Friday, June 24, 2011

పెళ్ళి చేసి చూడు - ఇల్లు మారి చూడు

మా ఇంటి పక్కన మా పక్కిల్లు ఉంది. పక్కా ఇల్లు. గత ఏడు నెలలుగా ఖాళీగా ఉంది. వాస్తు బాగోలేదని ఎవ్వరూ చేరట్లేదట. నలుగురు వాస్తు శాస్త్రఙ్ఞుల సలహా తీసుకుని..ఆ ఇంటి ఓనర్ ఇప్పటికి నాలుగు సార్లు ఇంటి సింహద్వారం మార్పించాడు. న్యూమరాలజీ శాస్త్రఙ్ఞుడి మాట విని..."ooowwwwnerrrr" అని పేరు కూడా మార్చుకుని చూసాడు. లాభం లేదు. ఇంటి బయట కట్టిన 'to-let' బోర్డు మీద 'రవి లవ్స్ త్రిషా', 'no parking', 'parking Rs.2' అని రాసిన జనం ఉన్నారు కాని, ఇల్లు అద్దెకు తీసుకుందామని వచ్చిన వాళ్ళు ఒక్కరూ లేరు.
ఎవరైనా వస్తారేమో అని ఇన్నాళ్ళు ఎదురు చూసి..అలసిపోయి..చిరాకొచ్చి..ఇంటికున్న తలుపులన్నీ తీసేసి, గోడలు కట్టించేసాడు. ఒక సొరంగం తవ్వి, దాని బయట ఒక శంకుస్థాపన రాయి పాతి, దాని మీద 'toooo-llleet' అని రాయించాడు.

ఇవన్నీ గమనిస్తున్న మా అమ్మ, అమ్మమ్మ ఒక రోజు నాతో.."ఇంటి వాస్తు సరిగ్గా లేకపోతే ఎన్ని అనర్థాలు జరుగుతాయో చూస్తున్నావా? అదృష్టవశాత్తు మనముంటున్న ఇల్లు వాస్తు బ్రహ్మాండంగా ఉంది. ప్రళయం వచ్చే దాకా ఇల్లు మారాలన్నా ఆలోచన రానివ్వకు.." అన్నారు.

ఈ మాటలు అన్న కొద్ది రోజులకు టీ. రాజేందర్ కొత్త సినిమా బెంగళూరు లో రిలీజ్ అయ్యింది. ఐదారు ప్రళయాలు కలిసి వచ్చినంత పనయ్యింది. భూకంపాలు, గాలి వానలు. ఊరంతాచెల్లాచెదరైపోయింది. ఆ దెబ్బకు మేమున్న ఇల్లు వాస్తు మారిపోయింది. పొద్దున్నే సూర్యనమస్కారం చేద్దామని మేడ మీదకు వెళ్ళి, తూర్పు వైపు తిరిగి దండం పెడితే...వెనక నుంచి సూర్యుడు టెంకి జెల్ల కొట్టాడు..

వెంటనే ఇల్లు మారాలని గోల మొదలుపెట్టింది మా అమ్మ. బెంగళూరు వచ్చినప్పటి నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నాము..ప్రస్తుతం ఇల్లు మారే మార్కెట్ ఎలా ఉందో నాకస్సలు తెలియదు. మా ఇంటి బయట బోర్డు పెట్టాను.."ఇల్లు మారాలి..ఇల్లుంటే నాకు కాల్ చెయ్యండి." అని..

నోటీసు పీరియడ్ నెల రోజులు ఉంది...29 వ రోజు నుంచి ఇల్లు వెతకటం మొదలు పెడదామని..నైరుతి మూలలో కుర్చీ వేసుకుని, ఈశాన్యం వైపు తిరిగి కూర్చుని, ఆగ్నేయంగా ఉన్న నక్షత్రాలను వాయువ్యంగా చూస్తున్నాను.
మా ఇంటి ఓనర్ నుంచి ఫోన్ వచ్చింది..

"ఏంటి ఇల్లు ఖాళీ చేస్తున్నారా?"

"ఔను సార్..ఇంటి వాస్తు మారిపొయిందట. ఈ ఇల్లు మొత్తం బధ్ధలు కొట్టించేసి..కొత్త ఇల్లు కట్టుకోకపోతే..మీకు బోలెడు కష్టాలు వస్తాయని మా అమ్మ మీతో చెప్పమంది. మీరు సరేనంటే నేను ఇంటి బయట పెట్టిన బోర్డులోనే "ఇల్లు బధ్ధలు కొట్టే వాళ్ళు కావాలి " అని రాస్తాను.." అన్నాను.

ఇన్నేళ్ళుగా నన్ను గౌతం గారూ అని పిలిచిన ఓనర్.."ఒరే...నా ఇల్లు ఖాళీ చేస్తావా. నా గురించి నీకు పూర్తిగా తెలియదురా రేయ్. నేను నీ ఇంటి ఓనర్ ని మాత్రమే కాదు..మా ఆఫీసులో మానేజర్ ని కూడా. ఈ నోటీసు పీరియడ్ లో నీ వాస్తు మార్చకపోతే నా పేరు ఓనరే కాదు." అని తిట్టి ఫోన్ పెట్టేసాడు.

మొదటి వారం అంతా బానే గడిచింది. వాస్తు ప్రకారం మెయిన్ డోర్ బాలేదని...మా పక్కింటాయన తవ్వించిన సొరంగాన్ని వాడుకుని ఇంట్లోపలికి, బయటికి వచ్చి వెళ్ళేవాళ్ళము. రెండో వారం నుంచి మా ఓనర్ తన వానర బుధ్ధి చూపించటం మొదలుపెట్టాడు. లిఫ్ట్ దగ్గర మనుషులను పెట్టాడు. నేను లిఫ్ట్ లో ఉంటే..మధ్యలో ఆపేసేవాళ్ళు. మేడమీదకెళ్ళి..మా కేబుల్ కనెక్షన్ కట్ చేసేసాడు. అదేం విచిత్రమో..కేబుల్ కనెక్షన్ లేకున్నా "భార్యామణి " సీరియల్ మాత్రం వచ్చేది. నేను సగం గడ్డం గీసుకున్న తరువాత నీళ్ళు కట్టేసేవాడు. ఈ విషయం లో నేను వాడికన్నా రెండు వాస్తు పుస్తకాలు ఎక్కువే చదివాను. రాత్రి పడుకునేప్పుడు సగం గడ్డం గీసుకుని..పొద్దున మిగతా సగం గీసుకోవటం మొదలు పెట్టాను.

ఆ పై వారం పైత్యం తారాస్థాయికి చేరుకుంది మా ఓనర్ కి. ఉతికి ఆరేసిన మా బట్టలకు మట్టి పూయటం మొదలు పెట్టాడు. వీడితో ఇలాక్కాదని..మా అమ్మ నా జీన్స్ ప్యాంట్లు ఆరేసింది ఒకసారి. నా జీన్స్ కి మట్టి రాయటానికి ప్రయత్నించిన వాడి చేతికే అంటుకుంది మట్టి. చింతపండు వేసి తోమినా పోలేదు..ఇంకోసారి మా బట్టల జోలికి రాలేదు వాడు..

29 వ రోజు రానే వచ్చింది...కొత్త ఇల్లు వెదకటం మొదలుపెట్టాను. పేపర్ కొని..అందులో అద్దెకున్న ఇళ్ళ అడ్వర్టైజ్మెంట్లు చూసి, ఆ నంబర్లకు ఫోన్ చెయ్యటం మొదలు పెట్టాను. ప్రతీ నంబరూ బ్రోకర్ గాడిదే..అందులో నంబర్ ఉన్న ప్రతీ బ్రోకరూ గాడిదే...అడ్డ గాడిద. బ్రోకర్ ఫీస్ - ఒక నెల అద్దె. చేసేదేమీ లేక "సరే కానీ..నాకు ఇల్లు చూపెట్టాక...నీ దగ్గర ఒక ఉద్యోగం కూడా చూడు.." అన్నాను వాడితో.

నా బండిలో వెళ్దాము అంటే.."వద్దు సార్..నా బండిలో వెళ్దాం" అన్నాడు..నన్ను వాడి బైక్ మీద ఎక్కించుకుని..మా పక్క వీధిలో ఉన్న పెట్రోల్ బంక్ కి తీసుకెళ్ళాడు. ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించుకుని, రెండు బిందెల్లో పెట్రోల్ నింపుకుని, "డబ్బు ఇచ్చెయ్యండి సార్" అన్నాడు. ఆ బంక్ వాడికి డబ్బిచ్చేసి..ఆ రెండు బిందెలు పట్టుకుని కూర్చున్నాను. ఒక పది మీటర్ల అవతల బండి ఆపి, నా చేతుల్లో ఉన్న బిందెలు ఎవరో ఇద్దరు పిల్లలకిచ్చి "ఇంటికి తీసుకెళ్ళి..మన పెట్రోల్ బావి లో పొయ్యండి" అని పంపేసాడు..

"రండి సార్...మీ ఇంటి పక్కనున్న అపార్ట్మెంట్స్ లోనే ఉన్నాయి ఇళ్ళు" అని తీసుకెళ్ళాడు. అన్నీ కొత్త ఫ్లాట్లు. బ్రోకర్ గాడు "ఓనర్ కి ఫోన్ చేసి పిలుస్తాను సార్" అని నా మొబైల్ తీసుకుని.. బొంబాయి కి, జెర్మనీ కి, త్రిశంకు స్వర్గానికీ ఫోన్లు చేసుకుని..ఎవరెవరితోనో బోలెడంత సేపు మాట్లాడి..తరువాత ఓనర్ కి ఒక మిస్డ్ కాల్ ఇచ్చాడు. "ఇల్లు చూడటానికి ఎవరైనా వస్తే మిస్డ్ కాల్ ఇమ్మంది సార్ ఓనర్ గారి భార్య..రెండు నిముషాల్లో వచ్చేస్తారు.." అన్నాడు. ఈ రెండు నిముషాల్లో వోడఫోన్ వాడు 9 సార్లు కాల్ చేసాడు.."మీ బిల్లు ఎప్పుడు కడతారు సార్..త్రిశంకు స్వర్గానికి కూడా ఫోన్ చేసినట్టున్నారు..మీ తాత సొమ్మనుకున్నారా..have a good day, sir." అని..

ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి మరీ మన్మోహన్ సింగ్ లా తయారయ్యాను నేను. ఈ బ్రోకర్ గాడు చేసిన పెట్రోల్, టెలెఫోన్ స్కాం లు చూస్తూ నోరు మెదపకుండా కూర్చున్నాను .

ఈ లోపు ఓనారి (ఓనర్ గారి భార్య) వచ్చింది..చేతులు కట్టుకుని "మేడం" అన్నాను నాకు తెలియకుండానే. నా పక్కనున్న బ్రోకర్ "సార్..ఈవిడ ఓనర్ వైఫ్" అనగానే తేరుకుని.."ఓకే..ఇల్లు చూద్దామా" అన్నాను గంభీరంగా.
"ఉండండి..మా ఆయన వచ్చి..అద్దె, అడ్వాన్సు, అగ్రీమెంటు గురించి చెబుతారు. అవి విన్న తరువాత మీరు మమ్మల్ని చంపెయ్యకుండా.. మీ ఆత్మాభిమానాన్ని చంపుకుని..మా ఇంట్లో చేరాలనుకుంటే...అప్పుడు ఇల్లు చూద్దాం." అంది..

"కోర్ కోర్ శరణు కోర్...కోర్ కోర్ శరణు కోర్" అన్నా కోరస్ వినబడింది వెనక నుండి..ఓనర్, వాడి అసిస్టెంటు వచ్చారు.

"ఇల్లు కావాలా బేటా..."

"ఔను బేటా...సార్"

"నీ ఇంటి పేరు, గోత్రం, నా ఇంటి పేరు, గోత్రం చెప్పు" అనడిగాడు..

"మీ ఇంటి పేరు నాకెలా తెలుస్తుంది సార్?" అన్నాను..

"ధిక్..." అని గట్టిగా అరిచాడు..

ఇలాంటి ప్రశ్నలు పది అదిగాడు నన్ను. ప్రతీ ప్రశ్నకు నాలుగు ఆప్షన్లు ఇచ్చి..ఒక్కొక్క సమాధానం చెప్పటానికి ఐదు అవకాశాలు ఇచ్చాడు. పది లో మూడున్నర ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చాను. పాస్ మార్కులేసాడు.

"ఇక అద్దె, అవీ మాట్లాడుకుందామా సార్" అనడిగాను..

"అద్దె పది వేలు"..

"అద్భుతం సార్.."

"మెయింటెనన్స్ పదమూడు వేలు"

నేను ఆయన అసిస్టెంటు వైపు తిరిగి.."ఇదిగో..సార్ మీకేదో చెబుతున్నారు" అన్నాను

"నేను చెబుతున్నది నీకే. మెయింటెనన్స్ పదమూడు వేలు."

"అంటే మొత్తం ఇరవైమూడు వేలా? అసలు అంత మెయింటెనన్స్ ఎందుకు సార్? రోజూ పరిచారికలు వచ్చి నాకు గులాబి రేకులతో స్నానాలు చేయిస్తారా ఏంటి? మీరు 'ధిక్ ' అన్నా సరే..నేను అంత మెయింటెనన్స్ కట్టను.." అన్నాను

"అద్దెకు ఉన్న వారి కోసం ఎన్ని సదుపాయాలు ఏర్పాటు చేసామో తెలుసా?" అని..

"కింద జిం ఉంది" అన్నాడు
"అలవాటు లేదు"

"విమానం పార్కింగ్ ఉంది"
"అవసరం లేదు"

"పిల్లలను ఆడించటానికి డేకేర్ సెంటర్ ఉంది.."
"నాకు పెళ్ళే కాలీదు.."
"వెరీ గూడ్. ఇక్కడ మ్యారేజ్ బ్యూరో కూడా ఉంది.."

తిరుపతి గంగమ్మ జాతర లో నేర్చుకున్న బూతులన్నీ తిట్టి, అక్కడి నుంచి బయటికొచ్చేసాను..

మా అన్నయ్య కి ఫోన్ చేద్దామని చూస్తే వొడాఫోన్ వాడు మధ్యలో తగులుకుని.. "ఇందాక చేసిన గ్రహాంతర కాల్స్ కి బిల్లు కట్టేంతవరకు నీ ఫోను పని చెయ్యదు.." అన్నాడు. ఏమి చెయ్యాలో తోచట్లేదు..ఇంతలో ఎవరో పిలిచారు..

"ఈ అపార్ట్మెంట్స్ లో అద్దెకు ఏవో ఇళ్ళు ఉన్నాయన్నారు..మీకు తెలుసాండి?" అనడిగాడు ఒకాయన..
"ఔనండి...ఉన్నాయి. ఓనర్ కి ఫోన్ చేసి పిలవాలి..కాస్త మీ ఫోన్ ఇవ్వండి" అని ఆయన ఫోను తీసుకుని...మా అన్నయ్యకి కాల్ చేసాను..

"నేను బెంగళూరు లో ఉండను రా..నాకు పిచ్చి పట్టేలా ఉంది.." అన్నాను..
"ఆ టీ. రాజేందర్ సినిమా చూడొద్దు రా అని చెప్పాను...వినకపొతే నేనేమి చెయ్యను?"
"అది కాదు రా..ఇల్లు విషయం. అద్దె, మెయింటెనన్స్, అడ్వాన్స్...అంతా నాన్సెన్స్..ఇంతింత డబ్బు నా వల్ల కాదు. నేను ఢిల్లి వచ్చేస్తాను. నాకొక మంచి ఉద్యోగం, మంచి ఇల్లు చూడు.."
"ఓరి పిచ్చోడా..బెంగళూరు పాతాళం లాంటిదైతే...ఢిల్లి అనేది పాతాళానికి బేస్మెంటు లో ఉన్న పార్కింగ్ రా..ఇక్కడికొస్తే రోజూ రాగింగ్ చేస్తారు నిన్ను. సరే కాని, నీ సేవింగ్స్ సంగతేంటి?"
"నా డబుల్ చిన్, నా నడుము చుట్టూ ఉన్న టైర్లు ..జాగ్రత్త గా ఉన్నాయి రా..నా వొంట్లో కొవ్వు ఒక్క అంగుళం కూడా పోకుండా సేవ్ చేసుకుంటున్నాను.."
"నీ కొవ్వు గురించి కాదు రా నేను అడిగేది...నువ్వు డబ్బు దాస్తున్నావా అని అడుగుతున్నాను.."
"డబ్బు దాయటమా...ఎవర్నుంచి?"
"నీ నుంచే రా యూజ్లెస్ ఫెలో. ఒకటో తారీఖు పొద్దున జీతం వస్తే..మధ్యహ్నానికి "మళ్ళీ ఒకటో తారీఖు ఎప్పుడొస్తుందా.." అని ఎదురు చూడకూడదు..జీతం అకౌంటు లో పడగానే ఆఫీసుకు శెలవు పెట్టి మరీ డబ్బు ఊదేస్తే ఎలా రా? ఈ అద్దె ఇల్లు అవీ వొద్దు కాని, సొంత ఇల్లు గురించి ఆలోచించు..వెళ్ళి మాంచి బ్రోకర్ ని ఎవర్నైనా పట్టుకో..వివరాలు కనుక్కో.....సరే..పది నిముషాల్లో మళ్ళీ ఫోన్ చేస్తాను ఉండు..మా ఇంటి ఓనర్ బట్టలు ఇస్త్రీ చెయ్యాలి నేను.." అని ఫోన్ పెట్టేసాడు..

అద్దె ఇల్లు కోసం వచ్చినాయనకి ఫోన్ తిరిగిచ్చేసి..."ఆ లోపల ఉన్నాడు వెళ్ళండి ఓనర్ గాడు.." అని లోపల అడిగే పిచ్చి ప్రశ్నలకు సమాధానాలు చెప్పి పంపాను..

ఇందాక మా అన్నయ్య అన్న మాటల గురించి తీవ్రంగా ఆలోచించాను...ఇంకో బ్రోకర్ గాడి దగ్గరికి వెళ్ళాను..

"ఒక సొంత ఇల్లు కావాలి" అనడిగాను. నీ దగ్గర డబ్బెంతుంది అన్నాడు వాడు. ఇంతుంది అని చెప్పాను. "ఆ డబ్బుకి ఇవొస్తాయి " అని కొన్ని ఫొటోలు చూపించాడు..ఒక సైకిల్ షాపు (tires not included), కొబ్బరి బొండాలు పెట్టుకునే చెక్క బల్ల, "ఆటో స్టాండ్" అని రాసి ఉన్న ఒక బోర్డు.

"బ్యాంక్ కి వెళ్ళి హౌసింగ్ లోన్ తీసుకోండి సార్..మీకు కావలసిన ఇల్లు కొనచ్చు.." అని సలహా ఇచ్చాడు.

బ్యాంక్ కి వెళ్ళి - "ఒక సొంత ఇల్లు కొనటానికి డబ్బు కావాలి " అన్నాను. ఎంత అనడిగాడు బ్యాంక్ వాడు. బోలెడంత అని చెప్పాను. ఒక క్యాలుకులేటర్ తీసి..."ఇరవై ఏళ్ళ పాటు వాయిదాలు కట్టాలి" అన్నాడు..."వాయస్..ఐతే నెలకు ఏ ఆరు వందలో, ఏడు వందలో కట్టాలేమో" అని మనసులో అనుకునేలోపు..."మనసులో ఏది పడితే అది అనుకొకండి సార్.." అన్నాడు..

లెక్కలన్నీ పూర్తిగా వేసి..."ఇరవై ఏళ్ళ పాటు నీ జీతం డబ్బంతా మాకు కట్టి..మీ ఇంట్లోవాళ్ళు ప్రభుత్వం వారి మధ్యహ్న భోజన పథకం లో భోంచేసి జీవనయానం చేయాలి..మీరు అడిగిన లోన్ లో 80% ఇచ్చుకోగలము" అన్నాడు.

వాడిచ్చిన ఆ EMI లెక్కల కాగితాలను నేను మిరపకాయ బజ్జిల బండి వాడికి ఇచ్చుకోగలిగాను.

దీర్ఘంగా ఆలోచించటానికి ఒక మాంచి లొకేషన్ వెదికి పట్టుకున్నాను. కానీ, ఆలోచించటానికి విషయమేమీ లేదు. ఇప్పుడుంటున్న ఇల్లు రేపటికి ఖాళీ చెయ్యాలి. కాబట్టి, పొద్దున చూసిన ఆ హిట్లర్ గాడి బంకర్ తప్ప వెరే గత్యంతరం లెదు. ఆ అపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళాను.

అక్కడ అధిష్టానం, ఆయన అసిస్టానం ఉన్నారు.

"మీరు పెట్టిన షరతులకి నేను ఒప్పుకుంటున్నాను సార్..ఇల్లు ఇప్పించండి" అన్నాను..
"షరతులా?? అవెక్కడ చెప్పాను? ఇందాక అద్దె గురించి చెప్పాను అంతే. ఇదిగో అగ్రీమెంటు. ఇందులో ఉన్నాయి కండిషన్స్." అని అగ్రీమెంటు నా చేతికి ఇచ్చాడు..

"ఆరు నెలల లోపు ఇల్లు ఖళీ చేస్తే పెనాల్టీ. సంవత్సరం కన్నా ఎక్కువుంటే అద్దె డబుల్. ఇంట్లో గోడలకి మేకులు కొడితే కొత్త గోడలు కొనిపెట్టాలి. దేవుడి పటాలు గట్రా ఉంటే...అవి పట్టుకుని నిలబడటానికి మనుషులని పెట్టుకోవాలి తప్ప...మేకులు కొట్టరాదు. మాకు తెలిసిన వాళ్ళకు, చుట్టాలకు ఇల్లు చూపించటానికి ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చెయ్యకుండా వచ్చేస్తుంటాము. నాకు కొవ్వెక్కువ. నేనొక లుచ్చాని."
"వీటన్నిటికీ నువ్వు ఒప్పుకుంటే సంతకం పెట్టు" అన్నాడు. ఆ చివరి రెండు వాక్యాలు అండర్లైన్ చేసి, సంతకం పెట్టాను.
వాడు కూడా సంతకం చేసాడు - D I N A K A R అని.

"ఓహ్...మీ పేరు దినకరా? ఇది తెలియక అనవసరంగా భయపడ్డాను ఇంత సేపు. ఇప్పుడడగండి...మీ ఇంటి పేరు గోత్రమే కాదు..మీ mail id, పాస్వర్డు తో సహా అన్నీ చెబుతాను..ఏబ్రాసి కుంక.." అని ఛాలెంజ్ చేసి బయటికొచ్చాను.

ఇప్పుడెళ్ళి పాత ఓనర్ గాడి దగ్గరినుంచి నా అడ్వాన్సు వెనక్కి రాబట్టుకొచ్చి, దానికి ఇంకాస్త డబ్బు కలిపి, వీడికి ఇవ్వాలి.

పాత ఓనర్ దగ్గరికి వెళ్ళి "నా అడ్వాన్సు కక్కు" అన్నాను..

"ఇంకేమి అడ్వాన్స్? మన అగ్రీమెంటు ప్రకారం చూస్తే...నువ్వే నాకు ఇవ్వాలి..కావలిస్తే చూసుకో" అని వాడు విషం కక్కాడు..

అగ్రీమెంటు చూసాను. నేను వీడికి డబ్బు ఇవ్వాలి అన్న విషయం ఎక్కడా కనబడలేదు. ఒక బూతద్దం తెచ్చి ఇచ్చాడు. అప్పుడు కనబడింది. ప్రతి రెండు లైన్లకు మధ్యలో పెన్సిల్ తో చిన్న చిన్న అక్షరాల్లో ఏదేదో బరికేసాడు. ఇల్లు వదిలివెళ్ళేటప్పుడు నేను వీడికి ఇవ్వవలసిన డబ్బు వివరాలు అవి. సంతకం పెట్టెటప్పుడు ఈ లైన్ల మధ్యలో రాసిన నా ఆస్తి వివారాలు చూసుకోకుండా సంతకం పెట్టేసాను నేను. అందుకేనేమో.."read between the lines" అన్నారు ఇంగ్లీషు పెద్దలు.

తెలుగు సినిమా వెబ్సైట్ల forums లో హీరోల పేర్లతో..కులాల పేర్లతో తిట్టుకునే తిట్లన్నీ తిట్టాను వాడిని..

ఒక లక్ష రూపాయలు, నా ఆఫీసు ల్యాప్టాప్ తీసుకెళ్ళి కొత్త ఇంటి తిక్క ఓనర్ కి ఇచ్చాను..."ప్రస్తుతానికి ఈ లక్ష తీసుకోండి. మిగత అడ్వాన్సు ఇచ్చేదాకా నా ఆఫీసు ల్యాప్టాప్ మీ దగ్గర ఉంచండి..దీని ఖరీదు లక్షా ఇరవైవేలు. కాని దీని విలువ ఐదు పైసలు కూడా లేదు. ఎయిర్పోర్టు లో కూర్చునప్పుడు స్టైల్ కొట్టటానికి తప్ప ఎందుకూ పనికిరాదు..ఉంచండి..మీకు బాగా ఉపయోగపడుతుంది.." అన్నాను..

సామాను మార్చటానికి packers and movers కి ఫోను చేసి పిలిపించాను...చకచకా సర్దటం మొదలుపెట్టారు..దొరికినవి దొరికినట్టు డబ్బాల్లో వేసి ట్రక్ లోకి ఎక్కించేసారు..కొత్త ఇంట్లో సామాను దించేటప్పుడు చూసాము..ఆ తొందరలో మా పనిమనిషిని కూడా ఒక డబ్బలో వేసేసారు. ట్రక్ నుంచి ఇంటి గుమ్మం దాకా వరుసగా నిలబడి...ఇటుకలు విసిరినట్టు విసురుకుంటున్నారు సామాను. ఇల్లంతా సరిపోయే సామాను...హాల్లో ఒక మూల పడేసి..డబ్బు తీసుకుని వెళ్ళిపోయారు. ఆ సామానులోంచి TV ఎలాగో పైకి లాగి, పవర్ ప్లగ్గు కూడా పెట్టకుండా 'భార్యామణి ' చూడటం మొదలుపెట్టారు మా అమ్మ, అమ్మమ్మ.

సామాను సర్దటం మొదలు పెట్టాక...మెల్లగా ఒక్కొక్క విషయం బయటపడింది...ఇంట్లో గీజర్ లు లేవు..ట్యూబ్ లైట్లకు కనెక్షన్ ఇవ్వలేదు. అల్మరాలకు తలుపులు ఉన్నాయి...తెరిస్తే లోపల ఏమీ లేదు...గోడ! గోడకు తలుపులు బిగించి, వాటి మీద "అల్మరా (హిహిహి)" అని రాసి వదిలేసారు.

కోపంగా ఓనర్ దగ్గరికి వెళ్ళాను...ఇందాక నేను ఇచ్చిన ల్యాప్టాప్ హార్మోనియుం లాగా వాయించుకుంటూ ఆడుకుంటున్నాడు.

"అసలు ఈ ఇంట్లో మనుషులెవరైనా ఉండగలరా? ఇంటికి గోడలు కట్టించి, పెయింట్ కొట్టిస్తే చాలా? లోపల కనీస సదుపాయాలు కూడా లేవు." అని అరిచాను..

హార్మోనియుం మూయకుండా రెంటల్ అగ్రీమెంట్ నా మొహాన కొట్టాడు. చదివాను. అనవసరంగా సంతకం పెట్టాను పొద్దున. ఇప్పుడు ఈ ఇంట్లో ఉండాలేను...ఖాళీ చెయ్యాలేను.

ఇవ్వాళ ఆఫీసు లో కూర్చుని ఒక సరికొత్త రెంటల్ అగ్రీమెంట్ తయారు చేసాను. వెల పది రూపాయలు. ప్రపంచం లో ఏ దేశం లో ఉన్నా సరే...ఇది వాడుకుని దుష్ట ఓనర్ల బారి నుండి మనల్ని మనము కాపాడుకోవచ్చు. సరే, ఇప్పుడే వస్తాను...తిరుపతి లో మా ఇంట్లో అద్దెకున్నవాళ్ళు తోక జాడిస్తున్నారట...ఫోన్ లో వాళ్ళ తోక కట్ చేసి కంట్రోల్ లో పెట్టాలి..

Wednesday, April 6, 2011

హీరో

"జీవితం లో దేనికీ భయపడకు" అని నేర్పిన మా హీరో రమణను తల్చుకుంటూ...ధైర్యంగా నవ్వుతూ..ఏడుస్తూ..