Thursday, August 20, 2009

మగ పిల్లాడు - పిల్ల మగాడు

అనగనగా ఒక సంవత్సరం...19__. అప్పుడు నా వయస్సు __.

నేను మా అమ్మ కడుపులో ఉండగా ఆడపిల్ల పుట్టాలని కోరుకున్నారట మా ఇంట్ళో అందరూ. నేను పుట్టాక..అబ్బాయి పుట్టాడని తెలిసి.. తమ మనోభావాలను గాయపరచినందుకు నా మీద కేసు వేసారు మా వాళ్ళు. సరే జరిగిందేదో జరిగిపోయిందని...తన ముచ్చట తీర్చుకోవటానికి రెండేళ్ళ పాటు నన్ను ఒక అమ్మాయిలా పెంచిదట మా అమ్మ..నాకు గుండు గీయించిన మరుసటి రోజునుంచే విగ్గు పెట్టి జడలు వేసేదిట..

జీవితమంటే 'రోజంతా పడుకుని సీలింగు ఫ్యాను చూస్తూ ఉండటం' అని అనుకునే ఆ వయస్సులో ఇలా అమ్మాయిలా పెంచబడటం వల్లనో ఏమో..నన్ను ఎవరైనా 'నీ వయస్సెంతా?' అని అడిగితే 'నీ జీతమెంత?' అని అడుగుతాను. అవతలి వాళ్ళు తమ జీతమెంతో చెప్పగానే నా జీతం కూడా చెప్పి చేతులు దులుపుకుంటానే తప్ప..నా వయస్సు మాత్రం చెప్పను....అందుకే మళ్ళీ మొదటి లైనుకు వెళ్దాం..

అనగనగా ఒక సంవత్సరం...19__. అప్పుడు నా వయస్సు __.

అంతవరకు మా ఊరు దాటి ఎప్పుడూ వెళ్ళలేదు నేను. ఆ ఏడాది మా మావయ్య పెళ్ళికని హైదరబాదు తీసుకెళ్ళారు మా ఇంట్లో వాళ్ళు. పెళ్ళి మండపం చేరగానే నా హైటు పిల్లలున్న గుంపులోకి నన్ను తోసేసి వెళ్ళిపోయారు.

అందరూ సిటీ పిల్లలే..అందరూ ప్యాంట్లు వేసుకుని ఉన్నారు..నేను మాత్రమే నిక్కరు వెసుకుని ఉన్నాను..అది కూడా మా అమ్మ తన కాటన్ చీరలతో పాటూ గంజి పెట్టించిన నిక్కరు. అందుకేనేమో నన్ను ఎవ్వరూ పలకరించట్లేదు..నేను మా వీధిలో గోలీల ఆటలో మూడు Grand Slam లు గెలిచానని తెలిస్తేనైనా నాతో మాట్లాడతారేమోనని జేబులోంచి మూడు గోలీలు తీసి గాలిలోకి ఎగరేసాను..ఆ ప్రయత్నం కూడా గాలిలో కలిసిపోయింది.....

ఆ అవమానాన్ని భరించలేకపోయాను..మోకాళ్ళు కనిపించేలా నిక్కరేసుకుని ఉండటమే ఇందుకు కారణమని గ్రహించాను..సైలెంటైపోయాను..

మరుసటి రోజు మా ఊరు తిరిగెళ్ళి...మా స్కూలుకు వెళ్ళేదాక ఏమీ మాట్లాడలేదు నేను..స్కూలు లో భోజనాల సమయంలో గణేష్, సుధాకర్ లతో నాకు హైదరబాదు లో జరిగిన అవమానం గురించి చెప్పాను..

"గాంధీ గారిని సౌత్ ఆఫ్రికా లో ట్రైను నుంచి బయటకు తోసేస్తే ఆయన ఏమి చేసారో తెలుసా?" అన్నాను..

"తెలియదు..కానీ నన్ను ఎవరైన అలా తోసేస్తే..ఆ ట్రైను టైర్లన్నిటికీ గాలి తీసేసేంతవరకు ఆ స్టేషన్ నుండి కదలను." అన్నాడు సుధాకర్ గాడు..

"ఏడ్చావు...ఆ అవమానం జరిగాక ఆయన మన దేశానికి తిరిగొచ్చి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు. నిన్న నాకు జరిగిన అవమానం కూడా అలాంటిదే..అందుకనే నేను కూడా ఒక మగాడిగా నా స్వాతంత్ర్యం కోసం పోరాడదలచుకున్నాను..ఇక నుంచి మనము మగ పిల్లలం కాదు..పిల్ల మగాళ్ళం...(టైటిల్ జస్టిఫికేషన్)

వెంటనే ఒక అజెండా తయారు చేసుకున్నాము..

- ఇక పై ప్యాంట్లు మాత్రమే వేసుకోవాలి
- జేబులో ఎప్పుడూ డబ్బులుండాలి

అనుకున్న వెంటనే ఇవి అమలు పర్చాలని...మా నాన్న పని చేసే స్కూలుకు వెళ్ళాను నేను, నా స్నేహితులిద్దరినీ తోడు తీసుకుని..మేము వెళ్ళే సమయానికి మా నాన్న లెక్కల పాఠం చెబుతున్నాడు. నేను నేరుగా క్లాసులోకి వెళ్ళి "నాన్నా..నేను ప్యాంటు కుట్టించుకోవాలి..నాకు డబ్బివ్వు " అనరిచాను..నా ధైర్యం చూసి ముందు బెంచీ లోని అమ్మాయిలు ముక్కు మీద వేలేసుకున్నారు (ఆశ్చర్యమేసి కాదు..ముక్కు మీద దురదగా ఉంటే గోక్కోవటానికి)..మా నాన్న నా మాటలేవీ పట్టించుకోకుండా ఒకమ్మాయిని లేపి "(a+b) ని (a-b) తో గుణిస్తే ఏమొస్తుంది?" అనడిగాడు..ఆ అమ్మాయి "సల్ఫ్యూరిక్ యాసిడ్" అంది..మా నాన్నకు విపరీతమైన కోపమొచ్చింది..వెంటనే నన్ను, గణేష్ గాడిని, సుధాకర్ గాడిని గోడ కుర్చీ వేయమన్నాడు..

ముగ్గురూ పక్కపక్కన గోడకుర్చీ వేయగానే మా కాళ్ళ మీద ఒక గుడ్డ కప్పి 'గోడ సోఫా' చేసాడు మా నాన్న..క్లాసులోని అమ్మయిలంతా గ్రూప్ సాంగ్ పాడినట్టు నవ్వారు..మా వాళ్ళు నా వైపు చిరాకు గా చూసారు..మా స్కూలు లో మేము తీసే గుంజిళ్ళు, తినే తన్నులు చాలవన్నట్టు వీళ్ళ స్కూలుకొచ్చి గోడ కుర్చీ వెయ్యాలా?? ఒక గుంటూరు వాస్తవ్యుడు గోంగూర కోసం బెంగళూరొచ్చినట్టుంది ఇది..

ఈ సంఘటన తరువాత ' మా నాన్న '..' మా బాబు ' గా మారిపోయాడు...అప్పటి నుండి మా ఇద్దరి మధ్యా పచ్చ గడ్డి వేస్తే Nuclear Fusion జరిగేది. అందుకే ఇక మాటలతో ఈ సమస్య తెగదని..ఒక ఉత్తరం రాద్దామని నిర్ణయించుకున్నాను..మాంచి వింటేజ్ ఫీల్ ఉంటుందని పోస్ట్ ఆఫీసుకెళ్ళి తాళపత్రాలు కొని రాసాను..మొన్నీమధ్య జరిగిన పురావస్తు శాఖ త్రవ్వకాల్లో ఆ తాళపత్రాలు బయటపడ్డాయి..నేను రాసిన ఉత్తరం ఇదిగో -మరుసటి రోజు ఆదివారం. హృదయం లేని మా బాబు 'ఆదిత్య హృదయం' చదువుతున్నాడు పొద్దున్నే.. టీవీ లో 'మహాభారత్ ' వస్తోంది..సరిగ్గా రాహుకాలం మొదలవ్వగానే నా తాళపత్రోత్తరం తెచ్చిచ్చాడు ఒక వేగు గుర్రం మీద..ఆ ఉత్తరం చదవగానే "జానకీ!!!" అని గట్టిగా అరిచాడు మా బాబు. 'జానకి!!!' అనే పేరుతో మా ఇంట్లో ఎవ్వరూ లేకపోవటం వల్ల ఎవ్వరూ పలకలేదు..ఈ సారి మా అమ్మను పిలిచాడు..మా అమ్మ టీవీ ముందు నుంచి లేచి పరుగు పరుగున వచ్చింది..ఉత్తరం చూపించాడు..మా అమ్మ "కింతూ..పరంతూ" అని ఏదో చెబుతున్నా వినిపించుకోకుండా తాండవం మొదలెట్టాదు మా బాబు....అసలు విషయమేంటంటే - చిన్నప్పుడు ఆయన్ని అందరూ 'బాబు ' అని పిలిచేవారట..నేను ఉత్తరం లో 'అమ్మ, బాబు లకు' అని రాసాను కదా.."నన్నే పేరు పెట్టి పిలుస్తాడా పిల్ల కుంక" అని అరుస్తున్నాడు..ఇప్పుడు నేను దొరికానంటే డ్యాన్సు ఆపి ఫైటింగ్ మొదలెడతాడని..రహస్య మార్గం ద్వారా వంటింట్లోకి పారిపోయాను నేను..

అక్కడ మా అమ్మమ్మ రోట్లో అల్లం పచ్చడి రుబ్బుతోంది..నేనెళ్ళి క్వీన్ విక్టోరియా పక్కన కూర్చుని.."సుధాకర్ వాళ్ళ నాన్న వాడి పుట్టిన రోజుకు ప్యాంటు కుట్టించాడు తెలుసా? నేను ఎన్నాళ్ళిలా ఉత్తరాలు రాసి రోలు పక్కన కూర్చోవాలి?" అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాను..

"ఇంత చిన్న విషయానికి ఎందుకురా ఏడుస్తావు? ఈ సారి మళ్ళీ సుధాకర్ పుట్టిన రోజుకు వాడికి కూడా నిక్కరు కుట్టించమని చెబుదాములే వాళ్ళ నాన్నతో...ఏదీ..ఆ అను" అని రోట్లోంచి ఒక వేలుతో అల్లం పచ్చడి తీసి నా నాలుకకు రాసింది........ఆహా...అమోఘంగా ఉంది..ఆ రుచి నాలుక నుంచి నేరుగా నా బుర్రలోకి ప్రవేశించి నా కోపాన్నంతా ముక్కలు ముక్కలు చేసేసింది..నాకు తెలియకుండా నవ్వు ఎక్స్ప్రెషన్ నా మొహం మీద అలా వచ్చేసింది...

మా అమ్మమ్మ అల్లం పచ్చడి చేసినప్పుడల్లా తన పుట్టింటి నుంచి తెచ్చుకున్న అమృతం సీసలోంచి రెండు చుక్కలు వేస్తుంది..ఆ పచ్చడి నాలుకకు తగలగానే రెండు రోజులు అలా గాలిలో నిక్కరేసుకుని తేలిపోవాల్సిందే....మా పూర్వీకుడొకాయన అమృత మథనం టైం లో అక్కడే ఉన్నాడుట..పెట్రోలు కోసమని ఒక లీటర్ వాటర్ బాటిల్ పట్టుకుని బయలుదేరిన మా పూర్వీకుడు ఆ ముచ్చటంతా చూద్దామని అక్కడే ఆగిపోయాడట..అమృతం వచ్చాక ఎవరో లేడీ ...దేవతలను, రాక్షసులను కూర్చోబెట్టి "నీక్కావలసింది...నా దగ్గర ఉంది" అని పాడుతూ అమృతం పంచిపెట్టిందట..(ఇదే పాటను మన తెలుగు సినిమావాళ్ళు రైట్స్ తీసుకోకుండా వాడుకున్నారు)...ఒక దేవుడి దగ్గర బ్లాకు లో ఒక లీటర్ అమృతం కొన్నాడు మా పూర్వీకుడు..అది అలా తర తరాలుగ వస్తోంది మా ఇంట్లో........ఇంతకీ ఏమి చెబుతున్నాను?? ఆ...అల్లం పచ్చడి...అది నాలుకకు తగలగానే నేను అన్నీ మరచి పోయాను...

ఓ రెండు రోజులు ఏమీ చేయలేదు..అంటే మూడో రోజు ఏదో చెసానని కాదు..మూడో రోజూ బేవార్సే...నాలుగో రోజు - నేను వరండాలో కూర్చుని వీధిలో వచ్చీ పోయే వాళ్ళ ప్యాంట్లు చూస్తూ ఉన్నాను..మా అన్నయ్య ఇంట్లోంచి హడావిడిగా వచ్చి తన జేబులోని బాల్ పెన్ తీసి మా కాంపౌండు బయట పారేసాడు..ఐదు నిముషాల తరువాత మా అమ్మ వచ్చి కాఫీ ఇచ్చింది మా అన్నయ్య కి..మా వాడు ఎడమ చేత్తో కాఫీ అందుకుని, కుడి చేయి చాచి - "అమ్మా..నా బాల్ పెన్ ఎక్కడో పారేసుకున్నానమ్మా...శ్రధ్ధగా చదువుకుందామంటే పెన్ను లేదు " అన్నాడు....చలన చిత్ర పరిశ్రమ ఎంత మంచి నటుణ్ణి మిస్ అవుతోందో నాకు చూపిస్తూ...

మా అమ్మ వెంటనే వాడి చేతికి ఒక పెద్ద నోటిచ్చి "ఇంక్ పెన్ కొనుక్కోరా..మిగిలిన డబ్బు దాచుకో" అని లోపలికెళ్ళింది..ఈ సన్నివేశాన్నంతా ప్రేక్షకుడి లాగా చూస్తున్న నా వైపు మా అన్నయ్య చూసి "ఉహుహహహహ" అని కళ్ళతో నవ్వి కాఫీ తాగటం మొదలెట్టాడు..

నా తక్షణ కర్తవ్యమేంటో నాకు గోచరించింది..వెంటనే నా వార్డ్ రోబ్ (మా అమ్మమ్మ పెట్టె) లోంచి నా నిక్కరు ఒకటి తీసి...బ్లేడుతో ఎడా పెడా కోసేసాను..ఆ చిరిగిన నిక్కరు తీసుకుని మా అమ్మ దగ్గరకు వెళ్ళాను..ఒక గ్లాసు తో పాలిచ్చింది..

"పాలు తాగటానికి నేనింకా చిన్న పిల్లడిని అనుకుంటున్నావా? నాకు కాఫీ కావాలి " అని అరిచాను..అప్పుడే గదిలోకొచ్చిన మా అన్నయ్య తన గ్లాసు లో మిగిలిన కాఫీ నా నోట్లో పోసాడు..కాకరకాయ, కుంకుడు కాయ, శీకాయ కలిపి నాలుక మీద పడ్డట్టయ్యింది..కళ్ళు చేదుగా మూసాను..

"మొదటి కాఫీ అలానే ఉంటుంది రా" అన్నాడు మా అన్నయ్య...మొదటి కాఫీ ఇలా ఇంత చేదుగా ఉంటుందని తెలిస్తే..మొదలెట్టటమే రెండో కాఫీ తో మొదలెట్టేవాడిని......ఇవన్నీ తరువాత...వచ్చిన పని ముఖ్యం - "అమ్మా...నా నిక్కరు చిరిగిపోయిందమ్మా...శ్రధ్ధగా చదువుకుందామంటే......." నా డైలాగు పూర్తవ్వకుండానే మా అమ్మ మా అన్నయ్య చేతికి నా నిక్కరు, ఐదు రూపాయలిచ్చి ఇచ్చి - "ఇది కుట్టించుకురా" అని పంపింది...మా వాడు ఆ ఐదు రూపయలలో నాలుగున్నర పెట్టి సినిమా చూసొచ్చి, మిగిలిన అర్ధ రూపాయితో ఒక సైకిల్ షాపు వాడి దగ్గర నా నిక్కరుకు ప్యాచ్ లు వేయించుకొచ్చాడు ..

అలా తెల్ల నిక్కరుకు నల్ల సైకిల్ ట్యూబుల అలంకరణలతో నేను కాలం సాగదీస్తున్నప్పుడు ఒక రోజు -

మా పక్క కాంపౌండులో ఉన్న నీలిమ జామెట్రీ బాక్సు కావాలని నా దగ్గరకు వచ్చింది..' శృతిలయలు ' సినిమాలో సుమలత గొంతు అంత అందంగా ఉంటుంది నీలిమ.

ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది..

వెంటనే ఇంటికి పరిగెట్టాను..అక్కడ సైకిల్ తుడుచుకుంటూ కనబడ్డాడు మా అన్నయ్య..

"రేయ్...నాకు డబ్బు కావాలి " అన్నాను..

మా అన్నయ్య పైకి లేచి "సేం పించ్" అని గట్టిగా గిచ్చాడు..

"అబ్బా..అలా గిచ్చావేంట్రా."

"లేకపోత ఏంట్రా...డబ్బు ఎవరికి వద్దు చెప్పు..ఇంతకీ నీకు డబ్బు ఎంత కావాలి? ఎందుకు కావాలి?" అనడిగాడు..

"నాకు 10 రూపాయలు కావాలి రా..నేను నీలిమ ను బాల్య వివాహం చేసుకుందామనుకుంటున్నాను..మనము 10 రూపాయలు కన్యాశుల్కం ఇచ్చి వరకట్నం గా 200 రూపాయలు అడుగుదాము..అందులో సగం నాకు...ఆ మిగతా 160 రూపాయలతో నీవు మాంచి ఇల్లు కట్టుకో" అన్నాను మా అన్నయ్య భుజం తడుతూ..

"10 రూపాయల్దేముంది రా...కుక్కను తంతే రాల్తాయి..నువ్వు ముందెళ్ళి అమ్మ, నాన్న ఆశీర్వాదం తీసుకో..ఆ తరువాత కుక్కల కోసం ఇద్దరూ రోడ్డు మీదకు వెడదాం.." అన్నాడు..

నేను ఇంట్లోకి వెళ్ళాను...హాలు లో మా బాబు, అమ్మ, అమ్మమ్మ ఉన్నారు…"నేను నీలిమను బాల్య వివాహం చేసుకోవాలనుకుంటున్నను " అని నా నిర్ణయాన్ని చెప్పాను..

కెమేరా మా అమ్మమ్మ వైపు తిరిగింది...తరువాత మా మ్మ వైపు...తరువాత మా బాబు వైపు.....ఆ తరువాత లాంగ్ షాట్..

ఇక్కడ నాకు తెలియని విషయమేంటంటే...ఆ ముందు రోజు మా బాబు లెక్కల క్లాసు అవ్వగానే వాళ్ళ హెడ్మాష్టరు మా బాబుకు చిన్న క్లాసు తీసుకున్నాడట....కోపంతో ఫస్టు క్లాసు మూడ్ లో ఉన్నాడు మా బాబు..నా బాల్యవివాహపు వార్త వినగానే ఏమీ మాట్లాడకుండా పైకి లేచి..తలుపుకు తగిలించిన తన ప్యాంటు జేబులోంచి ఒక ఫొటో తీసాడు..అది వాళ్ళ హెడ్మాష్టరు ఫొటో..దాన్ని నా వీపుకు అతికించాడు..ఆ తరువాత "బాల్య వివాహం కావాలి రా నీకు??" అని నా బాల్య వీపును చితగ్గొట్టాడు..

ఏడుస్తూ ఇంట్లోంచి బయటకొస్తున్న నన్ను చూసి మా అన్నయ్య మనసు కరిగింది..నా భుజం మీద చెయ్యి వేసి...నాకు జ్ఞాన బోధ చెయ్యటానికి మా పెరట్లోకి తీసుకెళ్ళాడు..అక్కడ బోధి వృక్షాలేవీ లేకపోవటం తో ఇద్దరూ మా గులాబి మొక్క కొమ్మలెక్కి కూర్చున్నాము..

"ఇప్పుడు చెప్పరా..నీ సమస్యేంటసలు?" అడిగాడు

"ఏమని చెప్పుకోను రా...'ఇంట్లో అందరికన్నా చిన్నవాడు..కొరింది ఇస్తారు ' అని నా గురించి పబ్లిక్ టాక్..కాని నేను పడే కష్టం ఆ పబ్లిక్ టాక్ కు తెలియదు..ఇంతవయసొచ్చినా నన్నింకా మరీ చిన్న పిల్లాడిలా చూస్తున్నారు..హైదరాబాదు లో నా వయసు పిల్లలంతా పెద్దవాళ్ళైపొయారు...ప్యాంట్లు, డబ్బు...ఏది కావాలంటే అది ఉంది వాళ్ళ దగ్గర..మన బాబేమో డబ్బూ ఇవ్వడూ..ప్యాంట్లూ కుట్టించడు నాకు..ఈ నిక్కరు చూడరా..నీకు నా మీద జాలి కలగట్లేదా?? నీ ప్యాంటు మీద ఒట్టేసి చెప్పు..." అని దీనంగా అడిగాను..

వెంటనే మా అన్నయ్య నా నిక్కరు జేబు చించి...దానిని జేబు రుమాలు లా వాడి నా కన్నీళ్ళు తుడిచాడు...నా చొక్క జేబులో ఉన్న ఉసిరికాయలు తీసి నా నోట్లొ ఒకటి వేసి...తన నోట్లొ ఒకటేసుకున్నాడు..

"థ్యాంక్స్ రా" అన్నాను..

"చూసావా..నీ జేబులోంచి ఉసిరికాయ తీసి నీకిస్తే థ్యాంక్స్ చెప్పావు..నిన్ను వెధవను చేస్తున్నా గుర్తించలేని వెధవ్వి నువ్వు..అందుకే నిన్ను చిన్న పిల్లడిలా చూసేది..సరే..నువ్వు కూడా నాన్నని ' బాబు ' అనే స్టేజ్ కు చేరుకున్నావు కాబట్టీ..నీకు కొన్ని జీవిత రహస్యాలు చెబుతాను. నిన్ను ఇంట్లో వాళ్ళు పెద్దవాడిగా గుర్తించాలంటే నువ్వు నిక్కర్లు కోసుకోవటం...బాల్య వివాహం చేసుకోవటం లాంటి విపరీత చర్యలు చేయనవసరం లేదు రా..నీ డబ్బు నువ్వు సంపాదించుకో" అన్నాడు..

"అంటే బాల కార్మికుడిని అవ్వమంటావా?"

"మూర్ఖా..సంపాదించుకోమంటే - అమ్మ పర్సులోంచి, నాన్న జేబులోంచి సంపాదించుకోమని.."

నా తల వెనకాల జ్ఞాన జ్యోతి వెలిగింది (సాయంత్రమయ్యిందని మా అమ్మ పెరట్లో లైటు వేసింది)..

"ఐతే వెంటనే వెళ్ళి మన బాబు జేబు బూజు దులిపొచ్చేస్తా" అని కొమ్మ దిగాను..

"ఆ తొందరే వద్దనేది..దొంగతనం చెయ్యటమనేది ఈత కొట్టటం లాంటిది" అన్నాడు..

"అంటే ఒక్క సారి నేర్చుకుంటే ఇక ఎప్పటికీ మరచిపోము అనా"

"కాదు...సరిగ్గా నేర్చుకోకుండా దూకితే మునిగి పోతావని"..అని ఒక గొప్ప దొంగ సూత్రం నేర్పాడు నాకు..

మళ్ళీ మా అన్నయ్యే మాట్లాడుతూ - "నువ్వు fresher దొంగవి...కాని నాకు చాలా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు టీం లీడ్ ను నేను. కాబట్టీ..నువ్వు నాకు చంచాగిరి చేసావనుకో..నువ్వు పని సరిగ్గా వెలగబెట్టకపోయినా...నీకు ప్రమోషన్ వస్తుంది.." అన్నాడు..

ఆ వయసులో మా అన్నయ్య అన్న మాటలు నాకు అర్థమవ్వలేదు కాని, ఉద్యోగం చెయ్యటం మొదలెట్టాక బాగా అర్థమయ్యాయి...

ఆ తరువాత నా చేతికి ఒక పుస్తకమిచ్చాడు మా అన్నయ్య "ఇదిగో.. 'Rapidex దొంగల కోర్స్ '..దగ్గరుంచుకో..ఒక్క విషయం గుర్తుంచుకో..డబ్బు కొట్టేయాలనుకుంటే నెలలోని మొదటి ఐదు రోజుల్లోనే కొట్టెయ్యి..నెలాఖరు లో ఐతే జేబు లో ఉన్న అర్ధ రూపాయి కూడా అరక్షణానికొకసారి తడిమి చూసుకుంటాడు మన బాబు..ఈ మధ్య ఫింగర్ ప్రింటు గుర్తించే పౌడరు కూడ జేబులో చల్లుకుని తిరుగుతున్నాడు..ఎవరయినా చేతులు పెడితే పట్టుకోవాలని...జాగ్రత్త గా ఉండు. అన్నట్టు అసలు మాట - మొదటి సారే మన ఇంట్లో ప్రయత్నించకు..నీ స్నేహితులతో చేతులు కలిపి వాళ్ళ బాబులను దోచెయ్యి..బాగా అలవాటయ్యాక ఇంట్లో ప్రయత్నించు.." అని నన్ను ఆశీర్వదించి...గాలి లోంచి వీభూది పుట్టించి నా నోట్లో వేసాడు..ఆ తరువాత గొంతు లోంచి ఏదో తీస్తున్నట్టు చాల ఓవరాక్షన్ చేసి..నోట్లోంచి ఉసిరికాయ తీసిచ్చాడు...

నేను వెంటనే సుధాకర్ గాడి దగ్గరకెళ్ళి ..వాళ్ళ నాన్న జేబులో డబ్బు కొట్టేస్తే వెంటనే పెద్దవాళ్ళైపోవచ్చని చెప్పాను వాడితో..వాడు పంచాంగం చూసి మంచి ముహూర్తం నిర్ణయించాడు.ముహుర్తూం నాడు నెను సుధాకర్ ఇంటికి వెళ్ళాను..

"మనమయితే సరిగ్గా చేయగలుగుతామో లేదో నని ఒక consultant ని పిలిపించాను రా..ఇహనో ఇప్పుడో వచ్చేస్తాడు."

"కన్సల్టెంటా? ఎవర్రా?" అడిగాను..

"ఒక తమిళబ్బాయి..పుట్టి పెరిగిందంతా ఇక్కడేలే..దినకరన్ అని.."

"ఎన్నింటికొస్తాడేంటి?"

"వచ్చేస్తాడు రా..సాక్సులు ఇస్త్రీ చేయించుకొస్తానని వెళ్ళాడు.."

పది నిముషాల తరువాత చెప్పులేసుకొచ్చాడు దినకరన్..

ముగ్గురం కలిసి సుధాకర్ వాళ్ళ నాన్న గది వైపు వెళ్ళాము..ఆయన నిద్రపోతున్నారు..

నేనూ, సుధాకర్ తలుపు దగ్గరే నుంచున్నాము..దినకరన్ మెల్లిగా నడుస్తున్నాడు..ఎందుకో ఒక్క క్షణం ఆగాడు..ఆగినోడు ఊరికే ఉండక సుధాకర్ వాళ్ళ నాన్న భుజం తడుతూ "సార్...సార్ మిమ్మల్నే" అన్నాడు మెల్లిగా..అది చూసిన సుధాకర్ శబ్దం రాకుండా గట్టిగా అరిచాడు..అది విన్న దినకరన్ అరవకుండా శబ్దం చేసాడు..మెమిద్దరం గదిలోకెళ్ళి దినకరన్ ను బయటకు లాక్కొచ్చాము..

"మా నాన్నను నిద్ర లేపుతావే? నీకేమైనా పిచ్చా?" అడిగాడు సుధాకర్..

"అది కాదు..డబ్బు ఏ చొక్కా జేబులో పెట్టాడో అడుగుదామని...అంతే..అడిగాక మళ్ళీ పడుకోమని చెబుతా" అన్నాడు కన్సల్టెంట్..

నేను రంగం లోకి దిగాను.."చూడు దినకరన్..ఇప్పుడు నువ్వు చేయబోయేది పులి తోక లాగటం లాంటిది...." అని ఇంకా ఏదో చెప్పబోతుండగా సుధాకర్ గాడు "రేయ్...నువ్వు అలాంటివన్నీ అనకు..ఇప్పుడు వీడెళ్ళి మా నాన్న లుంగీ లాగినా లాగుతాడు.....చూడు దినకరన్..ఇప్పుడు నువ్వు చేయబోయేది చాల అపాయం తో కూడిన పని..కాబట్టీ ఏ పొరబాటు చెయ్యకు.." అని చెప్పి పంపాడు..

ఈ సారి లోపలేమి జరుగుతోందో చూసే ధైర్యం లేక చార్లెస్ శోభరాజ్ మీద భారమేసి నేను, సుధాకర్ బయటే ఉన్నాను..కాస్సెపయ్యాక మెల్లిగా తలుపు తెరిచి తల బయటపెట్టాడు దినకరన్..

"జేబులో ఉన్నడబ్బంతా తీసాను...ఓకేనా?" అడిగాడు దినకరన్..

సుధాకర్ గాడు ఖంగారు గా "వొద్దొద్దు..మళ్ళీ మా నాన్నకు అనుమానమొచ్చేస్తుంది..అందులో సగం తిరిగి లోపల పెట్టెయ్యి" అన్నాడు..

ఇంకొక కాస్సేపు తరువాత బయటకొచ్చాడు దినకరన్...నుదుటి మీద పట్టిన చమట చూపుడు వేలుతో తీసి గాల్లోకి విసిరాడు..

"డబ్బేది?" అడిగాము నేను, సుధాకర్ ఆత్రంగా..

తన జేబులోంచి సగం చిరిగిన యాభై రూపాయల నోటు తీసాడు దినకరన్..

"ఇదేంటి?" అని అడగలేదు నేను, సుధాకర్..

"జేబులో ఒక్క యాభై రూపాయల నోటు మాత్రమే ఉంది" అని జవాబివ్వ లేదు దినకరన్..

ఎందుకంటే మేము మాట్లాడేలోపే "ఎవర్రా అది?" అని లోపలి నుంచి సుధాకర్ వాళ్ళ నన్న గొంతు వినబడింది..

"ఎవర్రా నా లుంగీ లాగింది?" అని అరిచాడు ఆయన..

నేను, సుధాకర్ గాడు ఒకేసారి "దినక....రన్" అని అరిచాము..

అక్కడ మొదలెట్టిన రన్నింగ్ ఆ దినకరన్ ను ఊరి బయటకు తరిమేదాక ఆపలేదు...

నాలో రోజురోజుకి అసహనం పెరిగిపోయింది..డబ్బెలా సంపాదించాలో పాలు పోలేదు. అందుకే నేరుగా మా అన్నయ్య డబ్బు దాచుకునే వాడి సైన్సు టెక్స్టు పుస్తకం లోంచి 23 రూపాయలు కొట్టేసాను..డబ్బు తీసేప్పుడు ఏదో పౌడర్ తగిలింది చేతికి..అది దులుపుకుని, 23 రూపాయలతో దుమ్ము దులిపేసాను..మరుసటి రోజు ఫొరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు చేతిలో పట్టుకునొచ్చాడు మా అన్నయ్య..

"గురు ద్రోహి..నాకే పంగ నామం పెడతావు రా? ఇదే నా శాపం - ఇప్పుడే కాదు..నీకు ఎన్నేళ్ళొచ్చినా నిన్ను పిల్ల వెధవ లాగే చూస్తారు జనం" అని అన్నాడు..గడియారం గంట మోగింది...టైం కరెక్టుగా అసురసంధ్యవేళ అయ్యింది..ఆకాశం లో రౌండ్సుకు తయారౌతున్న తథాస్తు దేవతలు మా అన్నయ్య మాట వినగానే "తథాస్తు...టేక్ ఇట్ ఈసీ" అన్నారు..

అంతే..

నాకిప్పుడు __ ఏళ్ళు..హైటు పెరిగినా, ప్యాంట్లు వేసుకుంటున్నా, డబ్బు సంపాదిస్తున్నా కూడా నన్ను ఒక పెద్ద వాడిగా గుర్తించే దిక్కేలేదు..

మొన్న ఆదివారం ఎవరో వచ్చారు ఇంటికి. నేనెళ్ళి "ఏంటి?" అనడిగాను..

"ఇంట్లో పెద్దవాళ్ళనెవరినైనా పిలు బాబు" అన్నాడు..నాకు గంపెడు కోపమొచ్చింది..

"నీ కళ్ళకి నేను పెద్దవాడిలాగా కనిపించట్లేదేంట్రా...మా ఇంటికే కాదు, మా ఇంటి పక్కనున్న ఖాళీ స్థలానికి కూడా నేనే పెద్ద మనిషిని.." అని అంటుండగా మా అమ్మమ్మ నన్ను పక్కకు లాగి...ఆ వచ్చిన వాడికి నాలుగు చెక్కులిచ్చింది..వాడు ఆ చెక్కులు చూసి, అందులో ఒకటి తిరిగిస్తూ "ఇందులో సంతకం పెట్టలేదమ్మా" అన్నాడు..మా అమ్మమ్మ నా జేబులోంచి పెన్ను తీసుకుని 'D.S.Goutham' అని సంతకం చేసిచ్చింది...

"నా చెక్కులు నువ్విస్తావేంటి?" అన్నాను కోపంగా..దానికి మా అమ్మమ్మ "పోనీ కాస్సేపు మా వాడికి ఆ చెక్కులు ఇవ్వు నాయన..చెక్కాట ఆడుకుని ఇచ్చేస్తాడు" అంది..

"చెక్కాటేంటి? నీ మీద ఫోర్జరీ కేసు పెడతాను..నేనంటే ఎవ్వరికీ ఖాతరు లేకుండా పొయింది......" అంటుండగా..అల్లం పచ్చడి నంచి, పెసరట్టు నోట్లొ పెట్టింది మా అమ్మమ్మ.....అంతే..రెండు రోజులు రెస్ట్!!

ఇందాకే మా అన్నయ్యకు ఫోన్ చేసి వాడు పెట్టిన శాపానికి విమోచన ఎప్పుడని అడిగాను..తథాస్తు దేవతలను కాంటాక్ట్ చేయమన్నాడు..అందుకే డైరెక్టు గా దెవుడినే అడుగుతున్నా - "వల్లభరావు మాష్టారు..నాకెప్పుడు విరుగుడు????????????"