Tuesday, March 3, 2009

బాపు, రవి వర్మ, పికాసో, నేను..

(అంధ్రభూమి మాస పత్రిక ఫిబ్రవరి 2009 సంచిక లోని నా 'తోటరామయణం', కొన్ని మార్పులు చేర్పులతో...)


పై నలుగురి జీవితాల్లోనూ కామన్ గా ఉన్న విషయం - బొమ్మలు గీయటం. మొదటి ముగ్గురిదీ ఆ పనిలో అందె వేసిన చెయ్యి అయితే, ఆ నాలుగో వాడు అందులో చెయ్యి పెట్టిన ప్రతిసారీ కాల్చుకున్నాడు..

ఈ రోజు పొద్దున్నే నాకు రెండు ఫోన్లు వచ్చాయి - క్రాంతి విశ్వాస్, రమణ నుంచి.. "ఇవ్వాళ మా ఇంట్లో క్యారెట్ హల్వా..వచ్చెయ్యి " అన్నాడు క్రాంతి. "ఇవ్వాళ మా ఇంట్లో క్యారెట్ల హల్వా చేస్తుంది మా అమ్మ.. వచ్చెయ్యి " అన్నాడు రమణ.. రమణ గాడి వాక్యంలోని బహువచనం నన్ను వాళ్ళింటికి తీసుకెళ్ళింది....

రమణ వాళ్ళింట్లోకి అడుగు పెట్టాను..హాలులో ఎవ్వరూ లేరు. సోఫా లో కూర్చుని టీవీ ఆన్ చేసాను. 'ఆలీబాబా నలభై దొంగలు ' సినిమా వస్తోంది. ఒక గుహ ముందు నుంచుని "ఖుదా కా కసం..హసన్ కా హుకుం..ఖుల్జా ఓ సిసేం" అన్నాడు యన్‌టియార్. ఆ మంత్రం కరెక్టో కాదో దేవుడెరుగు..యన్‌టియార్ అరుపుకు గుహ ద్వారం మాత్రం తెరుచుకుంది. పక్క గది ద్వారం తెరుచుకుని రమణ వాళ్ళ నాన్న వచ్చారు.. "రమణ లేడా అండీ?" అడిగాను.."మార్కెట్టుకెళ్ళాడు బాబూ..వచ్చేస్తాడు..టీవీ చూస్తూ కూర్చో" అని మేడ మీదకు వెళ్ళారు..

ఇంట్లో అడుగు పెట్టగానే కప్పులో క్యారెట్ హల్వా ఇస్తారనుకున్నా. రమణ గాడు ఇప్పుడు మార్కెట్టుకెళ్ళాడంటే..వాడు క్యారెట్లు తీసుకొచ్చి, వాళ్ళమ్మ హల్వా వండి నా చేతికి కప్పు అందేప్పటికి 'ఆలీబాబా నలభై దొంగలు ' నుండి 'ఆలీబాబా అరడజను దొంగలు ' వరకు వచ్చిన తెలుగు సినిమాలన్నీ చూసెయ్యొచ్చు. అమ్మో..అనవసరంగా ఇరుక్కున్నానని టీవీ కట్టేద్దామని రిమోట్ చేతిలోకి తీసుకున్నాను...తప్పు బటన్ నొక్కినట్టున్నాను. ఛానల్ మారింది.. ఇంకో తెలుగు సినిమా వస్తోంది. ఇంటి బయట పడదామని కుడి అడుగులో ఎడమ అడుగు వేసుకుంటూ నడిచాను..ఇంతలో టీవీ లో "గురుదేవా" అని గర్జించారు యన్‌టియార్..మేడ మీద మూడవ క్లాసు పిల్లలకు ట్యూషన్ చెబుతున్న రమణ వాళ్ళ నాన్న పరిగెట్టుకుంటూ వచ్చారు..అరిచింది నేను కాదు, యన్‌టియార్ గారని తెలుసుకుని..."మా వాడు ఇంకా రాలేదా బాబూ.. నేనెళ్ళి చూసొస్తాను. ఈలోపు మేడ మీద ట్యూషన్ పిల్లలను కాస్త చూస్తుంటావా...లేక పోతే ఇల్లు పీకి పందిరేస్తారు " అని చెప్పి వెళ్ళారు..

నేను మేడ మీదకు వెళ్ళేప్పటికి పిల్లలు ఒకళ్ళ జుట్టు ఒకళ్ళు పీకేసుకుంటున్నారు..బలపాలు నీళ్ళలో తడుపుకుని తింటున్నారు..ఇల్లు పీకేసారు - పందిరెయ్యటానికి షామియానా, మామిడాకులు కడుతున్నారు.."నాన్సెన్స్..న్యూసెన్స్...సస్పెన్స్" అన్నాను గట్టిగా. నేను అనదల్చుకుంది "సైలెన్స్" అని గ్రహించిన పిల్లలు నిశ్శబ్దంగా నా వైపు చూసారు. "మీ మాష్టారు ఇంకో పదినిముషాల్లో వస్తారు..నిశ్శబ్దంగా మీ పనులు మీరు చేసుకోండి " అన్నాను. వెంటనే పిల్లలందరూ ఒక వేలు నోటి మీద పెట్టుకుని...ఒకళ్ళ జుట్టు ఒకళ్ళు పీక్కోవటం కొనసాగించారు..

"ఆపండ్రా నాయన..పోనీ మీ మాష్టారు బయటకెళ్ళేముందు మీకు ఏ సబ్జెక్టు చెబుతున్నారో చెప్పండి " అడిగాను...నోటి మీద పెట్టిన వేలు తీయకుండా "డ్రాయింగ్" అన్నారు పిల్లలంతా కలిసి..

'డ్రాయింగ్' అన్న మాట వినగానే - చిన్నప్పుడు కాలుతున్న కొవ్వొత్తి తో ఆడుకునేప్పుడు మొట్టమొదటి సారి నా చేతి మీద మైనం చుక్కలు పడినప్పుడు కలిగిన మంట, నొప్పి కలిగాయి..

వాళ్ళల్లో ఒకడు పెన్సిల్ తీసుకుని నా వైపు స్లోమోషన్ లో వస్తుంటే కత్తితో నన్ను పొడవటానికొస్తున్న శత్రు దేశపు విలన్ లాగ కనిపించాడు. ఆ పెన్సిల్ తీసుకున్నాను కానీ ఏమి చెయ్యలో తోచటం లేదు...పక్కన్నే టేబుల్ మీదున్న ఒక తెలుగు పత్రిక తీసుకుని..కవర్ పేజీ మీదున్న హీరొయిన్ బొమ్మకు మీసాలు గీసి పిల్లలకు చూపించాను. అది చూసి పిల్లలంతా చప్పట్లు కొట్టి, నా చేతిలోని పుస్తకం లాక్కుని అందులో ఫొటోలున్న ప్రతి పేజీ చించి మీసాలు పెట్టటం ప్రారంభించారు..ఈ పిల్లలకు ఇంతకన్నా ఎక్కువ ఙ్ఞానం ఇస్తే బొమ్మలు గీయటం లో నా అఙ్ఞానం బయటపడుతుందని..నేను ఆ గది బయట పడ్డాను.

హీరొయిన్ ఫొటోలకు మీసాలు పెట్టటం, దుమ్ము పట్టిన గాజు కిటికీల మీద నా పేరు రాసుకోవటం లాంటివి చాలా సార్లు చేసాను కాని...బొమ్మలు చక్కగా గీయటం అనేది నాకు చేతకాని పని. చాల రోజులు కష్టపడ్డాను నేర్చుకుందామని...ఆ తరువాత నేను తెలుసున్న విషయం - రాత్రి తరువాత పగలు వస్తుంది, భూమికి ఆకర్షణ శక్తి ఉంది, నేను బొమ్మలు గీయలేను, తమిళ హీరో/దర్శకుడు/రచయిత/నిర్మాత టీ.రాజేందర్ ఒక మనిషి - ఇవి ప్రకృతి సిధ్ధమైన విషయాలు.. వీటిని మార్చాలనుకోవటం మూర్ఖత్వం. (పై వాక్యంలో నేను చెప్పిన నాలుగు విషయాల్లో ఒకటి మాత్రం శుధ్ధ అబధ్ధం..ఏదో కనుక్కోండి చూద్దాం - క్లూ: ఈకింది ఫొటో లో ఉన్నది టీ.రాజేందర్)మా అమ్మ ఒక సైన్సు టీచరు. తన సర్వీసు లో ఎంతో మందికి బొమ్మలు గీయటం నేర్పింది..కానీ నాకు నేర్పలేక పోయింది..బడి లో ఇచ్చిన హోంవర్కు బొమ్మలు కూడా ఎప్పుడూ నేను వేయలేదు. ఐదవ తరగతి వరకు బొమ్మలు గీసిస్తే కానీ అన్నం తిననని గోల చేసి బొమ్మలు గీయించుకునేవాడిని..ఐదవ తరగతి తరువాత బొమ్మలు గీసివ్వకపోతే ఇంట్లో అందరికీ వండిన అన్నమంతా నేనొక్కడే తినేస్తానని బెదిరించి గీయించుకునేవాడిని..అసలు నా అక్షరాభ్యాసం సమయలో "అ", "ఆ" లకు బదులు ఏ బయాలజీ బొమ్మలో నేర్పించుంటే ఏ కష్టాలు ఉండేవి కావు..అ, ఆ లు నేర్చుకోకపొయుంటే యేమయ్యుండేది? మహా అంటే నాకు చదువొచ్చేది కాదు..నేర్చుకోవటం వల్ల నాకు బొమ్మలూ రాలేదు, చదువూ రాలేదు.

అయినా మూత తీయని స్కెచ్ పెన్నుతో నా నుదుటి బొమ్మ గీసాడు బ్రహ్మ దేవుడు..నేను ఎంత ప్రయత్నిస్తే మాత్రం ఏమి లాభం? బొమ్మలు అందంగా గీయగలగటం అనేది అందంగా పుట్టటం లాంటిది - ఎవరో కొంత మందికే లభించే వరం అది!

నేను తొమ్మిదో తరగతిలో ఉండేప్పుడు మా డ్రాయింగు మాష్టారు "మీకు తోచిన బొమ్మలు గీసి చూపించండి " అనేవారు..నేను ప్రతిసారి 'మేఘాల ' బొమ్మ గీసేవాడిని. మేఘలకు ఒక సైజూ, షేపూ ఏడవవు కాబట్టీ నాకు తోచినట్టు గీసి...వాటికి చక్కటి పసుపు రంగు అద్ది...పైన ' నీలి మేఘాలు ' అని టైటిల్ పెట్టి చూపించేవాడిని. దానికి ఆయన ఎన్ని మార్కులిచ్చేవాడనేది ప్రస్తుతానికి అప్రస్తుతం..

నా మేఘాల బొమ్మలు చూసి విసుగెత్తిన మా మాష్టారు ఒక రోజు క్లాసులో అందరికీ స్కేలు, పెన్సిలు ఇచ్చి..వాటిని ఉపయోగించి బొమ్మలు గీయమన్నారు. మిగతా పిల్లలందరూ స్కేలు వాడి గేటు బొమ్మ, డబ్బా బొమ్మ, స్కేలు బొమ్మ..ఇలాంటివి చాలా గీసారు. నేను స్కేలు ఉపయోగించి ఒక ఎర్ర గులాబి బొమ్మ గీసాను.. అది చూసి మా మాష్టారు నా స్కేలు తీసుకుని నా చెయ్యి ఎర్ర గులాబి రంగు వచ్చేంతవరకు కొట్టాడు...

మా క్లాసులో అమ్మాయిలందరూ చాలా చక్కగా గీసేవాళ్ళు బొమ్మలు..నన్ను అమ్మాయిల మధ్యలో కూర్చొపెడితే ఏమయినా గుణం కనపడుతుందేమోనని..అమ్మాయిల వరుసలోని మధ్య బెంచీలో, ఇద్దరు అమ్మయిల మధ్య కూర్చోపెట్టాడు మా మాష్టారు..నాకు బొమ్మలు గీయటం రానందుకు మొట్ట మొదటి సారి ఆనందమేసింది..అందుకు కృతఙ్ఞతగా నూట ఒక్కటి కొబ్బరికాయల బొమ్మలు గీసి బ్రహ్మదేవుడికి సమర్పించుకున్నాను..తను సృష్టించిన లోకంలో కొబ్బరి కాయలు నూటొక్క రకాలు ఉంటాయని అప్పుడే తెలిసొచ్చుంటుంది బ్రహ్మదేవుడికి..

నా జీవితం ఇలా మూడు కొబ్బరికాయలు, ఆరు కొబ్బరిచిప్పలుగా సాగుతుండగా ఒక రోజు మా డ్రాయింగు మాష్టారు శెలవు పెట్టారు. గంట సేపు ఏమి చెయ్యాలో తోచని నా బెంచి అమ్మయిలు నా అరచేతికీ, మోచేతికి, కళ్ళకు, కళ్ళద్దాలకు గోరింటాకు పెట్టారు..ఇది చూసి ఓర్వలేని మగ వెధవలంతా మరుసటి రోజు మా డ్రాయింగు మాష్టారు దగ్గరకు వెళ్ళారు. తమలో ఒక్కరికీ కూడా బొమ్మలు గీయటం రాదని, నన్ను కూర్చోబెట్టినట్టు వాళ్ళను కూడా అమ్మాయిల మధ్యలో కూర్చోబెడితే జన జీవన స్రవంతి లో కలిసిపొతామని అర్జీ పెట్టుకున్నారు...దాని ఫలితంగా నన్ను తిరిగి మగ జంతువుల మధ్యలోకి విసిరేసాడు మా మాష్టారు.

అప్పటి నుండి స్కూలులో, కాలేజీలో ఎన్నో పరీక్షల్లో ప్రశ్నలకు సమధానాలతో పాటూ బొమ్మలు కూడా గీయమనేవారు...నేను వారి కోరికను సున్నితంగా తిరస్కరించాను..కనీ ఇంజనీరింగు లో చేరాక 'ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ ' అనే సబ్జెక్టు రూపం లో వచ్చి విధి నన్ను నడి వీధి లో నిలబెట్టింది..

ఇంజనీరింగు మొదటి సంవత్సరం లో ఉండే 'ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ ' అనే సబ్జెక్టు లో కేవలం బొమ్మలుంటాయి. వింత పరికరాలతో, రకరకాలుగా, నానా రకాల హింసలు పెట్టే సబ్జెక్టు..ఇలా థర్డు డిగ్రీ టార్చరు కు గురయ్యి సాధించే డిగ్రీ నాకంత అవసరమా అని ఆలోచించటం మొదలుపెట్టాను..నాతో సైకిల్ పంక్చర్ షాపు పెట్టిద్దామా, టెలిఫోను బూత్ పెట్టీద్దామా అని మా ఇంట్లో వాళ్ళు ఆలోచించటం మొదలుపెట్టారు..

ఒక మంచి రోజు చూసుకుని మా గ్రాఫిక్స్ ప్రొఫెసర్ థామస్ పింటో దగ్గరకెళ్ళి "ఇలా ఇలా నాకు డ్రాయింగు రాదు సార్, అదీ ఇదీ చేసి మీరు నన్ను పాస్ చేయిస్తే, వాడితోనో వీడితోనో మీ బొమ్మ గీయించి, అప్పుడో ఇప్పుడో ఆ బొమ్మను ఆర్టు మ్యూసియుం లో పెట్టిస్తాను సార్" అని కాళ్ళా వేళ్ళా పడ్డాను..సరేనని నా దగ్గర ఏడొందలు ఫీజు తీసుకుని, పరీక్షలకు నెల రోజులముందు ఉద్యోగం వదిలి వెళ్ళిపోయాడు..నేను గీయించిన థామస్ పింటో గాడి బొమ్మను తీసుకెళ్ళి పోలీసు స్టేషన్ నోటీసు బోర్డు లో పెట్టొచ్చాను..

బ్రహ్మదేవుడు, విధి, థామస్ పింటో నన్ను మోసం చేసినా దినకర్ నాకు తోడుగా ఉంటానని మాటిచ్చాడు..బొమ్మల విషయం లో దినకర్ ది కూడా నా పరిస్థితే. నేను 'మేఘాల ' బొమ్మలు గీసినట్టు వీడు 'గాలి ' బొమ్మలు గీసేవాడంట...గ్రాఫిక్స్ పరీక్షలో నెగ్గుకురావటానికి నేను, దినకర్ ఒక ఉపాయం ఆలోచించాము..నేను ఐదు బొమ్మలు, వాడు ఐదు బొమ్మలు నేర్చుకుంటాము. పరీక్షలో ఎవడు నేర్చుకున్న బొమ్మలు వస్తే వాడే ఇద్దరికీ గీసిపెట్టాలి..ఆ పైన మా అదృష్టం..

పరీక్షలో నేను నేర్చుకున్న 5 బొమ్మలు వచ్చాయి. ముందుగా నా చార్టులో ఐదు బొమ్మలు గీసి, ఇన్విజిలేటరు చూడనప్పుడు నా చార్టు దినకర్ గాడికిచ్చి వాడి ఖాళీ చార్టు తీసుకుని మళ్ళీ బొమ్మలు గీసాను..నా పెన్సిల్ ముక్క విరిగిపొవటం తో దినకర్ గాడికి నా పెన్సిల్ చూపించి సైగ చేసాను..అది చూసిన ఇన్విజిలేటరు నా దగ్గరకు వచ్చి "సిగ్గులేకుండా బొమ్మలు కూడా కాపీ కొడుతున్నావా " అని నేను గీసిన బొమ్మల్లో నాలుగింటిని పెన్ను తో కొట్టేసాడు..

దినకర్ గాడి అదృష్టం చూడండి - లైసెన్సు ఇంట్లో మరచిపోయి, రెజిస్ట్రేషన్ కాగితాలు లేని స్కూటరు మీద ముగ్గురిని ఎక్కించుకుని, హెల్మెట్టు లేకుండా రోడ్డు మీద కుడి వైపు వెళ్ళినా ఎవ్వరూ పట్టించుకోరు..కానీ నాలాంటి వాడు సొంత ఇంటి కాంపౌండు లో సైకిల్ స్టాండు వేస్తున్నా 'నో పార్కింగ్', 'ఎమిషన్ టెస్ట్ ఎక్కడ?' అని 499 రూపాయలు ఫైన్ వేస్తారు...

ఆ ఇన్విజిలేటరు కొట్టెయ్యగా మిగిలిన ఒక్క బొమ్మకు పది మార్కులొచ్చాయి..ఇంజనీరింగు చివరి సంవత్సరం దాకా పోరాడి ఏడాదికి 10 మార్కుల చొప్పున నలభై మార్కులతో చివరి ఏడాది పాసయ్యను గ్రాఫిక్స్ పరీక్ష..

ఆ తరువాత ఇప్పటీదాక బొమ్మల జోలికి వెళ్ళలేదు నేను..ఈ రోజు ఈ పిల్ల థామస్ పింటోల వల్ల నాలో పెరుగన్నం తిని, నిద్రమాత్రలు మింగి నిద్రపోతున్న కళాకారుడిని బయటకు తీసుకురావలసి వచ్చింది..

గేటు చప్పుడైతే కిందకు వెళ్ళాను..రమణ, వాళ్ళ నాన్న వచ్చారు. ఒక చేతిలో విత్తనాల కవరు, ఇంకో చేతిలో చెఱుకు గెడలు పట్టుకొస్తున్న రమణ గాడు నన్ను చూసి "రారా...ఇదిగో ఈ క్యారెట్ విత్తనాలు పెరట్లో నాటి, ఈ చెఱుకు గెడల్లోంచి చక్కెర తీసేసామనుకో - ఊరెళ్ళిన మా అమ్మ తిరిగి రాగానే నిముషాల్లో క్యారెట్ హల్వా రెడీ..అందాకా లోపల కూర్చుందాం రా"..అన్నాడు..నేను లోపలకు అడుగులేస్తుంటే పైనుండి రమణ వాళ్ళ నాన్న అరుపులు వినపడ్డాయి - "నాకు మీసాలు గీయటమేంట్రా?? ఎవడు నేర్పాడు మీకిది???"....అని

ఇక్కడే ఉందామా, ఇంటికి వెళ్ళిపోదామా అని తేల్చుకోలేక టాసు వేద్దామని నా జేబులోంచి రూపాయ బిళ్ళ తీసాను..'బొమ్మ పడితే వెళ్ళిపోదాము..బొరుసు పడితే ఇక్కడే ఉందాము ' అని మనసులో అనుకుని రూపాయి బిళ్ళ పైకి విసిరాను...ఆ బిళ్ళకు రెండు వైపులా బొమ్మే ఉన్నా కూడా...బొరుసే పడింది! అంతటి శతౄత్వం - నాకూ ' బొమ్మ ' కు..

నేను ఇదివరకే అన్నట్టు..

'బొమ్మలు అందంగా గీయగలగటం అనేది అందంగా పుట్టటం లాంటిది'..

కాబట్టీ, బొమ్మలు బాగా గీయగలిగే అబ్బాయిలూ - మీరు సినిమాల్లో ప్రయత్నించుకోవచ్చు..

బొమ్మలు బాగా గీయగలిగే అమ్మయిలూ - హి హి హి...నాకింకా పెళ్ళి కాలేదు..నాకు ఈ-మెయిలో, ఫోనో చేస్తే.................

(ఎలాగూ నాలోని కళాకారుడు నిద్రలేచాడు....అందుకే ఈ చిన్ని కళ -

ప్రకృతి - పురుషుడు : Exotic art form by Siddhartha Goutham

note: ప్రకృతి = కొబ్బరి చెట్టు+సెలయేరు+గుడిసె+ఆకాశం)