని ఏది? మీకు మూడు ఆప్షన్స్ ఇస్తున్నాము - a) మద్రాసు b) మద్రాసు c) వాషింగ్టన్...మీరు a,b or c అని టైపు చేసి 2222 నంబర్ కు SMS చెయ్యండి ".....అంది..

దినకర్ గాడు వెంటనే మా నలుగురి మొబైల్ ఫోన్లు తీసుకుని SMS లు చేసాడు....

"నాలుగు ఫోన్ల నుండీ SMS చేసాను రా...ఎవరో ఒకరు గెలవటం గ్యారెంటీ....మీలో ఎవరికి ఆ జాకెట్టు గుడ్డ వచ్చినా నాకే ఇవ్వల్రో" అన్నాడు....

"ఇంతకీ ఏమి సమధానం పంపావు రా" ఉండబట్టలేక అడిగాను..

"ఆవిడే చెప్పింది కదా...a,b or c అని టైపు చేసి పంపండి అని.....a,b or c అని పంపాను.." అన్నాడు....

మా వాడికి పద్మశ్రీలు, భూషణ్ లు సరిపోవు....ఏకంగా నోబెల్ ప్రైజే!!!

సాయంకాలం ఐదు కావొస్తోంది....పక్కన సంపత్ గాడికి సెలైను ఎక్కించాల్సిన పరిస్థితి....అయినా కాని....పట్టుదలతో ఉన్నాము...నంది హిల్స్ చూడాలని...

"బ్రేక్" అని అరిచాడు PVR..." అందరూ దిగండి " అన్నాడు...

హమ్మయ్య...వచ్చేసినట్టున్నాము...త్వరాగా వెళ్ళి కనీసం ఒక అరగంటైనా గడపాలి..అనుకుంటూ దిగాము..

తన సంచి లోంచి ఒక binoculars తీసి మాచేతికిచ్చి..."ఇందులోంచి చూస్తే ఆ మూలకు మూడు పెద్ద కొండలు కనిపిస్తాయి....ఆ కొండల వెనకాల ఉన్న రోడ్డు మీద వెళ్తే నంది హిల్స్ వచ్చేస్తుంది.....చూసారుగా...ఇక ఇంటికి బయలుదేరుదాము పదండి "....అన్నాడు PVR గాడు...

చేసేదేమీ లేక....ఈ ఇద్దరినీ చేయగలిగిందేమీ లేక....నోరుమూసుకుని ఉన్నాము నేను సంపత్ గాడు...

ఈ రోజు పుద్దుటి నుండీ జరిగిన వన్నీ ఆలోచించాక...తప్పు నాదేనని నిర్ధారించుకున్నాను..

" నంది హిల్స్ కు వెళ్ళటానికి ఏదైనా ఏర్పాటు చెయ్యమని దినకర్ గాడికి చెప్పాను " అని సంపత్ గాడు అనిన వెంటనే ఈ ట్రిప్పు ను ఫిబ్రవరి 1, 2010 కి వాయిదా వెయ్యని నా అసమర్థత వల్లనే ఇదంతా జరిగింది.....

(సశేషం.....((నాకు డౌటే))

Monday, January 5, 2009

ఉద్యోగానికి ఉచిత సలహాలు

(ఈ టపా అంధ్రభూమి మాస పత్రిక జనవరి 2009 సంచిక లో నేను రాస్తున్న 'తోటరామాయణం' అనే శీర్షిక కింద ప్రచురితమైనది)

కాలేజి నుండి బయటపడి మొదటి సారి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న కుర్రాళ్ళు, కుర్రాళ్ళినిలకు సహాయపడటానికి నేను చేస్తున్న ప్రయత్నమిది....ఇంటర్వ్యూ లో నెగ్గుకురావటానికి కావలసిన కిటుకులను నేను కాచి, వడబోసి, ఇంటి బయట పారబోసాను. నా సీనియర్లు నాకు ఉచితంగా ఇచ్చిన సలహాలను నేను మీకందరికీ ఆ ఉచితంలో సగం ధరకే ఇస్తాను..

ఉద్యోగానికి దరఖాస్తు చెయ్యటానికి ముందు మనము చెయ్యవలసిన పని - వచ్చే జన్మలోనైన ఇటువంటి దుస్థితి రాకుండా ఓ పది, ఇరవై కోట్లకు వారసులుగా పుట్టేలా దీవించమని దేవుడికి మొక్కుకోవటం.

ఆ తరువాత resumé తయారు చేసుకోవాలి. తయారు చేసుకునే ముందు దానిని 'రెస్యూం' అనాలో, 'రెస్యూమే' అనాలో పెద్దలనడిగి తెలుసుకోవటానికి ప్రయత్నిచటం...ఎలా అన్నా ఒరిగేది ఏమీ లేదని తెలుసుకున్నాక అసలు పనికి ఉపక్రమించటం.

'రెస్యూమే ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది ' అని చెప్పే ఉద్యోగ ద్రోహులు చెప్పే మాటలు వినకండి. మన తెలుగు క్యాలెండర్ లాగా కనీసం పన్నెండు పేజీలు ఉండేలా చూసుకోండి..ఆ తరువాత దాన్ని బైండింగు చేయించి, స్కూలు బ్యాగు లో మోసుకెళ్ళొచ్చు ఇంటర్వ్యూ కు.

పన్నెండు పేజీలు ఎలా నింపాలి??

మనం ఎంత వెధవలమయినా మనల్ని మనం ప్రేమించుకోవాలి. కాబట్టి, రెస్యూమే మొదటి పేజీ లో హైబ్రీడు తాటికాయంత అక్షరాలతో మన పేరు ఉండేలా చూసుకోవాలి. ఆ తరువాత మన ఫోన్ నంబరు, మన ఈ మెయిల్ ID రాయాలి. మన ఈ మెయిల్ ID దగ్గరే కంపెనీ వాళ్ళ దృష్టిని ఆకట్టుకునేందుకు ప్రయత్నించండి. ఏదో పేలవమైన ID కాకుండా crazyboy007@gmail.com లాంటి వంకర పేర్లు పెట్టుకుంటే మంచిది...మన రెస్యూమే జన్మలో మర్చిపోడు చూసినవాడెవడయినా.

ఈ వివరాల తరువాత objective రాయాలి...

objective అంటే ఈ రెస్యూమే ఎందుకు తయారు చేస్తున్నాము అని - అంటే ఉద్యోగం కోసమని - అంటే డబ్బు కోసమని - అంటే మూడు పూట్లా భోజనం కోసమని - అంటే రాత్రి పూట భోజనం చేస్తే బొజ్జ వస్తుందని - అంటే రాత్రి చపాతీలు మాత్రమే తినాలని....
కాబట్టీ, objective పక్కన 'చపాతీలు తినటం' అని రాయండి! మీ దూరదృష్టి అర్థమౌతుంది కంపెనీ వాళ్ళకు..

ఆ తరువాత మన అర్హతల వివరాలు...

పదవ తరగతి, ఇంటర్, గ్రాడ్యుయేషన్ మార్కు షీట్లు చూపించాలి కాబట్టి పెద్దగా అబద్ధాలు రాయకండి...కాని ఒకటవ తరగతి నుండి, తొమ్మిదో తరగతి వరకు రెచ్చిపోండి.

3వ తరగతి - ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్
5వ తరగతి - సౌత్ ఇండియా టాపర్
8వ తరగతి - పరీక్షలు రాయకుండానే పాస్

....ఇలా యధేచ్చగా రాసుకోవచ్చు.

ఆ తరువాత రెస్యూమే కు అతి ముఖ్యమైనది మన 'స్కిల్ సెట్' వివరాలు రాయటం (గుర్తుందిగా...పన్నెండు పేజీలు నింపాలి మనం)

ఇప్పుడిక్కడున్న అందరిలోకి మేధావిని నేనే కాబట్టీ నా 'స్కిల్ సెట్' గురించి ఎలా రాసానో చెబుతాను..దానిని నమూనా గా తీసుకుని మీ మీ స్కిల్ సెట్లు రాసుకోవచ్చు.

"నేను కాలేజీలో చివరి బెంచిలో కూర్చునేవాడిని..ముందు బెంచీ అబ్బాయిలు, అమ్మాయిలు క్లాసు జరుగుతున్నంత సేపు ఏవో చీటీలు రాసుకుని ఒకళ్ళకొకళ్ళు పాస్ చేసుకునేవాళ్ళు. అమ్మాయిలు ముసిముసి నవ్వులు నవ్వుకునేవాళ్ళు..అబ్బాయిలు ముసిముసి లేకుండా నవ్వుకునేవాళ్ళు. క్లాసు అయ్యాక ఆరోజు రాసుకున్న చీటిలన్నీ బెంచీల్లో వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు నేను, నాతోపాటు చివరి బెంచీల్లో కూర్చునే ఓ నలుగురిని వెంటేసుకుని ఆ చీటీలన్నీ హాస్టలుకు పట్టుకెళ్ళి, వాటిని క్షుణ్ణంగా చదివి...ఆ చీటిలలోని విషయాలన్నింటినీ రుబ్బి, ఒక కథగా రాసి, ఔత్సాహికులకు పంచిపెట్టేవాడిని."

చూసారా - ఒక నాలుగు పంక్తులు రాసి అందులో నా నిపుణతల్ని అన్నింటిని ఎలా ఇమడ్చానో! ఇది చదివిన వాళ్ళకు నా కష్టపడే మనస్తత్వం, నా అటెన్షన్ టు డీటెయిల్, నా నాయకత్వ లక్షణాలు, నా లోని టీం ప్లేయర్, పక్కవారితో పంచుకునే గుణం - అన్నీ కనిపిస్తాయి.

మీరు కూడా మీ సామర్థ్యాన్ని గురించి బుల్లెట్ పాయింట్ల రూపంలో కాకుండా ఇలా ఒక మినీ కథ రాస్తే పాఠకులు ఎక్కువగా ఆస్వాదిస్తారు.

ఆ తరువాత మనం కాలేజీలో చేసిన ప్రాజెక్ట్ల గురించి రాయాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి - మనది వసుధైక కుటుంబం. మన క్లాస్మేట్లు, మన సీనియర్లు అంతా మన ఇంటివాళ్ళే..వాళ్ళ ప్రాజెక్ట్లు మనవి కాదా, మన అరియర్లు వాళ్ళవి కావా? మొహమాటం లేకుండా ఎవరి ప్రాజెక్టు బాగుంటే అది పెట్టెయ్యండి రెస్యూమేలో..

ఆ తరువాత మన 'వ్యక్తిగత వివరాలు ' ఇవ్వాలి..రెస్యూమే మొదట్లో మనము రాసిన వివరాల్ని పీకి పాకాన పెట్టాలి..
మీ వంశవృక్షం మొత్తాన్ని ఒక ఫ్లోచార్టు లాగ గీసెయ్యండి. మీ పుట్టిన రోజు, బారసాల, మొదటిసారి గుండుకొట్టించుకున్న రోజు - ఈ వివరాలన్నీ రాస్తే ఇంటర్వ్యూ చేసేవాడికి బాగా దగ్గరౌతారు..

ఇవన్నీ రాసాక కూడా ఇంకా పన్నెండు పేజీలు నిండకపోతే ఈ రెస్యూమే టైపు చేసిన పేపర్ ఏ షాపులో కొన్నది, ఆ షాపు వాడు నెలకు అద్దె ఎంత కడుతున్నాడు, అద్దెలు బెంగళూరులో ఎలా పెరుగుతున్నాయి, బెంగళూరులో ఇంతమంది అమ్మాయిలున్నా మనల్ని ఒక్కరు కూడా ఎందుకు చూడట్లేదు - మన సృజనాత్మకతనంతా ఉపయోగించి ఇలాంటివెన్నో రాసుకోవచ్చు..

రెస్యూమే తయారయ్యాక దానికి పసుపు, కుంకుమ రాసి అప్లై చెయ్యాలనుకున్న కంపెనీలకు పోస్టు చెయ్యండి..చేసిన తరువాత తెలుస్తుంది - మనము ఇంకా గుప్తుల కాలంలో లేము, ఇప్పుడంతా ఆన్లైన్ అప్లై చేస్తారు అని...అప్పుడు కంప్యూటర్ మానిటర్ కు పసుపు, కుంకుమ రాసి ఆన్లైన్ దరఖాస్తు చెయ్యటం మొదలెట్టండి....

అప్ప్లై చేసేసాం కదా...ఇప్పుడు విశ్రాంతి! విశ్రాంతి తరువాత ఒక పాట. పాట అవ్వంగానే ఇంటర్వ్యూలు రావటం మొదలౌతాయి..

ఇంటర్వ్యూలో ఎటువంటి టెక్నికల్ ప్రశ్నలు అడుగుతారో మనకు తెలియదు...అలాంటప్పుడు వాటికి సమాధానాలు మాత్రం తెలుసుకుని ఏం చేస్తాం?? కాబట్టి, ఏ పుస్తకాలు చదువుకోకుండా నేరుగా వెళ్ళండి.

మామూలుగా శని, ఆదివారాల్లో కంపెనీలు 'వాక్-ఇన్ ' ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంటాయి...వీటి వివరాలు పేపర్ లో చూడగానే చెయ్యల్సిన మొదటి పని - అదే ఊళ్ళో ఉన్న మన క్లాస్మేట్స్ ఎవ్వరూ ఆ 'వాక్-ఇన్ ' కు అటెండ్ కాకుండా చూసుకోవటం!
ఇందాక చెప్పినట్టు..నేను బేసిక్ గా మేధావిని. నెను నా మొదటి ఉద్యోగం కోసం వెతికే రోజుల్లో ఇలాగే ఓ శనివారం మధ్యాహ్నం రెండింటికి ఒక 'వాక్-ఇన్ ' ఉందని తెలిసింది. అదే ఊళ్ళో ఉంటున్న నా ఫ్రెండు దినకర్ కు ఫోన్ చేసి - "రేయ్...ఈ శనివారం మధ్యాహ్నం మ్యాట్నీ కి రెండు టికెట్లున్నాయి ..నువ్వు, నీ ఫ్రెండ్స్ ఎవరయినా వెళ్ళండి" అన్నాను...దానికి వాడు "అలాగే రా..థ్యాంక్స్. నేనే నీకు ఫోన్ చేద్దామనుకున్నాను..ఆదివారం పొద్దున ఆటకు, మధ్యాహ్నం ఆటకు నా దగ్గర రెండు టికెట్లున్నాయి....నీ ఫ్రెండ్స్ ఎవరినయిన తీసుకెళ్ళు...ఒకే రోజు రెండు సినిమాలు!" అన్నాడు.

వాడికి ఉద్యోగం వచ్చింది - నాకు రాలేదు..

సరే....మొత్తానికి 'వాక్-ఇన్ ' ఇంటర్వ్యూల సమయంలో ఎలా ప్రవర్తించాలో తెలిసిందిగా..ఇప్పుడు ఏదయినా పెద్ద కంపెనీ నుండి ఇంటర్వ్యూ పిలుపొచ్చింది అనుకోండి.....ఏమీ ఖంగారు పడొద్దు - వేరే ఎవరికో చెయ్యల్సిన కాల్ మీకు చేసుండొచ్చు...అలా కాకుండా నిజంగా మీకు వచ్చిందంటే..బైండింగు చేసిన రెస్యూమే పట్టుకుని వెళ్ళండి.

ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళగానే చెయ్యవలసింది - లోపల ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఎంత మంది ఉన్నారో చూడటం. ముగ్గురో, నలుగురో ఉంటే.."రెస్ట్ రూం కు వెళ్ళొస్తాను " అని చెప్పి వెనక్కు తిరిగి రెస్టు తీసుకోకుండా పరిగెత్తటమే! ఎందుకంటే..ఆ నలుగురిలో ఒక హీరో, ఇద్దరు క్యారెక్టర్ ఆర్టిస్టులున్నా...ఆ నాలుగోవాడు ఖచ్చితంగా విలన్ అయ్యుంటాడు.

అలాకాకుండా లోపల ఇంటర్వ్యూ చేసేవాడు ఒక్కడే ఉంటే ధైర్యంగా లోపలకు వెళ్ళండి...మనం ఎంత ధృడంగా కరచాలనం చేసాము అన్నది మన లోని ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందట..కాబట్టి, ఆ ఇంటర్వ్యూ చేసేవాడు షేక్ హ్యాండు ఇస్తే వాడి చేతిని మాయాబజార్ లో రేలంగి చేతిని యస్వీ రంగారావు నలిపినట్టు నలిపిపారెయ్యండి.

ఆ తరువాత వచ్చే ప్రశ్నలకు కాస్త ఒళ్ళు దగ్గరపెట్టుకుని సమాధానం ఇవ్వాలి...ఈ ఇంటర్వ్యూ ఏ పోస్టుకు అని తెలుసుకుని రండి..ఉదాహరణకు - మీరు 'డాట్ నెట్' మీద పని చెయ్యాల్సిన ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్ళారనుకోండి...అవతలి వాడు ఏమడిగినా 'డాట్ నెట్' గురించే మాట్లాడండి....

ప్ర: మీ గురించి కొంచెం చెప్పండి
జ : మై నేం ఈస్ గౌతం, డాట్ నెట్...నేను ఇంజనీరింగ్ చేసాను, డాట్ నెట్

ప్ర: వాట్ ఆర్ యువర్ స్ట్రెంత్స్?
జ : డాట్ నెట్

ప్ర: వాట్ ఆర్ యువర్ వీక్నెసెస్?
జ : నాట్ డాట్ నెట్

మనకు ఆ ఉద్యోగం దాదాపు వచ్చినట్టే....

కానీ అసలు పరీక్ష ఇప్పుడే...ఇంటర్వ్యూ మొత్తానికీ అత్యంత కీలకమయిన ప్రశ్న ఇప్పుడడుగుతాడు -

ప్ర: జీతం ఎంత కావాలి?
జ : ఏదో సార్...మీ దయ

అలా జవాబిస్తే దెబ్బ తిన్నట్టే...జీతం గురించి నెగోషియేట్ చెసేప్పుడు అగ్రెసివ్ గా ఉండాలి. 'జీతం ఎంత కావాలి ' అని అడగంగానే జేబులోంచి కత్తి తీసి టేబుల్ మీద గుచ్చాలి...ఆ తరువాత కావలంటే 'ఏదో సార్...మీ దయ ' అనొచ్చు....

జీతం కూడా మాట్లాడుకున్నాక...ఇక మనము ఆలోచించవలసింది మన 'బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ' గురించి....మీరు గనక ఫ్లాష్ బ్యాకు లో ఏదయినా మర్డర్లు గట్రా చేసుంటే ఆ విషయాలు బయటపడకుండా బెదిరించవలసిన వాళ్ళను బెదిరించండి....

నేనిచ్చిన ఈ సలహాలన్నీ పాటించాక కూడా మీకు ఉద్యోగం వచ్చిందంటే...మీ ఖర్మ...కంగ్రాట్స్!

రేపటి నుండి రోజూ ఉద్యోగం చెయ్యొచ్చు.....ఇంతవరకు సంతోషంగా గడిచిన మీ జీవితం ఇక సర్వనాశనం అయినట్టే...