Thursday, September 16, 2010

ఈదలేని గోదావరి

******************

"ఏరా నువ్వు దేవుణ్ణి నమ్ముతావా?"

"పరీక్షల టైం లోనా..మమూలు టైం లోనా?"

"అన్ని సమయాల్లోనూ రా.."

"అంటే..పరీక్షల సమయాల్లో, రిజల్ట్ వచ్చేముందు ..మనసులో ధ్యానించుకుంటాను - 'వచ్చే సెప్టెంబర్ లోనైనా ప్రశ్నాపత్రం లో ప్రశ్నలేవీ లేకుండా చూడు తండ్రీ' అని. మమూలు సమయాల్లో - అంటే..పేకాటాడేప్పుడు, లాటరీ టికెట్లు కొన్నప్పుడు, ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడేప్పుడు..'అవతలి వాడు సర్వనాశనమై పోయి...ఈ ప్రపంచమంతా సుఖ సౌభాగ్యాలతో తలతూగేలా చూడు స్వామీ..' అని లోకకళ్యాణం కోసం కోరుకుంటాను.."

"నీ లాంటి వాడికి ఏ నడి సముద్రం లో మునుగుతున్నప్పుడో తప్ప...దేవుడి విలువ తెలియదు రా.."

******************


ఇది నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు..నాకూ, మా శీను మావయ్యకు జరిగిన సంభాషణ. మా మావయ్య శాపానికి భయపడి నేను సముద్రం దరిదాపుల్లోకి వెళ్ళలేదు.....ఇప్పటిదాక.

మా అమ్మ, అమ్మమ్మ తిరుమలలో బ్రహ్మోత్సవాలకు వెళ్ళారు. ఇంట్లో వాళ్ళు ఊరెళ్ళ్ళి..ఇల్లంతా మన ఆధీనంలోకి వస్తే ఏ బాధ్యతాయుతమైన పౌరుడైనా ఏం చేస్తాడు? (జవాబు - కొంప కొల్లేరు చేస్తాడు). నేనూ అదే చేసాను. "ఖాళీ ఇల్లు దొరికింది" అని వినగానే నా ఫ్రెండ్స్ - ఆఫీసుల్లో ఉన్న వాళ్ళు, షాపింగ్ చేస్తున్న వాళ్ళు, పెళ్ళి చేసుకుంటున్న వాళ్ళు - అందరూ వాళ్ళ పనులు మధ్యలో వదిలేసి మా ఇంటికి బయలుదేరారు. రవి, నీల్ విజయ్, దినకర్, బాలనాగు రాఘవేంద్ర కుమార్...ఇల్లు చేరుకున్నారు. మా వాళ్ళంతా ఇంట్లోకి రాగానే ఇంటి బయట "men's hostel" అని బోర్డు పెట్టి, తలుపు వేసి..TV లో 'భార్యామణి ' సీరియల్ పెట్టాము. మొహానికి ప్లాస్టిక్ సర్జరీ జరిగిన ఐశ్వర్య...తరువాతి ఎపిసోడ్ లో...మొహం మారిపోయి, లావు తగ్గి, పొడుగు పెరిగి, జడ సైజు పెరిగి కనిపించింది. ఈ అద్భుతాన్ని జీర్ణించుకునేలోపు ఎవరో తలుపు కొట్టారు..

మురళీ మోహన్ గారు..

"హలో బాస్. నిన్న సాయంత్రం మీకోసం వస్తే లేరు. మన అపార్ట్మెంట్స్ లో 'potluck' డిన్నర్ జరిగింది. అక్కడ అందరూ కలిసి 'అండమాన్ ' దీవులకు పిక్నిక్ వెళ్దామని నిర్ణయించాము. మీరు కూడా రావాలి..పడవ లో ప్రయాణం."

నాకు నోట మాట రాలేదు...లేకపొతే ఏంటి??? - మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేస్తే ఐశ్వర్య పొడుగు ఎలా పెరుగుతుంది???

"ఏంటండీ...ఏదైనా ప్రాబ్లమా?"

"సారీ..నేను ఏదో ఆలోచిస్తున్నాను. అలాగే వస్తాను..ఇదిగో నా స్నేహితులను కూడా తీసుకొస్తాను." అని చెప్పి ఆయన్ను పంపేసాను.

భార్యామణి దెబ్బనుంచి తేరుకున్న తరువాత అర్థమయ్యింది...అనవసరంగా మాటిచ్చాను అని. అప్పటికే అండమాన్ ప్రయాణమని గెంతులేస్తున్న మావాళ్ళకి మా శీను మావయ్య స్టోరీ చెప్పాను.

"అసలే పడవలో ప్రయాణం అంటున్నారు..మావయ్య మాటలు నిజమైతే?" అన్నాను.

నీల్ విజయ్ గాడు నా చేతిలో రెమోట్ తీసుకుని.."నీ మొహం..అలా అనవసరంగా భయపడకు" అని ఛానల్ మార్చాడు. 'గోరంత దీపం' సినిమా వస్తోంది. అందులో మొదటి పాట - చరణం మొదలయ్యింది..

"కడలి నడుమ పడవ మునిగితే...కడదాకా ఈదాలి" అన్న లైను వచ్చింది..

పడవ సంగతేమో కానీ, మా గుండెల్లో రైళ్ళు పరిగెట్టాయి. కారణం - మాలో ఎవ్వరికీ ఈత రాదు.


"ఇలా భయపడి ఒక మంచి ట్రిప్పు మిస్ అవ్వకూడదు మనం. బయలుదేరటానికి ఇంకా టైం ఉందిగా..స్విమ్మింగ్ నేర్చుకుందాం..ఏమంటారు?" అని అందరినీ చూసాడు బలనాగు.

ఇందాకటి నుంచి 'తెలుగు-కన్నడ ' నిఘంటువు లో 'potluck dinner' అన్న పదానికి అర్థం వెతుకుతున్న దినకర్ గాడు తల పైకిలెపి..

"ఇందిరా నగర్ లో ఉన్న 'water palace' లో నేర్చుకుందాం రా స్విమ్మింగ్. అక్కడ రిసెప్షనిస్ట్లు.. స్విమ్మింగ్ నేర్చుకోవటానికి వచ్చిన అమ్మాయిల్లా బికినీలు వేసుకుని ఉంటారని ఆస్పత్రి లో ఎవరో చెప్పుకుంటుంటే విన్నాను.." అన్నాడు.

ఈ మాట వినగానే మారు మాట్లాడకుండా water palace కు వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. ఎంత త్వరగా చేరుకుంటే అంత త్వరగా రిసెప్షనిస్ట్లని చూడొ.....అదే...ఈత నేర్చుకోవచ్చని.. వెంటనే ఇంటినుంచి బయటకొచ్చి, అటు గా వస్తున్నా ఒక రోడ్ రోలర్ వాడిని లిఫ్ట్ అడిగి..ఆఘమేఘాల మీద కంకర్రాళ్ళు తొక్కుకుంటూ water palace చేరాము. రోడ్ రోలర్ వాడు బ్రేక్ వేయకముందే అందరమూ కిందకు దూకేసాము. అలా దుమ్ము కొట్టుకున్న చొక్కాలు దులుపు కోకుండా...పరిగెట్టుకుంటూ రిసెప్షన్ దగ్గరకు వెళ్ళాము.

అక్కడి దృశ్యం చూసి మా అందరి నోళ్ళు, కళ్ళు తెరుచుకున్నాయి..దినకర్ విన్నది నిజమే.రిసెప్షనిస్ట్లు బికినీలు వేసుకుని ఉన్నారు....మగ రిసెప్షనిస్ట్లు!! మీసాలు, గడ్డాలు పెంచుకుని, సిగరెట్లు తాగుతూ...బికినీలు వేసుకుని ఉన్నారు.

మనసులోని కన్నీళ్ళు కంట్లోకి రాకుండా, గొంతులోనే మింగేసాము.

"ఏరా ఏం చేద్దాం?" అన్నాడు దినకర్.

"నిన్ను చంపక ముందా...చంపిన తరువాతా?" అడిగాడు బాలనాగు.

"నేనేమి చెయ్యను రా...ఆస్పత్రి లో కొంత మంది డాక్టర్లు మాట్లాడుకుంటుంటే విన్నాను. విన్నది మీకు విన్నవించుకున్నాను " అన్నాడు. ఆ మాటలు అంటూనే...రిసెప్షనిస్ట్లను ఓ రెండు క్షణాలు తీక్షణంగా చూసి - "రేయ్..ఆ ఆస్పత్రిలో మాట్లాడుకున్నది వీళ్ళే.." అని ఆ బికినీ వీరుల వైపు చూపించాడు.

వాళ్ళకు మా మాటలు, మా వాలకం చూసి విషయం అర్థమైనట్టుంది. మీసాలు తిప్పుకుంటూ, గడ్డం గోక్కుంటూ మా దగ్గరకు వచ్చి.."ఎలాగూ ఇంతదాకా వచ్చారు..ఒక్క రోజులో మీ అందరినీ గొప్ప ఈతగాళ్ళను చేస్తాము.." అన్నారు.

రిసెప్షన్ డెస్క్ వెనకాల ఒక పెద్ద పోస్టర్ ఉంది -

"మా దగ్గర ఈత నేర్చుకున్న వళ్ళు" - అన్న హెడింగ్ కింద మిహిర్ సేన్, మైకెల్ ఫెల్ప్స్ ఫొటోలు ఉన్నాయి.
"మా దగ్గర ఈత నేర్చుకోని వాళ్ళు" - అన్న హెడింగ్ కింద టైటానిక్ పడవ, బుధ్ధుడి విగ్రహం ఫొటోలు ఉన్నాయి.

ఆ రెండో లిస్ట్ లో మా ఫొటోలు చూసుకోవటం ఇష్టం లేక, డబ్బు కట్టేసాము. పైగా ఒకే రోజులో ఈత నేర్పించేస్తాము అంటున్నారు..

------

బికినీలు అవీ వేసుకుని ఈత కొట్టలేము కాబట్టీ..మాంచి స్విమ్మింగ్ కాస్ట్యూంస్ కొందామని ఊరి మీద పడ్డాము.

డబుల్ రోడ్డు లో వరుసగా స్పోర్ట్స్ గూడ్స్ షాపులు ఉన్నాయి..మొదటి కొట్టులోకి వెళ్ళాము.

"మేమంతా ఈత నేర్చుకోవాలనుకుంటున్నామండి..స్విమ్మింగ్ పూల్ లో చొక్కాలూ అవీ విప్పేసి దూకాలటగా. అందుకు ఏమి కావాలో కొందామని వచ్చాము " అన్నాను. ఆ కొట్టు వాడు నా మాటలు అర్థం కానట్టు చూస్తున్నాడు. మేమంతా చకచకా చొక్కాలు, బనియన్లు విప్పేసి.. "ఇలా చొక్కాలు విప్పి..ఈత నేర్చుకోవాలనుకుంటున్నాము.."

మా అర్ధనగ్న ప్రదర్శన చూసి కొట్టు వాడు లోపలికెళ్ళాడు. చొక్కాలు విప్పేసాం కదా..ఎవరెవరు ఏ డియోడరెంటు కొట్టుకొచ్చామో డిస్కస్ చేస్తున్నాము. దినకర్ గాడు చమట వాసన తో పాటూ..బొద్దింకలూ గట్రా రాకుండా బేగాన్ స్ప్రే కొట్టుకొచ్చాడట. అందుకే మాకు దూరంగా నిలబడి ఉన్నాడు..

రెండు నిముషాల తరువాత కొట్టు వాడు ఒక 'treadmill' తీసుకుని వచ్చాడు. మా చొక్కాలన్నీ తగిలించటానికి తెచ్చాడేమో అనుకుని అందరమూ దాని మీద చొక్కాలు వేసాము. కొట్టు వాడి మొహం లో రంగులు మారాయి. నాకు విషయం అర్థమయ్యింది - "బేగాన్ స్ప్రే కొట్టుకొచ్చింది వాడు.." అని దినకర్ గాడిని చూపించాను.

నేనన్న మాటలు పట్టించుకోకుండా.."ఈ treadmill తెచ్చింది చొక్కాలు తగిలించుకోవటానికీ, వడ్లు ఎండబెట్టుకోవటానికీ కాదు సార్. మీరంతా ఇది కొని, కొద్ది రోజులు వ్యాయామం చేసి, ఆ తరువాత చొక్కాలు విప్పి జనజీవన స్రవంతి లోకి వెళ్ళటం మంచిది. లేకపోతే ఏంటి సార్ ఆ బొజ్జలు? అక్కడ ఈత నేర్చుకోవటానికి అమ్మాయిలు, పిల్లలు వస్తారు..పెళ్ళి కాని అమ్మాయిలు మిమ్మల్ని చూస్తే.."ఇటువంటి వాళ్ళనా మేము పెళ్ళిళ్ళు చేసుకోవలసింది?" అని క్షోభ పడతారు..చిన్న పిల్లలు చూస్తే "పెద్దయ్యాక ఇలా తయారౌతామా?" అని భయపడతారు. కాస్త కూడా మానవత్వం లేకుండా ఇలా ప్రవర్తించటం భావ్యమా మీకు?" అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు.

మాకు కనువిప్పు కలిగింది..మా తప్పు తెలిసొచ్చింది. వెంటనే వీడి షాపులో నుంచి బయటకొచ్చి పక్క షాపులోకి వెళ్ళాము.

"మేము చొక్కాలూ అవీ వేసుకుని ఈత నేర్చుకోవాలనుకుంటున్నాము. దానికి కావలసిన వస్తువులు ఇస్తారా? మా దగ్గర treadmill ఉంది. అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. ఇంతింత బొజ్జలు ఉన్న పిల్లాలు కూడా ఉన్నారు. మీ కొట్లో కాక్రోచులు లాంటివి ఉంటే..మావాడిని లోపలికి తీసుకొస్తాము." అని బయట చొక్కా లేకుండా నించుని ఉన్న దినకర్ గాడిని చూపించాను. మా వాళ్ళంతా నా తెలివితేటలకు అబ్బురపడిపోయారు. ఇంత తేటతెల్లంగా చెప్పటం వల్ల కొట్టువాడికి కూడా అర్థమయ్యింది. మా తలలు తడవకుండా, చెవుల్లోకి, కళ్ళలోకి నీళ్ళు పోకుండా ఏవో గుడ్డపేలికలు, కళ్ళద్దాలు ఇచ్చాడు. షాపు వాడికి డబ్బిచ్చేసి, ఆ కళ్ళద్దాలు పెట్టుకుని, స్లో మోషన్ లో అందరమూ బయటకొచ్చాము.

"ఏరా...నువ్వు కొనవా? నీ తల తడిస్తే?" అనడిగాము దినకర్ గాడిని. వాడు ఒక నవ్వు నవ్వి.."నా ఏర్పాట్లు నేను చేసుకుంటాను..పదండి" అన్నాడు.

రెండు రోజుల తరువాత water palace కు బయలుదేరాము.


స్విమ్మింగ్ పూల్ దగ్గరకు చేరగానే చొక్కాలు గట్రా విప్పేసి, స్విమ్మింగ్ కాస్ట్యూంస్ వేసుకున్నాము. మేము తప్ప ఇంకెవ్వరూ లేరు. మా బొజ్జలు చూస్తే ఇక్కడికి వచ్చే జనాల ఆత్మగౌరవం దెబ్బతింటుందని..బొజ్జలు లోపలికి లాక్కుని, ఊపిరి బిగపట్టుకుని నిలబడ్డాము.

10 నిముషాల తరువాత ఒకాయన తలకు కిరీటం, చేతిలో పెద్ద కత్తి పట్టుకుని వచ్చాడు..

"హలో. నేను రాజుని...సుబ్బరాజుని.” అన్నారాయన.

మేమంతా “బహుపరాక్..బహుపరాక్” అని అరిచాము.

“ఆపండయ్యా వెధవ గోల. మీ ట్రైనర్ ని నేను. మీకు ఈత నేర్పటానికి వచ్చాను. ఈ రోజు మొత్తం నేను చెప్పినట్టు వినకపోతే ఈ కత్తి తో పొడిచేస్తాను. ఈ రోజు ముగిసేలోపు మీకు ఈత రాకపొతే ఇదే కత్తి తో మీరు నన్ను పొడిచెయ్యొచ్చు. ఈ ట్రైనింగ్ అయ్యాక అందరికన్నా బాగా ఈదగలిగిన వారికి ఈ డొక్కు కిరీటం బహుమతిగా ఇస్తాను.." అని కిరీటం, కత్తి పక్కన పెట్టారు రాజుగారు.

"ఈ రోజు మీరు తప్ప ఇంకెవ్వరూ రావట్లేదు ఈత నేర్చుకోవటానికి..ఇక ఊపిరి వదిలి మీ బొజ్జలు మామూలుగా పెట్టొచ్చు. ఇంకాస్సేపాగితే ఆక్సిజన్ మాస్కులు తెప్పించాల్సొచ్చేలా ఉంది. మీరూ మీ వెధవ టెక్నిక్కులు.." అని అసలు విషయం చెప్పి మాకు కొత్త ఊపిరి ప్రసాదించారు.

మేము మా బొజ్జలు విచ్చలవిడిగా బయటకు వదిలి నిలబడ్డాము.

“మీ తలలు, కళ్ళు తడవకుండా, చెవుల్లోకి నీళ్ళు పోకుండా ఏర్పాట్లు చేసుకున్నారా?” – రాజుగారడిగారు..

“యస్సార్” అని మేము తెచ్చుకున్నవన్నీ తగిలించుకున్నాము..ఒక్క దినకర్ గాడు తప్ప. రాజుగారు వాడిని చూసి..”మరి నువ్వు?” అనడిగారు. దినకర్ గాడు తన బ్యాగ్ లోంచి ఒక గొడుగు తీసి, అది తెరిచి, తల మీద పెట్టుకుని నిలబడ్డాడు.

రాజుగారు మమ్మల్ని చూసి.."ఎవరీ వ్యక్తి? పొద్దున్నే తాగొచ్చాడా? ముందు ఆ గొడుగు పక్కన పెట్టి రమ్మనండి.." అన్నారు

"మా వాడే సార్.." అని ఆయనకు సర్దిచెప్పి..దినకర్ గాడి గొడుగు పక్కన పడేసాము.


రాజుగారు అందరినీ హైటు ప్రకారం వరుసగా లైన్ లో నిలబెట్టారు.

“సరే..ఇప్పుడు చేతులు మోకాళ్ళ మీద ఉంచండి...ఎడమ చేత్తో వీపు మీద గోక్కోండి......రైట్..ఇప్పుడు లేచి నిలబడండి..."...

ఈత నేర్చుకోవటం చాలా సులభంగా ఉన్నట్టుందే అనుకుంటుండగా.. “ఇందాక మీరు చేసిన పనులకూ, మీ ట్రైనింగ్ కు.. ఏ సంబంధమూ లేదు. చెప్పిన మాట వింటారా లేదా అని ఒక చిన్న టెస్టు అంతే." అన్నారు రాజుగారు. ఈయన్ని కత్తి తో పొడవటానికి సాయంత్రం దాకా ఆగాలా అనిపించింది..

"ఈత రావాలంటే..ముందుగా క్రమశిక్షణ ఉండాలి...." అని మొదలుపెట్టారాయన.

పక్కవాడికి ఏదైనా నేర్పాలీ అంటే చాలు..ఎక్కడలేని ఙ్ఞానబోధ చేస్తారు జనం. సైకిల్ నేర్పించటానికి కూడా "నీ కన్ను, మనసు హ్యాండిల్ మీదనే ఉండాలి. కాళ్ళలో రసస్పందన కలిగి, తాదాత్మ్యం చెంది...పెడల్ తొక్కితే తప్ప..సైకిల్ ముందుకు కదలదు.." అని భయపెడితే ఎలా?

ఇప్పుడు ఈ ఈత నేర్చుకోవటానికి క్రమశిక్షణ, దుర్గాచరణుడి పట్టుదలా..అన్నీ నేర్చుకోవాలంటే ఎలా?

"ఒక 500 రూపాయలు ఎక్కువ కడితే..క్రమశిక్షణ లేకున్నా, ఈత నేర్పించేస్తాను " అని నేను మనసులో నెమ్మదిగా అడిగిన ప్రశ్నకు గట్టిగా సమధానమిచ్చారు. మా లాంటి సన్నకారు ఈతగాళ్ళకు ప్రభుత్వం అందించిన ఈ చేయూతకు మేమంతా హర్షించి చప్పట్లు కొట్టాము.

"సరే..ముందుగా..నాలుగు అడుగుల లోతు నీళ్ళలో దిగాలి. ఆ తరువాత మెల్లిగా ఆరు అడుగులు..నెక్స్ట్, పది అడుగులు. జీవితం లోనే కాదు..నీళ్ళలో కూడా మీకాళ్ళ మీద మీరు నిలబడేలా చేస్తాను. మనిషి చంద్రమండలం మీద ఈత కొడుతున్న రోజులివి.. మనము ఈ చిన్న స్విమ్మింగ్ పూల్ లో ఈ మూల నుంచి ఆ మూలకు ఈత కొట్టలేమా???"

"దీనికి సమాధానం నాకు తెలుసు సార్..నేను చెబుతాను..ప్లీజ్..సిర్..ప్లీజ్" అని చెయ్యి పైకెత్తి రాజుగారి మీదకు వెళ్తున్నాడు దినకర్..

"నీ మొహం..నువ్వు సమాధానం చెప్పటానికి నేను ఏ ప్రశ్నా అడగలేదయ్యా...ఏదో మిమ్మల్ని ఉత్తేజితుల్ని చెయ్యాలని అలా అన్నాను. వాక్యం చివర్లో క్వస్చన్ మార్కు ఉన్నంత మాత్రాన...నాలుగో తరగతి పిల్లాడిలా "నేను చెబుతాను..నేను " అని అలా అరుస్తావేంటి..ఎవడయ్యా వీడు?" అని మా వైపు చూసి అడిగారు. ఈ ప్రశ్న కూడా మమ్మల్ని ఉత్తేజితుల్ని చెయ్యటానికి అడిగారేమో రాజుగారు అని మేమెవ్వరూ సమాధానం ఇవ్వలేదు.

"సరే...తరువాతి స్టెప్.." అని ఆయన వాక్యం ముగించే లోగా మేమంతా స్విమ్మింగ్ పూల్ వైపు నడవటం మొదలు పెత్తాము. ఇంకేముంటుంది తరువాతి స్టెప్..నీళ్ళలోకి దూకి, ఈత కొట్టి, రానున్న కామన్ వెల్త్ గేంస్ లో గోల్డ్ మెడల్ సంపదించటం తప్ప..

"ఆగండాగండి....ఏంటి..స్విమ్మింగ్ పూల్ లోకి దిగేద్దామనే?? దిగే ముందు వెళ్ళి స్నానం చేసి రండి " అని ఆదేశించారు రాజుగారు. మేము ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నాము. అందరూ కలిసి స్విమ్మింగ్ పూల్ లో పుష్కర స్నానాలు చేద్దామని, రెండు రోజులుగా స్నానం చెయ్యకుండా డియోడరెంట్లు కొట్టుకుని తిరుగుతున్నాము. ఇప్పుడు చూస్తే ఈయన స్నానం చేసొచ్చేదాకా నీళ్ళలోకి దిగనివ్వను అంటున్నాడు..

"ఆ మూల షవర్లు ఉన్నాయి. షాంపూ, సబ్బు రుద్దుకుని శుభ్రంగా స్నానం చేసి రండి.." అని దినకర్ ను చూసి.."ఇదిగో..నువ్వు ఆ గొడుగు ఇక్కడే పెట్టి వెళ్ళు బాబూ.." అన్నాడు.

మేమంతా ఆయన చెప్పిన చోటికి వెళ్ళాము. పేరు కు 'షవర్లు '...అక్కడ ఒక్క షవర్ కూడా పని చేసి చావట్లేదు. ఏడు బక్కెట్లలో నీళ్ళున్నాయి. ఐదుగురికి కలిపి రెండు సబ్బులు, ఒక షాంపూ డబ్బా ఉంది.

"ఎవడు ముందు స్నానం చేసొస్తే...వాడికి ఫీజ్ లోంచి 50 రూపాయలు తగ్గింపు.." అని రాజుగారు గట్టిగా అనౌన్సు చేసారు.

అంతే.. మేమంతా ఒక్క మగ్గుతో రెండు మగ్గులకు సరిపడ నీళ్ళు ముంచుకుని పోసుకోవటం మొదలుపెట్టాము. షాంపూ మొదట నీల్ విజయ్ గాడు వాడుకున్నాడు..తలకు నవరత్న తైలం రాసుకున్నట్టు సగం డబ్బా రాసుకుని..కింద కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాడు. ఆ తరువాత బాలనాగు..తలతో పాటు, ఒంటికి కూడ షాంపూ రుద్దుకున్నాడు..ఆ సగం లో సగం అయిపొయింది. నెక్స్ట్ దినకర్ గాడు..మూత తీయకుండా డబ్బా నొక్కి, చేతిలో ఏమీ పడకపోయేటప్పటికి.."షాంపూ అయిపోయింది రోయ్..నెనెళ్ళి సార్ కు చెప్పొస్తాను.." అని రవి గాడికి డబ్బా ఇచ్చి బయటకు పరిగెట్టాదు. రవి గాడు "ఏం చేద్దాం?" అన్నట్టు నా వైపు చూసాడు. "ఆ మిగిలిన షాంపూ నాకిస్తావా...నీ sms రహస్యం ఇక్కడ బ్లాగు లో రాసెయ్యమంటావా?" అని కత్తులతో కాదు..కంటి చూపుతో బెదిరించాను. షాంపూ నా తలమీద రుద్ది, నా బక్కెటు లో నీళ్ళు కింద పోసి, మగ్గు విరగ్గొట్టి..బయటకెళ్ళిపోయాడు. నేను పక్క బక్కెట్లలోని నీళ్ళతో స్నానం చేసి, దిగ్విజయంగా 50 రూపయల కన్సెషన్ పొందాను.

రాజుగారు అరగంట ఎక్కడికో వెళ్ళి వచ్చారు. ఆయన రాగానే మేమంతా మళ్ళీ లైన్లో నిలబడ్డాము.

"టైం ఎంతయ్యింది?" అడిగారు రాజుగారు.

దినకర్ గాడు చెయ్యి లేపాడు. ఏంటన్నట్టు చూసారు ఆయన.

"12.10 కి 10 నిముషాలు ఉంది సార్.." అన్నాడు మా వాడు..

"ఏంటయ్యా..ఈ మనిషి ఏదీ తిన్నంగా చెప్పడా?....సరే..ముందు ఈ ట్యూబ్లు వేసుకుని, నాలుగు అడుగుల లోతులోకి దిగండి.......ఇదిగో..ఒక్కొక్కరుగా దిగండయ్యా..ఇదేమైనా సినిమా థియేటరా...అలా ఒకళ్ళనొకళ్ళు తోసుకోకండి.."

ట్యూబుతో మా బొజ్జలను కవర్ చేసుకుని..నీళ్ళలోకి దిగాము. ఆహా...ఎంత హాయిగా ఉంది..

"సార్.." అని చెయ్యి పైకి లెపాడు దినకర్..

"ఏంటి?"

"ఈ రవి గాడు నా నిక్కర్ లాగేస్తున్నాడు"

"మీతో చచ్చే చావొచ్చిందయ్యా..అసలు మీ వయస్సెంత? మీరు చేసే చేష్టలేంటి?? మీకన్నా చిన్న పిల్లలు నయం....సరే..ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ గోడను పట్టుకుని...కాళ్ళు నీళ్ళ అంచు దాక తెచ్చి...కొట్టండి.." అనరిచారు రాజుగారు.

గోడను చేత్తో పట్టుకుని, కాళ్ళు నీటి అంచుదాక లేపి....."ఒలమ్మీ తిక్కరేగిందా" పాటలో NTR పాత్రలో మమ్మల్ని ఊహించుకుని, జయప్రద పాత్రలో నీళ్ళని ఊహించుకుని...స్విమ్మింగ్ పూల్ ని నుజ్జు నుజ్జు చేసి పారేసాము. రెండు నిముషాల పాటు ఒళ్ళు తెలియకుండా అలా డ్యాన్స్ చేస్తూనే ఉన్నాము. ఈ సౌండు లో "ఆపండయ్యా...మిమ్మల్నే..ఆపండి " అన్న రాజుగారి ఆర్తనాదాలు వినబడలేదు. మేము అలసిపోయి సైలెంటయ్యాక...రాజుగారి వైపు చూసాము..కిరీటం తో తలబాదుకుంటూ కనబడ్డారాయన.

"మోటర్ తో నీళ్ళు పంపు చేసినట్టు ఎన్ని నెళ్ళు బయటకొచ్చేసాయో చూడండి..ఎంటయ్యా ఇది? మీ లాంటివాళ్ళు సముద్రం లో ఈత కొడితే..నీళ్ళు పక్కకు పొంగి, దేశాలకు దేశాలు మునిగిపోతాయి. సుతారంగా కాళ్ళు అలా..అలా అనండి చాలు.." అన్నారు రాజుగారు.

మేమంతా ఆయన చెబుతున్న మాటలు శ్రధ్ధగా, అర్థం కాకుండా వింటున్నాము..

"ఇప్పుడు ఆ గోడను వదిలేసి...మెల్లిగా మీ చేతులతో నీళ్ళు ఇలా వెనక్కు అనుకుంతూ...ఆరడుగుల వైపుకి రండి.."

నేను చేతులతో ఎంత ఇలా వెనక్కు అంటున్నా...ముందుకు వెల్లట్లేదు. పక్కకు చూసాను. మా వాళ్ళ పరిస్థితి అదే. ఒక్క నీల్ విజయ్ గాడు మాత్రం ముందుకు వెళ్తున్నాడు. నేను వెంటనే వాడి ట్యూబ్ పట్టుకున్నాను..బాలనాగు నా ట్యూబ్ పట్టుకున్నాడు. రవి గాడు బాలనాగును పట్టుకున్నాడు..దినకర్ రవి గాడిని పట్టుకున్నాడు..తలెత్తి, రాజు గారిని చూస్తూ "సార్...మీరొచ్చి నా ట్యూబ్ పట్టుకోండి. సరదాగా ఆ మూలదాకా వెళ్ళొద్దాం" అన్నాడు దినకర్.

"పెట్రోలు అయిపోయిన బైక్ ను తీసుకెళ్ళినట్టు అలా ముందు వాడి చెయ్యి పట్టుకుని వెళ్తే..మీకు ఎప్పటికీ ఈత రాదు. వదలండయ్యా...ముందు వదలండి చేతులు.." అని మా మీదకు రాళ్ళు విసురుతున్నారు రాజుగారు.

ఇప్పుడు అందరూ ఆరు అడుగుల లెవెల్ లో ఉన్నాము. ట్యూబ్ల సహాయం తో తేలుతూ ఉన్నాము. టైం 2.30 అవుతోంది. రాజుగారికి ఓపిక క్షీణిస్తోంది.

"ఇదిగో..నేను మొదట్లో మీకు ఈత రాకపొతే నన్ను కత్తితో పొడవమన్నానే...అది మనసులో పెట్టుకోకండి. ఏదో జోక్ చేసానంతే. ఇప్పుడు నీళ్ళ మీద పడుకుని..చేతులతో నీళ్ళు వెనక్కి అనండి....అలా..వెరీ గూడ్! ఇదిగో గొడుగబ్బాయ్..నీ నిక్కరు ఎవ్వరూ లాగరు లే..నిక్కరు మీది నుంచి చేతులు తీసి, ఈత కొట్టు..."

అందరూ మెల్లిగా ముందుకు కదులుతున్నాము. ఒకరి పక్కన ఒకళ్ళం "హలా..హలా" అనుకుంటూ ముందుకు సాగిపోతున్నాము. పది అడుగుల లెవెల్ కూడా దాటేసి, స్విమ్మింగ్ పూల్ ఇవతలి గోడదగ్గరకు వచ్చేసాము. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వచ్చేసామని మా అందరిలో ఆనందం...గర్వం...కొవ్వు. ఇక నా సర్టిఫికేట్లలో, విజిటింగ్ కార్డ్లలో.. "గజ ఈతగాడు గౌతం" అని పేరు మార్చేస్తాను.

"అద్భుతం....ఇప్పుడొక పది నిముషాలు బ్రేక్. అందరూ పైకొచెయ్యండి. మీకోసం నిమ్మరసం తెప్పించాను " అన్నారు రాజుగారు.

ముందుగా నీల్ విజయ్ గాడు నీళ్ళ లోంచి బయటకెళ్ళాడు..వాడి వెనకాల ఒకళ్ళ ట్యూబ్లు ఒకళ్ళు పట్టుకుని వరుసగా బయటకొచ్చాము.

సాయంకాలమవుతోంది..


"ఈ నిమ్మరసం తో పాటూ ఫుల్ మీల్స్ పెట్టించుంటే బావుండేది సార్..ఇక్కడ భోజనాలూ అవీ ఉంటాయని....." అని అంటున్న దినకర్ గాడిని మధ్యలోనే mute చేసేసారు రాజుగారు.

"జంతువులకి పుట్టుకతోనే ఈత వస్తుందిట..సో, నిమ్మరసం తాగాక ఏమాత్రం భయపడకుండా...ట్యూబ్లు లేకుండా నీళ్ళలోకి దూకండి చెబుతాను. రబ్బరు బంతిలా బయటకొచ్చేస్తారు.."

ఈ సారి రాజుగారి వాక్యం లో ఏ క్వస్చన్ మార్కు లేకున్నా...మేమంతా ఉత్తేజితులమైపోయాము.

రాజుగారితోపాటూ ఇంకో నలుగురు వచ్చారు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి. మమ్మల్నందరినీ పది అడుగుల లెవెల్ కు తీసుకెళ్ళారు.

"మేము ఉన్నాము..మీరు ధైర్యంగా దూకండి.." అన్నారు

మొదట నీల్ విజయ్ గాడు దూకాడు..వాడి వెంట వరుసగా అందరూ దూకాము.

ధబేల్..

నీళ్ళలోకి దూకగానే..మొదటి రెండు క్షణాలు ఏమీ అర్థం కాలేదు. ఏమీ కనిపించట్లేదు..చిన్నప్పుడెప్పుడో సబ్బు నీళ్ళతో బుడగలూదినట్టు..నా నోట్లోంచి బుడగలొస్తున్నాయి..కిందకు వెళ్తున్నాను..నేల తగిలింది. రాజుగారు చెప్పినట్టుగానే పైకి రావటం మొదలు పెట్టాను. అంటే...అంటే...నేను జంతువునేనన్నమాట! పైకి వెళ్ళగానే...నీళ్ళమీద కాలు మీద కాలు వేసుకుని కూర్చోవాలి. నీళ్ళ బయటైకి తల వచ్చింది..

"సార్..మీరు చెప్పినట్టే..రబ్బరు బం...."

తల నీళ్ళ లోపలికి వెళ్ళింది..మళ్ళీ కిందకు వెళ్తున్నాను. కాని ఈసారి ఏదో తేడా ఉంది. ఊపిరాడట్లేదు..నీల్ గాడిని పట్టుకుందామంటే...కళ్ళు కనిపించట్లేదు..చేతుల్లో, కాళ్ళల్లో నీరసం..

అప్పుడు కనిపించారు - దేవుడు, మా శీను మావయ్య.

మాట్లాడదామనుకునే లోపే ఎవరో నా జుట్టు పట్టుకుని పైకి లాగారు. ఆ తరువాత ఐదు నిముషాలు ఏం జరిగిందో తెలియదు. కళ్ళు తెరిచేప్పటికి స్విమ్మింగ్ పూల్ పక్కన పడుకుని ఉన్నాను. నా పక్కన మా వాళ్ళంతా పడుకుని ఉన్నారు. రాజుగారు, ఆయన భటులు నిలబడి మమ్మలని చూస్తూ ఉన్నారు.

దినకర్ గాడు పైకి లేచి "రేయ్...నీళ్ళ లోపల.. నువ్వు, మీ శీను మావయ్యా, దేవుడు.. కనబడ్డారు రా.." అన్నాడు.

మేమెవ్వరమూ మాట్లాడలేదు. సూర్యుడు అస్తమిస్తున్నాడు..అండమాన్ ట్రిప్పు గుర్తొచ్చింది..గోరంత దీపం పాట గుర్తొచ్చింది..

మెల్లిగా లేచి..రాజుగారి కత్తి ఎక్కడుందో వెతకటం మొదలుపెట్టాము..

******

పరిస్థితులు, దినకర్ నేర్పిన ఈ గుణపాఠం వల్ల..సాటి మనుషులకు సహాయం చెయ్యాలనే ఉద్దేశం తో ..ఈత నేర్చుకోవాలనుకునే ఔత్సాహికుల కోసం నేనొక flowchart తయారు చేసాను. చెలరేగిపోండి.